S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగే బఢ్‌తే

ఆగే బఢ్‌తే అంటే ముందుకు సాగుతూ అని అర్థం. అతను నడుస్తూనే ఉన్నాడు. ముందుకు కదులుతున్నాడు కూడా. నాలుగు అడుగులు నడిచే లోపల ఆలోచనలు మరెంతో దూరం ముందుకు, వెనుకకు వెళ్లి వస్తుంటాయి. అందుకే అతను హాయిగా ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తాడు. అట్లాగని అతని వెంట నడవడానికి అందరూ సిద్ధంగా నిలబడి ఉన్నారని కాదు. పక్కన మనిషి ఉంటే మాటలు మొదలవుతాయి. లేకుంటే నటీమణి మీనాకుమారి కవితలో చెప్పినట్టు ‘ఇద్దరమూ ఒంటరిగా నడుస్తున్నాము’ అవుతుంది. ఆమె పాపం! అంతటి నటి. అట్లా అందరి మధ్యన ఒంటరిగా బతికిపోయింది. కొందరి సంగతి అంతే! అతనూ అంతే!
అక్కడ గుడి దగ్గర కనిపించే ఒక దృశ్యం మనసులో మెదిలింది. మరీ ఉదయాన ఆ దారిన వస్తే, అక్కడ కొల్లేటి చేంతాడంత వరుస అనే క్యూ కనబడుతుంది. అన్నట్లు కొల్లేరు అంటే సరస్సు గదా! అక్కడ చేతాడు, చేంతాడు, చాంతాడు అంత పొడుగు ఎందుకయ్యిందో? ఈ తాటికి ఎక్కడికక్కడ పేర్లు మారుతూ ఉంటాయి కూడా. అతనికి గుర్తుకు వచ్చిన వరుస గుడి ముందు ఉంటుంది. అక్కడ పొద్దునే్న అన్నదానం ఉంటుంది. కుతూహలం కొద్దీ అతను వివరం చూడడానికి ప్రయత్నించాడు. అన్నం, పప్పు, కూర లాంటి హంగులు ఉండవు అక్కడ. అది పులుసన్నం లాగ కనిపించింది. కానీ, కడుపు నిండా పెడతారేమో! కొందరి చేతుల్లో స్టీలు టిఫిన్ డబ్బాలు కూడా ఉంటాయి. నిజంగా గుర్తించవలసిన సంగతి ఒకటి ఉంది. ఆ వరుసలో ఓపికగా నిలబడిన వారంతా తిండికి ఠికానా లేని నిరుపేదలు మాత్రం కాదు. చాలామంది లక్షణంగా మంచి బట్టలు వేసుకుని ఉంటారు. ఏ ఉద్యోగాలో, కనీసం చిన్న ఉద్యోగాలు చేస్తున్నట్టు కనబడతారు. అయితే అక్కడ అహం, పక్కనబెట్టి కొంతసేపు నిలబడితే, పూట గడుస్తుంది. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ అక్కడ నింపుకునే వాళ్లు ఉన్నారని ఎవరో అన్నారు కూడా! అదేమిటి? గుళ్లో పెడుతున్నారంటే, ప్రసాదం కదా? అంటూ వచ్చేవారు మరి కొందరు ఉండవచ్చు!
