S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పండుగ ఉంటుందా?

ఇద్దరు మిత్రులు చాలాకాలం తరువాత కలిశారు. వాళ్లలో ఒకతను సంచీ చంకన పెట్టుకుని తలవంచుకుని ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాడు. మరొకతను పడవలాంటి కారులో ఎదురుగా వచ్చి ఆగాడు. కారు దిగాడు. నడుస్తున్న మనిషిని గమనించాడు. మిత్రుడే అని తేల్చుకున్నాడు. మాట్లాడుకున్నారు. కలిసి కారెక్కి పోతున్నారు కూడా. ‘క్లాస్‌లో మామూలుగా ఉండేవాడివి, ఈ కారు, ఈ వ్యవహారం ఎలా కుదిరింది?’ అమాయకంగా అడిగాడు ఫుట్‌పాత్ మిత్రుడు. ‘ఏముంది, అవకాశం వచ్చింది, దూకేశాను’ అన్నాడు పడవ కారు మిత్రుడు. ‘అవకాశం వచ్చిందని ఎలా తెలిసింది?’ అమాయకం ప్రశ్న. ‘అదేమీ లేదు, ఎప్పుడూ దూకుతూనే ఉన్నాను. కనుక అవకాశం వచ్చినప్పుడు కూడా దూకినట్టే కదా!’ తెలివిగల జవాబు. నిజానికి ఈ ముక్కకు, నేను చెప్పదలచుకున్న అంశానికి సంబంధమే లేదు.
నాకు ఎప్పుడూ ఏదో ఒకటి రాయడం అలవాటే. అప్పట్లో కనీసం ఆనాటి ఆలోచనలను డైరీగా రాసుకునే వాడిని. ముప్పయి మూడు సంవత్సరాల వయసు నిండిన తరువాత అనుకోకుండానే ఒక రచన చేసినట్టున్నాను. దానికి ముప్పయి మూడు అని పేరు పెట్టాను. పదకొండు పేజీలు దాటి సాగినట్టు గుర్తుంది. అది కవితా, లేక కథ అర్థం కాలేదు. మొత్తానికి రాశాను. చాలామంది చదివారు. అది నా వెబ్‌సైట్‌లో ఉంది. ఎక్కడా అచ్చుమాత్రం కాలేదు. ఇది కూడా అప్రస్తుతమే. మొత్తానికి ఆ రచన చివరలో నీకు ఎన్ని ఏళ్లు వచ్చినా పరిస్థితి మారదు అని సూచిస్తూ 33 = 34 = 35 = 36 అంటూ ఏదో రాశాను. చిత్రంగా అరవయి మూడు నిండాయి. నిజంగానే ఏమీ మారలేదు. ముప్పయి మూడేళ్లు వచ్చినా ఎవరూ నన్ను పట్టించుకోరు, బతుకు గమ్యం ఏమిటో అర్థం కాదు, అంతా గజిబిజీ అని అప్పట్లో రాసుకున్నాను. ఇవాళ కూడా పరిస్థితి అట్లాగే ఉన్నట్టుంది.
అప్పటికే పెళ్లయింది. ఇప్పటికి బాబు పెళ్లి జరిగింది. అప్పుడు నేను బతుకుతున్నట్టే, ఇప్పుడు వాడు ఎక్కడో తన పని తాను చేసుకుంటూ బతుకుతుంటాడు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నందుకు పిల్లలూ, ఆలస్యంగా పుట్టినట్టు లెక్క. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. చదువే పూర్తి కాలేదు అంటుంది ఆమె. పిల్లలకు గజిబిజి లేదు గానీ, నాకు మాత్రం గజిబిజి సాగుతున్నది. మరో పుట్టినరోజు వస్తే ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు.
