S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శిల్ప చిత్ర కళల సాక్షి.. లేపాక్షి..

లేపాక్షి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓ చిన్న ఊరు. ఎన్నో చారిత్రక ఘట్టాలను తనలో ఇముడ్చుకున్న గ్రామం. భారతీయ శిల్ప కళా నైపుణ్యం, అపురూపమైన చిత్రకళల భాండాగారం. ఇక్కడున్న వీరభద్ర ఆలయం శిల్పకళా సంపదకు పెట్టింది పేరు. అక్కడి దుర్గాదేవి అమ్మ వారు విశేష ఆకృతిలో కొలువుదీరి ఉంది. విజయనగర సామ్రాజ్యం ఉచ్ఛ స్థితిలో ఉన్న సమయంలో 15వ శతాబ్దం చివరలో నిర్మాణం ప్రారంభించి 16వ శతాబ్దం వరకూ కొనసాగించినట్లు శాసనాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం నిర్మితమైంది. ఇక్కడి తైల వర్ణ చిత్రాలు, శిల్ప కళాకృతులు, వాస్తు నిర్మాణం యాత్రికుల మనసులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వాస్తు, శిల్ప కళల మేళవింపుతో సూక్ష్మ కళా నైపుణ్యం అబ్బుర పరుస్తుంది. శిలలను శిల్పాలుగా చెక్కిన, వాటికి తోడు తైల వర్ణ చిత్రాలను చిత్రించిన కళాకారుల అకుంఠిత దీక్ష లేపాక్షి వీరభద్ర ఆలయంలో ప్రస్పుటమవుతుంది. ఆగస్త్య మహాముని కొంత కాలం ఇక్కడ తపస్సు చేసుకుని, వీర భద్రుడికి ఒక ఆలయాన్ని నిర్మించాడని, ఇది భారత దేశంలో ఆయన నిర్మించిన 108 శైవ క్షేత్రాల్లో ఒకటని స్కంధ పురాణం చెబుతోంది. ఇప్పటి వరకూ లభ్యమైన సుమారు 20 శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు లేపాక్షి వైభవాన్ని చాటుతున్నాయి. 16వ శతాబ్దంలో లేపాక్షి ఆలయం సంపూర్ణంగా నిర్మితమై ఉండి ఉన్నట్లయితే దేశ చరిత్రలో మరో అద్భుత శిల్ప, చిత్ర కళాఖండంగా నిలిచిపోయి ఉండేది.
లేపాక్షి.. పేరెలా వచ్చింది..!
పేరు గురించి అనేక గాథలు వినిపిస్తున్నా.. ప్రధానంగా రామాయణంలో జటాయువు ఉదంతంతో లేపాక్షి పేరు స్థిరపడిందన్నది విస్తృత ప్రచారంలో ఉంది. క్లుప్తంగా చూస్తే.. శ్రీరాముడు, తన సతి సీతా, తన సోదరుడు లక్ష్మణుడి సమేతంగా వనవాసం చేస్తున్న సమయంలో లంకాధిపతి అయిన రావణాసురుడు మారువేషంలో ఇస్తాడు. లక్ష్మణుడు గీసిన గీత దాటి భిక్షం వేయడానికి వచ్చిన సీతను అపహరిస్తాడు. దక్షిణ దిక్కున ఉన్న శ్రీలంక (నాటి లంక) వైపు వెళుతుండగా, ఆ సమయంలో గమనించిన జటాయువు అనే పక్షి సీతాదేవిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. రావణాసురుడు, జటాయువు నడుమ పోరు సాగుతుంది. ఈ క్రమంలో జటాయువు రెక్కల్ని రావణాసురుడు కర్కశంగా తెగ నరుకుతాడు. దీంతో జటాయువు నేలపై కుప్పకూలుతుంది. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని లంక వైపు వెళతాడు. సీతను వెతుక్కుంటూ ఉత్తర భారతావణి నుంచి దండకారణ్యం మీదుగా వస్తున్న రామ, లక్ష్మణులు జటాయువును గుర్తించి సీత జాడ తెలుసుకుంటారు. రాముడు ఆ మార్గం గుండా వస్తాడని ముందే ఊహించిన జటాయువు ప్రాణాలను బిగబట్టుకుని ఎదురు చూస్తుంటుంది. రాముడు రాగానే జరిగిన వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఆ సమయంలో నీకు తిరిగి పూర్వ రూపాన్నిస్తాను లే..పక్షీ.. అని రాముడు అంటాడు. ఆ మాటలే కాలక్రమంగా లేపక్షి అని, తర్వాత వ్యవహారికంలో లేపాక్షిగానూ స్థిర పడింది. (స్థానిక కథనం, స్థల పురాణం మేరకు)
మరో కథనం ప్రకారం.. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల పాలనలో పెనుకొండ (అనంతపురం జిల్లా) రాజ్యానికి అచ్యుతదేవ రాయలు ప్రభువుగా ఉండేవాడు. అప్పట్లో లేపాక్షి ప్రాంతానికి కోశాగారాధికారిగా ఉన్న విరుపణ్ణ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. అచ్యుతరాయలు కొలువులో లేపాక్షి నందిశెట్టి, ముద్దమ కుమారులైన వీరణ్ణ, విరూపణ్ణ రాజోద్యోగులుగా పని చేసేవారు. పెనుకొండ రాజ్య కోశాధికారిగా ఉన్న విరుపణ్ణకు ఒక కుమారుడు పుడతాడు. ఆ బాలుడు మూగవాడు. తన కుమారుడికి మాటలొస్తే గుడి కట్టిస్తానని వీరభద్రుడికి మొక్కుకున్నాడు. ఒకరోజు విరూపణ్ణ కుమారుడు ఆడుకుంటూ వీరభద్రుడు స్వయంభూగా పుట్టుకొచ్చిన చోటుకు రాగానే అతనికి మాటలొస్తాయి. ఈ విషయం తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనై, ఆనంద పారవశ్యంతో కొడుకును ముద్దాడుతాడు విరూపణ్ణ. అనంతరం తన మొక్కుబడి తీర్చుకోవడానికి వీరభద్రుడికి గుడి కట్టి తన మాటను నిలుపుకుంటాడు. ఈ విషయం అచ్యుతరాయలుకు తెలుస్తుంది. తన అనుమతి లేకుండా ఆలయ నిర్మాణం గావిస్తూ ఖజానాలోని సొమ్ము మొత్తాన్ని ఖర్చు చేశాడని ఆగ్రహిస్తాడు. దీంతో రాజద్రోహం, దేశ ద్రోహం, నమ్మక ద్రోహాలకు పాల్పడిన విరూపణ్ణను కఠినంగా శిక్షించాలని పూనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న విరూపణ్ణ ప్రభువు చేతిలో మరణ దండన తప్పదని, ఆ అవమానం కన్నా ఆత్మగౌరవంతో చావడం మేలని భావించిన విరూపణ్ణ, తాను నిర్మించిన ఆలయానికి చేరుకుని తన రెండు కనుగుడ్లు (కళ్లను) స్వయంగా పీక్కొని ఎదురుగా గోడకు కొడతాడు. అలా విసిరి వేయగా రెండు కళ్లూ తగిలిన గోడకు నేటికీ గోదుమ- ఎరుపు రంగుల్లో రెండు మరకలు కనిపిస్తాయి. కళ్ల మరకలు ఉండటం, కళ్ల లోపం విరూఫ్ణకు ఉండటంతో లేప-అక్షి అని పిలిచారని కథనం. క్రమంగా లేపాక్షిగా మారిందని చెబుతారు. అయితే లభించిన శాసనాల ఆధారంగా అక్కడ వీరభద్రస్వామి గుడి నిర్మించక ముందే లేపాక్షి అని పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దక్ష యజ్ఞంలో పార్వతి ఆత్మాహుతి చేసుకోవడటంతో భరించలేని ఆవేదనతో శివుడు తన జటాజూటం నుంచి జటను తీసి నేలపై విసిరాడనీ, ఆ ప్రదేశం నుంచి శివుడి అంశంగా వీరభద్రుడు పుట్టుకొచ్చాడని, స్వయం భువు, ఉద్భవమూర్తి అయిన వీరభద్రుడికి ఆయన పుట్టుకొచ్చిన చోటే విరూపణ్ణ ఆలయాన్ని నిర్మించినట్లు కూడా ఇంకో కథనం.
