S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విగ్రహం... నిగ్రహం!

సెలవులకో, పని మీదో చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్స్‌కు వెళితే అక్కడ మనకొక శిల్పం కనిపిస్తుంది. రాజరిక దుస్తుల్లో నిల్చున్న ఒక చక్రవర్తి శిల్పం మనకి కనిపిస్తుంది. అయితే సరిగ్గా సాయంత్రం కాగానే ఆ శిల్పం అదృశ్యమైపోతుంది. మళ్లీ మర్నాడు ఉదయం అక్కడ అదే భంగిమలో ప్రత్యక్షమవుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ... అవును నిజమే ఉదయం నుండి అలా కదలకుండా నిల్చుని ఉన్న శిల్పం సాయంత్రం కాగానే మాయమైపోతుంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అక్కడ రోజూ శిల్పంలా నిల్చునేది అబ్దుల్ హజీజ్ అనే ఒక వ్యక్తి.
బ్రతుకు దెరువు కోసం చెన్నై వెళ్లిన హజీజ్‌కి ఎక్కడా సరైన ఉపాధి దొరకలేదు. అప్పుడు అతనికి విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్స్‌లో స్టాట్యూలా నిల్చునే ఉద్యోగం దొరికింది. అప్పటి నుండి అతను తన విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఒక వైపు ఉపాధి పొందుతూనే, అక్కడికి వచ్చే సందర్శకుల మనస్సులు చూరగొంటున్నాడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు ఆరు గంటల పాటు ఒక్క అంగుళం కూడా కదలకుండా, కనీసం కనురెప్పలు కూడా ఆర్పకుండా చూసేవారు నిజమైన శిల్పమా? అనిపించేటట్లు అలా బొమ్మలా నిలబడి ఉంటాడు. ఆ సమయంలో అతను పచ్చి మంచినీళ్లు కూడా తాగడు. ఏమీ తినడు. తన ముందు ఈగని కూడా ఎగరనివ్వడు. అతను ఈ వృత్తిలోకి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా అతనికి విసుగూ, విరామం లేదు. రోజూ చేస్తున్న పనినే ఎంతో నిబద్ధతతో చేస్తూ విజిపి గార్డెన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ అనిపించుకుంటున్నాడు.
తొలుత ఒక మనిషికి తోచిన ఉపాధి కల్పించడమే ధ్యేయంగా శిలలా హజీజ్ విజిపి గార్డెన్స్‌లో నిల్చోవడానికి అంగీకరించిన యాజమాన్యం అతని ప్రతిభని గమనించిన తర్వాత శిలలా నిల్చుని ఉన్న హజీజ్‌ని ఎవరైనా నవ్వించగలిగితే వెయ్యి రూపాయలు ఇస్తామనే కొత్త కానె్సప్ట్‌తో ఔత్సాహికులకు పోటీ పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఈ 31 ఏళ్లలో ఒక్కరు కూడా ఈ పోటీలో గెలుపొందలేదు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా హజీజ్ నవ్వలేదు సరికదా... తాను నిల్చున్న చోటు నుండి ఇంచ్ కూడా కదల్లేదు. దాంతో వారంతా ‘మా వల్ల కాదు బాబూ’ అంటూ విరమించుకున్నారు. అలా అందరూ అనడం వల్లో ఏమో ఇప్పుడంతా హజీజ్‌ని బాబూ అనే ముద్దుపేరుతో పిలుస్తుంటారు. అతను కొన్ని దఫాలు సింగపూర్, మలేషియా వెళ్లాడు. అక్కడ కూడా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. విజిపి గార్డెన్స్‌కి వచ్చే సందర్శకులు చాలాసేపు అతన్ని చూసి, అతన్ని కదిలించాలని ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి ఓటమిని ఒప్పుకుని అతనితో ఒక సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతుంటారు. ఇంతటి నిబద్ధతతో శిలలా అలా ఎలా నిలబడిపోతారు అని ఎవరైనా హజీజ్‌ని అడిగితే ‘రోజూ చేసే యోగాభ్యసనం ద్వారా’ అంటాడు అతను.
ఇక్కడ కొసమెరుపేమిటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ముందు గార్డులను నవ్వించలేమని, ఇంచ్ కూడా కదిలించలేమని పెద్ద పేరు. అది నిజమే కావచ్చు. అయితే ఆ గార్డులు ప్రతి రెండు గంటలకు మారుతుంటారు. మన అబ్దుల్ హజీజ్ మాత్రం ఉదయం డ్యూటీ ఎక్కితే మళ్లీ సాయంత్రమే దిగుతాడు. ఏకధాటిగా ఆరు గంటల పాటు అతను శిలలా మారిపోతాడు. మధ్యలో అతన్ని స్పందింపజేయడం మానవ మాత్రుల తరం కాదు.

- దుర్గాప్రసాద్