బంగారు వర్ణం పుష్పం!
Published Saturday, 21 March 2020సీనియర్, సీరియస్ చిత్రకారుడు ఎం.కృష్ణారెడ్డి. ఆయన చిత్రాలు విభిన్న శైలిలో, విశేష ‘వస్తువు’తో అటు ఆక్రిలిక్ రంగుల్లో కాన్వాసుపై పెన్ను, పెన్సిల్‌తో కాగితంపై ఇటు ప్రింట్ రూపంలోనూ కనిపిస్తాయి. ఇంతటి వైవిధ్యం ఒకే ‘కుంచె’లో కొలువుదీరడం అభినందనీయం!
తాజాగా ఈ చిత్రకారుడు పొద్దుతిరుగుడుపువ్వు ‘ఇమేజ్’తో ప్రయోగం చేస్తున్నారు. అది ఆయన అద్భుత రంగుల ‘చూపు’నకు నిదర్శనం. అతని అంతరంగాన్ని బలంగా వక్రీకరించడానికి అదొక పరికరంగా పనిచేస్తోంది. తన బలమేమిటో తెలుసుకుని బొమ్మలు గీయడం వల్ల బ్రహ్మాండమైన అభివ్యక్తి ఆవిష్కారమవుతుందని కృష్ణారెడ్డి నిరూపించారు. ప్రధానమైన ఈ లక్షణాన్ని గమనించడంలోనే సగం విజయం దాగుంది.
తనకిష్టమైన పొద్దుతిరుగుడుపువ్వును పరిపరి విధాల ప్రయోగం చేసి, ప్రతీకగా, పవిత్రతకు చిహ్నమైన పసుపుదనాన్ని తన కాన్వాసుల్లో రసాత్మకంగా చూపేందుకు పూనుకున్నారు.
అలాంటి చిత్రాల్లో బౌద్ధ గురువుగా పద్మపాణి అతని ఎదుట మరికొందరు బౌద్ధ భిక్షువులున్న బొమ్మ. వీరంతా పొద్దుతిరుగుడు పువ్వు రంగు దుస్తుల్లో దర్శనమిస్తారు. ఫోర్ గ్రౌండ్‌లో ఉన్న గురువు వస్త్రంపై పెద్ద సన్‌ఫ్లవర్ కనిపిస్తుంది. అదే ప్రముఖంగా కనిపిస్తుండటంతో జ్ఞానమనే సూర్యుని చుట్టూ పొద్దుతిరుగుడుపూవుల్లా బౌద్ధులు తిరుగుతున్నారన్న ప్రతీకతో ఆ బొమ్మను చిత్రించారనిపిస్తోంది. చిత్రకారుడి రస హృదయం ఏదైనప్పటికీ ఆ చిత్రం ఎంతో భావస్ఫోరకంగా కనిపిస్తుంది. పసుపు రంగు, ఆ పూవు గింజల రంగును చిత్రకారుడు ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకుని ఆ చిత్రానికి సరికొత్త తాత్వికతను అద్దారు.
ఈ బంగారు వర్ణపు పువ్వును చిత్రకారుడు ఎంతలా ఇష్టపడతారంటే... ఆపిల్స్ మధ్యన ఆ పూలు పెట్టి ఓ ఆపిల్‌పై మళ్లీ పొద్దుతిరుగుడు పూవును చిత్రించారు. అంతేనా?.. కాదు. లంబాడీ మహిళ ధరించే రంగురంగుల దుస్తులపై అద్దాలతో పాటు అద్భుతమైన పొద్దుతిరుగుడు పూలను చిత్రించి ఆకట్టుకున్నారు. చిత్రకారుడి ఊహకు, సృజనకు, రంగులపై గల మార్పునకు తనకిష్టమైన దాన్ని ప్రతీచోట దర్శించాలన్న తపనకిది నిదర్శనం.
