ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -13
Published Sunday, 8 March 2020వేద వ్యూహం నుండి ఎలా తప్పించుకోవడం అనే ప్రశ్న బుర్రని తొలిచేస్తుంటే తన సీట్లో చతికిల పడింది శకంతుల.
* * *
శకుంతల గురించి రహస్యంగా ఎంక్వైరీ చేయించిన వేద, తనకి అందిన రిపోర్ట్స్ చూసి హతాశయుడయ్యాడు.
ఆమెకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శకుంతల నగర మహిళామండలికి వర్కింగ్ ప్రెసిడెంట్.
సంఘ సేవకురాలు, డొనేటర్. ‘‘అందుకేనా తన ముందు అంత ధీమా ప్రదర్శించింది ఆ రోజు’’ అనుకున్నాడు వేదవ్యాస్.
శకుంతల విషయంలో ఆచితూచి అడుగువేయాలని నిశ్చయించుకున్నాడు.
అందరూ స్వాములే! వాళ్ల స్కామ్‌లు బయటపడితే కదా అసలు రంగు తెలిసేది. అందుకే గృహలక్ష్మి ప్రాజెక్ట్ విషయంలో తొందరపడదల్చుకోలేదతను.
* * *
రాత్రి సమయం.
పది గంటలవుతోంది.
ఎప్పట్లా రహస్యంగా సమావేశమయ్యారా ఇద్దరు.
‘‘ఎందుకీ అనుకోని అత్యవసర సమావేశం?’’
‘‘పోలీసు జాగిలాలు వెంటపడుతున్నాయ్!’’
‘‘ఎందుకని?’’
‘‘వాసన పసిగట్టినట్లున్నాయ్!’’
‘‘ఐసీ!’’
‘‘...’’
‘‘చేసేది, చేయించేది. అంతా నేనే! అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్.’’
‘‘జరగాల్సింది చూడు.’’
‘‘్భయపడుతున్నావా?’’
‘‘్భయం కాదు. ముందుగా జాగ్రత్త పడదామని.’’
‘‘అంటే?’’
‘‘బిజినెస్ క్లోజ్ చేసేయనా?’’
‘‘అదా నీలాంటి వాళ్లు చేయాల్సింది కాదు. జెర్రిపోతులా పిరికితనం ప్రదర్శించకు. త్రాచులా బుసకొట్టడం నేర్చుకో!’’
‘‘...’’
‘‘ఎందుకలా వౌనంగా ఉండిపోయావ్?’’
‘‘సారీ! ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడానికి సంసిద్ధంగా ఉంటాను.’’
‘‘దట్స్ గుడ్! మనం చేయాల్సింది అదే! మొండి ధైర్యం ఉంటే ప్రపంచాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు. ‘చేసేది చేయించేది అంతా నేనే’ అనేది శ్రీకృష్టపరమాత్మ స్టేట్‌మెంట్. అలా అని మన వంతు కర్తవ్యం మనం మరవకూడదు.’’
‘‘అలాగే.’’
‘‘ఇంతకూ వెంటపడుతున్నది ఎవరు?’’
‘‘వ్యాస్. యస్సై వేదవ్యాస్.’’
‘‘...’’
‘‘ఏమాలోచిస్తున్నావ్?’’
‘‘అతని గురించే!’’
‘‘ఎందుకని?’’
‘‘నీకు అతని వ్యక్తిత్వాన్ని తెలియపరుద్దామని’’
‘‘కూరలో కరివేపాకు కాదా?’’
‘‘ఎంత సింపుల్‌గా తీసిపారేయకు.’’
‘‘బిస్కట్లకి తోకాడిస్తాడా?’’
‘‘అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దనేది. దేనికో ఒక దానికి ప్రతివారూ లొంగిపోతారనుకోవడం పొరపాటు. ఖాకీ డ్రెస్ వేసుకున్న పిల్లిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అది మన ప్రొఫెషన్‌కి పనికి రాదు.’’
‘‘ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్...’’
‘‘ఘటికుడు. చాలా మొండివాడు. పైగా పట్టు పట్టాడంటే విక్రమార్కుడే! కదనరంగంలోకి దూకాడంటే అర్జునుడే!’’
‘‘వెరీ నైస్ పొగడ్త.’’
