S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ

చచ్చీచెడీ చాయంగల విన్నపములై గయకు చేరుకున్నాము. నేను మా గుంపుతో బయలుదేరడానికి ఇది ముఖ్యమయిన ఆకర్షణ. గతించిన పెద్దల పేరున అక్కడ కొంత కర్మకాండ చేయవచ్చునన్నది ఆ ఆకర్షణలోని వివరం. తల్లిదండ్రుల పట్ల కొడుకు నిర్వహించవలసిన బాధ్యతలుగా ధర్మశాస్త్రంలో మూడు అంశాలను చెప్పారు. వారు బతికి ఉన్నంత కాలం వారి మాట వినాలి. పోయిన తరువాత ఏటా ఒకసారి వారి పేరున అన్నదానం చేయాలి. కనీసం ఒక్కసారి గయలో వారి పేరున పిండప్రదానం చేయాలి. ఈ మూడింటిలోనూ నాకు ఛాదస్తం కనిపించలేదు. కని పెంచిన, కనిపించిన దేవతలకు మనం ఈ కొంచెం చేయడం వాళ్లను గుర్తుంచుకునే ప్రయత్నంలో ఒక భాగం అని నా భావం.
గయకు వచ్చేవాళ్లందరూ ఒకే రకమయిన ఆలోచనతో వస్తారని మాత్రం నేను అనుకోను. ఆ సంగతిని అక్కడి వాళ్లు బాగా వాడుకుంటారు. స్థానికులకు అది ఒక లాభసాటి వ్యాపారం. తెలుగువారు అనగానే, మా డ్రైవర్ మమ్మల్ని ఒక చోటికి చేర్చాడు. మా వాళ్లు అంతకు ముందే అక్కడ ఉండే పెద్ద మనిషితో మాట్లాడి రిజర్వేషన్ లాంటిది చేయించారు. ఆ పెద్ద మనిషి మహారాజులాగ దిళ్లకు ఆనుకుని చేరబడి ఉన్నాడు. మహారాజులాగే ఉన్నాడు. మనవాళ్లు వస్తారు, వెళ్లండి అని తెలుగులోనే అన్నాడు! అది రాజుగారు చెప్పినట్టే ఉంది. మా స్నానాలు అయిన తరువాత అసలు పరుగు మొదలయింది.
ముందుగా జరగవలసింది అక్కడ నదిలో స్నానం. కానీ, ఆ నదిలో నీటిచుక్క లేదు. కనుక మంత్రస్నానం ముగిసింది. తరువాతి తంతు కూడా బాగానే ముగిసింది. అందులో చివరి ఘట్టంగా గుడి లోపల హాల్లో పిండ ప్రదానాలు చేయిస్తారు. అమ్మవేపు, నాన్నవేపు గతించిన అందరు బంధువులకు అక్కడ పిండాలు పెట్టిస్తారు. ఈ పద్ధతి కొత్తకాదు. అటు తెలుగు, ఇటు కన్నడం మాట్లాడుతూ, అక్కడ ఒక ఆచార్యులవారు మా గుంపుతోపాటు మరో నలుగురితో కార్యక్రమం చేయిస్తున్నాడు. మధ్యలో, పిండాల కొరకు వండిన అన్నంలో కొంత భాగాన్ని పక్కన పెట్టండి అన్నాడు. ఎందుకో నాకు తోచలేదు. కొంత కార్యక్రమం నడిచిన తరువాత ఆ పురోహితుడు మాతృపిండాలు అని ఒక కార్యక్రమాన్ని సూచించాడు. నాకు ఈసారి మాత్రం కళ్లనీళ్లు ఆగలేదు. పురోహితుడు చెప్పిన మంత్రాలకు నాకు అర్థం తోస్తున్నది. కడుపున పడ్డనాటి నుంచి అమ్మ మన కొరకు చేసిన పనులన్నింటినీ గుర్తు చేసుకుంటూ, ఒక్కొక్క పిండానే్న పెట్టిస్తున్నాడు. మనము ఒంటికి రెంటికీ చేసినా, ఓర్చుకుని అమ్మ తీసింది. అందుకు పిండం అనేసరికి నా గుండె చెరువయింది. చాదస్తం అంటున్న సంప్రదాయాలలో కొన్నింటిలో చాలా లోతు ఉందన్న సంగతి మనసు లోలోతులకు చేరింది. సగం మనసుతోనే యాత్రకు బయలుదేరి నేను మంచి చేశాను అనిపించింది.
