S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆస్కార్ వీరుడు

ఒకటో తరగతి ఫెయిల్ అయ్యాడు.
కానీ అప్పటినుంచి
జీవిత పాఠాలు చదవడం మొదలెట్టాడు.
తినడానికి తిండిలేక దేశం విడిచి పరాయి
గడ్డపై బతకడం నేర్చాడు.
ఇప్పుడు అపర కుబేరుడయ్యాడు...
దానకర్ణుడయ్యాడు...
ప్రమాదాలతో స్నేహం చేసి
ఆత్మరక్షణ ఎలాగో నేర్పాడు...
అవార్డులు రివార్డులు కొల్లగొట్టాడు...
ఇన్నాళ్లూ దక్కని ఆస్కార్... ఇప్పుడు
ఆయనను వరించబోతోంది.
అద్భుత ప్రతిభావంతులైన సినీరంగ
ప్రముఖులకు ఇచ్చే గౌరవపూర్వక
‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును మోషన్ పిక్చర్స్ అకాడమీ (ఆస్కార్) ప్రకటించింది. దీంతో అతడు ఆస్కార్ వీరుడయ్యాడు.

జీవితాన్ని అందరికీ నచ్చిన విధంగా సాకారం చేసుకోవడం ప్రతిఒక్కరికీ సాధ్యమయ్యేదికాదు. నచ్చిన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తన తరువాతివారికి మార్గదర్శకంగా నిలిచిన విజేతల జీవితాలలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా తన జీవితాశయాన్ని సాధించుకున్నవాడే నిజమైన విజేత. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న జాకీచాన్ జీవితం కూడా బంగారుపళ్లెంలోనుండి ప్రారంభమైనదికాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్లీ నాలుగు మెట్లు కిందపడుతూ, చివరికి తాను అనుకున్న చోటుకి చేరాడు జాకీచాన్. 1954 ఏప్రిల్ 7వ తేదీన ఓ బీద కుటుంబంలో పుట్టిన ఆయన అంత గొప్పవాడు అవుతాడని ఎవరూ ఊహించలేదు. బిడ్డ పుట్టిన సమయంలో ఆస్పత్రిలో చెల్లించడానికి డబ్బుల్లేని తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో ఆయనకు తెలుసు. బిడ్డను ఇంటికి తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు అందరి దగ్గరా చందా పోగుచేసి తెచ్చుకున్న విషయాన్ని ఆయన ఏనాడూ మర్చిపోలేదు. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన ఆయన ఆ తరువాత ఆ దేశానికే సాంస్కృతిక రాయబారికన్నా ఎక్కువగా గుర్తింపు తీసుకువస్తాడని ఎవరూ భావించలేదు. ఓ హోటల్‌లో వంటవాడిగా పనిచేసే ఆయన తండ్రి, అదే హోటల్‌లో హౌస్‌కీపింగ్ చేసే తల్లిని చూస్తూ పెరిగిన ఆయన, పాఠశాలకు వెళ్లి చదువుకున్నది చాలా తక్కువే. జీవితాన్ని చదవడం ప్రారంభించాడాయన. ఏడు సంవత్సరాల వయసులోనే తండ్రి ఆస్ట్రేలియాలో వున్న అమెరికన్ ఎంబసీలో కుక్‌గా వెళ్లాక ఆయన జీవితం మారిపోయింది. నిజానికి చాన్ తండ్రి గూఢచారిగా పనిచేశారు. ఆయన చైనీస్ డ్రామా అకాడమీలో చేరారు. రోజుకి 19 గంటలపాటు అక్కడ జీవితాన్ని చదవడం ప్రారంభించాడు. ప్రఖ్యాతిపొందిన చైనా ఒపెరా మాస్టర్ యూజిమ్ యాన్ నేతృత్వంలో పాఠాలను నేర్చుకున్నాడు. కుంగ్‌ఫూ, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో అనుభవాన్ని సంపాదించడం ప్రారంభించాడు.
