రతనాల కొండ రాచకొండ
Published Saturday, 21 March 2020రాచకొండ అంటేనే గుట్టలు...గుహలు...గోపురాలు, అబ్బురపరిచే శిల్పాలతో పాటు కోనసీమ అందాలను మైమరిపించే విధంగా రాచకొండ గుట్టలు దర్శనమిస్తాయి. రాతి కట్టడాలు, కోట గోడలు, గోల్కొండను మైమరిపించే విధంగా ఉన్న రాచకొండ గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాచకొండ ప్రాంతాన్ని 1361లో రేచర్ల పద్మనాయకులు రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. తెలంగాణాలో కాకతీయ రాజుల తర్వాత చెప్పుకోదగ్గ రాజులు రాచకొండ వెలమ ప్రభువులు. వీరినే రేచర్ల పద్మనాయకులు అని పిలిచేవారు. చరిత్రకు తెలిసినంత వరకు వీరు తమ మూల పురుషుడు చెవిరెడ్డి (బేతాళ నాయకుడు) మొదలుకొని క్రీ.శ. 1553 నుంచి కాకతీయులకు సామంతులగు నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలించారు. కాకతీయులు క్రీ.శ. 1323లో పతనం అయ్యాక ఓరుగల్లు రాజ్యాన్ని పాలించిన ముసునూరు నాయకులకు సానుకూలంగా ఉన్నారు. కానీ సింగము నాయుడు క్రీ.శ. 1957 తర్వాత స్వాతంత్రదారు అనతికాలంలోనే సింగమనాయకుడు జల్లిపల్లి యుద్ధంలో మరణించారు. సింగమ కొడుకు అనపోతమ నాయుడు క్రీ.శ. 1361 రాజధాని ఆమనగల్లు నుంచి ‘‘రాచకొండ’’కు మార్చాడు. తన తమ్ముడు మాదా నాయకుడిని దేవరకొండలో నియమించారు. వీరి పాలన తెలంగాణ జిల్లాల్లో రాచకొండను రాజధానిగా చేసుకుని దశాబ్దానికి పైగా పాలన కొనసాగింది. రాచకొండ రాజులు పడమర ఉన్న బహుమనీ సుల్తాన్‌లతో స్నేహం చేసి కోస్తా ఆంధ్రులను, రెడ్డిరాజులను అణచి వేశారు. అనంతరం కళింగ (ఒరిస్సా) గణపతి రాజులతో స్నేహం చేసి బహుమనీ సుల్తాన్‌లను ఓడించారు. చివరికి విజయనగరం (కర్ణాటక-ఆంధ్ర) రాజులతో స్నేహం చేస్తున్న సమయంలో బహుమనీల చేతిలో రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి వారి నుంచి క్రీస్తు శకం 1536లో గోల్కొండ పాలకుడు కులీ కుతుబ్‌షా రాచకొండను వశపరచుకున్నారు. క్రీ.శ. 1433-60 మధ్య, క్రీ.శ. 1475-1503 మధ్య కాలంలో రాచకొండ బహుమనీ సుల్తానుల స్థానిక పాలన కేంద్రంగా ఉంది. రాచకొండ గుట్టలు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్నప్పుడు ప్రధానంగా సంకెళ్లబాయి గుట్ట నుంచి వెళ్లి పాలన కార్యక్రమాలు కొనసాగాయి. సంకెళ్లబాయి గుట్టను పరిశీలిస్తే సుమారు 600 అడుగుల ఎత్తులో గల ఈ గుట్ట చుట్టూ పెద్దపెద్ద బండరాళ్లతో నిర్మించిన కోట కూడా ఉంది. పడమర వైపు పెద్ద ద్వారం దాటాక రామాలయం ఉంది. గుడికి దక్షిణ భాగాన కోనేరు, రెండు కోటవైపు వెళ్తున్నప్పుడు మరో దిక్వూటాలయం. గుట్టపైన రెండు బండరాళ్ల మధ్యలో ఉండే బావిలో ఎల్లప్పుడూ నీరు ఉండటం విశేషం. దీనికి వంద మీటర్ల దూరంలో ఉత్తరాన బహుమనీ ముస్లింలు (మాలిక్ నిమత్) ఆలయం క్రీ.శ. 1484లో నిర్మించిన మసీదు ఉంది. కోట మధ్యలో అగ్రస్థానాన రాజమందిరం దానికి కుడివైపు మూలలో ఒక ఆలయం శిథిలమై ఉంది. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కోటలు కనిపిస్తాయి. గుట్టకు ఉత్తరాన కిలోమీటరు దూరంలో ‘గాలిపీర్ల దర్గా’ దర్శనమిస్తుంది. ఈ దర్గా వద్ద నేటికీ ప్రతి శివరాత్రికి హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా వారం రోజుల పాటు సుమారు సమీపంలోని ఆరు జిల్లాల నుంచి భక్తులు పాల్గొని ఘనంగా ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి. వెళ్లాల్సిన వారు రాచకొండ ప్రాంతానికి వెళితే ఒక మంచి ప్రదేశాన్ని చూశామన్న తృప్తిని పొందుతారు అనేది మాత్రం చెప్పవచ్చు. నరసింహులు గుట్టపైన ఒక పెద్ద గృహాలయం ఉంది. మరో నరసింహ ఆలయం నిర్మించారు. దాని ముందు బండరాళ్లకు ద్వాదశ ఆశౌర్ల మూర్తులకు కేంద్రాలుగా ఉన్నాయి. రాచకొండలో అపారమైన కళా సంపద, నాటి పాలకుల రాజప్రాసాదాలు, రంగురాళ్లు, క్వారీలు, కొండలు, లోయలు, అందమైన ప్రకృతి, అటవీ సంపద. రాచకొండలో నిత్యం సందర్శకులు వచ్చే ఇటీవల గుప్త నిధుల తవ్వకాల మూలంగా బయటపడిన 14 అడుగుల ఎత్తయిన శివలింగం ఉంది. నిత్యం వేలాది మంది ప్రజలు దర్శనానికి విచ్చేస్తారు. నాడు తెలంగాణకు రాజధాని అయిన రాచకొండ నేడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతంలోని నాటి రాజధాని రాచకొండ ప్రాంతాన్ని నేటి పాలకులు అభివృద్ధిపరుస్తున్నారు. పాలకుల హడావిడితో రాచకొండకు పునర్వైభవం వస్తున్నట్టే కనిపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా రంగారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాచకొండ మొత్తం విస్తీర్ణం 14,765,25 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2217.20 ఎకరాల పట్టా భూములు, 2956.01 ఎకరాల ప్రభుత్వ భూమి, 8945.09 ఎకరాల అటవీ భూములు కలవు. తెలంగాణ రాష్ట్రంలో సి.ఎం. కె.సి.ర్. సి.ఎం.గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా రాచకొండకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారు. రాచకొండను అభివృద్ధిపరిచేందుకు సి.ఎం. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాచకొండలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాచకొండలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కేసీఆర్ హైదరాబాద్ ఈస్ట్‌జోన్‌కు రాచకొండ కమిషనరేట్ అని పేరు పెట్టి రాచకొండ చరిత్రను దేశానికి చాటిచెప్పారు. దీంతో రాచకొండ పూర్వవైభవం ప్రాశస్త్యాన్ని గుర్తొచ్చేలా చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ సి.పి మహేష్ భగవత్ సేవలను గుర్తించి అమెరికా లాంటి దేశాలు హీరో అవార్డు ఇవ్వడంతో రాచకొండ కమిషనర్ పేరు ప్రపంచంలో వినిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శాసనమండలిలో రాచకొండ విశిష్టతను రాచకొండ పరిధిలోని 150 పైచిలుకు దేవాలయాలను, వాటికి నిత్య దీపారాధన, చారిత్రక కట్టడాలను, చెరువులు, కుంటలు, కోనేర్లను, రాచకొండ ప్రాంతానికి సందర్శించడానికి విచ్చేసే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా తన నియోజకవర్గ అభివృద్ది నిధులతో రాచకొండ గ్రామానికి 8 లక్షలతో మట్టి రోడ్డును వేయించాడు. ఇంకా అనేక రకాల వౌలిక సదుపాయాలు కల్పించాడు. ఈ ప్రాంతానికి సాగునీరు అవసరమని గ్రహించి శాసనమండలిలో ఈ ప్రాంత రైతుల బాధలను పభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తన ఆలోచనలోంచి ఆవిష్కృతమైనదే ‘‘రాచకొండ ఎత్తిపోతల పథకం’’ రూపకల్పన జరిగిందంటే నూరుకు నూరు శాతం కర్నె ప్రభాకర్ కృషే. ప్రభుత్వం ఈ ప్రాంతానికి రాచకొండ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించనుంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనవి. ఈ ప్రాంత అభివృద్ధికి వివిధ గ్రామాల్లోని యువకులు, నాయకులు స్వచ్చంధంగా కమిటీని ఏర్పాటు చేసుకొని ‘రాచప్ప’ కమిటీ పేరా ప్రతి సోమవారం శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలనాటి రాజులైన రేచర్ల పద్మనాయక వంశీయులు రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించిన క్రమంలో వారు నిర్మించిన అనేక గుళ్లు, గోపురాలు, శత్రుదుర్భేద్య కట్టడాలు నిర్మించిన తటాకాలు చెక్కిన శిల్పకళాసంపద, మండపాలు, కోనేరు, ఇత్యాది ఆనవాళ్లతో కూడిన అద్భుత ఫోటో ప్రదర్శన, బయల్పడిన శివలింగం, రామాలయం, దర్గాలు ముఖ్యమైనది. అప్పటి పూర్వ వైభవం అవగాహన కల్పించడానికి యాత్రికులకు, భక్తులకు అశేష ప్రజానీకానికి సందర్శించేందుకు వీలు కల్పించడం కోసం ఉత్సవాల ప్రధాన ఉద్దేశం. గత సంవత్సరం రాచకొండ పర్యాటక ఉత్సవాలకు హైదరాబాద్‌లో ఉండి మా చెల్లి సౌమ్యను తీసుకెళ్లాను. రాచకొండ ప్రకృతి అందాలను చారిత్రక కట్టడాలను, చెరువులను చూసి చాలా ఆనందపడింది. ఇంతటి గొప్ప ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నయ్య, నా జీవితంలో ఇంత గొప్ప అనుభూతిని మరెప్పుడూ పొందలేదు. నీకు థాంక్యూ అన్నయ్య అని కృతజ్ఞతతో నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అంత బాగుంటుంది ఈ రాచకొండ ప్రాంతం. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుటుంబ సమేతంగా వెళ్లి పర్యాటక ఉత్సవాలని, శివరాత్రి జాతరను, ఉర్సు ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి చూసి ఆనందాన్ని పొందండి.