గయకు వెళ్లినవారు గుర్తుగా ఒక పండు, కూరగాయల్లోని ఒక దాన్ని ఆ తరువాత తినకూడదని ఒక పద్ధతి. దానికి పురోహితుడు ఒక తంతు జరిపించాడు. ఇష్టంలేని వాటిని వదిలితే లాభం లేదన్నాడు. నాకు గోరుచిక్కుడు కాయ ఇష్టం. అనాస తినడం అంతకన్నా ఇష్టం. నిజానికి ఈ రెంటినీ వదలాలన్న నిర్ణయం నాది కాదు. నా కూతురు చేసిన సూచన! ఇష్టమయిన ఆ పదార్థాలను తినే అవకాశం వచ్చిన ప్రతి చోటా అటు అమ్మ, ఇటు మా నాయనమ్మ అంటే నా కూతురు గుర్తుకు రావడం నాకు చాలా బాగనిపించింది. అందరూ కాశీలో వదిలాను అంటారు. అదేమిటో నాకింకా అర్థం కాలేదు. గయలో కొన్ని నియమాలను పెట్టుకుని తిరిగి రావడం మాత్రం నాకు నచ్చింది. అది ఛాదస్తం కాదు అని కూడా అనుకుంటున్నాను.
గుడిలో అక్షయవటం అనే మర్రిచెట్టు ఉంటుంది. దాని చుట్టూ తిరిగి పిండాలను లోపలికి తీసుకుపోయి విష్ణు పాదాల దగ్గర వదలాలి. గుడిలో విష్ణువు ఉండడు. పాదాలు మాత్రమే ఉంటాయి! చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటే, అక్కడ చెట్టంత యువకుడు నిలబడి డబ్బులు వేయండి అని తెలుగులో అడుగుతున్నాడు. అతను అడుగుతున్న తీరు చాలా మొరటుగా ఉంది. అగౌరవంగా ఉంది. తెలుగురాని వాడు తెలుగు మాట్లాడుతున్నట్టు అర్థమయిపోయింది. నేను వెళ్లి ‘నీకు తమిళ్ కూడా వచ్చునా?’ అని అడిగాను. అతను రాదు పొమ్మన్నాడు. మరి తెలుగు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా అడిగాను. ‘ఇత్‌నే జో తెలుగూ లోగ్ యహా ఆతే హై!’ అన్నాడు. అంటే ఇక్కడికి మరి అంతగా తెలుగువాళ్లు వస్తున్నారు గనుక అని అర్థం. ఆశ్చర్యం నా వంతయింది. ఈ పరిస్థితి నాకు కాశీలో విశ్వనాథుని మందిరంలోనూ కనిపించింది. తెలుగువాళ్లకు భక్తి ఎక్కువా? ఛాదస్తం ఎక్కువా?
రెండూ ఎక్కువేనని మావాళ్లే నాకు తరువాతి కార్యక్రమం ద్వారా అర్థం చేయించారు. అందరి పద్ధతిలో అక్షయవటం, విష్ణుపాదం, మా వాళ్లకు సరిపోలేదు. శాస్ర్తియంగా పార్వణ పద్ధతిలో శ్రాద్ధాలు జరగాలి. అందుకొరకు ముందే ఏర్పాట్లు చేసి ఉంచారు. మాలో రెండు జట్లు అన్నదమ్ములు ఉన్నారు. అంటే అక్కడ ఒకేచోట తొమ్మిది హోమాలు జరగాలి. ఆ భయంకరమయిన వేడిలో ఒక చిన్న హాల్లో పక్కపక్కనే హోమాలకు చక్కని ఏర్పాట్లు చేశారు. వాళ్లు తెచ్చిన కర్రలు కర్పూరంలాగ అంటుకుని అంతెత్తు మండుతున్నాయి. తొమ్మిది హోమాలకు మొత్తం తొమ్మిది వంటలు విడివిడిగా చేశారు. అది మామూలు వంటలు కాదు. అసలుసిసలయిన తద్దినం భోజనాలు. శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిగింది. నాకు సంతోషంగానే ఉంది. అమ్మా నాన్నల పేర్లు మీద, ఆ పై తరాల పెద్దల పేరున ఏం చేయమన్నా చేస్తాను. కానీ నా మనసుకు తెలిసిన ఈ సంగతి శరీరానికి తెలియదుగా! ఆ మంటల మధ్యన నాకు ప్రాణం పోతుందన్న అనుమానం వచ్చింది. ఆ వసతి కల్పించిన పెద్ద మనిషిని ప్రాధేయపడి వాళ్ల ఫ్రిజ్‌లో నుంచి లీటర్ నీళ్లు తెచ్చుకుని గడగడా ఒకే గుక్కలో తాకాను. ఆ తరువాతే శ్రాద్ధ భోజనాలు, మా భోజనాలు. ఈ చివరి రెండు సంగతుల గురించి కూడా చాలా చెప్పవచ్చు. కానీ చెప్పను. భోజనం బాగుందని ఒక్కమాట మాత్రం చెపుతాను. మొత్తానికి కొంత ఛాదస్తం నాకు నచ్చిందని, నాకు వచ్చిందని అర్థమయింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీగారి అనుభవాలూ, జ్ఞాపకాలూనూ, దువ్వూరి వెంకటరమణ శాస్ర్తీగారి స్వీయ చరిత్ర, తిరుమల రామచంద్రగారి హంపీ నుంచి హరప్పా దాకా, చదివిన కొందరు వాటి నిండా బ్రాహ్మణ ఛాదస్తం ఉంది అనడం నాకు తెలుసు. మరి బ్రాహ్మడు తన బతుకు గురించి చెబితే, మరేం వినిపించాలో, కనిపించాలో నాకు అర్థంకాలేదు. నిజం చెపితే నచ్చదా?
