S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలం (సండేగీత)

1990 సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు హైదరాబాద్‌లో నేను ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఆహార కల్తీ నేరాలు చేసిన వ్యక్తులని, మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం నేరం చేసిన వ్యక్తులని శిక్షించే కోర్టు. వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్ నగరంలో క్యాంప్ కోర్టు నిర్వహించాలి. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ ఆ కోర్టుకి ఓ అంబాసిడర్ కారుని ఏర్పాటు చేసింది. అప్పుడు జిల్లా జడ్జీలకు కూడా కార్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఓ మేజిస్ట్రేట్‌కి ప్రభుత్వ కారు ఉండేది. దాదాపు అందరూ న్యాయమూర్తులు బస్సుల్లో, ఆటోల్లో కోర్టులకి వెళ్లేవాళ్లు. అప్పుడు ఎం.ఇ.ఎన్. పాత్రుడు మొదటి అదనపు సెషన్స్ జడ్జిగా పని చేసేవారు. ఆయనే చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా కూడా వ్యవహరించేవారు. ఇతర మేజిస్ట్రేట్‌లతో నెలకి రెండుసార్లు సమావేశాన్ని నిర్వహించి కేసుల పురోగతిని సమీక్షించేవారు. నేను ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా జాయిన్ అయిన తరువాత ఓ నెల రోజులకి ఆ మీటింగ్ జరిగింది. చాలా విషయాలు మాట్లాడిన తరువాత కోర్టులకి మేజిస్ట్రేట్లు ఎలా ప్రయాణం చేస్తున్నారన్న విషయం చర్చకి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. నేను కారులో వచ్చి వెళ్తున్నానని చెప్పాను.
‘రోజూ ఓ నలుగురు ఆఫీసర్స్‌ని మీ కారులో తీసుకొని రావచ్చు కదా? రేపటి నుంచి అలా చేయండి’ అన్నారు.
నా కోర్టు ఎక్కడో కోర్టుల సముదాయానికి దూరంగా ఓల్డ్ సిటీలో ఉంటుంది. అందులో వారానికి రెండు మూడు రోజులు క్యాంప్ కోర్టు ఉంటుంది. హైదరాబాద్‌లో క్యాంప్ కోర్టు ఎక్కడెక్కడో నిర్వహిస్తాం. అక్కడే సాయంత్రం ఐదు దాటుతుంది. అక్కడెక్కడి నుంచో మళ్లీ తిరిగి వచ్చి మా అధికారులని తీసుకొని వెళ్లడం చాలా కష్టమైన పని. అదే విషయం చాలా స్పష్టంగా ఆయనకి చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. అంత స్పష్టంగా, నిర్మొహమాటంగా మాట్లాడటం మా ఇతర మేజిస్ట్రేట్స్‌కి ఎవరికీ నచ్చలేదు. అందరిలో ఓ సీనియర్ మేజిస్ట్రేట్ నాతో ఇలా అన్నాడు.
‘మీటింగ్‌లో అంత నిర్మొహమాటంగా చెప్పడం బాగుండదు. పెద్దవాళ్లు హర్ట్ అవుతారు. మీకు అసౌకర్యంగా అన్పిస్తే ఆయనతో వ్యక్తిగతంగా చెప్పాలి. మీకు ఉద్యోగం కొత్త కదా’ అన్నారు.
నేను ఏమీ సమాధానం చెప్పలేదు. నేను చేసింది కరెక్టని నా అభిప్రాయం. నేను వౌనం వహించాను.
కొద్ది నెలలు గడిచాయి. వారంట్ల అమలు విషయం కూడా చర్చకు వచ్చింది. అప్పుడు కూడా నిర్మొహమాటంగా నా అభిప్రాయాలు చెప్పాను. ఉద్యోగంలో కొత్తగా చేరిన వ్యక్తి నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగేది. జిల్లా న్యాయమూర్తులు మాత్రం వౌనంగా ఉండేవాళ్లు.
ఓ మూడు మాసాల తరువాత పాత్రుడుగారు పిలిచి బాగా మాట్లాడుతున్నారని అన్నారు. చాలా విషయాల మీద నేను చెప్పిన అభిప్రాయాలను ఆయన గౌరవించారు. ఇంకా కొద్ది మాసాల తరువాత నాతో చాలా సన్నిహితంగా వుండటం మొదలుపెట్టారు. అది అందరికీ ఆశ్చర్యం వేసేది.
మేమెంత సన్నిహితం అయినామంటే కుటుంబాలతో కలిసి టూర్లు తిరిగేంత సన్నిహితం అయ్యాం.
జీవితంలో మనం నమ్మింది చెప్పగలగాలి. అది కూడా స్పష్టంగా చెప్పాలి. అర్థం చేసుకునేవాళ్లు అర్థం చేసుకుంటారు. ధైర్యంగా విషయాలని చెప్పాలి. ఎవరైనా పొరపాట్లు చేస్తే చెప్పగలగాలి. అదే బలం. ఒక్కోసారి బలహీనత. కానీ చాలాసార్లు అది బలంగానే ఉంటుంది.