S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోతులు - తాతలు

................
పోలికల ప్రకారం చూస్తే చింపాంజీలు మనుషులకు
అన్నింటికన్నా దగ్గర రకం. తర్వాత గొరిల్లాలు. ఆ తరువాత ఒరాంగుటాన్‌లు. ఈ మూడు రకాలు, ఒకే జాతి నుంచి వచ్చినవా తెలియదు. ఇక ఏప్స్ తరువాతే, కోతులు మనకు
చుట్టాలవుతాయి. అంతేగాని అవి మనకు తాతలు కావు.
తాత చుట్టాలు మాత్రమే!
...............

టార్జాన్ అనే పేరు చాలామంది విని ఉంటారు. అతడిని ఏప్ మాన్ అన్నారు. అంటే పూర్తిగా మనిషి కాడని అర్థమా? ఏమో? అయితే టార్జాన్ అనే మనిషి నిజంగా లేడు. ఎడ్గర్ బరో అనే రచయిత ఒక అడవి కథని నవలగా రాశాడు. దాని ఆధారంగా 1932లో ఒక సినేమా వచ్చింది. ఆ తరువాత మరో 10 లేదా 11 టార్జాన్ సినేమాలు వచ్చాయి. ఇంతకూ నేను చెప్పదలుచుకున్నది టార్జాన్ గురించి కాదు. అతగాడిని ప్రేమించిన అచ్చమయిన అమ్మాయి పేరు జేన్! అంతటితో ఈ కథకు తెరవేద్దాము.
1934లో లండన్‌లో ఒక పాప పుట్టింది. ఎందుకంటే జవాబు ఉండదు గానీ, ఆమెకు జేన్ అని పేరు పెట్టారు. ఆమెకు ఆమెకన్నా పెద్ద చింపాంజీ బొమ్మను తెచ్చి ఇచ్చారు. ఈ జేన్‌కు కూడా జంతువుల పట్ల చెప్పలేని ప్రేమ మొదలయింది. ఎలాగయినా తాను ఆఫ్రికా వెళ్లాలని, అక్కడ అడవి జంతువుల మధ్య గడపాలని జేన్ అనుకున్నది. కొంతమందికి కోరికలు అనుకోకుండా తీరుతయి. జేన్ ఆఫ్రికా వెళ్లింది. అయితే సరదాగా తిరిగి చూచి మళ్లీ వచ్చిందనుకుంటే తప్పే! పిన్న వయసులోనే అడవులలోకి వెళ్లిన జేన్‌కు చింపాంజీలను గురించి పరిశోధించే అవకాశం వచ్చింది. ఆమె జీవితమంతా అడవులలోనే ఉండిపోయింది. అక్కడే పనిలో తోడుగా వచ్చిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని కొడుకును కన్నది. చివరకు తన పేరున అక్కడ, అంటే ఆఫ్రికాలో పరిశోధన సంస్థను స్థాపించే స్థాయికి చేరుకున్నది.
ఇవాళ ప్రపంచమంతటా జేన్ గుడాల్ పేరు మారుమ్రోగుతున్నది. నిజానికి డయన్ ఫోసీ అనే మరో అమ్మాయి గొరిల్లాలను గురించి పరిశోధించింది. కానీ జేన్ కొత్త దారి వేసిన వ్యక్తిగా ఎంతో గొప్ప పరిశోధకురాలిగా పేరు సంపాదించుకున్నది.
కొత్త దారులు అనే శీర్షికన నేను ఒక వరుసలో పుస్తకాలు రాయాలని అనుకున్నాను. చంద్రుని మీదకు దిగడానికి ముందుకు వచ్చిన ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి రాశాను. ఆ తరువాతి పుస్తకం జేన్ గుడాల్ గురించి! రాసేది ఎంత పుస్తకమయినా బోలెడంత చదవాలి. ఎంతో అర్థం చేసుకోవాలి! ఆ పనిలో ఉండగా, కోతులు - తాతలు గురించి లోకాభిరామమ్‌లో వ్యాసం రాయాలని అనిపించింది. అందుకు బోలెడు కారణాలున్నాయి. జేన్ తన జీవితమంతా చింపాంజీల గురించి పరిశోధించింది. చింపాంజీలు కోతులు కావు. కొండముచ్చులు అని మాట విన్నాను గానీ, నేను వాటిని చూడలేదు. వాటి గురించి పట్టించుకోలేదు. పద్ధతిగా జీవశాస్త్రం చదువుతున్న నేనే కోతులు మన తాతలు అని రాశాను. అది తప్పు గదా అని అర్థమయింది. అర్థమయిన సంగతి మరో పదిమందితో పంచుకుంటే అదొక తృప్తి.