ఇంతలా ‘సబ్జెక్ట్’పై మక్కువ ఉన్నప్పుడే మంచి చిత్రాలు, మరచిపోని చిత్తరువులు పురుడు పోసుకుంటాయి. ఆ మానసిక స్థితి నుంచే అనేక ప్యాట్రెన్స్‌లోనూ, పళ్లలోనూ గీతల్లోనూ చివరికి సయాకుల (పెట్టెల)పై కూడా వాటిని చిత్రకారుడు దర్శించి కలవరించారు.
ఆక్రలిక్ రంగుల్లో చిత్రకారుడు గీసిన మై విలేజ్, ఫోర్ట్(కోట) బొమ్మలు ఎంతో సింపుల్‌గా కనిపించినా ఆకర్షణీయంగా, ఊహకు బంగారపు రంగులద్ది మనసు దోచుకునేలా ఉన్నాయి. కాంపోజిషన్‌తో పాటు డిజైన్, రంగుల పొందికతో ‘ఆర్ట్ లవర్స్’ హృదయాలను కొల్లగొట్టారు. చిత్రకారుడు గీసిన పొద్దుతిరుగుడు పూవు బొమ్మను చూస్తే అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడు ‘వాన్‌గా’ గీసిన పొద్దుతిరుగుడు పువ్వు చిత్రం గుర్తుకొస్తుంది.
భాగ్య నగరమంటే ఈ చిత్రకారుడికి అపారమైన అభిమానం, ప్రేమ. ఆ విషయం ఆయన గీసిన బొమ్మలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. మీనార్లు, మసీదులు, వాటి ఆవరణం, ఆర్కిటెక్చర్‌ను రేఖల్లో, రంగుల్లో చూపారు. ఆ బలమైన గీతలు, ముదురు రంగులు ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాల్ని, జీవన విధానాన్ని ఒక ఫ్రేమ్‌లో బంధించి గత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ముఖ్యంగా సైకిల్ రిక్షా, గుర్రం, అంబారీని చిత్రించి వీక్షకుల మోముపై చిరునవ్వులు తెప్పించారు. హైదరాబాద్ సంస్కృతిలో అంతర్భాగమైన బంజారా (లంబాడీ)లను సైతం ఆయన ఎంతో నిష్టతో చిత్రిక పట్టారు. రియల్ స్టిక్ పోట్రేట్ పద్ధతిలో గాకుండా తనదైన శైలిలో బంజారా మహిళలను కాన్వాసుపైకి తీసుకొచ్చారు. తన సృజనను జోడించారు. రంగుల్లోనే గాక పెన్ అండ్ ఇంక్ మాధ్యమంలోనూ బంజారా మహిళల అందచందాలను చూపారు. నేపథ్యంలో చార్మినార్, గోల్కొండ, బురుజులు సూచన ప్రాయంగా పొందుపరిచి మనసులను అలరించారు.
పాత హైదరాబాద్‌కు పర్యాయపదంగా వంతెనలు, కమాన్లు (ఆర్ట్‌లు), మీనార్లు, నగిశీలు, నక్కాశీ... నిలుస్తాయి. చిత్రకారులు ఆ గుబాళింపును సైతం తన బొమ్మల్లో బంధించారు. ఆ పాతదనం, రంగు కలసిన, పెచ్చులూడిన కట్టడాల్లో దాగిన నైపుణ్యాన్ని, నాజూకుదనాన్ని పట్టి చూపేందుకు ప్రయత్నించారు. ఆనాటి గ్రామాల్లో పటేల్-పట్వారీలు డఃగుసున్నంతో నిర్మించిన ఇళ్ల ఆకృతులను కాన్వాసుపైకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ జీవన హృదయాన్ని రంగుల్లో పట్టి చూపారు. లైన్ డ్రాయింగ్స్‌లోనూ రమ్యంగా చిత్రిక పట్టారు. ‘ప్రింట్స్’లోనూ పరవశించేలా కళ్లకు కట్టారు.
