S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తన వంతు వస్తే... ( సిసింద్రి కథ)

రాఘవాపురం అడవిలో కోతులు, పులులు, జింకలు మరెన్నో జంతువులతోపాటు ఒక సింహం నివసిస్తుండేది. ఆ సింహాన్ని అడవికి రాజుగా ఎంచుకున్నాయి జంతువులు. ఏ సమస్య వచ్చినా సింహానికి చెప్పేవి. సింహం తగు విచారణ చేయించి సమస్యను పరిష్కరించేది.
ఆ అడవిలో అన్ని జంతువులకంటే కోతుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అవి ఇతర జంతువులపై పడి గోళ్లతో రక్కడం, గాయపరుస్తుండటం ప్రారంభించాయి. వాటికదో సరదాగా మారిపోయింది. రానురాను అది అలవాటుగా మారింది. ఏ జంతువైని నడిచి వెళ్తూంటే ఏమరుపాటుగా వెనుక నుండి వెళ్లి ఎగిరి జంతువు మీదికి దూకడం, ఒళ్లంతా గోకడం, రక్తం వచ్చేట్టుగా రక్కి దొరక్కుండా పారిపోయేవి. గాయపడిన జంతువులు నొప్పితో బాధపడుతూంటే కోతులు విజయ గర్వంగా నవ్వుకొనేవి.
కొన్ని కోతులు ఒకచోట కలిసినప్పుడు ఏ కోతి ఏ జంతువును ఎలా రక్కి ఏడ్పించిందో చెబుతుండేవి. మిగతా కోతులు నవ్వుతుండేవి. ఆ అడవిలో తమకు ఎదురు లేదనుకునేవి.
ఓసారి ఓ కుందేలును ఓ కోతి దారుణంగా రక్కింది. అది వెళ్లి సింహానికి ఫిర్యాదు చేసింది. సింహం ఆ కోతిని పిలిపించి మందలిస్తుందనుకుంది. కానీ సింహం ఏదో కోతి చేష్ట కదా! పోనీ వదిలెయ్. ఏదన్నా ఆకు పసరు రుద్దుకో. తగ్గుతుంది గాయం- అని సలహా ఇచ్చింది.
మరోసారి ఓ కోతి జింక మీద దాడిచేసి రక్కి, గాయపరిచింది. ఆ జింక బాధ భరించలేక వెళ్లి సింహానికి ఫిర్యాదు చేసింది. సింహం అదేదో చిన్న విషయంగా భావించింది. ‘జింక తమ్ముడూ! కోతి అల్పప్రాణి కదా! ఏదో సరదాగా అలా చేసుంటుంది. ఈ మాత్రానికే అంత బాధపడితే ఎలా?’ అని చెప్పి పంపించింది.
ఇలా కోతుల బాధ పడలేక ఎన్నోసార్లు ఎన్నో జంతువులు సింహంతో మొరపెట్టుకున్నాయి. సింహం వాటికి ఏవో మాటలు చెప్పి పంపించేది. ఎవరినేమి చేసినా తమను అడిగేవారు లేరనుకున్నాయి కోతులు. దాంతో మరింత రెచ్చిపోయినై.
ఓ రోజు సింహం సుష్ఠుగా భోంచేసింది. విశ్రాంతి తీసుకోవాలన్పించింది. ఓ చెట్టు నీడన వొరిగింది. ఆ చెట్టు మీద కోతుల గుంపు ఉంది. అందులోంచి ఒక కోతి సింహం వీపు మీదికి దూకి కసిగా గోళ్లతో రక్కింది. సింహం లేచి నిల్చుంది. కోతి ఎగిరి చెట్టు మీద కూచుంది. రక్కిన బాధ ఏమిటో సింహానికి తెలిసొచ్చింది. నొప్పి భరించలేక కోపమొచ్చింది. చెట్టుమీదున్న కోతులతో ‘నన్ను రక్కిన కోతిని నాకు అప్పజెప్పండి. లేకపోతే కోతి జాతిని సర్వనాశనం చేస్తాను’ అని హెచ్చరించింది.
కోతులన్నీ భయపడ్డాయి. ఒక్క కోతి కోసం మొత్తం కోతి జాతిని బలి చెయ్యడం బాగనిపించలేదు. సింహాన్ని రక్కిన కోతిని అప్పగించాయి. అప్పటికే అడవి జంతువులు అటు వంచి చుట్టూ మూగాయి. వాటన్నింటికీ కోతుల మీద కోపముంది.
అన్ని జంతువుల ముందు సింహం ఆ కోతిని చంపి దాని మాంసాన్ని జంతువులన్నింటికి ప్రసాదంలా పంచింది. ‘ఈసారి ఏ కోతి ఏ జంతువును గాయపరిచినా దానికిదే గతి పడుతుంది’ అని హెచ్చరించింది.
కోతి రక్కుడుకు గురైన కుందేలు ముందుకొచ్చింది.
‘సింహరాజా! తమరు ముందే ఈ హెచ్చరిక చేసినట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు’ అన్నది.
తన తప్పు తెలుసుకున్న సింహం ‘నిజమే! కోతి రక్కడంతో ఇంత బాధ అవుతుందని నాకు తెలియదు. నాదాకా వస్తేనే అర్థమైంది. ఈసారి ఇలాంటి పొరపాటు చేయను’ అని సముదాయించింది.
కొన్ని జంతువులు ఆకు పసరును సింహం గాయానికి అద్దాయి.
అప్పట్నుంచీ కోతులు జంతువులను రక్కడం మానేసి స్నేహంగా కలసి ఉంటున్నాయి.

-ఐతా చంద్రయ్య