S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాంఘిక మాధ్యమాలు

సాంఘిక మాధ్యమాలనేవి ఓ వ్యసనంగా మారిపోయాయి. మన జీవితం వీటితోనే ముడిపడినట్టుగా అనిపిస్తుంది. గతంలో ఉదయం లేవగానే దేవుని బొమ్మ చూసేవాళ్లు. ఇప్పుడు వాట్సప్‌లు చూస్తున్నారు. సాంఘిక మాధ్యమాల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నప్పటికీ, చాలామంది విలువైన కాలాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని అనిపిస్తుంది.
రొటీన్ జీవితం నుంచి కొంత విరామం తీసుకోవడానికి సెలవుల్లో టూర్లకి వెళ్లేవారు. ఇప్పుడూ వెళ్తున్నారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన దగ్గర నుంచి, మరో ఎయిర్‌పోర్ట్‌లో దిగే వరకు ఎన్నో సెల్ఫీలు దిగుతున్నారు. వాట్సప్‌లలో, ఫేస్‌బుక్‌లో వెనువెంటనే పెట్టేస్తున్నారు. ఫోటోలే కాదు. వీడియోలు కూడా. కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడపకుండా ఈ పనుల మీదే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు.
ఓ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువైపోయింది. వారి స్టాటస్ చూస్తే చాలు. ఎన్నో ఫోటోలు దర్శనమిస్తాయి. మార్కెట్‌కి వెళ్లినా, హోటల్‌కి వెళ్లినా, చివరికి గుడికి వెళ్లినా అక్కడ తీసుకున్న ఫోటోలు వెంటనే వారి వాట్సప్ స్టాటస్‌లో కనిపిస్తున్నాయి. వాటి మీద మిత్రుల ఎమోజీలు, తంసప్‌లు, చప్పట్లు ఇట్లా ఎన్నో ప్రతిస్పందనలు కనిపిస్తూ ఉంటాయి.
మిగతా ప్రదేశాలు చూడటం కన్నా ఎక్కువ సమయాన్ని ఈ ప్రతిస్పందనలని చూడటానికే కేటాయిస్తున్నారు. సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కడబడితే అక్కడ ఎవరితో బడితే వాళ్లతోని సెల్ఫీలు. సమయం లేదు. సందర్భం లేదు. సెల్ఫీల పిచ్చి సెల్ఫ్ పిటీ దాకా వెళ్లిపోయింది.
వాట్సప్‌లలో ఎన్నో గ్రూపులు. ఆ గ్రూపు సభ్యుడు ఏదో చిన్న ఘనకార్యం చేసినట్టు పోస్టింగ్ కనిపించగానే అభినందనల పరంపర. ఇది పర్వాలేదు. ఎవరన్నా చనిపోయారన్న పోస్టింగ్ కనిపిస్తే ‘రిప్’ సమాచారాలు వరుసగా అందులో దర్శనమిస్తాయి. ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధిందిన వ్యక్తులు ఆ గ్రూపులో లేకపోయినా రిప్‌ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి గురించి ఎవరూ చిన్న వ్యాసం రాయరు. తాము ఎక్కడ వెనకపడిపోతున్నామోనన్న భయమో, ఆందోళనో వాళ్లని తమ సందేశాలు పంపే విధంగా తయారు చేస్తుంది.
వ్యక్తిగత ఫోటోలు, ఉత్తరాలు అన్నీ పబ్లిక్ అయిపోయాయి. ఒకటి రెండు ఫోటోలు కాదు. వందల ఫోటోలు.
ఈ ఆధునిక యుగంలో నాగరికత త్వరత్వరగా మారిపోతుంది. మనుషుల నడవడిక, స్వభావాలు కూడా మారిపోతున్నాయి.
తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఆధునిక సాంఘిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అంతవరకు పర్వాలేదు. కానీ వ్యక్తిగత జీవితం లేకుండా చేసుకోవడం ఎంతవరకు సమంజసమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
సాంకేతికత మరెన్ని మార్పులు తెస్తుందో వేచి చూడాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001