S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మారుతూ... ముందుకు

ఈ ప్రపంచంలో శాశ్వతంగా జరిగేది మార్పు ఒక్కటే. ఇటువంటి మాటలను విరోధాభాసం అంటారు. నాకు మార్పు చాలా ఇష్టం. చివరికి వీలయితే ఏడాదికొకసారి ఇల్లు మార్చుకుందామని ఉంటుంది. కానీ అది కుదరదు. కనుక, ఉన్న ఇంట్లోనే పదేళ్లయినా ఉంటున్నాను. నమ్మండి, నమ్మకపోండి, ఈ మధ్యన ఉన్న ఇంట్లోనే నేను నా గదిని మార్చుకున్నాను. అది నా మనస్తత్వం. నా బతుకు కూడా నాకు తగిన అవకాశాలనే ఇచ్చిందనాలి.
మొదటి తరగతిలో మా పుస్తకం పేరు అరటి బాలశిక్ష. అందులో అ,ఆ లకు అరటి, ఆవు బొమ్మలు ఉండేవేమో! కనుకనే పుస్తకాన్ని అరటి బాలశిక్ష అన్నట్టున్నారు. మా తరువాత సంవత్సరం అమ్మ బాలశిక్ష వచ్చింది. ఆ పుస్తకం మా పుస్తకం కంటే పెద్దదిగా ఉండేది. బహుశా రంగుల్లో బొమ్మలుండేవి. అందులో మొదటి అక్షరానికి అమ్మ బొమ్మ వేశారు. పుస్తకాన్ని అమ్మ బాలశిక్ష అని మాత్రం అనలేదు. నేను నడిచి ముందుకు పోతూ ఉంటే, నా ప్రపంచం ఆ తరువాత కొత్త దారిలో నడుస్తుందని నాకు అప్పట్లో అర్థంకాలేదు. ఒక విషయం మాత్రం తోచింది. నేను ఏ క్లాసు వదిలి ముందుకు పోయినా, తరువాతి వారికి కొత్త పుస్తకాలు వచ్చాయి. అంటే, నా పుస్తకాలను సెకండ్ హాండ్ కింద అమ్ముకునే వీలు ఉండేది కాదు. నేను మాత్రం సంతోషంగా మా ముందు వాళ్ల నుంచి సెకండ్‌హాండ్ పుస్తకాలు కొనేసుకునేవాణ్ణి. ఒక్క పుస్తకాలతోనే మార్పు పూర్తయితే, అందులో కొంతకాలానికి స్వారస్యం మిగలదు. అంటే రుచి మిగలదని అర్థం. ఏనుగొండ బడిలో అయిదవ తరగతి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత చదువుకు పాలమూరుకు పోవలసి ఉంటుంది. అక్కడ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో చదువు కొనసాగింది. ఆ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే ఉండేదేమో! తరువాత అందరూ దగ్గర్లోనే ఉన్న మల్టిపర్పస్ హైస్కూల్‌కు వెళ్లేవారు. సరిగ్గా నేను ఎనిమిదవ తరగతి పూర్తి చేసే సమయానికి ఆ స్కూల్లో తొమ్మిదవ తరగతి వచ్చేసింది. మరి నా తరువాత మార్పు ఉండాలి గదా! నేను మాత్రం స్కూలు మారాలని ముందే నిర్ణయించుకున్నాను. ఆ సమయానికి నాన్న అదే బడికి వచ్చి పని చేస్తున్నారు. నేను టి.సి. కొరకు కాగితం పెట్టుకున్నాను. హెడ్‌మాస్టర్‌గారు నన్ను చాలా అభిమానించేవారు. ఆయన పేరు శ్యామసుందరరావు గారు. ఆ తరువాతి కాలంలో ఆయన టీచర్ ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. నేను స్కూలు వదిలి వెళ్లడం ఆయనకు ఇష్టంగా లేదు. నన్ను, నాన్నను తన గదికి పిలిపించి నా బుర్రను మార్చే ప్రయత్నం చేశారు. నాన్న సంగతి ఆయనగారికి అర్థమయినట్టు లేదు. నాన్న నన్ను, నా ఆలోచనలను నూరు శాతంగా అవునంటారు. ‘మంచి విద్యార్థులంతా వెళ్లిపోతే కొత్త క్లాసులు పెట్టి లాభమేమి?’ లాంటి ప్రశ్నలేవో రావుగారు అడిగారు. నాన్న నవ్వి ఊరుకున్నారు. నేను నా పట్టు వదలలేదు. స్కూలు మారాను.