ముచ్చటైన ఈ మూడు మాధ్యమాల్లో మనసు మూర్చనలు పోయే రీతిలో బొమ్మలు సృష్టించి, చిత్రకళా రంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుని, అంతర్జాతీయ ప్రింట్ ప్రదర్శనల్లో పాల్గొని ప్రశంసలందుకున్న కృష్ణారెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు సమీపాన దూపల్లి గ్రామంలో 1972లో జన్మించారు. అక్కడే నాల్గవ తరగతి వరకు, అనంతరం ఆత్మకూరులో ఐదవ తరగతి నుంచి ఎస్.ఎస్.సి. వరకు చదివారు. ఇక్కడి చిత్రలేఖనంపై ఆసక్తి ఏర్పడింది. దాంతో తన తండ్రిలా చక్కని చేతి రాతను ప్రాక్టీసు చేయడం, బొమ్మలు గీయడం ప్రారంభమైంది. ఈ ‘ప్రత్యేకత’ను గమనించిన తన చిన్నాన్న హైదరాబాద్‌లోని ఫైన్‌ఆర్ట్స్ కాలేజీ గూర్చి సమాచారం ఇచ్చాడు. అలా హైదరాబాద్ చేరుకుని ఎ.వి.కాలేజీలో ఇంటర్‌లో చేరి కేశవ మెమోరియల్ స్కూల్‌లో ఆర్ట్ టీచర్‌గా పనిచేసే నరేంద్రరాయ్ దగ్గర చిత్రకళలో ప్రాథమిక పాఠాలు, అంశాలు తెలుసుకుని సాధన చేసి ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రవేశ పరీక్ష రెండు మూడు సార్లు రాయగా చివరకు 1991లో సీటు లభించిందని ఆయన చెప్పారు. అలా జె.ఎన్.టి.యు.లో ఐదు సంవత్సరాలు వివిధ మాధ్యమాల్లో పని నేర్చుకుని, పెయింటింగ్‌ను స్పెషలైజేషన్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని 1997 వరకు సాధన చేసి సంపూర్ణ అవగాహన కొచ్చానని, ఆ తరువాత సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్‌లో పి.జి. చేశానని, ఇక్కడ ప్రముఖ చిత్రకారుడు లక్ష్మారెడ్డి నేతృత్వంలో ప్రింట్ మేకింగ్‌లోని మెలకువలను నేర్చుకున్నానని, వుడ్ కార్వింగ్‌తో సహా ఎచ్చింగ్ ఇంకా అనేక మాధ్యమాల మూల స్వభావం తెలుసుకున్నానని, చాలా కాలం ప్రింట్ వర్క్ చేశానని, అలా తనలోని సృజనశక్తి విస్తృతమైందని ఆయన వివరించారు.
ఈ క్రమంలోనే మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు స్మారకార్థం ఏర్పాటు చేసిన బంగారు పతకంతో పాటు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి, మరికొన్ని ప్రముఖ సంస్థల నుంచి బహుమతులు, ప్రశంసలు లభించాయన్నారు.
హైదరాబాద్‌లో మూడు సోలో షోలను ఏర్పాటు చేశానని, దేశ వ్యాప్తంగా 30 గ్రూపు షోలలో పాల్గొన్నానని, వివిధ ఆర్ట్స్ క్యాంపుల్లో పాల్పంచుకున్నాను, ‘స్ట్రీట్ ఆర్ట్’కు మంచి గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో స్ట్రీట్ ఆర్ట్ కార్యక్రమంలో పాల్గొన్నానని, ప్రముఖ పాఠశాలల్లో ఆర్ట్ టీచర్‌గా సేవలు అందించానని, ప్రస్తుతం గ్లిండేల్ అకాడెమీలో చిత్రకళను సీనియర్ విద్యార్థులకు బోధిస్తున్నానని, ‘అచ్చు’ ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశానని, అలా పొద్దుతిరుగుడు పువ్వులా సూర్యుడనే ‘ఆర్ట్’ చుట్టూ తాను తిరుగుతున్నానని కృష్ణారెడ్డి చమత్కరించారు.
*చిత్రాలు..
ఎం. కృష్ణారెడ్డి, 9866402168