S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమీబియాసిస్‌కు ఆహారమే ఔషధం ( మీకు మీరే డాక్టర్)

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642

ఫ్రశ్న: చాలా ఏళ్లుగా అమీబియాసిస్ వ్యాధి ఉంది. ఎలా తగ్గించుకోవాలో వివరించగలరు.
జ: అమీబియాసిస్ వ్యాధి కడుపులోకి కేవలం నోటి ద్వారానే ప్రవేశిస్తోంది. ఆ దారిని మూసేయగలిగితే ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం దొరికినట్టే! అంటే అమీబియాసిస్ వ్యాధి వచ్చిన వాడు అన్నపానీయాలు వదిలేయాలని కాదు, అవి సూక్ష్మజీవుల దోషాలతో కూడుకున్నవి కాకుండా శుచిగా ఉండాలని అర్థం. అవి వ్యాధి కారికంగా ఉన్నప్పుడు నిర్మొహమాటంగా వదిలేయాల్సిందే!
అమీబియాసిస్ వ్యాధికి శుచిగా లేని ఆహారం, నీళ్లు కారణం అవుతున్నాయి. కాబట్టి, కేవలం శుచికరమైన అన్నపానీయాలతోనే అమీబియాసిస్ వ్యాధిని తగ్గించవచ్చు నంటుంది వైద్య శాస్త్రం. ఆహార వైద్యంలో ఇది ముఖ్యమైన విషయం.
పేగులలో కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పుడు వెంటనే జాగ్రత్త పడితే అది పెద్ద వ్యాధికి దారి తీయకుండా ఉంటుంది. మన ఆహార విహారాలు మన ఆలోచనా విధానాలే పేగులలో అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. మన ప్రమేయం లేకుండానే వ్యాధి వచ్చిందని అనడానికి లేదు. ఎవరి మొహమో చూసి నిద్ర లేచినందువలన మనకు కడుపులో నొప్పి రాదు. మరి ఎందుకు వచ్చినట్టు? వెదికితే మన తప్పులే ప్రధాన కారణంగా కనిపిస్తాయి.
ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళితే జ్వరానికి ఒక మందిచ్చాడండీ.. అప్పటి నుంచీ ఈ అమీబియాసిస్ వ్యాధి పట్టుకొంది అన్నాడు మొన్న ఒకాయన. మనకు వచ్చే బాధలన్నింటికీ కారణాల్ని ఎవరో ఒకరి మీదకు నెట్టినందువలన అసలు కారణాన్ని మనం ఎప్పటికీ కనుగొనలేక పోతాం. అమీబియాస్ వ్యాధి పరమ దీర్ఘవ్యాధిగా మారటానికి ఆ వ్యాధిని పూర్తిగా అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం, నోరు కట్టుకోలేక పోవటం అసలు కారణాలు.
పేగుపూత, పేగులలో వాపు, తరచూ నీళ్ల విరేచనాలు, జిగురుతో కూడిన విరేచనాలు, కడుపులో నొప్పి, దుర్వాసనతో విరేచనం, పెంటికల్లా విరేచనం అవటం, మలబద్ధత ఇవన్నీ పొట్టలో కలిగే అసౌకర్యాలే! ఈ లక్షణాలు గ్రహణి అనే వ్యాధిగా ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అమీబిక్ కోలైటిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పెప్టిక్ అల్సర్ లాంటి పేర్లతో ఆధునిక వైద్యంలో పిలుస్తారు. ఈ వ్యాధులు మనం మన ఆహారపు అలవాట్లనీ, మన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చేసే హెచ్చరికలే! వాటిని పెడచెవిన పెడితే వ్యాధి ముదిరి పాకాన పడుతుంది. అన్నింటికీ మందులున్నాయి కదా అనుకోవటమే తప్పు. అన్నీ మందులతోనే పోయేటట్లయితే, దీర్ఘ వ్యాధులనేవే ఉండవు కదా..!
ధనియాలూ, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున కొని దేనికది దోరగా వేయించి మెత్తగా దంచి లేదా మిక్సీ పట్టి మూడు పొడులనూ కలిపి తగినంత ఉప్పు చేర్చి ఒక సీసాలో భద్రపరచుకోండి. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా పొడిని కలుపుకొని ప్రతీరోజూ తాగండి. అమీబియాసిస్, అనుబంధ వ్యాధులన్నీ తగ్గుతాయి.
