S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుంటూరు కారం

నేను ఇన్ని పుస్తకాలు రాశాను గానీ, ఏనాడూ ఒక ఆవిష్కరణ సభ పెట్టాలని, అందరి ముందు మాట్లాడాలని అనుకున్నది మాత్రం లేదు. విశాలాంధ్రలో మొదటి పుస్తకం వచ్చినప్పుడు సభ పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ నేనే వద్దన్నాను. మొత్తానికి ఎవరో ఒకరు వచ్చి నా పద్ధతిని పక్కదారి పట్టిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అది జరిగింది. పుస్తకం ఆవిష్కరణ పేరున గుంటూరు దాకా ప్రయాణం చేయవలసి వచ్చింది. కొత్త మిత్రులను కలవవచ్చునన్న కోరిక ఒకటే నన్ను ప్రయాణానికి సిద్ధం చేసింది. అయితే నేను అనుకున్నట్టు కాక ఆ ప్రయాణం చాలా విచిత్రంగా, వినోదంగా జరిగింది.
పొద్దునే్న సికిందరాబాద్ స్టేషన్‌కు చేరుకున్న మరుక్షణం నుంచి ఈ ప్రయాణం గురించి వ్యాసం రాసేస్తాను అని నా నేస్తాలను భయపెడుతూనే ఉన్నాను. వాళ్లు మాత్రం జరిగిన ప్రతి విషయానికి నవ్వుతూ, ఇది కూడా నీ వ్యాసంలో రాయవచ్చు కదా అని నన్ను ఆటపట్టించడం మొదలుపెట్టారు. గుంటూరు వెళ్లి వచ్చి చాలా రోజులు అయ్యింది. అనుకున్న ప్రకారం వ్యాసం అప్పుడే ఎందుకు రాయలేదో నాకు తెలియదు. ఇన్నాళ్లకు రాద్దామని కూచుంటే, జరిగిన చాలా విషయాలు నాకు గుర్తు రావడం లేదు. ఆ రెండు రోజుల్లో హద్దులు లేకుండా తిండి తిన్నానన్న సంగతి మాత్రం గట్టిగా గుర్తుకు వస్తున్నది.
నాకు ప్రశ్నలు అడగడం అంతగా అలవాటు లేదు. ఏ హోటేల్‌లోనో బస ఏర్పాటు చేస్తారు అనుకున్నాను. తీరా తీసుకుపోయిన చోటు చూస్తే అది ఒక గుడి. ఆ ఆవరణలోనే కళ్యాణ మండపం ఒకటి ఉన్నది. గుడికి మరోపక్కన నిర్వహణ కార్యాలయం మీద ఒక గెస్ట్‌రూం ఉన్నది. అందులోనే ఉండాలన్నారు. బాగుంది అనుకున్నాను. రైల్లో తిన్నది చాలదన్నట్టు మధ్యాహ్నం భోజనం కోసం ఆటో ఎక్కించి మరీ తీసుకుపోయారు. ఆ ఊళ్లో ఉన్నంతకాలం నాలుగు అడుగులు కూడా నడవకుండా ఆటోల్లోనే తిప్పారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. మొత్తానికి చాలా గొప్ప హోటేల్ అని చెపుతూ ఒక చోటుకి తీసుకుపోయారు. అది తప్పకుండా గొప్ప హోటేల్. ఎందుకంటే, అది చాలా పాతది. అక్కడి పద్ధతులు కూడా చాలా పాతవి. హాల్లో బల్లల దగ్గర ఎవరూ లేరు. నేను వెళ్లి కూచుంటే, భోజనాలు ఇక్కడ కాదు, లోపల ఉంటాయి అన్నారు. వెళ్లి చూస్తే ఒక చిన్న హాలులో గోడల వెంట ఒక్కొక్కరికి ఒక బల్ల, ఒక కుర్చీ పద్ధతిలో ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ చాలా మంది వేచి ఉండడం కూడా