బౌద్ధం వైదిక సంస్కృతికి విరుద్ధమని చాలా మందికి తెలియదు. హిందూత్వాన్ని నిరసించ దలచినవారు బౌద్ధం నీడకు చేరుతారు. కానీ, బుద్ధుని బోధనలలో అంతకు మించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి మతంతో అవసరం లేకుండా మానవులు అన్నవారు అందరికీ అనువర్తించేవే. కనుక, నాతో ఉన్న బంధుమిత్రులంతా ఇక భక్తులు పోయి పర్యాటకులు అయ్యారు. బౌద్ధంలోని పద్ధతులను గురించి నిజానికి చాలామందికి తెలియదు. ముందు నడుస్తున్న వాళ్ల దారిలో మనం కూడా నడిస్తే సరి. అదే పద్ధతిలో అందరమూ కలిసి బోధ్ గయ వెళ్లాము. అక్కడ పక్బందీగా ఏర్పాట్లు, పద్ధతులు ఉన్నాయి. తోటలను, గుడులను నిర్వహిస్తున్న తీరు ఆదర్శప్రాయంగా ఉంది. ఇష్టం లేకుండానే మా వాళ్లంతా చుట్టూ తిరుగుతున్నారు. బుద్ధుని మందిరం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ దేశదేశాల వారు కనిపించారు. అందరూ వౌనంగా ఉన్నారు. కొందరు ఒక మూలన కూచుని ఏదో చదువుకుంటున్నారు. మన గుళ్లల్లో ఇట్లాంటి ప్రశాంతత ఉంటే బాగుంటుందని నాకు ఒక్క క్షణం అనిపించింది. ఒకచోట నలుగురు భిక్షువులు కూచుని స్వరబద్ధంగా ఏదో పఠనం చేస్తున్నారు. కొందరు వాళ్ల ముందు డబ్బులు పెట్టి పోతున్నారు. మా వాళ్లను అదే పని చేయమంటే, అనుమానంగా అయినా చేశారు. నేను మాత్రం కొంచెంసేపు నిలబడి వాళ్ల గానం, అందులోని పద్ధతి వింటూ గడిపాను. గుడి వెనుక ఒక పెద్ద చెట్టు ఉంది. అదే మహాబోధి వృక్షం. ఆ చెట్టు కిందే బుద్ధునికి జ్ఞానోదయం అయిందని రాసి పెట్టి ఉంది. నేను వంగి అక్కడ ఉన్న శిలకు తల తగిలించి నమస్కరించాను. చాలామంది ఆ పని చేయకుండానే వెళిపోతున్నారు. చేసిన కొందరిలో మాత్రం గొప్ప శ్రద్ధ కనపడుతున్నది. బౌద్ధంతో నాకు పనిలేదు. బుద్ధుడు మనుషుల మధ్యన నడయాడిన మనిషి. మహామనిషి. కనుక ఆయన స్మృతికి నమస్కరించడం నాకు తెలిసిన పద్ధతి. బోధ గయలో చాలాసేపే ఉన్నాము. అక్కడ ఒక అబ్బాయి నాణాలు అమ్ముతున్నాడు. ఏమిటని చూస్తే, అవి సింహళం అనే శ్రీలంకవారి ప్రస్తుతపు నాణాలు. పాత నాణాలు కొనడం తెలిసిందే. ఇప్పటి నాణాలు కొనడం కొత్త పద్ధతి. కనుక నేను కొన్నాను. రూపాయి నాణెం రెండు రూపాయలకు ఇచ్చినట్టున్నాడు.
ఎట్లాగూ పర్యాటకులంగా మారినందుకు నేను అక్కడ యాత్రలో అప్పటివరకూ చేయని ఒక పని చేశాను. ఆవరణలోనే ఐస్‌క్రీమ్ బండి కనిపించింది. అందరికీ ఐస్‌క్రీమ్‌లు కొని బండిలో కూర్చున్న మా వాళ్లకు తీసుకుపోయి అందించాను. ఆచారాలు, ఆర్భాటాలు లేకుండా అందరూ ఆత్రంగా అందుకుని తిన్నారు. కొందరు వన్స్‌మోర్ అన్నారు. యాత్ర ఉద్దేశం ‘గయాయాం పిండదానం’. అది అన్ని రకాల సలక్షణంగా జరిగింది. ఇక తరువాతి కథ మరో దారిన పడుతుంది. పడాలన్నదే నా కోరిక.

కె.బి. గోపాలం