S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసు, గుండెల చిరునామా!

సీరియల్ ఒకటి సీరియస్‌గా నడుస్తున్నది. అందులో బరువు డయలాగులను చాలా తేలికగా చెప్పేస్తున్నారు. ‘మెదడంటూ ఉండాలే గానీ, మనసును కట్టిపడేయడం తేలిక పని!’ అన్నది ఒకావిడ. ‘ఎవరూ ప్రయత్నించి ప్రేమించరు. ప్రేమ అనుకోకుండా జరుగుతుంది’ అన్నది ఇంకొక అమ్మాయి. ఎంతటి మాటలు? ఇలాంటి బరువు మాటలను సినిమాల్లో అంతగా విన్న గుర్తులేదు. సీరియల్స్ కూడా విన్న గుర్తు లేదు. అందుకు కారణం అతి సింపుల్. నాకు సీరియల్స్ చూసేంత ఓపికగానీ, తేలిక గానీ లేవు! కానీ చూచి ఆనందిస్తున్న వారు మాత్రం ఈ మాటలను కోట్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు. చాలామంది కనీసం వాటిని పట్టించుకుంటున్నారు. తరచి, ‘లోనారసి’ చూస్తున్నారు. ఇంతకూ నేను ఈ సంగతులు రాయడానికి కారణం వేరుగ ఉంది.
మెదడు, మనసు రెండూ ఒకటేనా? లేక వేరువేరా?
అతను గట్టి గుండె మనిషి. ఆమె గుండె ధయిర్యం గల మనిషి, లాంటి మాటలు సీరియల్ దాకా పోనవసరం లేకుండానే వినబడుతుంటాయి.
ఎవరికయినా సరే, గుండె గట్టిబడితే, ఏమవుతుంది? అది కొట్టుకోవడం మానేస్తుంది. కనీసం వేగం తగ్గుతుంది. ‘అంటే శరీరానికి రక్తం అందే తీరులో తేడాలు వస్తాయి. అందువలన కష్టం, నష్టం తప్ప లాభం లేదు గదా? మరి ఆ రెండు వాక్యాలలో ధయిర్యం గురించి మాట్లాడిన గుండె ఎదలో లబ్‌డబ్ గుండెకాయా? లేక మరెక్కడయినా ఉందా?
ఎదను కదిలించిన సన్నివేశాలు జీవితంలోనూ, కల్పన ప్రపంచంలోనూ అందరికీ ఎదురయి ఉంటాయి. అప్పుడు ఎద ఎక్కడికి, ఎటువేపు ఎంత కదిలింది? పక్కకు జరిగిందా? ఊగిసలాడిందా? వెన్నలాగ మెత్తని మనసు అంటారు. కరిగి కాలువయి ప్రవహించింది అంటారు! అట్లా నిజంగా జరిగితే ఏమవుతుంది? ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అంటాడు ప్రియుడయిన హీరో. ‘వాడి గుండెల్లో నిద్దురపోతా?’ అంటాడు అతనే మరో సందర్భంలో! వారెక్కడ పడుకుంటారు? శరీరానికి రక్తం అందించే గుండెలోనా? హృదయం అంటే అదేనా? లేక మెదడులోని ఆలోచనలలోనా? ఇన్నీ చేసేది మెదడు ఒకటే అయితే, ఇన్ని రకాల పేర్లు, తీర్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
వీటన్నిటికీ మించిన మాట ఒకటి ఆ మధ్యన ఒక పరిశోధన పత్రికలో కనిపించింది. ‘ఆడవారికి గానీ, మగవారికి గానీ, సెక్స్ అంతా, అంగాలతో సహే ఉండేది, చెవుల మధ్యన!’ అని అర్థం వచ్చే వాక్యం ఒకటి అక్కడ చదివాను. తరువాత ఈ మాటను విశదీకరిస్తూ మరిన్ని మాటలు కూడా రాశారు. లైంగికత, స్ర్తి పురుష ఆకర్షణ అన్నది ఒకదాని తర్వాత ఒకటి, లేదా ఒక దాంట్లో కలిసి మరొకటి కొనసాగుతాయి. నేనిక్కడ బూతులు రాస్తానని భయపడకండి. పాల బూతులు లేవు. టెలిఫోన్ బూతులు లేవు. ఇక మాటలలో బూతులు ఎక్కడున్నాయి? అయినా నేనటువేపు ప్రయత్నం చేసి కూడా పోవడం లేదు. కనుక మీరంతా అనుమానం లేకుండా వ్యాసం కడదాకా చదవగలరని మనవి! అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. కలిసి బతకడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఏమిటని అర్థం? కలిసి వండుకు తిందాం అని కాదు గదా? మరి లైంగిక ఉద్దీపన, ప్రేమల సంగతి ఏంగాను? తెనాలి రామలింగని కొడుకు పెళ్లి గురించిన ఒక కథ గుర్తుకు వస్తున్నది. కానీ, అందులో, అందరికీ బూత్, బూతులాగ వినిపించే రెండు మాటలుంటాయి గనుక చెప్పను!