కనిపించింది. నాకు ఒక్కసారిగా సుల్తాన్ బజార్ ప్రాంతంలోని రామకృష్ణ విశ్రామ్ భవన్ జ్ఞాపకం వచ్చింది. కూచుని తింటున్న వారు మధ్యలోకి కూడా భోజనం పూర్తి చేయకముందే మరొకరు వచ్చి వాళ్ల భోజనం చీటీ ఆ బల్ల మీద పెట్టిపోవడం నాకు ముప్పైయ్యేళ్ల కిందే అనుభవంలో ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి మరింత విశేషంగా ఉంది. విశ్రామ్ భవన్ ఇప్పుడు ఉంది కానీ, అప్పటి పరిస్థితిలో లేదు. అలనాటి పద్ధతిలో నడుస్తున్న ఈ గుంటూరు హోటేల్‌లో ఎక్కువ సేపు వేచి చూడకుండానే మాకు సీటు దొరికినట్టుంది. కానీ ఒక్కసారిగా జనం వచ్చినట్టున్నారు. ఒక ఆయన నేను తింటున్న ఆకు పక్కన తన చీటీ పెట్టి కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. నేను ఎంత తలవంచుకుని తిందామని ప్రయత్నించినా ఆయనగారి బొజ్జ మాత్రం నాకు కనిపిస్తూనే ఉన్నది. పైగా సాంబారు పేరున ఇచ్చిన ముక్కల పులుసుతో సహా నోట్లో పెట్టుకున్న ప్రతిదీ నషాళానికి అంటేంత కారంగా ఉంది. ఉన్నమాట చెపుతున్నాను. ఈ నషాళం అంటే ఏమిటో నాకు తెలియదు. కారం తినడం అంతకన్నా తెలియదు. నా మిత్రులు మాత్రం కారం అలవాటు కలవాళ్లులాగ ఉన్నారు, హాయిగా భోజనం చేశారు. నేను మాత్రం తినకుండా ఉన్నానా? బాగానే తిన్నాను.
సాయంత్రం సభా కార్యక్రమం చాలా బాగా జరిగింది. సభ ముగిసే ముందు నిర్వాహకులు, ఇప్పటివరకు ఆవిష్కరించిన పుస్తకాలను ఇక్కడే అమ్ముతున్నారు అని ప్రకటించారు. కానీ ‘లేవండీ, అయిపోయినయి’ అన్న జవాబు అటు నుంచి వినిపించింది. అయితే అమ్మడానికి మరి జంకుతూ ఏ అయిదో, పదో మాత్రమే నా పుస్తకాలను తెచ్చినట్టున్నారు. అవి మీటింగ్ ముగిసేలోపల చెల్లిపోయినయి.
నాకు ఇంట్లో ఉంటే, రెండు పూటలా ఒక్కొక్క రొట్టె మాత్రమే తినడం అలవాటు. ఆ కోటా ఆనాడు ఉదయాన రైల్లోనే లాగించాను కారం అంటూనే మధ్యాహ్నం ఫుల్‌మీల్ లాగించాను. నిర్వాహకులు రాత్రి మళ్లీ భోజనానికి రావాలి అన్నారు. నాకు వద్దు అంటే బాధపడతారేమో! అందుకని మళ్లీ తినక తప్పలేదు. అయితే అక్కడ కలిసిన ఒక ప్రత్యేక మిత్రుని కారణంగా ఆ రాత్రి భోజనంలో ఏం తిన్నదీ గుర్తులేకుండానే పని ముగిసింది. ఆ మిత్రుని గురించి నాకు ముందు నుంచీ తెలుసు. అయితే ఆయనను కలిసింది లేదు. సంగీత విద్వాంసుడిగా మాత్రమే. నా మనసులో ఉన్న ఆయన మంచి పండితుడని తెలిసేసరికి నా ఆనందానికి అంతులు లేకుండా పోయాయి. ఆయన కూడా నా పరిచయాన్ని గురించి అంతగానూ సంతోషించిన భావన నాకు స్ఫుటంగా తెలిసింది. ఇక కూరలోని కారం అడ్డు వస్తుందంటారా? రాదుగాక రాదు.
