S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎందుకీ బాధ

సైన్సు ఎందుకు రాస్తున్నావు అని ప్రశ్న. బుద్ధిలేక అని నేరుగా జవాబు. వెతికితే ఇంగ్లీషు పత్రికలలో కూడ ఇటీవలి సైన్సు గురించి చదవడానికి ఏమీ కనపడదు. సైన్సు పత్రికలు దేశ స్థాయిలో కూడా లేవు. అయినా పట్టువదలని వక్రమార్గుడి వలె నేను ఎందుకు సైనే్స రాస్తున్నాను. ఈ మాటలకు జవాబు చెపితే నాలాంటి మరి కొందరిని కూడ ఇదే ప్రశ్న అడిగి అందరి జవాబులను ఒక పుస్తకంగా అచ్చేస్తారట. ప్రపంచంలో, దేశంలో ప్రజలు సైన్సు అని ఒకటి ఉన్నదని పట్టించుకోకుండా బతుకుతూ ఉంటే వాళ్లకు చుట్టూ ఉన్న సైన్సు గురించి చెప్పాలన్నది నా తపన. ఆ చెప్పే తీరు గురించి, సైన్సు తీరు గురించి చెప్పేవాళ్లు మరి కొందరున్నారు.
ప్రతి సంగతిని, లోతుగా పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం నాన్నవల్ల అలవడ్డాయి. ఇడ్లీ అంటే ఏమిటో తెలియకుండానే ఇడ్లీలు తయారుచేశారు. గేదెకు కుడితి ఏయే రకాలుగా వండితే ఇష్టంగా తాగుతుందని ప్రయోగాలు చేశాను. స్నానాల (గది లేదు గానీ ఒక గదిలాంటిది ఉండేది) పొయ్యి దగ్గర, ఇనుపగంటెలో నేను చేసిన ఆల్కెమీ మరెవరు చేసి ఉండరు. మొత్తానికి చదువుగూడ సైన్సు దారిలో పడింది. అందరిలాగే పద్యాలు, కవితలతోనే రచనలు మొదలయ్యాయి. యూనివర్సిటీకి చేరిన తర్వాత కూడ కవిత రాయడంలో ముందుకు సాగడు, మానెయ్యడు అని పేరు మిగిలింది. మిత్రుడు దేవరాజు మహారాజుతో రేడియోలో యువవాణి కార్యక్రమంలో ఒక సైన్సు వ్యాసం చదివాను. అది నా మొదటి సైన్సు రచనేమో! (బడాయి). ప్రపంచంలో జంతుజాతులు విస్తరించిన తీరు గురించి రాశాను. ఆవేళ నాకు ఆ తరువాత ఎప్పుడో రేడియోలో చేరతానని, అక్కడ సైన్సు కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని ఆలోచన కూడ కలుగలేదు.
అదేమిటోగానీ సైన్సు చదువుతు ఉంటే గొప్ప ఆనందం కలిగేది. ఎమ్మెస్సీలో బయోకెమిస్ట్రీ ఉంటుంది. అందరూ ఏదో ఒక పుస్తకం తెచ్చుకుని దాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చదువుతారు. నేను మాత్రం లైబ్రరీలో ఉన్న అన్ని రకాల బయో కెమిస్ట్రీ పుస్తకాలను చదివాను. ‘ఇదంతా మన శరీరంలో జరుగుతున్నదా?’ అని ఒక థ్రిల్ మరీ ఎక్కువ చదివి గురువులతో చర్చకు దిగిన సందర్భాలు ఉన్నాయి. సైన్సులోని ఆనందం అక్కడ ఉంటుంది. బయో కెమిస్ట్రీ అంటే చెట్లు, పురుగులు మొదలు మన శరీరాలలో దాక జీవులన్నింటిలోనూ ఉండే రసాయనాల తీరు గురించిన శాస్త్రం. మనిషికి ఇందులో కాకుంటే మరెక్కడ ఆనందం దొరుకుతుందని నా అనుమానం. తిండి తింటే కడుపులో ఏమయినందుకు అది అరిగి మనకు శక్తి అందుతుంది అన్న ప్రశ్నకు జవాబు తెలిస్తే అది నాకు ఆనందం. కొంతమంది ‘ఈ సంగతులు తెలియకుంటే తిన్న తిండి అరగదా’ అని అడిగేవాళ్లు కూడ ఉన్నారు. వారికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప చేయగలిగింది లేదు. ఏదీ తెలియకుండా అందరూ బతుకుతున్నారు గనుక మనమూ బతుకుతూ వెళ్లిపోతే అందులో ఆనందం ఎక్కడిది?
