S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంక్ పెన్ను ( సండేగీత)

ఈ కాలంలో సిరా (ఇంక్) పెన్నులు రాసే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రకరకాల పెన్నులు వస్తున్నాయి. బాల్‌పాయింట్ పెన్నులు, జెల్ పెన్నులు ఇలా ఎన్నో రకాలు. తడి తగిలినా కూడా అక్షరాలు చెదిరిపోకుండా ఉండే ఇంక్‌లతో ఎన్నో పెన్నులు కన్పిస్తున్నాయి.
ఇక, ఇంక్ పెన్నుల విషయానికి వస్తే అవి తడి తగిలితే చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్క నల్ల సిరాతో రాసినవి ఆ విధంగా చెదిరిపోవడం లేదు. కారణాలు ఏమైనా సిరాతో రాసే పెన్నుల వినియోగం చాలా తగ్గింది. నా చిన్నప్పుడు ఎక్కువగా ఇంక్ పెన్నులనే వాడేవాళ్లు. ఇప్పుడు ఇంక్ పెన్నుల్లో ఇంక్ పోసుకునే ఓపిక జనాలకు లేకుండా పోయింది.
నాకు చిన్నప్పటి నుంచి ఇంక్ పెన్నులతో రాయడం ఇష్టం. అందులోనూ రకరకాల రంగులని వాడతాను. అందుకని నా దగ్గర కనీసం ఐదారు ఇంక్ పెన్నులు ఉండేవి. ఇప్పుడు కూడా చాలా పెన్నులు నా దగ్గర ఉన్నాయి. రకరకాల రంగుల ఇంక్ బాటిల్స్ ఉన్నాయి.
నేను ఇంక్ పెన్నులని వాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కువగా రాయడం అవసరం ఉంది కనుక ఇంక్ పెన్నులు వాడతాను అని చెప్పేవాడిని. ఇంక్ పెన్నులతో రాయడం వల్ల చెయ్యి మీద వత్తిడి తగ్గుతుంది. ఎవరైనా ఇంక్ పెన్నులతో రాసే వ్యక్తులు కన్పిస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది. అదే విషయం వాళ్లకి చెబుతాను.
హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో డక్కన్ పెన్‌స్టోర్ ఉంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లడం అలవాటుగా మారింది. కొత్తగా వచ్చిన పెన్నులని చూడటం, అదే విధంగా కొత్తగా వచ్చిన రంగురంగుల ఇంక్ బాటిల్స్‌ని పరిశీలించడం, అవసరమైనవి కొనుక్కోవటం చేస్తుంటాను. బ్రౌన్ కలర్‌లో ఇంక్ బాటిల్స్ వచ్చేవి. ఇప్పుడు రావడం తగ్గింది. కలర్ బాటిల్స్ గురించి, కొత్త పెన్నుల గురించి నాకు ఆ షాప్ వాళ్లు చెప్పేవాళ్లు. ఆ షాప్‌లో ఓ ప్రత్యేకత ఉంది. మనం రాసే పెన్ను నిబ్ (పత్తి) సన్నగా రాయాలంటే సన్నగా చేసేవాళ్లు, లావుగా రాయాలంటే ఆ విధంగా మనకు అవసరమైన రీతిలో ఆ పత్తిని మార్చి ఇస్తారు. ఈ సౌకర్యం నాకు హైదరాబాద్‌లో ఎక్కడా కన్పించకపోయేది.
ఈ మధ్య ఓసారి ఆ షాప్‌కి వెళ్లాను. కొత్తగా వచ్చిన షఫర్ పెన్నుని చూపించి, అది బాగా రాస్తుందని చెప్పాడు. దాని ఖరీదు 5వేల రూపాయలని చెప్పాడు. నాకు వంద, రెండు వందల రూపాయల పెన్నులు మాత్రమే కొనడం అలవాటు. కాని ఆ కొత్తగా వచ్చిన సేల్స్‌మెన్ కొనుక్కోమన్నట్టుగా మళ్లీ చెప్పాడు.
‘పెన్ను కాదు ముఖ్యం. దాంతో మనం ఏం రాస్తామన్నది ముఖ్యం’ అన్నాను.
దగ్గర్లో కూర్చున్న దాని యజమాని నా మాటలు విని ‘ఆదాబ్ సాబ్’ అన్నాడు సంతోషంగా.
మనలో చాలామంది గుర్తించనిది ఇదే. ఖరీదుకు ప్రాముఖ్యం ఇస్తారు. చాలామంది పెద్ద కార్లు కావాలని కోరుకుంటారు. కానీ ఏ.సి వున్న ఏ కారైనా ఒక్కటే అనుకోరు.
గంటా, రెండు గంటల విమాన ప్రయాణానికి రెండింతలు చెల్లించి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేస్తుంటారు. వెళ్లే గమ్యం ఒక్కటే.
అలంకారానికి మాత్రమే కొనుక్కుంటే ఎంత ఖరీదైన పెన్నైనా లాభం లేదు.