(పురావస్తు శాఖలో స్తపతిగా పనిచేస్తూ 2013లో పదవీ విరమణ పొందిన, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర-సంస్కృతిలో భాగంగా గ్రంధీకరించిన ‘విజయనగర కళానిలయం-లేపాక్షి దేవాలయం’లో పొందు పర్చిన అంశాలు ఆధారం)
ఇక బ్రిటిష్ సామ్రాజ్య పాలనలోనూ రెవెన్యూ రికార్డుల్లో లేపాక్షి అనే పేరు రాయబడింది. అయితే శ్రీరాముడు ఈ ప్రాంతానికి రాక మునుపు ఏ పేరుతో ఈ చిన్న గ్రామాన్ని పిలిచేవారన్న చారిత్రక ఆధారాలు నేటికీ లభ్యం కాలేదు. అంతేకాకుండా ప్రత్యేకించి అక్కడే ఆలయాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందన్న విషయంపైనా సమాచారం లేదు. అయితే వీరభద్రుడు స్వయం భువుగా వెలిసిన సమయానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు చిన్న ఆలయాలను కలుపుతూ విరూపణ్ణ వీరభద్రస్వామి ఆలయ నిర్మాణాన్ని కళా, తైల చిత్ర సమ్మేళనంతో నిర్మించడానికి పునుకున్నాడని, అచ్యుతరాయల ఆగ్రహంతో నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచి పోయాయని చరిత్ర చెబుతోంది.
కాగా ప్రముఖ పురావస్తు శాస్తవ్రేత్త, చరిత్రకారుడు ముల్క్‌రాజ్ ఆనంద్ (ము.రా.ఆ) కథనం మేరకు విజయనగర సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో వీరణ్ణ, విరూపణ్ణ అనే శ్రీమంతులైన వర్తక సోదరులిద్దరూ వీరభద్ర ఆలయాన్ని నిర్మించారని, అందులో శివలింగాన్ని ప్రతిష్టించారని తెలుస్తోంది.
స్థానిక, పురాణ గాథల పరంగా లేపాక్షి చరిత్ర ఎలా ఉన్నా.. లే.. పక్షి అన్న శ్రీరాముడి కథనానే్న ప్రధానంగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో శిల్ప, చిత్ర కళా నైపుణ్యం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
ఆలయంలో చూడదగినవి
ఇక్కడ దేశంలో అతి పెద్దదైన ఏకశిల బసవణ్ణ (నంది విగ్రహం) ఉంది. ఉత్తర, తూర్పు దిశల్లో 60 మీటర్ల దూరంలో 6 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల పొడవున, రిక్కించిన చెవులతో, మెడనిండా గంటలు నూలు, నగలు, వీపుపైన, మూపురంపై శాలువ కప్పి ఉంటుంది. మోర ఎత్తి ఉంటుంది. దూరం నుంచి చూసే వారికి నిజమైన నందిగా భ్రమింపజేస్తూ, లేచి వచ్చేలా దర్శనమిస్తుంది. ఇక దేశంలోనే మైసూరులోని చాముండీ హిల్స్‌లో రెండో అతి పెద్ద నంది విగ్రహం ఉండటం విశేషం. ఇక్కడ వీరభద్రస్వామి ఆరాధ్య మండపం, పాపనాశేశ్వర ఆలయం, రఘునాథస్వామి ఆలయం చూడదగ్గవి. ముఖ్య మండపం, కల్యాణ మండపాలు ప్రధానమైనవి. గోపురాలు, వాహన మండపం, పాకశాల, కల్యాణ మండపం, సీతమ్మ పాదం, ఆంజనేయస్వామి గుడి, శివ లింగం ప్రతిష్టింపబడిన నాలుగు కాళ్ల మండపం, నాగ మండపం, హోమ మండపం, పంచాంగ మండపం, రాముడు, అగస్త్యుడు, హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగాలు, ఇటుక రాతి గుడి, ఉయ్యాల మండపం, ధ్వజ స్తంభం, బలిపీఠాలు, వర్ణ చిత్రాలు, వీటిలో విరుపణ్ణ, వీరణ్ణల వర్ణ చిత్రాలు వంటివి ఎన్నో ఆకట్టుకుంటాయి. అసంపూర్తి కల్యాణ మండపం.. నాట్య మండపం, శిల్పాలు, పై కప్పులపై తైల వర్ణ చిత్రాలతో చిత్రించిన రామాయణ, మహాభారత గాధలు..లోపలకు వెళ్లగానే.. ఎడమ వైపు పద్మినీ జాతి స్ర్తి, ఉత్తమ పురుష శిల్పాలు ప్రధానంగా దర్శనమిస్తాయి. గర్భ గుడిలో 27 అడుగుల విరుపణ్ణ తైల వర్ణ చిత్రం ప్రధాన ఆకర్షణ. ఇది దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దది. ఆలయంలో వీరభద్రస్వామికి అభిముఖంగా ఉన్నపుడు ఎడమ వైపు విష్ణు పీఠంపై పాపానాశేశ్వరుడు. కుడివైపు శివ పీఠంపై రఘునాథస్వామి ఉంటారు. వైష్ణవులు, శైవుల మధ్య విభేదాలున్న సమయంలో హిందూత్వంలో అందరూ ఒకటేనని, అబేధమని చాటుతూ పాపనాశేశ్వరుడు, రఘునాథస్వామిని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.