ఇప్పటికే మలుపు తిరిగాడు అతను. ఆలోచన మాత్రం మళ్లీ వెనుకకు వెళ్లిపోయింది. అది తెగేసరికి, అక్కడ ఒకనాడు కనిపించిన కత్తి ఒకటి మళ్లీ మెదడులో తళుక్కుమన్నది. అది మూరెడు కత్తి. వంకర తిరిగి ఉంది. ఉర్దూలో జంబియా అని ఒక మాట ఉంది. తెలుగులో దాన్ని బాకు అనవచ్చునేమో! ఆ కత్తి, పండ్లు కోయడానికి పనికి వచ్చే రకంలాగ లేదు. ఎవరిదో పొట్ట చీల్చడానికి, ఎదలో పొడవడానికి తగినట్లు ఉంది. అది సరికొత్తగా ఉంది. పొడవడానికి కాకుంటే, అతను దాన్ని ఎందుకు కొన్నాడు. అతను ఊగిపోతున్నాడు. కోపంలో ఉన్నాడు. గుడ్డలో చుట్టిన కత్తిని బయటకు తీశాడు. ఊగిపోతున్నది కత్తిగల అతను. మన నడక సాగిస్తున్న ‘అతను’ అప్పటికి రోడ్డు అటు పక్కన ఉన్నాడు. ఏం చూడవలసి వస్తుందో అన్న ఆత్రం ఉన్నా అతను కదలకుండా నిలబడి ఎదురుచూస్తున్నాడు. కత్తిగల అతనికి ఒకరిద్దరు హంగుదారులు ఉన్నారు. వాళ్లు వచ్చి అతగాడిని బలవంతంగా పక్కకు తీసుకుపోయారు. ఆనాటి దృశ్యం మరోసారి తెర మరుగయింది.
అంతలో ఎదురుగా ఏటిఎమ్ ఎదురయింది. ఈ మధ్యన ఈ యంత్రాలు అందరి నోళ్లలోనూ నాని అందరికీ శత్రువులయ్యాయి. ఇవాళ అక్కడ క్యూ లేదు. అసలు మనుషులే లేరు. అక్కడే ఉండవలసిన సెక్యూరిటీ మనిషి కూడా లేడు. అంటే అర్థం రెండు రకాలుగా ఉండవచ్చు. పైసలు, పోనీ రూపాయలు, కాదంటే దుడ్డు, రొక్కం, డబ్బుల పరిస్థితి తిరిగి మామూలు అయింది. ఏవో ఒక రకం నోట్లు, వాటిల్లో దొరుకుతున్నాయి. అవసరంగల వాళ్లంతా తీసుకుని ఎవరి దారిని వాండ్లు, వారు, వాళ్లు పోయారని, వెళ్లారని అనుకోవచ్చు. లేదంటే 2016 నవంబర్, డిసెంబర్ లాగే నో క్యాష్ అయినా అయి ఉండాలి. అయ్యుండాలి. అక్కడ కింద చెత్తగా స్లిప్స్ పడి ఉన్నాయి. అంటే కాష్ ఉందని అర్థమేమో?
ఇంతలో అతనికి ఏటిఎమ్‌ల గురించి మిత్రుడు ఒకతను చెప్పిన కథ వంటి సంగతి గుర్తుకు వచ్చింది. ఆ చెప్పిన పెద్ద మనిషి కలవాడు, మంచి ఉద్యోగం కలవాడు. తెలివి కలవాడు. అప్పట్లోనే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. కొంచెం పల్లె రకం మనిషిని వెంటబెట్టుకుని దిల్లీ వెళ్లవలసి వచ్చింది. అక్కడ కొంత మనీ అవసరం వచ్చింది కూడా. కార్డు వాడితే పోతుందని ఆయన ఏటిఎమ్‌లోకి వెళ్లాడు. కార్డు పెట్టి, నంబర్ నొక్కి చేయవలసింది చేశాడు. అప్పుడు మరి నోట్స్ ఎలా వచ్చేవో తెలియదు. కానీ వచ్చాయి. తోడుగా వెళ్లిన మనిషి కళ్లు విప్పారదీసుకుని మరీ చూచాడు. అక్కడ ఏమీ అన్నట్టు లేదు. ఊరికి తిరిగి వచ్చిన తరువాత మాత్రం, ఈయనకు తెలియకుండా, వీలయినంత మందికి ఒక కథ వినిపించాడు. ‘ఆయన పైసలు ఇక్కడ పెట్టగూడదని దిల్లీలో దాచుకున్నడు. పోయి అడగంగానే పైసలు వాన గురిసినట్లు దడదడమంటు వచ్చి పడినయి’ అని కథ! ఇక మన దేశంలో నోట్లు లేకుండ బతుకులు గడవాలె అంటున్నరు. అయ్యేదేనా?