ఆ మధ్యన వయోధికుల సంఘం వారు ఒక కవి సమ్మేళనం పెట్టి అందులో కవిత చదవమని నన్ను కూడా పిలిచారు. కవిత, కథ రాయను అని ఒకప్పుడు అన్నాను కానీ, అడపాదడపా రాస్తూనే ఉన్నాను. ఓ కవిత రాశాను. అక్కడ చదివాను. అందరూ బాగుందన్నారు కూడా. అయితే ఆ సమావేశంలో హిందీ, ఉర్దూ అర్థమయ్యేవాళ్లు కొంతమంది ఉన్నట్టు నాకు అర్థమయింది. అందుకనే అక్కడికక్కడ రెండు ఉర్దూ ముక్కలు కూడ చెప్పాను. ‘వింతగా ఉంది, ఎందుకు నీవు చింత పడుతున్నావో, ముందుకు నడవాలిక, గమ్యం నిజానికి దగ్గరయింది’ అని అర్థం వచ్చే పద్ధతిలో ఒక ఉర్దూ కవిత చెప్పాను. చాలామంది తగిన పద్ధతిలో శభాష్‌లు కూడా చెప్పారు. ఇంతకూ సంగతేమిటంటే, వయసు పెరిగిన తరువాత పుట్టిన రోజు మరింత ఆనందంగా చేసుకోవాలి కదా! ఇంకా మరెన్నో పుట్టిన రోజులు జరుపుకునే వీలు ఉండదు కనుక, ఉన్న అవకాశాన్ని హాయిగా వాడుకోవాలన్నది నా ఆలోచన. పెద్దవాళ్లమయినందుకు మరింత ఆనందంగా బతుకు సాగాలి కానీ, బరువు భావం కలుగకూడదు. ఈ బరువు ఇంకెన్నాళ్లో ఉండేది కాదు కనుక, ఉన్నంతకాలం ఆనందంగానే ఉంటే పోతుంది.
ఇంతకూ ఈ ప్రపంచంలో ఎంతమంది తమ పుట్టిన రోజును గుర్తుంచుకుని భారీ ఎత్తున లేదా తగిన ఎత్తున పండుగ చేసుకుంటారు? ఒకప్పుడు బడిలో చేరడానికి కూడా బర్త్ సర్ట్ఫికెట్ అడిగేవారు కాదు. మనం చెప్పిన మాటను నమ్మేవారు. నాన్న నన్ను బడిలో చేర్పించినప్పుడు ఉజ్జాయింపుగా ఏదో ఒక తేదీ వేశాడు. నిజానికి ఒకవైపు సంప్రదాయం, మరోవైపు ఛాదస్తం ఉండే మా వాళ్లు కూడా పిల్లల జాతక చక్రాలు వేసి దాచుకోవడం నాకు కనిపించలేదు. అప్పట్లో అమ్మ ఏకాదశి నాడు పుట్టావు అని చెప్పింది. రోహిణి నక్షత్రం అన్నారు. ఆ రెంటిని కలిపి చూస్తే నాన్న వేసిన తేదీ తప్పు అని తెలిసింది. అంతో ఇంతో సమాచారం కలిసే తేదీ జులైలో వస్తుంది. నాన్న మాత్రం నా పుట్టిన రోజు జూన్ మాసంలో అని రాసేశాడు. కొంతవరకు పట్టింపు ఉన్న మనుషులే ఈ రకంగా ఉంటే, ఇక అమాయకపు పల్లె జనం అసలు ఆ విషయానే్న పట్టించుకునేవారు కాదు. చాలా మందికి పుట్టిన రోజు జనవరి మొదటి తేదీ వేసేవారని, ఆ తరువాత ఎవరో చెపితే ఆశ్చర్యమయింది.
మొత్తానికి నాకు చిన్నప్పటి నుంచి పుట్టిన రోజు చేసుకునే పద్ధతి లేదు. అందుకు కారణం ఉంది. అమ్మ కడుపున నా కన్నా ముందు పడ్డ అయిదుగురు మిగలలేదు. ఇద్దరు అన్నయ్యలు, ముగ్గురు అక్కయ్యలు పోయారన్నమాట. కనుక నన్ను చేతనయినంత నిర్లక్ష్యం చేసినట్టు లెక్క. అయినా పిల్లలు పెద్దవాళ్లయిన తరువాత గుర్తుంచుకుని నా పుట్టిన రోజున గొప్ప సంబరం లేకున్నా, కనీసం గ్రీటింగ్‌లు మాత్రం తప్పకుండా చెప్పేవారు.
