మంత్రం
Published Saturday, 2 January 2016ఈ రోజుల్లో యువకులు అన్నీ సులువుగా రావాలని కోరుకుంటున్నారు. ఈజీమనీ, ఈజీ లైఫ్. ఇలా ఎన్నో... ఇది గమనించినప్పుడల్లా నా చిన్ననాటి సంఘటన గుర్తుకొస్తుంది.
నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు మంచి టీచర్లు ఉండేవాళ్లు. ఒకరిని మించి మరొకరుగా అన్పించేవాళ్లు. తెలుగు టీచర్‌ని మించి సైన్స్ టీచర్. అతన్ని మించి లెక్కల టీచర్. సులువుగా పాఠాలు చెప్పేవాళ్లు. పుస్తకం చూడాల్సిన అవసరం వాళ్లకి ఉండకపొయ్యేది. అలవోకగా చెప్పేవాళ్లు.
క్లాస్ విన్న ప్రతిసారి వాళ్లలాగా పాఠాలు అన్నీ నోటికి వస్తే బాగుండునని అన్పించేది. పాఠాలు ఆ విధంగా వచ్చేలాగా ఏదన్నా మంత్రం ఉంటే బాగుండునని అన్పించేది. వాళ్లు ఆ విధంగా ఎలా చెబుతున్నారు? వాళ్లకి ఆ పాఠాలు నోటికి ఎలా వచ్చాయని ఆశ్చర్యం వేసేది.
వాళ్లని అడగాలని అన్పించేది. కానీ ధైర్యం చాలక పొయ్యేది. వాళ్లకి వచ్చినంత సులువుగా పాఠాలు వస్తే బాగుండునని మాత్రం తరచూ అన్పించేది. లెక్కల్లో మంచి మార్కులు రావాలని ట్యూషన్‌కి వెళ్లేవాడిని. ఓ రెండు నెలల తరువాత ఆ లెక్కల సార్‌తో కొంత చనువు ఏర్పడింది.
తనకి వచ్చినంత సులువుగా మాకు లెక్కలు వచ్చే ఉపాయం ఏదన్నా ఉందాని ఒకరోజు ధైర్యంచేసి అడిగాను.
ఆయన నవ్వి ఇలా అన్నాడు.
‘మన గుట్ట మీద ఎన్నో రాళ్లు ఉన్నాయి. అందులో ఒక రాయి శిల్పంగా మారి గుడిలో దేవుడిగా మారింది. ఆ రాయి ఎన్ని ఉలిదెబ్బలు తిన్నదో గమనించావా? ఎన్నో ఉలి దెబ్బలు ఎన్నో మార్పులు చేర్పుల తరువాత అది దేవుని రూపంగా మారింది. ఏదీ అంత సులువుగా రాదు. వాటికి మంత్రాలు లేవు’
ఇక్కడితో ఊరుకోలేదు. ఇంకా ఇలా చెప్పాడు.
‘మీరంతా చాలా సులువుగా అన్నీ కావాలని కోరుకుంటున్నట్టుగా నాకు అన్పిస్తుంది. ఏవీ సులువుగా రావు. జీవితం సులువైనది కాదు. ఎన్నో సంవత్సరాలు గాంధీ కష్టపడితే స్వాతంత్య్రం వచ్చింది. చివరికి ఆయన ఓ బుల్లెట్ వల్ల చనిపోయాడు.
ఓ ఆటగాడు రోజూ ఎన్నో గంటలు ప్రాక్టీస్ చేస్తాడు. క్రికెట్ విషయమే తీసుకో. సునీల్ గవాస్కర్ రోజూ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఎన్ని అపజయాల తరువాత చాంపియన్‌గా నిలదొక్కుకున్నాడు. ఓ గాయకుడు ఓ కచేరీకి వచ్చే ముందు ఎంతో ప్రాక్టీస్ చేస్తాడు.
జీవితంలో ఏదీ సులువుగా రాదు. నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడో తెలుసా? టాటా, బిర్లాలు సులువుగా వ్యాపారం చేయడం లేదు. వాళ్లకి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజకీయ నాయకులని, బ్యూరోక్రాట్లని, వ్యాపారంలోని పోటీని ఇలా ఎన్నో ఎదుర్కోవాలి. వాళ్ల దగ్గర ఏ మంత్రమూ లేదు’
ఆ మాటలు అలా గుర్తుండిపోయాయి. సులువైన జీవితం అంటూ ఏదీ వుండదు. మనం జీవితంలో ఏం కావాలో నిర్ణయించుకునేది మనమే. ఆ విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి.
జీవితంలో ఏదీ సులువుగా రాదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. విజయానికి అడ్డదారులు లేవు. దానికి వున్నది ఒక్కటే రహదారి. నిరంతరంగా శ్రమించడం. యువతరం ఇది గమనించాలి.
====================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు,
రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు
కూడా పంపించవచ్చు.
=======================