S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషా... రబ్బరు బొమ్మా!

ఏ మనిషైనా తాను ఏ రంగంలో రాణించగలడో తెలుసుకుంటే అతనే ప్రపంచం కీర్తించే స్థాయికి ఎదుగుతాడనేందుకు ఎన్నో ఉదాహరణ లున్నాయ. దురదృష్టవశాత్తు ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారు తమ గొప్పదనం ఏమిటో గుర్తెరగలేరు. అయితే తానేమిటో, తన టాలెంట్ ఏమిటో చిన్ననాటి నుండి గుర్తించగలిగిన ఒక యువకుడు నేడు అన్ని చోట్లా కీర్తింపబడుతూ ఖ్యాతి గడించాడు. అతనే పంజాబ్‌లోని లుథియానాకు చెందిన జస్ప్రీత్ సింగ్ కల్రా. కల్రాని అందరూ రబ్బర్‌మేన్ అంటారు. దీనికి కారణం అతను తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పేయగలడు. అతను చేసే ఈ విన్యాసాన్ని చూసేవారంతా అసలు అతని ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని అశ్చర్యానికి గురవుతుంటారు. నిజానికి కల్రా తనకున్న ఈ టాలెంట్‌ని పదకొండేళ్ల వరకు తెలుసుకోలేకపోయాడు. పనె్నండో ఏట అతను పాఠశాలలో చదువుతుండగా అతని స్కూల్లోని యోగా టీచర్ ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దానికి అటెండ్ అయిన కల్రా టీచర్ చెప్పిన కొన్ని యోగాసనాలను సునాయాసంగా వేసి చూపించాడు. అది కాదు ఆ యోగా టీచర్‌ని షాక్‌కు గురి చేసింది. కల్రా తన మెడని కోడి మెడలా చుట్టూ తిప్పడం, అసాధ్యమైన రీతిలో తన చేతులను 360 డిగ్రీల కోణంలో గుండ్రంగా తిప్పడం గమనించిన ఆయన ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. సూపర్ ఫ్లెక్సిబిలిటీ కలిగిన అతని శరీరం అతను ఎలా చెబితే అలా చేయగలుగుతుందని గమనించిన టీచర్ అతన్ని ఈ విషయంలో ప్రోత్సహించాడు. అప్పటి నుండి కల్రా అమెరికాకి చెందిన ప్రముఖ కాంటోర్షనిస్ట్ (శరీరాన్ని నచ్చినట్లు తిప్పగల కళాకారుడు) డేనియల్ బ్రౌనింగ్ ప్రదర్శించే విన్యాసాలను పూర్తి స్థాయిలో అభ్యసించడం మొదలుపెట్టాడు. బ్రౌనింగ్ కూడా తన శరీరంలో అస్సలు ఎముకలే లేనట్లు శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచేస్తూ, తిప్పుతూ చూపరుల మతులు పోగొడుతున్నాడు. అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
కల్రా ఇప్పుడు పదహారేళ్ల ప్రాయానికి వచ్చాడు. అతను ఇప్పుడు తన తలని 180 డిగ్రీల కోణంలో వెనక్కి, చేతులను వేర్వేరుగా 360 డిగ్రీల కోణంలోను తిప్పుతాడు. అలాగే అతను తన రెండు భుజాలను డిస్‌లొకేట్ చేస్తూ మనవాకృతి కోల్పోయే విన్యాసంతో చూపరులను షాక్‌కు గురి చేస్తుంటాడు. పొట్టని వీపుకు అతుక్కుపోయేలా చేసి, కాళ్లను పైకి లేపడం, వీటితో పాటు శరీరాన్ని రకరకాలుగా బెండ్ చేస్తూ అసలు ఇతను మనిషేనా అనే అనుమానానికి గురి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. లూథియానాలోని ఆర్యా మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న కల్రా తాను శరీరంతో విన్యాసాలు ప్రదర్శించేటప్పుడు ఎలాంటి నొప్పి కలగదని చెబుతున్నాడు. కల్రా చేసే విన్యాసాలతో అతనికి పెద్ద ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. తోటి విద్యార్థులంతా అతని అభిమానులే. టీచర్లు కూడా కల్రా అంటే ఇష్టపడతారు. అతని విన్యాసాలు చూసాక ఎంతో మంది అతని నుండి ఆటోగ్రాఫ్‌లు అడుగుతుంటారు. అనితరసాధ్యమైన తన విన్యాసాలతో ఆకట్టుకుంటున్న కల్రా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి బోన్‌లెస్ మేన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి రబ్బర్‌మేన్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్ నుండి మోస్ట్ ఫ్లెక్సిబుల్ మేన్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లిమిటెడ్ నుండి యంగెస్ట్ ఫ్లెక్సిబుల్ బాయ్, మిరకిల్ వరల్డ్ రికార్డ్స్ నుండి ది రబ్బర్‌మేన్ వంటి బిరుదులు, అవార్డులు అందుకున్నాడు. కల్రా ప్రతిభకు అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇది దేవుడిచ్చిన వరమని, దీనిని మరింత పదును పెట్టి తమ బిడ్డ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు.

- దుర్గాప్రసాద్ సర్కార్