సులభంగా ఒక సూత్రం చెపుతాను. గుర్తుంచుకోండి. కోతులకు తోకలు ఉంటాయి. చింపాంజీలకు ఉండవు. అది కోతులకు మిగతా ‘కోతులు’ అని మనం అనుకుంటున్న జాతులకు, మొదటి తేడా! పాలిచ్చే జంతువులలో ప్రైమేట్స్ అనేవి ఒక శాఖ. అందులో కోతులు, ఏప్స్, మనుషులు అనే మూడు ప్రశాఖలు. ఏప్స్‌లో చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు ఉంటాయి. పోలికల ప్రకారం చూస్తే చింపాంజీలు మనుషులకు అన్నింటికన్నా దగ్గర రకం. తర్వాత గొరిల్లాలు. ఆ తరువాత ఒరాంగుటాన్‌లు. ఈ మూడు రకాలు, ఒకే జాతి నుంచి వచ్చినవా తెలియదు. ఇక ఏప్స్ తరువాతే, కోతులు మనకు చుట్టాలవుతాయి. అంతేగాని అవి మనకు తాతలు కావు. తాత చుట్టాలు మాత్రమే! మానవులు, ఏప్‌లు, మంకీలకు కలిసి పూర్వజాతి ఉందా? ఏమో?
నేను అయిదవ అంతస్తు ఇంట్లో ఉంటాను. మామూలుగా రోజంతా ఒక్కడినే ఉంటాను. కనుక చుట్టాలు ఎక్కువగా రారు. పాపం అనుకున్నాయేమో ఈ మధ్యన కోతులు రావడం మొదలుపెట్టాయి. చుట్టాలు గదా అని ఊరుకుంటే లాభం లేదు. చుట్టాలమన్న సంగతి వాటికి తెలియదు గద! అయినా ఫ్రిజ్ తెరిచి అందులోని గినె్నలు తీసుకుని రెండు కాళ్ల మీద నడుస్తూ వెళ్లడం తెలుసును. కనుక మా బిల్డింగ్‌లో అందరూ తలుపులు మూసుకుని బతకక తప్పడంలేదు. నాకు అట్లా బతకడం ఇష్టం లేదు. కనుక గ్రిల్ తలుపు పెట్టించుకున్నాము. వీళ్లు రానివ్వడం లేదన్న సంగతి కోతి బావలకు అర్థమయినట్లుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా జొర్రుతున్నాయి. అంటే దూరుతున్నాయి. అంటే చొరబడుతున్నాయి. నేను అందుబాటులో ఒక చేతికర్ర ఏర్పాటు చేసి ఉంచాను. అది అందనంత దూరంలో ఉండగా మొన్ననొక కోతిబావ వచ్చి భయపెట్టే ప్రయత్నం చేసింది. దానికన్నా గట్టిగా నేను ప్రయత్నించాను, నేనే గెలిచాను. నన్ను మాయావిడ ‘గోపిబావా’ అని పిలుస్తుంది. నాకెందుకో అది ‘కోతి బావా’ అన్నట్టు వినిపిస్తుంది.