ఆనందాన్ని వెతుకుతూ ఉంటే కొత్తదారులు కనిపించసాగాయి. మళ్లీమళ్లీ విశ్వం పుట్టుక, నక్షత్రాలు లాంటి పాత సంగతులే చెపుతున్నా వింటున్నా ఆనందం కలగలేదు. నిన్న మొన్న జరిగిన, జరుగుతున్న సైన్సును అర్థం చేసుకోవాలి. అర్థమయిన అంశాలను వీలయిన చోటికి ప్రపంచంతో పంచుకోవాలి అన్న ఒక పద్ధతి మొదలయింది. పత్రికలలోని మిత్రులు అందుకు నాకు ఎంతో సాయం చేశారు. ఇక రేడియోలో వ్యవహారం నా చేతిలోనే ఉండేది. బిబిసి రేడియోలో శుక్రవారం సాయంత్రం ఐదారు అధునాతన సైన్సు అంశాలను గురించి వివరించే కార్యక్రమం ఒకటి వచ్చేది. దాన్ని రికార్డు చేసి మళ్లీమళ్లీ విని ఆ సంగతులను శనివారంనాడు కార్యక్రమంగా మార్చి ఆదివారం ఉదయం వినిపించే పద్ధతి పెట్టాను. ఒక సంవత్సరం నోబెల్ బహుమానాల వివరాలను నేను ఆదివారం నా కార్యక్రమంలో వివరించిన తరువాత మరురోజు హిందూ లాంటి ఆంగ్ల పత్రికల్లో కూడా వచ్చాయి. నేను కేవలం వార్తలతో ఆపకుండా, అందులోని ఒక అంశం గురించి, అది టనలింగ్ మైక్రోస్కోప్ అని జ్ఞాపకం ఉంది, వివరంగా చెప్పాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్‌గారు ఫోన్‌లో పిలిచి ఈ వివరాలు నీకు ఎలా దొరుకుతాయి అని అడిగారు. నేను వినయంగా, నేను పాత్రికేయుడనని ఆయన కేవలం పరిశోధకుడని జవాబు చెప్పాను. ఆయన నవ్వి అర్థం చేసుకున్నారు.
పత్రికల్లో రాసే రచయితలను, అందునా వరుసబెట్టి రాస్తుండే వారిని చాలామంది పట్టించుకోరు. రచనను గురించి మాత్రం ఎక్కువగా పట్టించుకుంటారు. పత్రికలలో రకరకాలుగా నేను కాలమ్స్ రాశాను. అందరూ అభిమానంగా చదివారు. ఈలోగా టెలివిజన్ ఛానల్స్ వచ్చాయి. వారికి కూడా సైన్సు ప్రోగ్రాములు తయారుచేసి ఇచ్చాను. అవన్నీ నేను రాసి షూట్ చేసినవి కాదు. అట్లా చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ ప్రపంచంలోని గొప్ప టీవీ ఛానల్స్ వారందరూ భారీగా ఖర్చుపెట్టి సైన్సు కార్యక్రమాలను తయారుచేస్తుంటారు. ఒకటి రెండుసార్లు ప్రసారం చేసిన తరువాత వాటిని మిగతా భాషల వారికి అమ్ముతారు. నేను అటువంటి కార్యక్రమాలను సంపాదింపజేసి వాటిని ముక్కలుగా చేసి ముందు, వెనుక మనవారికి అర్థమయ్యే పద్ధతిలో మాటలు జోడించి అందించాను. ఆ కార్యక్రమాలకు అనుకోని ప్రజాదరణ అందింది. నాకిక ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. వింతగా, విడ్డూరంగా ఉండే విషయాలను గురించి ఆకర్షణీయంగా కార్యక్రమాలను తయారుచేయడం ఒక పద్ధతి. అయితే సైన్సులోని ప్రాథమిక విషయాలను కూడా సులభ పద్ధతిలో అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడం మరొక పద్ధతి. ఇక ఈ కాలంలో జరుగుతున్న పరిశోధనల నుంచి ఆసక్తికరమయిన అంశాలను ఎంపిక చేసి వివరంగా వార్తలుగా అందించడం మూడవ పద్ధతి. ఆశ్చర్యంగా ప్రేక్షకులు మూడు రకాల కార్యక్రమాలను ఆదరించారు. సైన్సు వార్తల కార్యక్రమాలను మరింత ఆనందంగా చూచారు. నాకు గొప్ప సంతృప్తి కలిగింది. నావల్ల తెలుగు పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులకు సైన్సు విశేషాలతో పరిచయం ఏర్పడుతున్నదన్న ఆనందం అది. తెలియకుండానే అందరూ ఎంతో సైన్సును అందుకున్నారు. దూరదర్శన్ వారు నాచేత ఒక సైన్సు క్విజ్ చేయించారు. అది నిజంగా చాలా ప్రభావం చూపించింది. దారి పక్కన చెప్పులు కుట్టుకునే ఒక మోచి దంపతులు ఆ కార్యక్రమం గురించి నాతో చర్చించిన నాడు నాకు నిద్ర పట్టలేదు
సైన్సు ఎందుకు రాశావు? రాస్తున్నావు అంటే ఏమని జవాబు చెప్పేది? అందులోని ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది. ఏముంది అనువాదం చేయడం కూడా గొప్ప విషయమేనా, అన్నారు కొందరు. అందరికీ అర్థమయ్యే పద్ధతిలో అనువాదాలు చేయగలిగానన్నది నా ఆనందం.
నారాయణన్ అనే ఒక వైద్య నిపుణుడు విదేశాల్లో ఎక్కడో ఉంటాడు. ఆయన రాసిన వ్యాసాలను అనువదించి తెలుగులో పుస్తకంగా తెచ్చే అవకాశం నాకు కలిగింది. తెలుగు పుస్తకం గురించి తెలుగు తెలిసిన మిత్రులు ఆయనకు నా పుస్తకాలలోని నాణ్యత గురించి చెప్పినట్టున్నారు. ‘నా వ్యాసాలు నీవు రాసినవే అనిపించేంత బాగ అనువదించాట, సంతోషం!’ అని ఆయన ఉత్తరం రాశారు. కలం పట్టుకుని రాత మొదలుపెడితే పాఠక దేవుడు, పాఠక మిత్రుడు, పాఠక బంధువు మాత్రమే నాకు కనపడతారు. నేను ఎవరినీ మెప్పించడానికి రాయలేదు. తెలిసిన విషయం నాకు అర్థమయింది అనిపించినప్పుడు మాత్రమే తెలుగులో రాశాను. సవినయంగా చెపుతున్నాను, నమ్మండి.
రచనలో ఒక ఆనందం ఉందని కొత్తగా చెప్పనవసరం లేదు. కొన్ని సందర్భాలలో మాత్రం అసంతృప్తి కూడా మిగులుతుంది. రచనల గురించి చర్చ జరగాలి. అందిన సమాచారం గురించి అందరూ మాట్లాడుకోవాలి. నేను నాకుగా ప్రయత్నించి పుస్తకాలు చాలాకాలం వరకు రాయలేదు. అసలు కొంతకాలం రాయడమే ఆపేశాను. అందరూ చివాట్లు పెట్టారు. రాయాలి అని శాసించారు కూడా. నేను సైన్సు చదవడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఇక మీద ఆపే ప్రసక్తి కూడా లదు. చదువుతూనే ఉంటాను. కనుక రాయగలను, రాస్తాను. ఇది ఎంతకాలం సాగుతుంది. అంటే జవాబు ఉండదేమో!

కె.బి. గోపాలం