S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంత్రాల జయరాముడు (సిసింద్రీ కథ)

బిజినవేముల గ్రామంలో జయరాముడు అనే వడ్రంగి ఉండేవాడు. అతను కమ్మరి పని కూడా చేసేవాడు. కొన్ని మంత్రాలను వశ పరచుకున్నాడు కూడా. తన మంత్ర ప్రభావంతో ప్రజల రోగాలను బాగుపరచటమే కాక, దెయ్యాలు, భూతాలను తాయెత్తులతో విడిపిస్తూ ఉండేవాడు. ఆ కారణంగా జయరాముడు ప్రజల దృష్టిలో ఒక మహానుభావుడిగా పేరు పొందాడు.
ఆ గ్రామానికి పక్కన ఆమడాల అనే ఊరు ఉంది. జయరాముడు అమడాలలో ఎక్కువగా ఉంటూన్నందున అతనిని అమడాల జయరాముడు అని పిలుచుకొనేవారు. జయరాముడు ఆ రెండు గ్రామాల మధ్య ఒక ప్రదేశంలో వెదురు కర్రలతో ఇంటిని నిర్మించుకొని.. జీవించసాగాడు. అప్పటికే ఆయన వద్ద కొందరు శిష్యులుగా చేరి ఉపచర్యలు చేయసాగారు.
అక్కడికి దగ్గరలో ఉన్న కోయిలకుంట్ల అనే ఊళ్లో కమ్మరి, వడ్రంగం పనులు చేస్తూండే వీరయ్యచారి అన్ని పనుల్లో నేర్పరి. దైవ భక్తుడు. కాస్త మంత్ర విద్య కూడా ఎరిగిన వాడు. తన ఇంటిలోని ఒక చెక్క స్తంభానికి ఒక గూడు ఉన్నది. ఆ గూటిలో ఒక పుస్తకం భద్రంగా దాచబడి ఉంది. తీరిక సమయాల్లో ఆ పుస్తకాన్ని తీసి చదువుకొని ఆ గూటిలోనే భద్రం పెట్టి తాళం వేసేవాడు. ఆ పుస్తకంలో ఏం ఉన్నదో అతనికి తప్ప ఎవరికీ తెలీదు.
ఒకసారి వీరయ్యచారికి, జయరాముడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మరింత గాఢమై మంచి స్నేహితులుగా మారారు. ఒకనాడు జయరాముడు వీరయ్యచారి ఇంటికి వచ్చి ‘మీరు కమ్మరి, వడ్రంగంలో మంచి పనివారనీ, చాలా దైవభక్తులనీ తెలిసింది. మీరు గొప్పవారు’ అని వీరయ్యను పొగిడాడు.
అందుకు వీరయ్య జయరాముడి పొగడ్తను కొట్టిపారేస్తూ ‘నేనేమీ గొప్పవాడిని కాను. మీరు మంత్ర విద్యలో గొప్పవారనీ, ప్రజల రోగాలను నయం చేయటమే కాక, దెయ్యాలు, భూతాలు పట్టిన వారిని బాగు చేస్తారని విన్నాను. మీరే గొప్పవారు’ అన్నాడు. వీరయ్యచారి పొగడ్తకు జయరాముడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అప్పటి నుంచి జయరాముడు అప్పుడప్పుడు వీరయ్యచారి ఇంటికి వచ్చి ఏదో బాతాఖానీ కొట్టి పోతూండేవాడు. ఓ రోజు వీరయ్యచారి స్తంభపు గూటిలోని పుస్తకాన్ని తీసి చదివి, మళ్లీ యథాస్థానంలో పెట్టి తాళం వేయటం జయరాముడి కంట పడింది. ఆ పుస్తకం దేనికి సంబంధించిందో జయరాముడు ఎంత ఆలోచించినా తట్టలేదు. వీరయ్యచారిని అడుగుదామను కొన్నాడు గానీ.. ఏమనుకుంటాడో అని అడగలేదు.
ఒకనాడు ఆ పుస్తకం కనిపించలేదు. ఎవరు దొంగిలించారో అర్థం కాలేదు. పుస్తకం గురించి జయరాముడిని అడగాలన్న ఆలోచన వచ్చింది గానీ.. జయరాముడిని దొంగగా చూడటానికి మనసు అంగీకరించలేదు.
కొంత కాలం గడిచింది.
జయరాముడిలో మార్పు కనిపించసాగింది. వీరయ్యచారి ఇంటికి రావటం తగ్గించి, చివరికి మానేశాడు. ప్రజల రోగాలను బాగు చేయటం మానేశాడు. దెయ్యాలనూ, భూతాలను వెళ్లగొట్టడం లేదు. గ్రామ ప్రజలపై అధికారం చెలాయించటం మొదలుపెట్టాడు. అందరూ తన బానిసలన్నట్టు ప్రవర్తించసాగాడు. ప్రజలు అతగాడి అరాచకాలను భరించలేక.. వీరయ్యచారితో మొరపెట్టుకున్నారు. దాంతో జయరాముడి ప్రతి కదలికను గమనించిన వీరయ్యకు ఒక విషయం అర్థమైంది. స్తంభపు గూటిలోని పుస్తకాన్ని దొంగిలించింది జయరాముడేననీ, ఆ పుస్తకంలోని మంత్రాలను ఔపోసన పట్టి.. వాటి శక్తితో విర్రవీగుతున్నాడనీ.. ప్రజలకు మేలు చేయాల్సిన మంత్రాలను.. తన దుష్ట బుద్ధితో దుర్వినియోగం చేస్తున్నాడనీ తెలుసుకొన్నాడు. ఆ గ్రంథాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని ఆ మంత్రాల పొగరును అణగగొట్టాలని నిర్ణయించుకున్నాడు.
* * *
గ్రామస్థులతో మాట్లాడి ఒక పథకాన్ని రూపొందించాడు వీరయ్యచారి. ఆ పుస్తకం ఎక్కడ దాచి పెట్టాడో ఎవరికీ తెలీలేదు. మంత్రాలను జపించాలంటే తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని బయటకు తీయాల్సిందే. ఆ రోజు కోసం వేచి ఉన్నారు గ్రామస్థులంతా. ఎట్టకేలకు ఆ పుస్తకాన్ని ఎక్కడ భద్రం చేశాడో కనుక్కొని.. ఓ రాత్రి దాన్ని తస్కరించి వీరయ్యచారికి అందజేశారు.
ఆ గ్రంథంలోని మంత్రాలకు విరుగుడు ఎలాగో తెలుసుకొని.. ఆయా మంత్రాలను దుష్టబుద్ధిగల జయరాముడిపైనే ప్రయోగించాడు వీరయ్యచారి. దాంతో జయరాముడు రక్తం కక్కుకొని మరణించాడు.
* * *
మంత్ర తంత్రాలు ప్రజల క్షేమాన్ని కోరుకోవాలే గానీ.. వారిని బానిసలుగా చేసుకోవటానికి కాదన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాడు వీరయ్యచారి.
అప్పటి నుంచీ ప్రజలు రోగాల బాగు కోసం.. దెయ్యాల పీడ వదిలించుకొనేందుకు వీరయ్యచారి దగ్గరకు వెళ్లసాగారు.

- షేక్ హున్నూర్