మనం కోతులను తాతలు అని మాత్రమే అనుకుని ఊరుకున్నాము. కానీ వాల్మీకి రామాయణంలో వాటికి మాటలు, విద్యలు అన్నీ నేర్పించారు. రామాయణం కేవలం కథ, కల్పన అంటే కళ్లు పోతాయేమో తెలియదు గానీ, కాళ్లు విరుగుతాయని తెలుసు. కవి, రచయిత ఏం రాశాడోగానీ, కళాకారులు మరింత ముందుకు కదిలారు. అనుమాండ్లు, అనే హనుమాన్‌లు, అనే హంజనెయ్య, అనే ఆంజనేయ బొమ్మ గీసి, అందుట్లో ఆయనకు జెట్టి, లాగు కట్టిపిచ్చినరు. కిరిటం గూడ వెట్టినరు. హన్మంతుడు మొదటిసారి కనిపించంగనే, ఈయన శాన తెల్విగలిగినోడు అని రాములువారు అన్నట్టు రామాయణంలో ఉన్నది. కోతికి అంత గనము తెలివి ఉంటదా? వాలి, సుగ్రీవుడు, దోస్తీ, ఏంది ఇదంత అని ఎవరికయిన అనుమానం వస్తుంది. అడిగితే నాస్తికుడవు అంటరేమొ? అంటే ఏమి? అడుగాలె! అనుమానం దీర్చుకోవాలె!
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇటువంటి సంగతులను గురించి బాగా రాశారు. ‘శంబుకవధ’ అని ఆయన రాసిన నాటకం ఒకటి ఉన్నది. అందులో శంబుకుని కథలోని లోతుపాతులను ఆయన నిగ్గుతేలుస్తారు. ఆ నాటకానికి 25 పేజీల నిడివిగల తొలి పలుకులు ఆయన రాశారు. రామాయణ కథాకాలంలో హిందూదేశం తీరుతెన్నులను తెలుసుకోవాలి. అంతకు ముందటి పరిస్థితులను గూడా తెలుసుకోవడం అవసరం అంటూ ఆయన ఎత్తుకుంటారు. దేశంలో అప్పటికే ఆదివాసులున్నారు. వారినే దస్యులని, రాక్షసులని, వానరులని, శూద్రులని అన్నారు. అందరినీ మరీ మొరటువారని ఒకే గాట కట్టారు అంటారు చౌదరి! వారి మాటలను మరికొన్నింటిని మనం పరిశీలించాలి.
‘నాగరికత తారతమ్యమును బట్టి ద్రావిడులను రెండు భాగములుగా విభజింపవచ్చును. 1.మాంసభక్షకులు (తారకాదులు), 2.శాక భక్షకులు (వాలి సుగ్రీవాదులు) మాంస భక్షకులు రాక్షసులని, శాక భక్షకులు వానరులని వ్యవహరింపబడిరి’ తిపిర్నేని వారు సులభంగా చెప్పేశామనుకున్నారు. మరయితే మాంసం వండుకు తిన్నారని కూడా ఆయన చెప్పారు. లంక రాక్షసుల కేంద్రం అన్నారు. వారి వివరణ చాల ముందుకు సాగుతుంది. అవును అనిపిస్తుంది. అయితే నావంటి వానికి అనుమానములు మెండు! రావణుడు రాక్షసుడా? పౌలస్త్య బ్రహ్మ కుమారుడే! చతుర్వేద పారంగమదే? అట్లయిన రాక్షసుడెట్లాయె? ఆయన భార్య మండోదరి పంచమహా పతివ్రతలలో నొకతెగా నెట్లాయె?
పోనిద్దురూ! గొడవ! నేను ఇంత కష్టపడి చదువుకున్న బయాలజీ, జువాలజీ, అందులోని వర్గీకరణం ఏమయిపోవాలి? వానరులంటే కోతులా? ఏప్స్ అంటే జాతివా? బొమ్మలన్నిటిలో ఆంజనేయునికి తోక ఉంటుంది. కథలో ఆయన తోకకు పాత్ర ఉంటుంది. హనుమంతుని తోక అని ప్రత్యేక రచన కూడా ఒకటి ఉందాయె! చింపాంజీల గురించి, గొరిల్లాల గురించి మన వారికి తెలియదా?
కొంచెం ఓపిక పడితే నా పుస్తకాలు అచ్చవుతాయి. జేన్ గురించయినా తెలుస్తుంది!

కె. బి. గోపాలం