గురువు శిక్షణలో ఆరితేరిన జాకీచాన్, ఆ తరువాత నేర్చుకున్న విద్యలోనే వైవిధ్యాన్ని చూపడానికి ప్రయత్నాలు చేశాడు. జంతువులతో చేసే సర్కస్ కంపెనీలు, అమ్యూజిమెంట్ పార్క్స్ లాంటి చోట ప్రజలకు ఆనందాన్నిచ్చే స్టంట్స్ చేసి మెప్పులు పొందడం ప్రారంభించాడు. 17 ఏళ్ళ వయసులో అకాడమీనుంచి బయటకు వచ్చి స్వంతంగా ప్రజలకోసం తన కళలను ఉపయోగించడం ప్రారంభించాడు. స్టంట్‌మెన్‌గా ఉన్నతమైన రాణింపును పొందాడు. షావ్‌బ్రదర్స్ ఫిలిం అకాడమీలో యుద్ధ విద్యలను ప్రదర్శించడానికి పూనుకున్నాడు. అనేకమంది పాత స్నేహితులను కలుపుకుని ఈ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. అదేసమయంలో గోల్డెన్ హార్వెస్ట్ కంపెనీతో జాకీచాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే 1971లో బ్రూస్‌లీ నటించిన ‘్ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్‌ది డ్రాగన్’ చిత్రాలలో హీరోతో ఢీకొనే ఫైటర్‌గా నటించాడు. విల్లికచాన్ రూపొందించే చిత్రాలలో కూడా నటించడం ప్రారంభించాడు. మిలియనీర్
డైరెక్టర్‌లో బ్రూస్‌లీకి మోడల్‌గా నటించాడు. బికమ్ ఏ డ్రాగన్ చిత్రాన్ని
మళ్లీ నిర్మించే ప్రయత్నం చేశాడు. న్యూ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ (1976) చిత్రాన్ని తన స్టైల్లో రూపొందించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. షావులిన్ వుడెన్ మ్యాన్, కిల్లర్ మెటియోర్, మ్యాగ్నిఫియెంట్ బాడీగార్డ్స్ చిత్రాలను తన స్టైల్లో రూపొందించాడు. కానీ ఆ చిత్రాలు అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి. జాకీచాన్ నిరుత్సాహానికి లోనయ్యాడు. స్నేక్ అండ్ క్రేన్ ఆర్ట్స్ ఆఫ్ షావోలిన్ చిత్రాన్ని స్నేహితుడు చాన్‌చీవావ్ దర్శకత్వంలో రూపొందించాడు. తనకు నచ్చిన విధంగా ఫైట్స్ కంపోజ్ చేసి, తన అనుభవాన్నంతా జోడించి ఆ చిత్రాన్ని రూపొందించాడు. సెనే్సషనల్ చిత్రం 1978లో వచ్చిన ‘స్నేక్ ఇన్ ది ఈగిల్ షాడో’ జాకీచాన్ పేరును మారుమ్రోగించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు తన చిత్రాలను ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగానే రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. స్నేక్ ఇన్ ది ఈగిల్స్ షాడో ఆయన జీవితానికొక పాఠంగా నిలిచి సరికొత్త మలుపు తీసుకోవడానికి ఉపయోగపడింది. అప్పటినుండి కుంగ్‌ఫూ నేపథ్యంలో కథలు రాసుకుని దానికి కామెడీ జోడించి చిత్రాలు తీయడం ప్రారంభించాడు జాకీచాన్.