శ్యామ సుందరరావు గారి గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్పకపోతే, అన్యాయమవుతుంది. ఇటీవలి కాలంలో కూడా ఆయన నన్ను చేరదీసి అందరికీ చాలా గొప్పగా పరిచయం చేసేవారు. మా విద్యార్థులు గొప్పవాళ్లయితే మాకు సంతోషం కదా అనేవారు. నా చేత ఏవో మంచి పనులు చేయించాలని ప్రయత్నించారు కానీ, అవి జరిగేలోగా రావుగారు వెళ్లిపోయారు. ఇది నా వల్ల జరిగిన మార్పు కాదు.
మల్టిపర్పస్ స్కూల్‌లోచదువు పద్ధతి కొంచెం వేరుగా ఉండేది. మామూలుగా ఉండే లెక్కలు, బయాలజీలతోపాటు, ఆ బడిలో వ్యవసాయం, సాంకేతిక విద్య కూడా పదవ తరగతి నుంచే చెప్పేవాళ్లు. నాకు వ్యవసాయం చదవాలని కోరిక. కానీ, ఎవ్వరూ ఆ విషయంలో నన్ను సపోర్ట్ చేయలేదు. మిగతా మిత్రులందరూ చేరినందుకు నేను బయాలజీలో చేరాను. క్లాసులు విడిపోయిన మొదటినాడు మా లెక్కల మాస్టారు, సూర్యనారాయణ గారు బయాలజీ క్లాసులోకి వచ్చి ‘ఇక్కడేం చేస్తున్నావ్‌రా! మన క్లాసుకు వచ్చేసేయ్. నీవు లెక్కలు దిట్టముగ చేస్తవుగదా, వచ్చేసేయ్!’ అనడం నాకింకా గుర్తుంది. కానీ, నాకు లెక్కలంటే అంత ఇష్టంలేదు. అందుకు సూత్రం చాలా సులభం. నాకు కష్టపడడం ఇష్టంలేదు. బయాలజీలో నాలుగు బొమ్మలు గీస్తే, పని జరిగిపోతుంది. లెక్కల్లో మాత్రం దిక్కుమాలిన పుస్తకాలన్నింటినీ వరసబెట్టి సాల్వ్ చేయడం అవసరమని మా ఒకానొక అన్నయ్య ఆదర్శంగా నన్ను భయపెట్టాడు. ఆ భయం వాడు పెట్టలేదు. నేనే పెట్టుకున్నాను. ఇదంతా పక్కనబెడితే, మొత్తానికి పనె్నండవ తరగతికి వచ్చేసాము. అప్పుడు ఒక విచిత్రం తెలిసింది. అంతకు ముందే తెలిసినట్టుంది ఆ విచిత్రం. మా తరువాత పనె్నండవ తరగతి పద్ధతి ఉండదు పొమ్మన్నారు. ఆ బడిని జూనియర్ కాలేజీ కిందికి మార్చేశారు. మొత్తానికి నా తరువాత ప్రపంచం మారడం అన్న క్రమం అక్కడ కూడా సాగిందన్నమాట. చాలా పేరున్న ఆ బడిలో మగపిల్లలు మాత్రమే ఉండేవారు. వాళ్లంతా అల్లరి మూకలుగా కూడా ఉండేవారు. సంగతేమిటో తెలియదుగానీ, ఆడపిల్లలను ఆటపట్టించడం ఆ కాలంలో ఒక పెద్ద హీరోయిక్ లక్షణంగా కనీసం మాలాంటి వాళ్లు భావించేవాళ్లు. మా తరువాత జూనియర్ కాలేజ్‌లో అమ్మాయిలకు కూడా అవకాశం కల్పించారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండగా, సోడాబుడ్డీ కళ్లద్దాలతో ఒక అందమయిన అమ్మాయి బడిలోకి వచ్చింది. నేనేవో కారుకూతలు కూశాను. అప్పుడు అది తప్పని నాకు తెలియదు. నాకు ఒకటి మాత్రం తెలుసు. కొంతసేపు తరువాత నా మిత్రుడు ఒకడు ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని అప్లికేషన్‌ఫామ్ నింపాలంటూ నా ముందుకు వచ్చాడు. నేను ఆ అమ్మాయి హాయిగా నవ్వుకున్నాము.