లైలా మజ్నూల కథ లోకమంతా ఎరిగినదే. విషయం తెలిసిన ప్రభువుగారు ‘ఏమయ్యా! అమ్మాయి అతి లోకసుందరి కూడా కాదు. ఎందుకని అంతగా ప్రేమలో పడ్డావూ?’ అని అడిగాడట. ‘ఆమెను నా కళ్లతో చూడండి ప్రభూ!’ అన్నాడట ప్రేమికుడు మజ్నూ. అందం చూచేవారి కళ్లలో ఉందని మరో మాట. ‘నా కళ్లలో మెదలాడుతున్నావు’ అని కవితాత్మకంగా ఇష్టమయిన వారిని గురించి చెప్పడం తెలిసిందే. ఇక్కడ మనసు, గుండె, హృదయం వరుసలో కళ్లు కూడా వచ్చి చేరుకున్నాయి. కళ్ల నుంచి సంగతులు మెదడుకు చేరుకునే దారి లేకపోతే, ఆ కళ్లు ఉన్నా లేకున్నా ఒకటే!
కళ్లు, తాము గమనించిన సంగతులను మెదడుకు అందజేస్తాయని అందరూ అంగీకరిస్తారు. మనసు, హృదయం విషయంలో ఇటువంటి ప్రసక్తి రానే రాదు. లైంగికత సంగతి కూడా అదే దారిలాగుంది. ఉండేది మెదడు ఒకటే. అందులోనే ఆలోచనలు. ఆవేశాలు, హావాలు, భావాలు! (అవునూ? ఈ హావాల గురించి ఎవరికయినా తెలుసునా?) వీటన్నిటికీ రకరకాల రంగులు, హంగులు, రకరకాల పర్యవసానాలు, ఫలితాలు. అన్నీ జరిగేది మెదడులోనే. ధయిర్యం గలవారికి ఆపద ఎదురయినప్పుడు, ఆ సంగతి మెదడుకు తెలుస్తుంది. ఆ ధయిర్యం కూడా మెదడులోనే ఉంటుంది గనుక, ఆలోచన పుడుతుంది. అవసరమయిన వేగంతో అది శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఎదురు నిలవడం, పని పాడవకుండా ముందుకు సాగడం లాంటివి జరుగుతాయి.
అలిపిరి గుండె, బక్క ప్రాణం అనే వారికి గుండె లక్షణంగా ఉంటుంది. ఆ భయం ఏదో మెదడులో ఉండే మనసులో ఉండే గుండెలో ఉంటుంది. అపాయం అనగానే ఒక సంకేతం అక్కడికి అందుతుంది. శరీరంలో హార్మోన్స్ రసాయనాలు విడుదల అవుతాయి. ఇక రకరకాల ప్రభావాలు కనబడతాయి. మోకాళ్లు బలహీనపడడం వాటిలో ఒకటి మాత్రమే. రక్తం పోటు, వేగం పెరుగుతుంది. కండరాల తీరు మారుతుంది. అప్పుడు పోరుకన్నా పరుగు అనే పద్ధతికి మొగ్గు కనబడుతుంది. ధయిర్యం గలవారు తెగించి పోరాడతారు. అలిపిరి (తిరుపతిలో కాదు) గుండె వారు పరుగేస్తారు. అసలు ఈ పరుగు వాళ్లే తెలివిగలవాళ్లు అని అభిప్రాయం ఉంది తెలుసా? పిచ్చి, లేదా మొండి ధయిర్యం అంత మంచిదేమీ కాదు! వీరుడు అంటారన్న ఆశతో నిండు ప్రాణాలను ఆపదలో పడేయడం తెలివిగల పనికాదేమో? విజయం కలిగే అవకాశం కూడా ఉందనుకోండి! విజయం అందుకున్నా వాళ్లను వీరులు అంటారు! తేరు మరల్పుమింక’ అన్నవారు ఉత్తర కుమారులు, ఉత్తరాకుమారులు అవుతారు.
ప్రేమ లైంగికతలలో కూడా మెదడే మెయిన్‌రోల్! నాటకం సాంతం అక్కడి నుంచే నడుస్తుంది. అక్కడ మంచి, చెడ్డలను ఆలోచించే ఓపిక తెరమరుగవుతుంది. తతంగం, ముందుకు సాగుతుంది. చాకొలేట్లలో ప్రేమను పెంచే రసాయనాలు ఉంటాయట. అందుకే ‘మా చాకీలేటులను మీకిష్టమయిన వారికి ఇవ్వండి!’ అని ప్రకటనలు!
‘హృదయమా! ఓ బేల హృదయమా!’ అంటూ ఎవరయినా పాటకు లంకించుకుంటే, పిలిచి సంగతి చెప్పండి. కావాలంటే గోపాలం ఈ మధ్యనే రాసి అచ్చేసిన మెదడు - మనము పుస్తకం గురించి చెప్పండి.
‘ఆమె నడిచేటి దారిలో పరిచాను - గుండె లేదను మాట మరిచాను’ అని డాక్టర్‌గారికి చెబితే, స్టెతస్కోప్ పెట్టి చూచి, ‘గుండె గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లా దడదడ లాడుతున్నది గదా!’ అని పంపేస్తారు. మనసు పారేసుకున్నాను, ఆరేసుకున్నాను అని కత్తుల కఠార్ల డాక్టర్‌కు చెపితే లాభం లేదు మరి! ఇంతకూ మెదడు విషయం అర్థమయిందా?

కె. బి. గోపాలం