అవాంతరాలు
చిత్రాలను రిస్కీ షాట్స్‌తో నింపడానికి జాకీచాన్ పడే తపన సామాన్యమైనది కాదు. ఎన్ని దెబ్బలు తగిలినా మొక్కవోని ధైర్యంతో షూటింగ్ సాగించాడు. ఒకసారి పళ్లు మొత్తం దెబ్బతిన్నాయి. అయినాకానీ షూటింగ్ సాగుతూనే వుంది. మరోసారి యాక్సిడెంట్ అయి రక్తం పోతూనే వుంది. షూటింగ్‌లో వున్నవారందరూ జాకీచాన్‌ను చూస్తున్నారు కానీ, కెమెరా తన పని తాను చేసుకుంటున్న సంగతి గుర్తించలేదు. ఇప్పటికీ ఆ సన్నివేశం చిత్రంలో చూస్తే ప్రేక్షకులకు గగుర్పాటు కలుగుతుంది. దర్శకుడు యోన్‌వో పింగ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. డ్రంకెన్ మాస్టర్ చిత్రం ఆయనకు లభించిన అతి పెద్ద విజయం. 1999లో వ్యాకోవాస్కీ బ్రదర్స్ నేతృత్వంలో హాంగ్‌కాంగ్ సినిమాకు ఆద్యుడిగా జాకీచాన్ నిలిచారు. యాక్షన్ కామిక్ జోనర్‌లో ‘ది మాట్రిక్స్’ చిత్రం ఆయన విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇలాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్‌వద్ద జాకీచాన్ రేటింగ్స్‌ను పెంచేశాయి.
ఒక్కసారి తాను ఏర్పర్చుకున్న, ప్రపంచమంతా మెచ్చిన పద్ధతిలోనే జాకీచాన్ చిత్రాలను రూపొందించారు. ‘ది యంగ్ మాస్టర్’ (1980) లాంటి చిత్రాలన్నీ గోల్డెన్ హార్వెస్ట్‌తో సమానంగా ఆదరించబడ్డాయి. పోలీస్‌స్టోరీ కథనాలతో 80 దశకం నుండి 90వ దశకం వరకు ఆయన రూపొందించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్సే. ప్రాజెక్ట్-ఎ, మై లక్కీ స్టార్స్, డ్రాగన్స్ ఫర్ ఎవర్ లాంటి చిత్రాలు జాకీచాన్ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాయి.
80వ దశకం నుండి హాలీవుడ్‌లో తన పతాకాన్ని ఎగరేసే ప్రయత్నం చేశాడు జాకీ. రాబర్డ్ క్లౌజ్ దర్శకత్వంలో ‘బాటిల్ క్రీక్ బ్రావెల్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో ఆయనకు చిన్న పాత్రే లభించింది. కొరియోగ్రఫితోపాటుగా ఫైట్స్ కంపోజింగ్ కూడా చేశారు. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడం బాధించింది. కానిబాల్న్ చిత్రంలో కూడా జాకీ లభించిన పాత్ర చిన్నదే. రోగర్‌మూర్, డిన్‌మార్టిన్ లాంటి నటులు నటించిన ఆ చిత్రాలలో ఆయన పాత్ర వెలవెలపోయింది. హాంగ్‌కాంగ్ సాంస్కృతిక నేపథ్యంలో ఆయన రూపొందించిన చిత్రాలు దాదాపు వంద మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టాయి. జాకీచాన్ ఒక నటుడుగా కాక ఓ స్టార్‌గా హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయన తెలుసు. అందుకే మాస్ పల్స్‌ను పట్టుకున్నట్లుగా ఓవైపు భీకర యుద్ధాలతోపాటు మరోవైపు నవ్వించే స్కిట్స్ చేసినట్లుగా ఆయన ఫైట్స్ కంపోజ్ చేసేవారు. ఈ జోనర్ ఆయనకు అన్ని విధాలా గుర్తింపు తెచ్చింది. ఇలాంటి జోనర్ ఒకటి వుంది అని అంటే అది ఖచ్చితంగా జాకీచాన్‌ను గుర్తుచేస్తుందనడంలో సందేహం లేదు. కానీబాల్ రన్-2 చిత్రం ఆయనకొక ఇమేజ్‌ను తీసుకొచ్చింది. 1985లో వచ్చిన ది ప్రొటెక్టర్ చిత్రం హాలీవుడ్‌లో ఆయన కీర్తిప్రతిష్ఠలను శిఖరాగ్రస్థాయికి తీసుకెళ్లింది. జాకీస్ స్టైల్ అంటూ ఓ వరవడిని సృష్టించాడు. అనేకమంది హాంగ్‌కాంగ్ దర్శకులు జాకీచాన్‌ను తమ సినీ రాయబారిగా అభివర్ణించడం విశేషం. ‘రంబుల్ ఇన్ ది బ్రాంక్స్, మిస్టర్ నైస్ గై, రష్ అవర్’లాంటి చిత్రాలన్నీ దేశ విదేశాలలో జాకీచాన్ కీర్తి పతాకాన్ని ఎగరేశాయి.
