S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రవర్తనే వ్యక్తిత్వానికి దర్పణం

ప్రతి వ్యక్తి వౌనంగా, సంతోషంగా ఉండడం అలవరచుకోవాలి. ఈ విధానం మనిషికి ఎంతో ఆత్మబలాన్ని చేకూర్చి ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కల్గిస్తుంది. మనిషి ఒక స్థాయిని నిర్దేశించే స్థితిలో నుండి దిగజారిపోకుండా పక్కవారికి మార్గదర్శకత్వంగా ఉండాలి. నైపుణ్యంగా పని చెయ్యడం అంటే పని ప్రశాంతంగా, సమతూకంగా కుదురుగా చేయడమే. మనిషి ఆలోచనల ప్రతిరూపంగానే జాగ్రత్త, అజాగ్రత్తలు బహిర్గతమవుతాయి. ఎవరైనా సరే పుస్తకాలు, స్నేహితులు, కళలు, సంగీతం, యాత్రల నుండి కొత్త స్ఫూర్తిని, ఉత్తేజాన్ని పొందగలగాలి.
ఏ పనినయినా సరే యాంత్రికంగా, కిరాయి మనిషిగా, బానిస మాదిరిగా చేయకూడదు. అది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. విజేతలు బోరుకొట్టే పనిని కూడా ఆసక్తికరమైన పనిగా మార్చుకుని చిత్తశుద్ధితో పని చేస్తారు. పైగా వీరు శ్రమించి పని చేస్తున్నట్లు భావించక కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు భావిస్తారు.
బాధ-సంతోషం
మనిషి మనసుకు నచ్చని ఏ అనుభవమయినా బాధగా ఎదురవుతుంది. మనిషి మనిషికి ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి. అంటే బాధలు అనేవి కూడా మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి. ఒకరికి బాధగా అన్పించే అనుభవం మరొకరికి సంతోషమైన అనుభవంగా ఉండవచ్చు. ఉదాహరణకు శారీరక వ్యాయామం క్రీడాకారులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కూర్చుని పనిచేసేవారికి ఇటువంటి అనుభవం బాధాకరంగా ఉండవచ్చు. విజయ సాధనకు తప్పనిసరిగా మూల్యం చెల్లించాలి. మూల్యం అంటే డబ్బు అని కాదు. అది ఒక ప్రయత్నం, సాధన లేదా కష్టం ఏదైనా కావచ్చు. ఆసక్తిగలవారు ఇటువంటివి ఎంతో సంతోషంగా చేస్తారు. ఆసక్తి లేనివారికి ఇవన్నీ శ్రమలు, బాధలుగా ఉంటాయి.
చేసే పని ఏదైనా అర్థవంతంగా ఉండి పూర్తి కావాలంటే ఆ పని ఎలా పూర్తి చేయాలో తెలిసి ఉండాలి. మంచివారు, చెడ్డవారు అని విభజించి మంచివారు విజయవంతంగా పనులు సాధించగలరని భావించలేము. పనిచేసే విధానం తెలిసిన వారే విజయవంతంగా పని పూర్తి చేయగల్గుతారు. మంచివారికి తెలియక, చెడ్డవారికి తెలిస్తే వారే పనిని జయప్రదంగా పూర్తి చేయగల్గుతారు.
విజేతలు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంటారు. సాధారణ వ్యక్తుల జీవితాలు సాఫీగానే కొనసాగుతాయి. వారి జీవితాల్లో అంతగా ఒడిదుడుకులు ఎదురుకావు. ఎత్తుపల్లాలలో పయనించే విజేతలకే సంపదలు వరిస్తాయి.
విజేతలు - పరాజితులు
విజేతలకు గల ధైర్యం, ఆత్మవిశ్వాసం వారి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునేలా చేస్తాయి. పరాజితులకు ఇటువంటి శక్తి ఉండదు. పిరికితనం, భయపడటం వీరిలో తరచు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తరచు మనిషి సంతోషకరమైన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నంలో ఉండాలి. చెడు సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ తాము సాధించలేమని ప్రయత్నం నిరుపయోగమవుతుందని ఆందోళనతో నలిగిపోతూ ఉంటారు పరాజితులు.