ఆలోచన తెగింది. అప్పటికి అతను బియెర్ షాప్, బార్ షాప్, బీర్ షాప్ ప్రాంతంలో ఉన్నడు. నాలుగు అడుగులు ముందుకు నడిస్తే బార్ కూడ ఉంది. అది సాయంత్రం అయిన తరువాత ‘రమ్ము, రమ్ము’ అని పిలుస్తుందట. ‘పదండి మందుకు’ అంటూ అందరూ పోతారట. అది వీలుగాని వారు కటకటాలలో నుంచి షాపులో తమ తమ శక్తిని బట్టి సీసా, బుడ్డీ కొని, దాచుకొని, తీసికొని ఎక్కడికో పోతారు. ఎంతమంది ఇంట్లో కూచుని హాయిగా తాగగలరో తెలియదు. ఒక ‘నిజంగా’ అన్ని రకాలుగానూ పెద్ద మనిషి, ఆడ స్ర్తిలు, బంధు జనము అందరూ ఉండగా, ఇంట్లో ఒక్కడే తాగుతూ కబుర్లు చెప్పడం అతను కళ్లారా చూచిన సంగతి గుర్తుకు వచ్చింది. అందరికీ అంతటి అదృష్టం వెసులుబాటు ఉండదు గదా! అటువంటి అభాగ్యుల కొరకు అక్కడ గల ఒక సౌకర్యం అతను అటుగా వెళ్లినప్పుడల్లా కళ్లబడుతుంది. అంగడికీ, బార్‌కూ మధ్యన ఒక చోట ఒక చిన్న సందు లాంటిది ఉంటుంది. అది వీధి కాదు. ఒక భవనంలోని అంగళ్ల మధ్యన ఉంటుంది. బహుశః మెట్ల కింద ఏర్పడిన ఖాళీతో కలిసి కొందరు నిలబడడానికి మాత్రమే వీలుగల చోటు అది. చిన్న కొట్టు ఏదయినా పెట్టే వీలు ఉంటుందేమో! కానీ, దాన్ని ఒకతను చక్కని సౌకర్యంగా తీర్చిదిద్దాడు. అక్కడ ఒక బల్ల ఉంటుంది. వాడి పడేసే గ్లాసులు, నీళ్లు, బహుశః సోడాలు, నమలడానికి కాస్త ఖారా వస్తువులు అన్నీ బల్లమీద ఉంటాయి. అంగట్లో బుడ్డీ కొన్ని వారిలో కొంతమంది, అందుబాటులో ఉన్న సౌకర్యాలను అందుకొని, అందుకుని, ఆ సందులో చేరి ఆదరాబాదరాగా తాగుతుంటారు! ఇంట్లో తాగుతానంటే బహుశః తంతారేమో? మరి ఇంత కుతిగా తాగి ఇల్లు చేరితే తన్నరా? అతనికి అనుమానం వస్తుంది. కానీ, అంతలో మరేదో కనబడుతుంది. ఆలోచన అటువేపు వెళుతుంది. అది ముందుకు సాగుతూ అతడినీ నడిపిస్తుంది. ఆలోచనల్లో తేలుతూ నడుస్తూ ఉంటే వెనుక నుంచి హార్న్ అనే బూరా క్రూరంగా వినిపిస్తుంది. నడుస్తున్నది అంచు మీదే అయినా, తాను ట్రాఫిక్ నడుస్తున్న దిశలోనే కదులుతూ ఉండడం అర్థమవుతుంది. అయినా ముందుకు సాగవలసిందే!
*

కె. బి. గోపాలం