తెలంగాణ ఉద్యమం పేరున మేము బి.ఎస్సీ నాలుగు సంవత్సరాలపాటు చదువుకున్నాం. ఆ తరువాత కూడా బిఎస్సీ కొనసాగినట్టే ఉంది. ఎవరూ ఊహించని విధంగా నేను ఎమ్మెస్సీలో వెళ్లి జాయిన్ అయ్యాను. వరంగల్‌లో అప్పట్లో, పి.జి. సెంటర్ ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీకి అది అనుబంధ సంస్థ. అక్కడ చదువు చాలా బాగా సాగింది. అయితే, మన ఊడ్పు కార్యక్రమం మాత్రం అక్కడ కూడా కొనసాగింది. పిజి సెంటర్‌ను కాకతీయ యూనివర్సిటీగా మారుస్తారని వార్త వచ్చింది. మాకు మాత్రం ఉస్మానియా డిగ్రీలు ఇచ్చారు. మా తరువాత బ్యాచ్ వాళ్లకు కాకతీయ డిగ్రీ ఇచ్చారు. నేను చదివిన తరువాత ఇక ఆ పిజి సెంటర్ మిగిలితే నేను నేనెట్లా అవుతాను?
నిజానికి పిహెచ్‌డి కి కాకతీయలోనే ఉండిపోవలసిన మాట. కానీ మారాలి కదా? కనుక గురువుగారు రామచంద్రరావుగారు కారణంగా నేను ఉస్మానియా క్యాంపస్‌కి వచ్చాను. అక్కడే పిహెచ్‌డి అయింది. నా తరువాత కూడా మా ల్యాబ్ మిగిలింది. కానీ ఎక్కువకాలం మిగలలేదు. గురువుగారు రిటైరైన తరువాత ఆ ల్యాబ్ తీరు బాగా మారిపోయింది.
నేను రేడియోలో ఉద్యోగం చేశానన్న సంగతి అప్పుడప్పుడు నేనే మరచిపోతుంటాను. రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ప్రొడ్యూసర్లు అని రెండు రకాల వారు పని మాత్రం ఒకే రకంగా చేస్తూంటారు. సాహిత్యం, సంగీతం లాంటి విషయాలకు ప్రత్యేకమయిన నైపుణ్యం గలవారిని ప్రొడ్యూసర్లుగా వేసుకునేవారు. నేను సైన్స్ కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా ఎంపికయి ఉద్యోగం చేశాను. నాకు ముందు రేడియోలో సైన్స్ ఆఫీసర్లు లేరు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తున్నది. మామూలు ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఉమ్మడి ఆస్తులుగా గదులు, బల్లలు ఉంటాయి. నాది కొత్త ఉద్యోగం. నా కోసం కొత్తగా ఒక బల్ల కొన్నారు. నాతోబాటే మరో ఇద్దరు ప్రొడ్యూసర్లకు కూడా కొన్నారు. వారిలో రవివర్మ అనే మిత్రుడు క్రీడలకు ఇన్‌ఛార్జ్. నేను, వర్మ ఇద్దరూ ఉద్యోగాలు వదిలేశాము. నా తరువాత మార్పు అవసరం కదా! రేడియోలో మరి సైన్స్ ఆఫీసర్ నా తరువాత లేరు. వర్మ లాంటి ఆఫీసర్ కూడా మరొకరు రాలేదు. నేను రేడియోలో ఉండగానే సైన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగం హుళక్కి అయింది. మహా ఘనత వహించిన ప్రభుత్వం వారికి దేశంలో ఉన్న నాలాంటి సైన్స్ ఆఫీసర్ల మీద ఎక్కడలేని ప్రేమా కలిగి, ఒకనాటి ఉదయం మమ్మల్ని మూకుమ్మడిగా సహాయ కేంద్ర నిర్దేశకులుగా మార్చేశారు. ఆ తరువాత దేశంలోనే సైన్స్ ఆఫీసర్లు లేరు! నేను ఆ తరువాత రెండు హోదాల్లో రేడియోలో కొనసాగాను. ఆ హోదాలు మిగిలి ఉన్నట్టే ఉన్నాయి. కానీ, వాటి ప్రభ మాత్రం చాలా చాలా తగ్గినట్టు అందరూ వచ్చి నాకు చెపుతుంటారు.
నేను ఆ తరువాత కూడా ఒకటి రెండు ఉద్యోగాలు చేశాను. ఇప్పుడా ఉద్యోగాల్లో ఎవ్వరూ లేరు. నేను పని చేసిన ఒక సంస్థ కూడా ఏకంగా మాయమయింది. నేను నడుస్తూ ఉంటే, అనుమానంగా వెనక్కి మళ్లి చూస్తుంటాను. దారి ఇంకా ఉందా అని!

కె.బి. గోపాలం