చిన్న విషయాలు
Published Friday, 28 October 2016ఓ రోజు ఉదయం మా ఇంటి దగ్గర్లో వున్న హోటల్‌కి వెళ్లాను. అక్కడ సెల్ఫ్ సర్వీస్. మనమే తెచ్చుకొని తినాలి. టీ కూడా అంతే. టీ వాసన గుప్పుమన్నది. టీ చాలా బాగుంది. వెంటనే ఆ విషయం టీ తయారుచేస్తున్న వ్యక్తికి చెప్పాను. అతని మొఖం విప్పారింది. ఎప్పుడు అక్కడికి వెళ్లినా అతను ఆనందంగా పలకరిస్తాడు. మంచి టీ తయారుచేసి ఇస్తాడు.
ఈ మధ్య ఓ మిత్రుడి ఇంటికి వెళ్లాను. వేడివేడి పకోడి చేసి పెట్టారు. ఆ వాసన గుమ్మంది. చాలా రుచికరంగా ఉన్నాయి. వెంటనే చాలా బాగున్నాయని చెప్పాను. మా మిత్రుడికి మొఖంలో, అతని భార్య మొఖంలో ఆనందం కన్పించింది.
జీవితాన్ని ఆనందించడానికి ఏవో పెద్ద విషయాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. కానీ అతి మామూలు విషయాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయన్న విషయాన్ని మనలో చాలామంది గమనించరు. ఈ రెండు సంఘటనలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
గతంలో పిల్లలు ప్రథమ శ్రేణిలో పాసవుతే తల్లిదండ్రులు ఎంతో పొంగిపోయేవాళ్లు. ఇప్పుడు పిల్లలకి 99 శాతం కన్నా తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు తెగ బాధపడుతున్నారు. ఇక 70 శాతం వస్తే తల్లిదండ్రుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పిల్లల కన్నా ఎక్కువ నిరుత్సాహపడుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. దీంతో పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఇక మెడిసన్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఉన్నవి కొన్ని సీట్లు. పోటీ పడుతున్నది లక్షల మంది. చాలా తీవ్రమైన పోటీ. చాలా తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తారు. ఎం.బి.బి.ఎస్. చదవడంతోనే వాళ్ల ప్రయాణం పూర్తి కాదు. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఇంకా ఇంకా చదవాలి. పిల్లలు మెడిసిన్ చదివితేనే గొప్ప అనుకోవడం ఎంత సరైంది కాదో, ఏమీ చదవకపోయినా ఫర్వాలేదని అనుకోవడం కూడా సరైంది కాదు.
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఇతరులు స్వీట్లు తింటున్నప్పుడు కూడా ఆనందించడం అలవాటు చేసుకోవాలి. కొంచెమే స్వీటు తిన్నా కూడా ఎక్కువ ఆనందపడటం నేర్చుకోవాలి. గతంలో ఎన్నో స్వీట్లు తిన్నామన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి.
ఓ చిన్న మాట ఎంతోమందిని ఆనందపరుస్తుంది. ఆ విషయాన్ని గమనించక ఏదో పెద్ద విజయం సాధించిన తరువాత అభినందిద్దామని అనుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు సరైందో ఆలోచించాలి.
ఎవరెస్టు శిఖరం ఎక్కితేనే అభినందిద్దామని అనుకోకుండా, ఏ చిన్న విజయం సాధించినా అభినందిస్తే వాళ్లు సంతోషిస్తారు. ఈ చిన్న ఆనందాలని ఇంట్లో వాళ్లకి ఇస్తే ఇల్లు ఇంకా ఎంతో సంతోషంగా ఉంటుంది.
టీ వాసన ఘుమఘుమలాడినప్పుడే అభినందించాలి. తాగిన తరువాత కన్నా తాగుతున్నప్పుడే అభినందించాలి.