ప్రయోగాలు.. 2008లో విడుదలైన ‘ది ఫర్‌బిడన్ కింగ్‌డమ్’ చిత్రంలో ఆయన చేసిన ప్రయోగం ప్రేక్షకుల మన్ననలు పొందింది. కుంగ్‌ఫూ పాండా, సూపర్‌మెన్, షింజుకు ఇన్సిడెంట్, ఆర్నర్ ఆఫ్ గాడ్-3, చైనీస్ జోడియాక్, ది స్పై నెక్స్ట్‌డోర్, లిటిల్ బిగ్ సోల్జర్, ది కరాటే కిడ్ లాంటి చిత్రాలు జాకీచాన్‌లో వున్న ప్రయోగశీలిని పట్టిచూపుతాయి.
రాజకీయ వివాదాలు
రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎన్నికలలో డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థులకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. ప్రెసిడెంట్‌ను, వైస్‌ప్రెసిడెంట్‌ను ఎన్నుకునే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు వివాదాలను రేకెత్తించాయి. తైవాన్ దేశం గురించి ఆయన అన్న మాటలు కూడా రెండు దేశాలమధ్య ఆవేశకావేశాలను పెంచాయి. యునిసెఫ్ అంబాసిడర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి.
జంతు ప్రేమికుడిగా జాకీచాన్ తన చిత్రాలలో చూపిన విధంగానే నిజ జీవితంలో కూడా ఆచరించి చూపాడు.
బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్
1999లో యాక్షన్, అడ్వెంచర్స్ గ్రూప్‌లో రష్‌అవర్ చిత్రానికిగాను ఫావరేట్ డ్యూ అవార్డు అందుకున్నాడు. 2001లో షాంగై నూన్ చిత్రానికిగాను ఫావరిట్ యాక్షన్ టీమ్‌గా నామినేట్ అయ్యారు.
సినీక్వెస్ట్ ఫిలిం పెస్టివల్‌లో 1998లో మావేరిస్క్ స్క్రిప్ట్ అవార్డు అందుకున్నారు. 2002లో జాకీచాన్ అడ్వెంచరెస్ యానిమేటెడ్ చిత్రానికి నామినేట్ అయ్యారు. 1997లో బెస్ట్ ఎషియన్ ఫిలిం ‘డ్రెంకెన్ మాస్టర్’ చిత్రానికిగాను చై లియాంగ్ లుతో అవార్డును పంచుకున్నారు.
గోల్డెన్ హార్స్ ఫిలిం ఫెస్టివల్‌లో 1992, 1993 సంవత్సరాలలో పోలీస్ స్టోరీ-3, సూపర్ కాప్, క్రైంస్టోరీ చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 2005లో ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ అవార్డు తీసుకున్నారు.
హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్‌లో 1999లో యాక్టర్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపు పొందారు.
హాంగ్‌కాంగ్ ఫిలిం అవార్డ్సు- 1983లో బెస్ట్ కొరియోగ్రాఫర్ (డ్రాగన్ లార్డ్), 85లో బెస్ట్ యాక్టర్ (ప్రాజెక్ట్-ఎ), 1986లో బెస్ట్ డైరెక్టర్ (పోలీస్ స్టోరీ), బెస్ట్ యాక్టర్ (పోలీస్ స్టోరీ, హార్ట్ ఆఫ్ డ్రాగన్) చిత్రాలకు నామినేట్ అయ్యారు.
1989లో రోగ్ చిత్రానికి అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా 1990, 93, 94, 96, 97, 99 సంవత్సరాలకు మిరాకిల్స్, సూపర్‌కాప్, క్రైంస్టోరీ, డ్రాగన్ లార్డ్, హూ యామ్ ఐ చిత్రాలకుగాను ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నాడు.

