S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పడమటి పుత్తాండు

ఒక పుస్తకం అచ్చవుతున్నది. నిజానికి అచ్చు అయింది. కవర్‌పేజ్ కూడా అచ్చయింది. ఆ రెంటినీ కలిపి బైండ్ చేసే పని మిగిలి ఉంది. ఏనుగెళ్లింది, తోక మిగిలింది అన్న పద్ధతి అన్న మాట! (నా మాటే!) ఏమిటి ఆలస్యం? అంటే కొత్త సంవత్సరం వస్తున్నది గద! కాలెండర్‌లు, డైరీల పనిలో అందరూ బిజీగ ఉన్నారు అన్నారు. (మాటల గురించి ఆలోచించడం నా బలహీనతలలో ఒకటి. డెయిరీ అంటే పాడి పరిశ్రమ. డయరీ అంటే దినచర్య పుస్తకము. అంతేనా?) అంతకన్నా ముందే నాకు మన సంవత్సరాది గుర్తు వచ్చింది. అంటే ఉగాది పండుగ అన్నమాట. (పాండవులు అన్న మాట జవదాటరు అంటే వాండ్ల అన్నగారి మాట మీరరు అని అర్థమట!) అది యుగాది గాకుండ ఉగాది ఎందుకు అయింది? ఎవరన్న వివరించాలె. ఊళ్లోకి ఉగాది ఒచ్చింది, అని ఒక కవిత ఉన్నట్టుంది. లేక కథనా? ఊరిలోకి ఉగాది వస్తే అంతగా రంతు ఉండనే ఉండదు. సంక్రాంతి, దసరాలకు అయినంత గోల, గడబిడ ఉండదు. పాత రకం మనుషులు సాంత్రం గుడిలో చేరి పంచాంగం చెప్పించుకుంటే అదొక గొప్ప!
మనకు ఉగాది వచ్చినప్పుడే మరాఠీ వాండ్లకు గుడీ పడ్‌వా అని పండుగ వస్తుందని అనుకుంట. అక్కడ గూడ పెద్ద ఎత్తున పండుగ జరిగినట్లు ఏమీ కనిపించదు. అయితే ఈ పండుగలు ఎప్పుడు ఒకటే తేదీన రావు. ఎందుకంటే మనము పాటించేది చాంద్రమాన పద్ధతి. చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగ వస్తే ఆ మాసమని అర్థం. చిత్త, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాల పేరున చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం అని నెలలు. చంద్రుని లెక్క 28 దినాల ప్రకారం సాగుతుంది. అధిక మాసాలు, అవి ఇవి కలిపి, సౌరమానంలోని 365 దినాల లెక్కకు కలుపుతరు.
‘పుత్తాండు’ అనే మాట ఎప్పుడయిన వింటిరే? ‘అత్తాండు’ అని కరీంనగరంలో అంటే వస్తున్నడు, వచ్చుచున్నాడు అని అర్థం. ఆ మాటకు ఈ పుత్తాండుకు సంబంధము లేదు. పుదు అంటే కొత్త. ఆండు అంటే ఏడు, యాడాది, ఏడాది, అనగా సంవత్సరము. కొత్త సంవత్సరం అన్న మాట (!) ఏ భాషలో? అరవము అనే తమిళములో (అవునూ? తమిళులు ఎప్పుడూ అరవరా?) తమిళ పంచాంగము సౌరమానము ప్రకారం నడుస్తుంది. సూర్యుడు ఏ రాశిలోకి దూరితే, (జొర్రితే అనే మాట ఎప్పుడయిన విన్నారా? వింటిరా? ఇన్నరా? విన్నారా?) ఆ నెల వస్తుంది. అందుకే తమిళంలో నెలలకు తమిళ పేర్లు ఉన్నప్పటికీ, సింహ మాసం, మేష మాసం అని రాశుల పేరున వాటిని గుర్తించే పద్ధతి కూడ ఉన్నది.
అసలు సంగతేమంటే, తమిళ నూతన వత్సరము మామూలుగ ఏప్రిల్ 14ననే వస్తుంది. భూమి సూర్యుని చుట్టు తిరుగుతున్నదని తెలుసు గద. అది మరీ కచ్చితమయిన గుండ్రని దారి వెంట తిరుగుతున్నట్టు లేదు. పైగా భూమి నిట్టనిలువుగ ఉండి తిరుగుతులేదు. ఇటువంటి కారణాల వల్లనే మనకు ఋతువులు ఏర్పడుతున్నయి. పగలు రాత్రుల నిడివిలో తేడాలు వస్తున్నయి. అయితే యాటా రెండుసార్లు, అంటే ఏడాదికి రెండుసార్లు పగలు, రాత్రి యించుమించు సమానంగ ఉంటయి. అటువంటి పరిస్థితిని వెర్నల్ ఇక్వినాక్స్ అంటరు. అట్టి దినము ఒకటి ఏప్రిల్ 14 వస్తుంది. అది ఎప్పుడు తప్పక వస్తుంది. ఆ రోజును, దినాన్ని దివసాన్ని తమిళులు కొత్త సంవత్సరం మొదటి నాడుగ ఎంచుకున్నరు. నేపాల్, బంగ్లాదేశ్, బర్మాలతోబాటు, పంజాబ్, కేరళ లాంటి చోట్ల కూడా పంచాంగాలు సూర్యుని అనుసరిస్తయి గనుక వారి సంవత్సరాది కూడా ఏప్రిల్ 14నే వస్తుంది. కంబోడియా, నావోస్, థాయిలాండ్‌లలో కూడ కొత్త సంవత్సరం ఈ రోజునే మొదలవుతుందట!
