నేనున్నాను
Published Saturday, 19 December 2015గేదెల గోవిందుకు కష్టకాలం దాపురించింది. వర్షాభావం వల్ల రైతులు పొలాలు దున్నించి పంటలు వెయ్యడం లేదు. గోవిందు సిద్దాపురం అనే ఊళ్లో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. అతనికి స్థిరమైన ఆదాయం లేదని ఎవరూ పిల్లనివ్వడంలేదు.
‘ఎకరం పొలం కూడా లేనివాడివి. పెళ్లాం పిల్లల్ని ఎట్లా పోషిస్తావు? కూలి పనులు సంవత్సరం పొడుగునా వుండవు కదా?’ అంటున్నారు.
ఊరు వదిలి దూర దేశం వెళ్లి డబ్బు సంపాదించి పొలం కొనుక్కోవాలని కలలు కంటున్నాడు. అప్పుడు అతనికి నాగభూషణం అనే స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు.
‘కళ్యాణపురం ఊళ్లో జమీందారు పొలం పండించుకునే వారికి ఐదు ఎకరాలు ఉచితంగా ఇస్తాడు’
గేదెల గోవిందుకు ఆ సలహా చెవుల్లో తేనె పోసినంత హాయి కలిగించింది. వెంటనే కళ్యాణపురం వెళ్లి జమీందారుని కలిశాడు. ఆయన దివానుకి చెప్పి గోవిందుకు ఐదు ఎకరాల భూమి ఇప్పించాడు. పక్కనే చెరువు నుంచి నీటి సదుపాయం కూడా ఉండటంతో గోవిందుకి సంతోషం కలిగింది. పగలు చెట్టు కింద పొయ్యి పెట్టి వంట చేసుకుని తినేవాడు. రాత్రి కాగా ఊరి చివర సత్రంలో నిద్రపోయేవాడు.
కొన్నాళ్టికి గోవిందుకు పెళ్లి మీద ధ్యాస మళ్లింది. తనకి ఎటూ ఐదు ఎకరాల భూమి ఉన్నది. కనుక భుక్తికి లోటు లేదు. ఇక తమ ఊరు వెళ్లి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి కాపురం పెట్టాలి అనుకున్నాడు. పొలం వుంది కనుక ఎవరో ఒకరు పిల్లనిస్తారు. కాని అతనికి కళ్యాణపురంలో ఇల్లూ వాకిలీ లేవు. భార్యని తీసుకుని వస్తే ఎక్కడ ఉంచాలి? అనేది సమస్యగా మారింది.
గోవిందు ఊరంతా తిరిగాడు. కిరాయి ఇల్లు దొరుకుతుందేమో అని. కాని ఎవరూ అతనికి ఇల్లు కిరాయికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
‘నువ్వు ఎవరో? ఏ కులం వాడివో మాకేం తెలుసు? ఎవరికి పడితే వారికి ఇల్లు ఇవ్వలేం’ అన్నారు.
గోవిందుకు ఏమీ తోచలేదు. ఇల్లు ఎవరూ ఇవ్వడం లేదు. ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి. పంట పండాలి. అది అమ్మితేగాని డబ్బు రాదు. అతను ఊరికి అపరిచితుడు కాబట్టి వ్యాపారస్థులు ఎవరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు.
గోవిందు సత్రంలో పడుకున్నాడు. నిద్రలో అతనికి కల వచ్చింది. ఆ కలలో తాటిచెట్టు మాట్లాడుతోంది.
‘గోవిందూ! ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు, పెంకులు, సున్నం కావాలా? నేను ఒక్కదాన్ని చాలు గదా!’ అన్నది.
తెల్లవారిన తర్వాత గోవిందుకు మెలకువ వచ్చింది. కలలో తాటిచెట్టు మాటలు గుర్తొచ్చాయి.
‘నిజమే కదా! తాటిచెట్టు కల్పవృక్షం’ అనుకున్నాడు.
