వచ్చె వసంతేందిర
Published Sunday, 22 March 2020మత్త॥ పట్టుబట్టి ప్రసూన పల్లవ పావడంబులు గట్టుచున్
పట్టరాని పరీమళంబును ప్రాణి కోటికి పంచుచున్
అట్టహాసముతో నటించుచు హాయి హాయిగ నూగుచున్
చెట్టుచేమలు చూడ నెంతగ చెన్ను మీరెను సృష్టలోన్
మత్త॥ కొండ కోనల కోకిలమ్మలు కూని రాగము తీయగన్
మండమండను జుట్టి తుమ్మెద మాధ్వి రుచులన్ గ్రోలగన్
మండుటెండల కోర్చి మామిడి మంజరుల్ వెదజల్లగన్
దండు దండుగ తేనెటీగలు దట్టవౌ పొద జేరగన్
మత్త॥ ముద్దుముద్దుగ మోదుగల్ కడు మోహనంబును గూర్చగన్
మొద్దుమొద్దని సుద్దులాడు సమూహ సద్దును ద్రుంచగన్
బొద్దుబొద్దుగ వృక్షజాలము ప్రొద్దు పోలిక జూపగన్
కొద్దికొద్దిగ కాదు కెంపును కోన క్రిక్కొన నింపగన్
మత్త॥ వచ్చెవచ్చె వసంత మాధవి వనె్నచినె్నలు చిల్కుచున్
తెచ్చెతెచ్చెను తేట తేనెలు తీపి తీవ్రత పెంచుచున్
వెచ్చవెచ్చగ వీపుతట్టుచు వేడిగాలులు వీచగన్
పచ్చపచ్చని చూతకమ్ముల పక్షిమూకలు చేరగన్