S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కథ చెపుతాను.. ఊ కొడతావా

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *
చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకుల కథ, బయిండ్ల కథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనే లేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది. హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. మాటలకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.
మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాలపాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచుకునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడించడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా సంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపేవాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.
నేను కథలు రాయకూడదని నిర్ణయించు కున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి.
కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమయిన మాటలు గానీ, చెప్పిందే మళ్లీ చెప్పడంగానీ ఉండదు. మొదట్లో నాకు ఆయన పద్ధతి గొప్పగా ఉందనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకుపోయిన పద్ధతేమో అని అనిపించసాగింది. ఇక మరి కొందరు ఉపన్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నాననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసు కెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉందిగానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూ నే ఉంటాయి.
ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నాను గానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడంలోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెర మీదలాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించిందంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్య వరకు నేను కూడా అదే పద్ధతి. అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించకూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.
రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ కూడా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలుపెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించేవాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
ఝలక్: చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.

కె.బి. గోపాలం