దాంతో పొలానికి వెళ్లి ఓ తాటిచెట్టుని కొట్టి దూలాలు నిలబెట్టాడు. మట్టితో వాటి మధ్య సందులు పూడ్చాడు. తాటి ఆకులతో ఇంటిపైన కప్పాడు. అంతే ఇల్లు తయారైంది.
గోవిందు సంతోషంగా తమ ఊరు బయల్దేరాడు పెళ్లి చేసుకోవడానికి.
***************************
ప్రపంచ శాస్తవ్రేత్తలు
కోపర్నికస్
-పి.వి.రమణకుమార్
‘్భమి కూడా ఒక గ్రహమే. అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది’ అని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసినవాడు కోపర్నికస్. నికొలస్ కోపర్నికస్ 1473 ఫిబ్రవరి 19న, పోలండ్ దేశంలోని టోరన్ అనే పట్టణంలో జన్మించాడు. కోపర్నికస్ తండ్రి పెద్ద వ్యాపారవేత్త, తల్లి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది.
కోపర్నికస్ పాఠశాల చదువు అనంతరం క్రాకో యూనివర్సిటీలో చేరాడు. అక్కడ ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, జామెట్రీ, జాగ్రఫీలు గల గ్రూపులో చేరి డిగ్రీ తీసుకున్నాడు. ఇంటి దగ్గర కూర్చుని ఖగోళ శాస్త్రం గురించి అనేక సిద్ధాంతాలు రాశాడు. స్వతహాగా ధనవంతుడు కావడంవల్ల విదేశాల నుంచి అనేక గ్రంథాలు తెప్పించుకుని అధ్యయనం చేశాడు. ఆ రోజుల్లో భూమి, సూర్యుడు గ్రహాల గురించి ప్రజలలో అనేక మూఢ విశ్వాసాలుండేవి. భూమి చుట్టూ సూర్యుడితో సహా ఇతర గ్రహాలు తిరుగుతాయని విశ్వసించేవారు. కోపర్నికస్ మొదటిగా ‘ప్లానెట్స్’ అనే మాటను ఉపయోగించాడు. గ్రీకు భాషలో ‘ప్లానెట్’ అంటే ‘తిరిగే వ్యక్తి’ అని అర్థం.
పినతండ్రి సలహా మేరకు కోపర్నికస్ పడువా యూనివర్సిటీలో మెడిసిన్ చదివాడు. ఆ కాలంలోనే కొలంబస్ అమెరికాను కనుగొన్నాడనే వార్త విని పులకించిపోయాడు. తానూ అలా ఆత్మవిశ్వాసంతో పరిశోధించిన విశ్వాసాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.
ఒకపక్క వైద్యుడిగా సేవలందిస్తూనే ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేస్తుండేవాడు. చివరికి తన పరిశోధనలను ఒక పుస్తక రూపంలో ప్రచురించాడు. దాని పేరు ‘ఆన్ ది రివల్యూషన్స్ ఆఫ్ ది సెలిస్టియల్ స్పియర్స్’.
ఆ గ్రంథం గొప్ప సంచలనం సృష్టించింది. కేథలిక్ చర్చి అధికారులు దాన్ని బసిష్కరించడం కూడా జరిగింది. పెద్దలు అతన్ని తీవ్రంగా మందలించారు. కుర్రాళ్లు మూర్ఖంగా అతన్ని రాళ్లతో కొట్టబోయారు. ఆ పుస్తకంలో అతను రాసిందల్లా ‘్భమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని’.
