S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క మాట

ప్రతి విషయంలోనూ ఓ మాట చెప్పడం అవసరం. అలా చెప్పడం వల్ల చాలా అనర్థాలు, అపోహలు రాకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించరు.
వయసు వచ్చిన తరువాత అనారోగ్యం పాలు కావడం సహజం. మరణం సమీపిస్తుందన్న సూచనలు కూడా తెలుస్తుంటాయి. అయినా చాలామంది ఏమీ చెప్పకుండా మరణిస్తారు. అనుభవజ్ఞులు ఏమైనా అడుగుదామని ప్రయత్నిస్తే కుటుంబ సభ్యులు వారిస్తారు. కానీ అనుభవంతో తెలుస్తాయి అలా అడగడం ఎంత మంచిదో.
తమ శరీరాన్ని ఏం చెయ్యాలో, ఎలా దహనం చెయ్యాలో, ఎవరికి దానం చెయ్యాలో కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అట్లాగే మరణం తరువాత అయ్యే ఖర్చులని కొంతమంది తమ బీరువాల్లో, బ్యాంకుల్లో జమచేసి చనిపోతూ ఉంటారు. వాళ్లందరిది దూరదృష్టి. జీవిత సారం నుంచి లభించిన జ్ఞానం.
మనిషి ఎక్కడో పుడతాడు. ఎక్కడో పెరుగుతాడు. మరెక్కడో మరణిస్తాడు. ఇంకా ఎక్కడో దహనం కాబడుతాడు. కొంతమంది కొన్ని విషయాల్లో స్పష్టత ఉంటుంది.
ఈ మధ్య మా వదిన మరణించింది. ఆమె వయసు డెబ్బై దాటి ఉంటాయి. కొంత అనారోగ్యానికి గురై చనిపోయింది. తన మరణం దగ్గరికి వస్తుందన్న సంగతి ఆమెకి తెలుసు. మా అందరికీ తెలుసు.
ఆమె జన్మించింది సిరిసిల్లలో. మెట్టింది వేములవాడలో. భర్తతో కలిసి స్వంత ఇంట్లో ఎక్కువ కాలం జీవించింది కరీంనగర్‌లో. చివరి దశలో నివసించింది హైదరాబాద్‌లో.
అనారోగ్యంతో బాధపడి కొంతకాలానికి ఆమె మరణించింది. మా బంధువులు, మా వదిన బంధువులు అందరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మా కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆమె దహన సంస్కారాలు, అపర క్రియలు హైదరాబాద్‌లో చేస్తే అందరికీ సులువుగా ఉంటుంది. అమెరికాలో వున్న కూతురికి కూడా సులువే. కరీంనగర్‌లో వుంటున్న కొడుకూ, కొంతమంది బంధువులు హైదరాబాద్‌కి వస్తే సరిపోతుంది.
అందుకని మా వదిన మరదలు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మరి కొంతమంది కూడా ఆమె ప్రస్తావనని సమర్థించారు.
‘తన పూర్తి క్రియలు కరీంనగర్‌లో జరపాలన్నది అత్తమ్మ అభిమతం. ఇదే విషయాన్ని పది రోజుల క్రితం నాకూ శశాంకకు చెప్పారు’ అంది గద్గద గొంతుతో చిన్న కోడలు.
అంతే!
ఆ విషయం గురించిన చర్చ జరగలేదు. అంతిమ క్రియలు కరీంనగర్‌లో జరపడానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. మా వదిన అభిమతం ప్రకారం అపరక్రియలు అన్నీ కరీంనగర్‌లో జరిగాయి.
చనిపోవటానికి ముందు మా వదిన చెప్పిన ఒక్క మాట ఓ ముఖ్యమైన సమస్యని సులువుగా పరిష్కరించింది. ఎలాంటి చర్చకి అవకాశం లేకుండా చేసింది. ఆమె అభిమతాన్ని గౌరవించిన ఫీలింగ్ అందరిలో మిగిలింది.
ఒక్క మాట చాలా విషయాలని పరిష్కరిస్తుంది. అయితే విజ్ఞులకే వర్తిస్తుంది. కొంతమంది అభిమానాన్ని గౌరవించక గొడవలు కూడా పడవచ్చు.
ఈ ఒక్క మాట అంతిమ క్రియల గురించే కాదు. ఆస్తిపాస్తుల విషయంలో కూడా వర్తిస్తుంది.
అభిమానాన్ని గౌరవించే మనస్తత్వం అందరిలో వుండాలి.