చతురస్ర భూతలంపై నిర్మాణం
చతురస్ర భూతలం మీద పెద్ద పెద్ద రాతికణీకలతోనూ, స్తంభాలతోనూ, పలకలతోనూ ఆయల నిర్మాణం జరిగింది. ఆలయం చుట్టూ స్తంభాలతో నిర్మించిన ఆవరణం, లోపలి ప్రాకారం మీద చిన్నచిన్న గోపురాలు అలంకారంగా నిర్మితమయ్యాయి. ముఖద్వారం పైకనున్న రాతి కణీల మీద దక్షిణ దేశంలో సామాన్యంగా కనిపించే పల్లవ వాస్తు సాంప్రదాయంలో గోపురం నిర్మించబడింది. దీని మీద ఇటుక, సున్నంతో కట్టిన శిల్ప విశేషాలు నేడు శిథిలావస్థలో ఉన్నాయి. గర్భగృహం మీద ముఖ్య విమానం అంటూ ఏదీ లేదు. కానీ విమానం వంటి కొన్ని కట్టడాలు మాత్రం ఆ పైభాగం మీద కనిపిస్తాయి. దేవాలయ
వాస్తుతో వీటికి సంబంధం ఉన్నట్లు తోచదని వాస్తుశాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. తోలపి చుట్టు ప్రదక్షిణం 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పు ఉండేట్లు 9 అడుగుల ఎత్తుండే స్తంభాల వరుసలపై రాతి పలకాలతో కప్పబడి ఉంది. ఆలయం చుట్టూ మూడో ఆవరణంగా ఎతె్తైన ప్రాకారం గోడ ఉంది. అది అసంపూర్తిగా కనిపిస్తుండి. దీనికి అర్ధ చంద్రాకార ( ఆర్చి) ద్వారాలు మూడు ఉన్నాయి. మూడు భాగాలుగా ఆ ఆలయం విభజించబడింది. ఇందులో..
1. ముఖమంటపం : దీనిని నాట్య మంటపం లేక రంగ మంటపం అని కూడా పిలుస్తారు.
2. అర్ధ మంటపం : గర్భ గృహముతో కూడిన ముఖ్యాలయం
3. కల్యాణ మంటపం : ఆలయానికి పడమర దిశలో అసంపూర్తిగా విడువబడింది.
ముఖ మంటపం ద్వారానికి నిలువు రాళ్లపై గంగా యమునల ప్రతిరూపమైన నర్తకి ప్రతిమలు అలంకారలతాగ్రాహిణులుగా మలచబడ్డాయి. 14, 15 శతాబ్దాల్లోని కల్పసూత్ర ప్రతికృతుల లిఖిత గ్రంధములందు ఉన్న మారిది ముఖ రచనలు దట్టముగా, అందంగా దిద్దబడి కనిపిస్తాయి. కల్యాణ మంటపానికి పశ్చిమ దిశగా ఉన్న ఓ బండపై కుడికాలి పాదముద్ర ఉంది. అది సీతమ్మ వారి పాదమని అధికులు విశ్వసిస్తారు. ఇంకొందరు దుర్గమ్మ పాదంగా కొలుస్తారు.