మళ్లీ ఆటోలో వెళుతున్నాము. అది మరునాడు అనుకుంటాను. నేను మామూలు పద్ధతిలో ఏదో అనేశాను. గుంటూరు గురించి కామెంట్ చేసినట్టున్నాను. ఆటో నడుపుతున్న పెద్దాయన కోపంగా వెనక్కి చూచి నాకు తీవ్రమయిన జవాబిచ్చాడు. గుంటూరు కారం అన్న మాట చాలా రోజులుగా తెలుసు. ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేస్తేగానీ రైలు ఎక్కేది లేదు అన్నారు మిత్రులు. నాకు తిండి అవసరం లేదని కాదు, కానీ మరీ అంత అవసరం లేదు. అయితే తెగేసి మళ్లీ నిన్నటి హోటేల్‌కి మాత్రం నేను రాను అని చెప్పాను. ఆనాటి ఉదయం షాపింగ్ పేరున అటు ఇటూ తిరుగుతున్నప్పుడు కనిపించిన ఒక కొత్త హోటేల్‌కి తీసుకువెళ్లారు. ఉదయం కాఫీలు అక్కడే అయినట్లున్నాయి. అప్పుడే మధ్యాహ్నం భోజనంలోని వివరాలను గురించి బోర్డు మీద రాయడం నేను గమనించాను. ఆ లిస్టులో చాలా చైనా వ్యవహారం అనిపించే ఒక మాట ఏదో కనిపించింది. కనుక భోజనానికి అంగీకరించాను. కంచం తెచ్చిపెట్టినాయన దాన్ని పెట్టిన తీరు చూస్తే తిండి తినాలని అనిపించలేదు. అయినా తినక తప్పలేదు. నేను చైనా వంటకం గురించి ఎదురుచూస్తున్నాను. కూరలు వడ్డించిన తరువాత చూస్తే, అది చాలా మామూలు క్యాబేజీ కూర మాత్రమే అని అర్థమయింది. మొత్తానికి అక్కడ తిండి మరీ అంత కారం లేదు.
ప్రయాణంలో నాకు దొరికిన ఆనందం గురించి కూడా చెప్పాలి. బస చేసిన గుడి ఆవరణకు దగ్గరలోనే మరొక భవనంలో అన్నమాచార్య గ్రంథాలయం అని ఒకటి ఉంది. అక్కడకు నన్ను మిత్రులు తీసుకుపోయారు. గోడల మీద గిరిధర్‌గౌడ్ వేసిన చిత్రపటాలు ఉన్నాయి. ఆయన పక్కన ఏదో ఊళ్లో ఉంటారన్నారు. కలవాలని చాలా బలంగా అనిపించింది కానీ, ఆయన ఇంట్లో లేరు. పైగా మాకు టైమ్ కూడా లేదని అర్థమయింది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు నన్ను కట్టిపడేసాయి. అటువంటి లైబ్రరీ ఒకటి దొరికితే అన్నం, నీళ్లు అడగకుండా ఎంతకాలమయినా చదువుతూ ఉండిపోవచ్చు. పుస్తకాలను చాలా చక్కగా వర్గీకరించి పెట్టారు కూడా. వాటిని చూస్తూ చాలాసేపు గడపడం నిజంగా ఒక ఆనందం.
గుంటూరు ప్రయాణం గురించి చెప్పడం మొదలుపెడితే మంగళగిరి శర్మగారిని గురించి చెప్పకుండా ముగించడం అన్యాయమే అవుతుంది. ఆయన గురించి నాకు తెలుసు. అంతేగానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. రైలు మంగళగిరిలో ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. అయినా ఆయన అక్కడికి వచ్చి పెద్ద వయస్సును లెక్కచేయకుండా మా పెట్టెను చేరుకుని ఇవ్వవలసినవి ఏవో ఇచ్చారు. నాకు కొండంత ఆనందాన్ని ఇచ్చారు. నేను ఇటీవల అనువదించిన షెర్లాక్ హోమ్స్ నవలలు ఆయన చదువుతున్నారట. వాటిని రాయడంలో నేను పాటించిన పద్ధతి గురించి ఆయన నన్ను ప్రశంసించారు. అందరూ మెచ్చుకోవడం ఒకటయితే, శర్మగారి వంటి పండితులు మెచ్చుకోవడం మరొకటి. గుంటూరు ప్రయాణం గురించి కలకాలం గుర్తుండే అంశం కారం కాదు.. శర్మగారి అభిమానం. *

కె. బి. గోపాలం