ప్రతిరోజూ మూడు పూటలా, కనీసం రెండు మూడు గ్లాసులు మజ్జిగ తాగితే అమీబియాసిస్, అల్సరేటివ్ కొలైటీస్, పేగుపూత, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ లాంటి వ్యాధులన్నీ చక్కగా తగ్గుతాయి. అయితే ఆ మజ్జిగ బాగా చిలికినవై ఉండాలి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టకుండా బైటే ఉంచాలి. పులిసిపోకుండా చూసుకోవాలి. పేగులకు సంబంధించిన వ్యాధులలో పాలు నిషిద్ధం. పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా బాగా చిలికిన మజ్జిగ మంచివి. ఒక్క మజ్జిగతోనే ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ ఖరీదయిన రోజుల్లో అన్నన్ని మజ్జిగ ఎక్కడ నుంచి తెస్తామండీ అంటారా.. ఒక గినె్నలో సగం మజ్జిగ పోసి మిగతా సగం నీళ్లు పోయండి. రెండు గంటల తరువాత మజ్జిగ మీద తేరుకొన్న నీటిని వంచుకుని మళ్లీ ఆ మజ్జిగలో నీళ్లు పోసేయండి. మీ మజ్జిగ మీకే ఉంటాయి. మజ్జిగ మీద తేరుకున్న నీటిలో ఉపయోగపడే బాక్టీరియా ఉంటుంది. అది పేగులను సంరక్షిస్తుంది.
బాగా పాతబడిన బియ్యాన్ని వాడండి. బియ్యానికన్నా ఈ వ్యాధిలో రాగులు, జొన్నలు, సజ్జలు మెరుగ్గా పని చేస్తాయి. మరమరాలు లేక బొరుగులు అని పిలిచే వరి పేలాల జావ, జొన్న పేలాల జావ, సగ్గుబియ్యం జావ, బార్లీ జావ వీటిలో ఏదైనా కాచుకొని రోజూ తాగుతూంటే పేగులు బలసంపన్నం అవుతాయి. ఈ జావలో పెరుగు కలిపి కవ్వంతో చిలికితే చిక్కని మజ్జిగ వస్తాయి. ఇందులో ఈ శొంఠి పొడిని కలుపుకొని రోజూ తాగండి. అమీబియాసిస్ అదుపులోకి వస్తుంది. పేగుపూత కారణంగా కడుపునొప్పి వచ్చే వారికి మేలు చేస్తుంది.
ఉదయాన ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, గారె లాంటి కఠినంగా అరిగే పదార్థాలన్నింటికీ స్వస్తి చెప్పండి. ఇవన్నీ వ్యాధిని పెంచేవే! బదులుగా పెరుగన్నం తినండి. తాలింపు పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అల్లం వగైరా చేర్చి కమ్మని దద్దోజనం చేసుకొని తినండి. రాత్రి వండిన అన్నం ఒక గినె్నలోకి కొద్దిగా తీసుకొని, అది మునిగే వరకూ పాలు పోసి నాలుగు మజ్జిగ చుక్కలు వెయ్యండి. ఉదయానికి ఆ అన్నం కూడా పెరుగులాగా తోడుకొని ఉంటుంది. దాన్ని కూడా ఇలానే దద్దోజనం చేసుకోవచ్చు.
ఉదయం పూట ఉపాహారానికి దీనికన్నా మెరుగైన వంటకం ఇంకొకటి లేదు. రాత్రి అన్నంలో మజ్జిగ పోసి ఉంచితే తెల్లవార్లూ అది నాని ఉంటుంది. ఉదయానే్న తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా ఏ రకంగా తీసుకొన్నా అందులో ధనియాలు, జీలకర్ర, శొంఠి పొడి నంజుకొని తినండి. పేగులలో వచ్చే వ్యాధులన్నింటికి ఇది గొప్ప నివారణోపాయం.
వెలగ పండు గుజ్జు, మారేడు పండు గుజ్జు వీటికి అమీబియాసిస్‌ను అదుపు చేసే ఔషధ గుణాలున్నాయి. వీటి గుజ్జుని కాల్చి పెరుగు పచ్చడి చేసుకొని తినడం మంచిది. అరటి పువ్వు కూర, అరటికాయ కూర, అరటి వూచ పెరుగు పచ్చడి వీటిని పేగులకు సంబంధించిన ఏ వ్యాధిలోనైనా ఔషధంగా తినవచ్చు. సాంబారు, పులుసు, పులుసు కూర, చింతపండు చారు వీటిని పూర్తిగా ఆపండి. బదులుగా కంది కట్టు, పెసర కట్టు తీసుకోండి. చింతపండు లేని పప్పు చారుని కట్టు అంటారు. దానిమ్మ గింజలకు పేగపూతని తగ్గించి, పేగులను సంరక్షించే శక్తి ఉంది. చింతపండు లేకుండా కూరలు పప్పు, రసమూ లేదా కట్టు తినేప్పుడు దానిమ్మ గింజలను నంజుకోండి.
బూడిద గుమ్మడికాయ కూర, పప్పు, పచ్చడి, పెరుగు పచ్చడి ఇవన్నీ పేగులను బాగు చేసేవిగా ఉంటాయి. గోధుమలు, బఠాణీలు, శనగపిండి, పుల్లని పదార్థాలు, దుంపకూరలు, ఊరగాయ పచ్చళ్లు పేగులను పాడు చేస్తాయి. మెంతు కూర, పాలకూర, తోటకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, బెండ, దొండ, పులుపు లేని కూరలు ఏవైనా తినవచ్చు. కానీ చింతపండు, శనగపిండి, మసాలాలు, నూనెల వాడకం చాలా పరిమితంగా ఉండాలి.
బాగా చలవ చేసేవీ, తేలికగా అరిగేవీ ఆహారంగా తీసుకొంటూ, బయట పండిన ఆహార పదార్థాల్ని మానేస్తే, అమీబియాసిస్ వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఆహారంలో మార్పులనేవి వాడే మందుల కోసం కాదు, వచ్చిన వ్యాధి అదుపునకే! మిరప బజ్జీల బండి మీద దండయాత్ర చేస్తూ, పేగుపూత తగ్గాలంటే సాధ్యమా..!
*

- డా. జి.వి.పూర్ణచందు