వేలాడే స్తంభం (అంతరిక్ష స్తంభం)
అంతరిక్ష స్తంభంగా పిలవబడే వేలాడే స్తంభం ఆలయ పైకప్పును మాత్రమే ఆధారం చేసుకుని, భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా ఉంటుంది. నాటి నుంచి ఏ వాస్తు శాస్త్ర పరిశోధకుడికీ అంతుచిక్కని అద్భుత కళా సృష్టిగా నేటికీ నిలిచి పోయింది. స్తంభం అడుగు భాగంలోని ఖాళీ ప్రదేశం నుంచి చిన్న పేపరు, లేదా పల్చని రుమాలు ఇటువైపు నుంచి అటువైపునకు నాలుగు వైపులా తీసేలా ఉండేది. అయితే ఓ దశలో బ్రిటిషర్ స్తంభం ఇలా ఉంటే ఆలయానికి ప్రమాదమని భావించి దానిని నేలపై కూర్చోబెట్టే ప్రయత్నం చేయడంతో స్తంభం ఓమూలకు ఒరిగిపోగా, ఆలయ పైభాగం కొంత కదిలినట్లు గుర్తించి, ఆ ప్రయత్నాన్ని విరమించారు. అందుకే ఇపుడు స్తంభానికి మూడు మూలల మాత్రమే ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఉదయ భానుడి కిరణాలు గర్భ గృహంలోకి చొచ్చుకుని వచ్చి పెద్ద శివలింగంపై పడుతుంటాయి. ఇలాంటి ఎన్నో విశేషాలు లేపాక్షి ఆలయంలో ఉన్నాయి. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ పర్యాటక ప్రాంతాల సరసన చేరిన లేపాక్షి గ్రామం జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 120 కి.మీ., హిందూపురం నుంచి తూర్పు దిక్కుకు 14 కి.మీ., బెంగళూరు-హైదరాబాద్ 44వ జాతీయ రహదారిపై ఉన్న కొడికొండ చెక్‌పోస్టు వద్ద అడ్డరోడ్డు నుంచి 6 కి.మీ., బెంగళూరు నుంచి 104 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాక, కర్నాటక, తమిళనాడు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు లేపాక్షిని సందర్శిస్తుంటారు. పెనుకొండ, హిందూపురానికి బెంగళూరు, హైదరాబాద్ వైపు నుంచి రైలు సౌకర్యం ఉంది. బస్సులు, ఇతర వాహనాల్లోనూ వెళ్లవచ్చు. పర్యాటక శాఖ విశ్రాంతి గృహం సామాన్య యాత్రికులకు సైతం అందుబాటులో ఉంది. శివరాత్రి, అశ్వయుజ మాసంలో 10 రోజులు పాపనాశనం దేవర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
మూడోసారి ఘనంగా ఉత్సవాలు
2016లో అప్పటి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2016లో కోట్లాది రూపాయల ఖర్చుతో ఉత్సవాలు జరిపారు. జటాయువు విగ్రహాన్ని 2018 ఉత్సవాల్లో ఏర్పాటు చేశారు. రూ.3.50 కోటి జటాయువు ఘాట్, పార్క్, రోడ్లు, కోనేరు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో మూడోసారి ఘనంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఎం వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర పర్యాటక శాఖ రూ.కోటి పైబడి వెచ్చిస్తోంది.
రాయలసీమ, అనంత జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలకు
అద్దం పట్టేలా లేపాక్షి ఉత్సవాలు : కలెక్టర్ గంధం చంద్రుడు
రాయలసీమ మర్యాద, సంస్కృతి, సాంప్రదాయాలు, అనంతపురం జిల్లా ఘన చరిత్రను చాటేలా లేపాక్షి ఉత్సవాలు జరుపుతున్నాం. లేపాక్షిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ ఉత్సవాల ద్వారా కృషి చేస్తున్నాం. తోలుబొమ్మలాటలు, కోలాటాలు, ఉరుములు, కొమ్ములు, డప్పులు, కీలు గుర్రా, మరగాళ్లు, గొరవయ్యలు, తప్పెట్లు, చెక్క్భజనలు వంటి కళారూపాలు, గ్రామీణ క్రీడలైన కర్రసాము,కత్తిసాము, రాతిగుండు, ఇరుసు ఎత్తడం, గోళీలాట, ఉట్లమాను, చిల్లాకట్టె (కర్రాబిళ్ల), తాడాట, కబడ్డీ వంటివి ఆకట్టుకుంటాయి. పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈశ్వరయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయలక్ష్మీ, దేవాదాయ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఉత్సవాలు ఏర్పాటు చేశారు.

-కె.పురుషోత్తమకుమార్ 9573613737