‘‘పొగడ్తలు కావు. వాస్తవాలు. శత్రువునెప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అది వీరుల లక్షణం కాదు. మనకంటే శత్రువు బలవంతుడనే నమ్మకంతోనే మనం పోరుకి సిద్ధపడితే విజయం హస్తగతమవుతుంది. ఎప్పుడైతే శత్రువుని తక్కువ అంచనా వేయడం ప్రారంభించామో అది ఓటమికి సంకేతం అన్న మాట.’’
‘‘మరిప్పుడేం చేయాలి?’’
‘‘జీవితం వైకుంఠపాళీ లాంటిది. ఏ నిమిషంలో నిచ్చెన తగిలి పైకెదుగుతామో, ఏ క్షణంలో పాము నోట బారిన పడి అధఃపాతాళానికి జారిపోతామో తెలియదు.’’
‘‘చేసేది చేయించేది అంతా నేనే’’ అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. అందుకే మనం నిమిత్తమాత్రులం. అలా అని అచేతనంగా ఉండనవసరం లేదు. చేనత్వంతో నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు సాగడమే మన వంతు కర్తవ్యం. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావ్?’’
‘‘చేయదలుచుకున్నదేదో నేనే చేసేస్తే ఈ సీక్రెట్ మీటింగ్‌తో పనేంటి? నినె్నందుకు రమ్మంటాను? సలహా ఇస్తావని కదా!’’
‘‘...’’
‘‘ఏం చేయమంటావ్? చెప్పు’’
‘‘ముందు ఆ పోలీసాఫీసర్ కదలికల్ని అడుగడుగునా పసికట్టడానికి నమ్మకమైన ఒక వ్యక్తిని నియమించు. ఆ రిపోర్ట్స్‌ని బట్టి చూద్దాం. మన మనిషి ఆ వేదవ్యాస్ గురించి అందించే సమాచారం ఆధారగా మనం ప్రొసీడవుదాం. అంతవరకూ సైలెన్స్‌గా ఉండటం బెటర్.’’
‘‘నైస్ సజెషన్.’’
‘‘ఆ రిపోర్ట్స్ అందేవరకు నువ్వు మాత్రం చాలా అలర్ట్‌గా ఉండాలి. ఏమాత్రం తొందరపడకు. ఎక్కడా కించిత్ తేడా కూడా రానివ్వకు. కాస్త దూకుడు ఎక్కువ నీకు. ఏ దిశ నుండయినా ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుందని మాత్రం మరవకూడదు. ‘‘చేసేది చేయించేది అంతా నేనే’’ అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మైండిట్!’’
‘‘ఓకే!’’
‘‘గుడ్ నైట్’’
‘‘గుడ్ నైట్’’
* * *
కానీ వాళ్లకి తెలియని విషయం ఒకటుంది.
తాము నియమించబోయే సీక్రెట్ నుండి గృహలక్ష్మి బిజినెస్ గురించి వేదవ్యాస్ పూర్తిగా మరచిపోయాడనే రిపోర్ట్ రాబోతోందని.
కేవలం వాళ్లని తప్పుదారి పట్టించడానికే ఆ పోలీస్ ఆఫీసర్ పై ఎత్తుగడ వేశాడు.
10
అఖిల్ విషయంలో ఏదైతే జరగకూడదని వసంత్ ఇన్నాళ్లూ అనుకున్నాడో ఆ సంఘటనకి నాందీ ప్రస్తావన జరగనే జరిగింది.
ఆ కుర్రాడిని సూపర్ కిడ్‌గా ప్రపంచం ముందుకి తీసుకువెళ్లే రోజు సడెన్‌గా వచ్చింది.
అదెలా జరిగిందంటే..
గణగణమంటూ ఫోన్ మ్రోగింది.
ఫైల్ నుండి దృష్టి మరల్చకుండానే ఎడం చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు.
‘‘హలో! వసంత్ కుమార్ స్పీకింగ్’’ అంటూ అవతల వైపుకి మెసేజ్ అందించాడు వసంత్.
వెంటనే బదులు వచ్చింది.
‘‘హలో! ... మిస్టర్ వసంత్‌కుమార్. నేను యస్సై వేదవ్యాస్‌ని మాట్లాడుతున్నాను.’’
‘‘వాటే సర్‌ప్రైజ్ థింగ్. నేను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. బట్ ... మీరే నాకు ఫోన్ చేయడం రియల్లీ ఏ రేర్ వండర్.’’