మొన్న జూన్‌లో 63వ పుట్టిన రోజు జరిగినట్టు లెక్క. నా పుట్టిన రోజు నాకే గుర్తుండేది కాదు ఒకప్పుడు. యూనివర్సిటీలో ఉండగా, ఒకరోజు బ్యాంక్‌లోకి వెళ్లాను. డబ్బులు తీయాలని చెక్ రాస్తున్నాను. దాని మీద 16-06 అని అంకె వేశాను. నాకేదో చటుక్కున మెరుపు మెరిసింది. ఈ తేదీ మళ్లీ మళ్లీ రాస్తుంటానే అనిపించింది. ఒక్క క్షణం తరువాత ట్యూబ్‌లైట్ వెలిగింది. ఇవాళ నా పుట్టిన రోజు కదూ అని గుర్తుకు వచ్చింది. యురేకా పెద్ద మనిషిలాగ, అక్కడ నేనేదో గోల చేసి ఉంటే, అందరూ నన్ను ఎర్రగడ్డకు చేసే ప్రయత్నం చేసేవాళ్లేమో. (ఎర్రగడ్డలో పిచ్చాసుపత్రి ఉంటుందని తెలియని వారికి క్షమాపణలు) ఇప్పుడు మాత్రం ప్రపంచం మారిపోయింది. టెలిఫోన్‌లో డైరీ ఉంటుంది. అందులో మనకు తెలిసిన వాళ్ల అన్ని పుట్టిన రోజుల గురించి ముందే తెలుస్తుంది. నా టెలిఫోన్ నాది అని టెలిఫోన్‌కు తెలియదు. తెలిస్తే నీ పుట్టిన రోజు అని పాట పాడేదేమో! పాడలేదు. అయితే ఫలానావాడి పుట్టిన రోజు అని మాత్రం ముందే తెలిసింది. ఎంతమందికి గుర్తుంటుందో చూద్దాం అనుకున్నాను. ఒక్కొక్కప్పుడు రాత్రి దాకా ఎవరికీ గుర్తు రాకపోవడం మామూలే. బాబు అమెరికాలో ఉన్నాడు, వాడికి మన సాయంత్రం అయితే గానీ తెల్లవారదు.
పొద్దునే్న ఎవరో తలుపు తట్టారు. ఎవరో వచ్చి హాపీ బర్త్‌డే చెప్పి చాక్‌లెట్ ఇస్తారని నేను ఏమీ అనుకోలేదు. మామూలుగా తలుపు తీశాను. తరువాత కూడా మామూలుగానే ఏదో జరిగింది. చాలాసేపటి వరకు అంతా మామూలుగానే జరుగుతున్నది. ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను. నా పుట్టిన రోజు చీమ ముందు నాకు కుట్టాలి. నాకే కుట్టకపోతే మరెవరికి కుడుతుంది?
అనుకోకుండా స్వీడన్ నుంచి నా చిట్టితల్లి ఫోన్ చేసింది. ఏమీ పట్టనట్టు మామూలుగా మాట్లాడుతున్నది. ఇవాళ నా పుట్టిన రోజు అని నేను గుర్తు చేయవలసి వచ్చింది. బాబుతోనూ అదే పరిస్థితి. మా ఇంటి మాలక్ష్మి అంటే నా కోడలు మాత్రం గ్రీటింగ్స్ పంపింది. నేరుగా ఫోన్ చేసి నాతో కబుర్లు చెప్పే ధైర్యం ఆమెకు ఎప్పుడు వస్తుందో తెలియదు.
నాకు అక్కడికే చెట్టెక్కినంత సంతోషమయింది. కొండెక్కినంత సంతోషమయింది. అంతలో ఒక మిత్రుడు ఫోన్ చేసి నేను రాసిన ఒక నలభయి పేజీల పుస్తకం కారణంగా నాకు మంచి పాపులారిటీ, అంతకు మించి డబ్బులు కూడా రానున్నాయని చెప్పాడు. అంతకంటే కావల్సింది ఏముంది? ప్రస్తుతం ప్రపంచంలో ఎవర్ని ఎవరు పట్టించుకున్నా, పట్టింపు లేకుండా ఉన్నా గుర్తు చేయడానికి ముఖ పుస్తకం ఒకటి ఉన్నది. నేను నిజానికి ఆ ఫేస్‌బుక్‌ను పట్టించుకోను. ఆ వేళ అనుకోకుండా చూచాను. అక్కడ చాలామంది గ్రీటింగ్స్ చెప్పారు.
అన్నిటికీ మించి నాకు సన్నిహితుడయిన ఒక శిష్యుడు లాంటి మిత్రుడు వెతుకుతూ రాత్రి వచ్చాడు. అతను ప్రతి సంవత్సరమూ వస్తాడు. గత సంవత్సరం మాటల సందర్భంలో నేను కొన్ని పనులు చేసి తీరతానని అన్నానట. అవి చేసి చూపించానని అభినందించి సంతోషం పంచుకున్నాడు ఆ మిత్రుడు. నాకు మిగతా రోజంతా జరిగింది పట్టలేదు. అంతకంటే గొప్ప పండుగ కావాలా అనిపించింది!

కె.బి. గోపాలం