నా పుస్తకం బైండింగు జరగలేదని, అది బుక్‌ఫెయిర్ తొలినాటికి అందలేదని మొదలుపెట్టి, ఆ సంగతి పక్కనబెట్టి, కొత్త సంవత్సరం లెక్కల్లో పడి కొట్టుకు వచ్చిన కొత్త పుస్తకం యాడాదిలో ఏ నాడయిన రావచ్చు. కొత్త సంవత్సరం మాత్రం ఒక లెక్క ప్రకారం రావాలె గద! ఇంతకు సూర్యుని గమనాన్నిబట్టి పంచాంగం పాటించేవారు కూడ రుూ పడమటి అంటే గ్రెగోరియన్ న్యూఇయర్‌కు సమంగ గడబిడ చేయగలుగుతున్నరా?
ఎందుకో తెలియకుండనే, అందరు జన్వరి, జానువరి, లేదా అలవాటయిన జనవరి మొదటి తారీఖు, తేదీ కొరకు అదేదో కొంప మునుగుతుంది అన్నట్లు ఎదురుచూస్తరు. మధ్యరాత్రి వరకు, ఆ తరువాత కూడ మేలుకుని ఉండి, గ్రీటింగులు, గోల చేస్తరు. సంక్రాంతికి ఒక ముగ్గయినా వేయని వాండ్లు కూడా, ఆనాడు ‘హాపీ న్యూయియర్’ ముగ్గులు వేస్తరు. రాస్తరు. మరి యింట్లో పండుగ, ప్రత్యేక పూజలు, కొత్తబట్టలు, మిఠాయిలు ఉంటయ్యా. మా యింట్లోనయితే ఉండవు!
నిజానికి జనువరి తొలినాడు సూర్యుడు తూర్పునగాక మరోచోట ఉదయించే పద్ధతేమీ లేదు. మరి ఎందుకని మనవాండ్లు, మన పండుగలను కూడ మరిచి, ఈ లేని పండుగ కొరకు ఎదురుచూస్తరు? తి.తి.దే అనే తిరుమల తిరుపతి దేవస్థానము వారి కాలెండర్, డయరీలు జనువరితో మొదలవుతయి. ఉగాదితో మొదలయి ఉంటే అందరికీ వాటివల్ల తెలుగు సంస్కృతి గురించి తెలిసేది గద!
దూరం లెక్కబెట్టాలంటే మైలురాళ్లు ఉన్నట్లు, కాలం లెక్కబెట్టాలంటే గూడ ఒక రాయి, కాదంటే ఒక దివసం ఉండాలె గద! (దినం, దివసం అంటే మరేదో గుర్తుకు వస్తుందట చాలమందికి. రోజ్ అన్నది మన మాట కాదు. రోజు అని బలవంతంగా అన్నప్పటికీ అది తెలుగు కాదు) పార్సీ వారికి నవ్‌రోజ్ అనే ఉగాది, న్యూయియర్ డే ఉంది. నవ అంటే కొత్త, రోజ్ అంటే దినము. సింపుల్. కొత్త సంవత్సరానికి కొత్త దినంతో ప్రారంభం. పారసీలు సూర్య ఆరాధకులు. ఉత్తరార్ధ గోళంలో పగలు రాత్రి సమానంగా ఉండే మార్చ్ 21న ఈ పండుగ వస్తుంది. మహా అయితే ఒకనాడు అటుయిటు అవుతుంది. జమ్‌షేడ్ అనే ప్రభువు ఈ నిర్ణయం చేసినందుకు ఈ పండుగను జమ్‌షేడీ నవ్‌రోజ్ అని కూడా పిలుస్తారు. ఇరాన్‌లో మొదటి నెల పేరు ఫర్‌వర్దిన్. ఎక్కడో విన్నట్టుందా? హిందీలో ఎందుకంటరో తెలియదుగాని ఫిబ్రవరినీ ఫర్వరీ అంటరు.
ఇస్లాం కొత్త సంవత్సరం ముహర్రం నెలతో మొదలవుతుంది. దీన్ని హిజ్‌రీ నయాసాల్ అంటరు. ఇందులో కూడ పనె్నండు నెలలు ఉంటయి. అయితే అధికమాసం పద్ధతి లేదు గనుక, ఈ నెలలు ఎప్పుడూ ఒకే తీరుగ రావు. రంజాన్ జరుగుతుంది. నిజంగ పక్కకు జరుగుతుంది. అట్లా ఈ ఉపవాసాల నెల సంవత్సరమంతా జరుగుతూ, రకరకాల రుతువులలో వస్తుంది. అంతా వింతగ ఉంటుంది. ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంగతులు ఎన్నో ఉన్నయి.
ఇంతకు నా కథల పుస్తకం బైండింగ్ జరిగిందా? ఎప్పుడు జరిగింది? తరువాతి కథ వెండి తెరపై చూడండి! ఇట్లంటే ఏమో తెలియనివారు కూడ లోకాభిరామమ్ చదువుతుంటరు. వెనకట, మాఝీమే, గతంలో సినిమా పబ్లిసిటీ కొరకు కథను కొంచెం చెప్పి, కొన్ని ప్రశ్నలు రాసి, తరువాతి కథ వెండితెరపై చూడండి అనేవారు. నిజంగ సినేమాకు పోతే అక్కడ వెండితెర ఉంటుందా? తెల్లని తెర ఉంటుందా? ఈసారి పోయినప్పుడు గమనించి ఉత్తరం రాయండి! ఈలోగా నేను నా పుస్తకాల పరిస్థితిని గురించి కొంచెము తెలుసుకునే ప్రయత్నము చేస్త గద!
*

కె.బి. గోపాలం