S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫొటో

నా బెడ్‌రూంలోని గోడకి నా పెళ్లినాటి ఫొటో ఒకటి వ్రేలాడుతుంటుంది. అది పెళ్లికి రెండు రోజుల ముందు మా పెద్దింటికి వంటింటికి మధ్యన మెట్ల మీద కూర్చున్న నా చేతికి మైదాకు (గోరింటాకు) పెడ్తున్న దృశ్యం. ఆ ఫొటోలో దాదాపు ముప్పై మంది ఉంటారు. నలుగురు అక్కలు, నలుగురు స్నేహితులు, అక్కల పిల్లలు, అన్నల పిల్లలు. చాలా అరుదైన ఫొటో. అది నలుపు తెలుపు చిత్రం. పెళ్లి ఫొటోలు తిరగేస్తున్నపుడు ఓ పదిహేను సంవత్సరాల క్రితం మమ్మల్ని బాగా ఆకర్షించిన చిత్రం అది. అందుకని అది కాస్త పెద్ద చిత్రమై గోడకు వ్రేలాడుతూ దర్శనమిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు ఆ చిత్రాన్ని దగ్గరకు తీసుకొని అప్పటి మా వేషధారణలని చూడటం ఓ గొప్ప అనుభవంగా అన్పిస్తూ ఉంటుంది.
ఫొటోలు మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తాయి. ఒక్క ఫొటోతో ఎన్ని జ్ఞాపకాలు చుట్టుముడుతాయి. అప్పటి వాతావరణం, అప్పటి మనుషులు, వేషధారణ, ఆ నవ్వులు ఇట్లా ఎన్నో. కొన్ని ఫొటోల్లో కన్పించే అమ్మ, నాన్న.. ఇప్పుడు లేకపోవడం. చిన్ననాటి చిత్రాలు, పిల్లల ఫొటోలు, కొన్ని ప్రదేశాలను సందర్శించినపుడు అక్కడి వేషధారణ, అనుభవాలు ఇట్లా ఎన్నో గుర్తుకొస్తాయి. ఫొటో ఆల్బమ్‌ని చూడటమంటే గతంలోకి ప్రయాణం చేయడమే. ఫొటోల్లో కన్పించే మనుషులు, పెంపుడు జంతువులు, చెట్లు చేమలు ఇట్లా ఎన్నో.
నాకు మైదాకు పెడుతున్న ఫొటోలో కన్పించే మా గుణక్క ఇక కన్పించదు. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ ఫొటోను చూసి గలగలా ఎన్నో మాటలు మాట్లాడేది. ఇక ఆ మాటలు విన్పించవు. ఆమె కన్పించదు. కానీ నా మనోనేత్రం మీద ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. ఆమె మరణ వార్త తెలిసిన తరువాత మరొక్కసారి ఆ ఫొటోవైపు చూశాను. ఆ ఫొటో మసకబారినట్టుగా అయిపోయింది. ఆ చిత్రం మసకబారలేదు. నా కన్నుల్లో నీరు నిండి కళ్లు మసకబారి అంతా అస్పష్టంగా మారిపోయింది. కన్నీళ్లు ధారలై చెక్కిళ్ల మీద ప్రవహించాయి. దుఃఖం పొర్లుకొచ్చింది. చిన్నప్పుడు తిట్టుకున్నది, కొట్టుకున్నది, ఇష్టపడింది అన్నీ కలగాపులగమై మనస్సంతా అస్పష్టంగా మారిపోయింది. ఆ ఫొటోని చూసినప్పుడు ఎప్పుడూ ఇట్లా అన్పించలేదు. ఎప్పుడు చూసినా సంతోషం వేసేది. కానీ ఈ రోజు కళ్లల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.
నన్ను నేను తమాయించుకున్నాను. కన్నీళ్లను చూసి ఎవరూ ఏమీ అనుకున్నా పర్వాలేదు. అవి నా కళ్లని శుభ్రపరుస్తాయి. నా అంతరాన్ని శుభ్రపరుస్తుంది. నా బాధని కొంతవరకైనా తగ్గిస్తుంది. ఇతరుల పట్ల నేను ఎంత ప్రేమపూర్వకంగా ఉండాలో అది గుర్తుకు తెస్తుంది. నేను ఎలా ఉండాలో నాకు తెలియజేస్తుంది.
జీవితం అంటే చిరునవ్వులే కాదు. జీవితం అంటే కన్నీళ్లు కూడా. అవి రెండూ మన జీవితంలో ప్రవహిస్తేనే మనం బతుకుతాం. అందరూ నవ్వుతూ వున్న ఫొటో ఈ రోజు కళ్లల్లో కన్నీళ్లను చిమ్మింది.

-జింబో 94404 83001