***
భారత్‌తో అనుబంధం
జాకీచాన్‌కు భారత్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ నటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాలకు మనదేశానికి వస్తూంటారు. మల్లికాషెరావత్‌తో కలసి నటించిన ‘ద మిత్’ షూటింగ్‌కోసం మనదేశంలో చాలా ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘కుంగ్ ఫు యోగ’లో భారతీయ నటులు సోనుసూద్, దిషాపటాని, అమర్ దస్తూర్, ఆరిఫ్ రెహ్మాన్‌లతో కలసి నటిస్తున్నాడు. జైపూర్‌లో నిర్వహించిన షూటింగ్‌కు హాజరయ్యాడు. త్వరలో నిర్మించనున్న స్కిప్‌ట్రేస్ సీక్వెల్‌లో భారతీయ నటినే ప్రధాన పాత్రకు ఎంపిక చేయాలని జాకీచాన్ నిర్ణయించడం విశేషం. చైనా-్భరత్‌లమధ్య శాంతిసామరస్యాలు నెలకొనాలన్నది ఆయన అభిలాష. భారతీయ నటీనటుల ప్రాభవం విశ్వవ్యాప్తం అవుతోందని ఆయన కితాబివ్వడం విశేషం.
***
సంగీత ప్రియుడు
చిన్నతనంలోనే ఓపెరా స్కూల్‌లో సంగీత పాఠాలను నెమరువేశాడు జాకీచాన్. 1980లోనే తాను కంపోజ్ చేసిన అనేక ఆల్బమ్స్‌ను రికార్డ్ చేశాడు. తియ్యనైన స్వరం వున్న గాయకుడిగా హాంగ్‌కాంగ్‌లోనే గుర్తింపు పొందాడు. దాదాపు 20 ఆల్బమ్స్ స్వీయ సంగీతంలో విడుదల చేసిన సంగీతజ్ఞాని ఆయన. జపాన్, తైవాన్, మాండారిన్ దేశాలలో ఆయనకు సంగీత అభిమానులు విశేషంగా వున్నారు. కుంగ్‌ఫూ ఫైటింగ్ మాన్ అన్న తొలి ఆల్బమ్‌తోనే గుర్తింపు పొందాడు. ది యంగ్ మాస్టర్ (1980) లాంటి చిత్రాలలో సౌండ్ ట్రాక్‌ను ఆయనే అందించడం విశేషం. చైనీస్ పాట స్టోరీ ఆఫ్ ఎ హీరోకు అందించిన బాణీ ఇప్పటికీ అభిమానులకు చెవులలో రింగుమంటూనే వుంటుంది. ఆయన రూపొందించిన బాణీలు అనేకమంది తమ అమ్యూజిమెంట్ పార్క్‌లలో, క్లబ్‌లలో ఉపయోగించారు. ములాన్ (1998) అన్న చిత్రాన్ని వాల్ట్‌డిస్నీ రూపొందిస్తే, అందులో ఓ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. ఐ విల్ మేక్ ఎ మాన్ ఔట్ ఆఫ్ యూ అన్న సౌండ్ ట్రాక్‌కు విశేషమైన ఖ్యాతి లభించింది. ఉయ్ ఆర్ రెడీ (2007) ఆయన విడుదల చేసిన ఒలింపిక్ ట్రాక్ క్రీడాకారులకు ఉత్సాహాన్నిచ్చింది.
***
కుటుంబ నేపథ్యం
జాకీచాన్ 1982లో జాన్‌లీన్ అనే తైవాన్ నటిని వివాహం చేసుకున్నారు. ఆయన కొడుకు జెసిచాన్ గాయకుడిగా ఎదుగుతున్నాడు. జాకీచాన్‌కు వున్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో ఆయన దాంపత్య జీవితం ఒడిదుడుకుల పాలైంది. అనేక దేశాలలో క్రీడాకారులు, నటీనటులు ఆయనకు వీరాభిమానులు. ఇది కూడా ఆయన దాంపత్య జీవితానికి గొడ్డలిపెట్టులా మారింది. తన సంపాదనలో సగ భాగం ప్రజలకోసం ఖర్చుచేయడానికి ముందుకువచ్చి ఆ పనిని నిర్విఘ్నంగా చేశాడు జాకీచాన్.

-సరయు