చేతులు
Published Saturday, 19 December 2015మనకు చాలా మంచి మిత్రులు ఉంటారు. కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉంటే మరి కొంతమందికి మందు ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏవో ఏవో ఇష్టాలు ఉంటాయి.
మా మిత్రుడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కలిసినా స్వీట్స్ తిందామని అనేవాడు. అతని దురదృష్టవశాత్తూ మధుమేహ వ్యాధి వచ్చింది. స్వీట్స్ తనకి మంచిది కాదు అని తెలిసి తినేవాడు. ఏదైనా పెళ్లికి వెళితే అక్కడ వున్న రకరకాల స్వీట్స్ తినేవాడు. ఫలితంగా అతని షుగర్ లెవల్స్ పెరిగిపోయేవి. ఇబ్బందుల పాలయ్యేవాడు.
నాకు మరో మిత్రుడు ఉన్నాడు. అతనికి మందు అలవాటు. పార్టీలకు తరచూ వెళ్లేవాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ఎక్కువగా పట్టుకుంటున్నారని డ్రైవర్‌ని పెట్టుకొని పార్టీలకు వెళ్లేవాడు. ఫలితంగా అతని కాలేయం దెబ్బతింది. డాక్టర్లు తాగడం మానెయ్యమని చెప్పారు. మానేశాడు. కానీ ఎప్పుడైనా పార్టీలు ఉంటే ఆకర్షితుడై మందు తీసుకునేవాడు.
స్వీట్లు, మందు తీసుకోవడమే కాదు. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. మన ఆరోగ్యానికి సరిపడదని తెలిసి కూడా ఆ అలవాట్లు మానుకోవడానికి చాలా కష్టపడతాం. ఒబెసిటీ వస్తుందని తెలిసి కూడా కొంతమంది ఎక్కువగా నూనెతో చేసిన పదార్థాలు ఇష్టపడతారు.
ఎవరెన్ని చెప్పినా చాలామంది తమ అలవాట్లు మానుకోరు. తమ ఆరోగ్యాలని పణంగా పెట్టి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. స్వీయ నియంత్రణ చాలా అవసరం. స్వీయ నియంత్రణతో ఈ అలవాట్లని జయించాల్సి ఉంటుంది.
ఈ మధ్య స్వీయ నియంత్రణ మీద ఎక్కడో వ్యాసం చదివాను. ఆశ్చర్యకరంగా ఆ వ్యాసంలో వివేకానందుడి ప్రస్తావన ఉంటుంది. వివేకానందుడిని చూసి మీరు ఏం నేర్చుకుంటారు అన్న ప్రశ్నతో వ్యాసం మొదలవుతుంది. ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఎన్నో ఆలోచనలు, సమాధానాలు కన్పిస్తాయి. కానీ ఆ రచయిత చెప్పిన కోణం స్ఫురించలేదు. దాని గురించి తరువాత చెబుతాను.
మన మనసు బహు చంచలమైనది. మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అయినా కోరికలు తీర్చుకోమని చెబుతుంది. మనసు చెప్పిన పనిని మనసు చేయదు. మన చేతులే చెయ్యాలి.
స్వీట్స్ తినాలని మనసు చెబుతుంది. ఆ పని చేయాల్సింది మన చేతులు. మన చేతులు మనసు మాట వినకపోతే స్వీట్స్ తినే పరిస్థితి ఉండదు. మందు విషయంలో, తిండి విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
ఈ విషయాల్లోనే కాదు. ప్రతి విషయంలోనూ అంతే! మనసు చెప్పిన పని కావాలంటే చేతులు సహకరించాలి. చేతులు సహకరించకపోతే మనసు ఏమీ చేయలేదు. మనసును అదుపు చేయడం సాధ్యం కాకపోతే చేతులని అదుపు చేయాలి.
వివేకానందుడు మనకు ఎలా కన్పిస్తాడు. ఏ ఫొటో చూసినా చేతులు కట్టుకొని కన్పిస్తాడు. నిర్మలంగా కన్పిస్తాడు. చేతులు కట్టుకోకుండా కన్పించిన ఫొటోలు అరుదు. లేవనే చెప్పవచ్చు.
మనసుని అదుపులో పెట్టుకోమని చెబుతాడు వివేకానందుడు. మనసు చంచలమై మీ మాట వినకపోతే చేతులని అదుపులో పెట్టుకోమని చెబుతాడు. అతన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అతని బొమ్మ చూసి నేర్చుకోవాల్సింది ఇదే.
దురలవాట్ల (టెంప్టేషన్)కి సంబంధించి మనసు ఏదైనా చెబితే మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది వివేకానందుడిని.
====================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు,
రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు
కూడా పంపించవచ్చు.
=======================