మనిషి ఆలోచనలే వారి భవిష్యత్‌కు దర్పణాలు. విజయం గురించి ఆలోచించేవారు విజేతలు అవుతారు. అపజయం గురించి ఆలోచించే వారు ఓటమి పాలవుతారు. ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి బాధ, చెడు విషయం ఏదో ఒక ప్రయోజనాన్ని జత చేసుకుని మనిషి వద్దకు వస్తాయి. ఆ అనుభవాలసారం నుండి తగిన పాఠాలను నేర్చుకుని మనిషి తనను తాను అభివృద్ధి పరచుకోవాలి.
ఎన్నో అపజయాల నుండి పాఠాలు నేర్చుకుని ఏ పని ఎలా చెయ్యకూడదో తెలుసుకుని చివరకు తాము అనుకున్నది సాధించిన విజేతలు మనకు చరిత్రలో ఎందరో కన్పిస్తారు. వారంతా ప్రస్తుత తరాలకు స్ఫూర్తిప్రదాతలని మరచిపోకూడదు.
ఎదుగుదలకు పునాదులు
మనిషి చేసిన పనిని సానుభూతితో చూడక తప్పుపట్టే వ్యాఖ్యల్ని విమర్శలు అనవచ్చు. తాను చేసిన పనిని అభినందించాలనుకుంటే సాధ్యంకాదు. చాలాసార్లు వెక్కిరింతలు ఎదురవ్వడమే గాక పని చేసిన మనిషి మనసును అదుపు తప్పిస్తాయి. ఎదుటి వారి విమర్శలకు కుంగిపోక వాటిని విశే్లషణా ధోరణితో ఆలోచించాలి. దానివలన విమర్శల బాణాల వల్ల కలిగే బాధ మాయమవుతుంది. ఇతరులు మన మీదకు విసరిన ఇటుకలతో గట్టి పునాది నిర్మించుకోగలిగిన వాడే సృజనాత్మకమైన మనిషిగా ఎదుగుతాడు. ఒక్క విషయం దృష్టిలో ఉంచుకోవాలి. ఇతరుల వల్ల మనకు తగిలిన గాయం మనం చేసిన పనికి ప్రతిఫలంగా లభించినదే. అదే మన మనస్తత్వానికి ప్రతిబింబం.
ఇతరులకు మనం అవకాశం ఇచ్చినపుడే వారు మన మానసిక వ్యధకు కారణమవుతారు. మనిషి సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇతరుల మాటలు, చేతల మీద ఆధారపడనిస్తున్నాడంటే అది ఆ మనిషి బలహీనత.
నిరాశ-నిస్పృహ
ఓటమి నిరాశా నిస్పృహలను కల్గిస్తుంది. ఎంతటి ఉన్నతులయినా ఓటమిని రుచి చూడక తప్పదని చరిత్ర మనకు చెబుతున్న సంగతి మరువకూడదు. ఏ పనీ చెయ్యని వాడికంటే పొరపాట్లు చేస్తూ, జీవితం గడిపినవాడే గొప్పవాడని తెలుసుకోవాలి. కష్టాల ముంగిట లొంగిపోని ధైర్యం, సంకల్పం గల మనిషి విజయం వైపు అడుగులు వేయగల్గుతాడు. మనిషి జీవితంలో నిరంతరం దెబ్బతిన్నదాన్ని బాగుచేయడం ఎలా? దానిని పునర్నిర్మించడం ఎలా? ఓటమిగా ఎదురయ్యే దానిని గెలుపుగా మలచుకోవడం ఎలా? అనే విషయాలపై ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణలోకి దిగితే విజయం సాధించడమేగాక అంతులేని ఆనందాన్ని, సంతృప్తిని సొంతం చేసుకోగల్గుతాడు.

-సి.వి.సర్వేశ్వరశర్మ