అనేక మానసిక ఒత్తిడుల వలన కోపర్నికస్ ఎంతో వ్యధ చెందినప్పటికీ తన ప్రయోగాలు మానలేదు. ఖగోళ శాస్త్రానికి సంబంధించినవే కాకుండా, ఇతర పరిశోధనలు కూడా ఎన్నో చేశాడు. ‘ఎట్రీటీస్ ఆఫ్ కరెన్సీ’ అనే తన గ్రంథంలో కరెన్సీ, నాణెముల ముద్రణలకు చక్కని పద్ధతిని సూచించాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. కేలండర్ విధానానికి కూడా కోపర్నికస్ ఎన్నో మార్పులు చేశాడు. తగిన ప్రోత్సాహం లేక ఎన్నో అవమానాలతో పరిశోధనలు సాగించిన కోపర్నికస్ తీవ్రమైన మనోవ్యధతో 1543 మే 24న మరణించాడు. ఆ మహా శాస్తవ్రేత్త పరిశోధనలను ఆ తర్వాత గెలీలియో వంటి వారు బలపరచి కోపర్నికస్ కృషికి తగిన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టారు.
************************
పేలు
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
స్కూల్ నించి తిరిగి వచ్చిన అభిశ్రీ ఏడుస్తూ తల్లితో చెప్పింది.
‘అమ్మా! ఇవాళ స్కూల్‌కి వచ్చిన నర్స్ మా అందరి తలల్ని పరీక్షించింది. చాలామంది తలల్లో పేలు ఉన్నాయట. నా తల్లో లేవని చెప్పింది. కానీ నాకు దురద పుడుతోంది. అవి నా తల్లోకి ఎక్కాయేమో అని అనుమానంగా ఉంది’
‘అవి నీ తల్లోకి ఎక్కితే నర్స్ తెలుసుకునేది. కాబట్టి భయపడకు’ తల్లి ఓదార్చింది.
‘వాటిని చంపే మందు గురించి నర్స్ చెప్తే రాసుకున్నాను. ఎందుకైనా మంచిది. నాకా మందు తెచ్చి పూయి’ అభిశ్రీ కోరింది.
‘అలాగే. అందువల్ల నీకు చింత ఉండదు’ తల్లి ఒప్పుకుంది.
‘పిల్లలంతా పార్వతి, లలితల వల్ల పేలు అందరికీ ఎక్కాయని అనుకుంటున్నారు. పార్వతిని ‘పేల పార్వతి’ అని వెక్కిరిస్తున్నారు’
తల్లి భృకుటి ముడిపడింది.
‘నువ్వు వెక్కిరించలేదు కదా? పేలు వాళ్ల నించే వచ్చాయని మీకు కచ్చితంగా తెలీదుగా? అవి ఎవరి నించైనా వచ్చి ఉండచ్చు’
‘నిజమే. కానీ పేల వల్ల వ్యాధులు వస్తాయి కదా? పార్వతి, లలితలతో ఎవరూ ఆడకూడదని నిశ్చయించుకున్నాం’
‘వాళ్లు కూడా మందు వాడితే పేలు పోతాయి. వ్యాధులు రాకుండా ఉండాలంటే శుభ్రత ముఖ్యం కాబట్టి మన శరీరానికి మురికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. కానీ పాపం నించి మన మనసులని శుభ్రంగా ఉంచుకోవడం ఇంకా ముఖ్యం. చిన్నచిన్న పాపపు పనుల వల్ల మనకి ఆధ్యాత్మిక పరమైన వ్యాధి కలుగుతుంది’
‘అంటే?’
‘అసూయ, కోపం, ద్వేషం, అహంభావం, ఇతరుల కీడు కోరుకోవడం.. ఇలాంటివన్నీ మానసికమైన, ఆధ్యాత్మికమైన వ్యాధులే’
‘అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?’ అభిశ్రీ అడిగింది.
‘పేలు పడ్డవాళ్లతో ఆడనట్లుగా, ఈ లక్షణాలు గల వారికి దూరంగా ఉండాలి. లేదా అవి మనకి కూడా అంటుకుంటాయి’
‘సరే. నేను మా క్లాస్‌లోని అలాంటి వారికి దూరంగా ఉంటాను’ అభిశ్రీ చెప్పింది.