ఆశ్చర్యం ప్రకటిస్తూ కుడిచేతిలో ఉన్న ఫైల్‌ని మూసివేశాడు.
‘‘నాకు ఫోన్ చేద్దామనుకున్నారా! ఎందుకని? మళ్లీ ఏదైనా ప్రోబ్లమ్ క్రియేట్ అయ్యిందా?’’ ఆతృతగా అడిగాడు వేదవ్యాస్.
‘‘నో సర్. అదేం లేదు. ఎవ్విరీ థింగ్ ఈజ్ ఓకే! పర్సనల్‌గా మీకే చేద్దామనుకున్నాను. మీకు తీరిక ఉన్నప్పుడు మిమ్మల్ని డిన్నర్‌కి పిలవాలని ఆలోచన అంతే!
‘‘ఇట్స్ ఓకే! అలాంటివి నాకిష్టం ఉండదు.’’
‘‘ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఏదైనా ఫంక్షన్ చూసుకొని పిలిస్తే బావుంటుందని ఆగాం. వచ్చే నెలలో అఖిల్ బర్త్‌డే ఉంది. కనీసం అప్పుడైనా వీలుచూసుకొని తప్పక రావాలి.’’
‘‘్థంక్స్. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి’’ చెప్పాడు వేద.
‘‘ఈజ్ దేర్ ఎనీ మిస్టిక్ ఫ్రమ్ మై సైడ్ ఆర్ అవర్ డిపార్ట్‌మెంట్ సైడ్’’ కాస్త కంగారుగా అడిగాడు వసంత్.
‘‘పోలీస్ డిపార్టుమెంట్ నుండి కాల్ అనగానే భయపడ్డం సర్వసాధారణమై పోయింది అందరికీ. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా మేమూ గవర్నమెంట్ సర్వెంట్స్‌మి అని ఎందుకని అనుకోరు? అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లాగే పోలీస్ స్టేషన్‌ని కూడా ఒక ఆఫీస్‌గా పరిగణించరెందుకని. మీలాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఇదే భావనని కనబరచడం విచారకరం’’ నిట్టూర్చాడు వేద.
‘‘మీ డిపార్టుమెంట్‌పై ప్రజలకి ఏర్పడిన అభిప్రాయం అలాంటిది. పోలీస్ స్టేషన్ ఈజ్ నథింగ్ బట్ యమపురి అనే భావన జీర్ణించుకుపోయింది అందరిలో. అందుకు మీలోని కొందరు వ్యక్తులే కారకులు. ఇంతకూ మీరు ఏ విషయం....’’ అంటూ ఆగాడు వసంత్.
‘‘మీతో పర్సనల్‌గా మాట్లాడాలి. మీరు నాకో అరగంట టైమివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణం వీలవుతుందా?’’ సూటిగా అడిగాడు.
‘‘నాతో పర్సనల్‌గానా’ అనుకుంటూనే ‘ష్యూర్!’’ నాకు పెద్దగా పనే లేదీ రోజు. స్టేషన్‌కి రమ్మంటారా?’’ అనడిగాడు.
‘‘స్టేషన్‌కి వద్దు. సరిగ్గా ఇరవై నిమిషాల అనంతరం మనిద్దరం హోటల్ సవేరాలో కలుసుకోబోతున్నాం బీ రెడీ!’’ అంటూ ఫోన్ క్రెడిల్ చేసిన శబ్దం.
* * *
ఫైల్ టేబుల్ మీద సర్ది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన సీట్లోంచి లేచి బయటకు కదిలాడు వసంత్.
ఇద్దరూ అనుకున్న సమయానికి హోటల్ సవేరాలో సమావేశం అయ్యారు.
‘‘చెప్పండి’’ అడిగాడు వసంత్.
‘‘అఖిల్ తండ్రిగా మిమ్మల్ని ఒక సహాయం కోరుతున్నాను. మీరు కాదనరు అనే నమ్మకం నాకుంది’’ దృఢంగా అన్నాడు వేదవ్యాస్.
‘‘ఆ రోజు మా అబ్బాయిని కాపాడారు. మా ఇంట్లో అందరికీ మీరంటే అభిమానమే. అలాంటి మీకు సహాయం చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరే పని చేయమన్నా చేయడానికి నేను సిద్ధమే!’’
వేద మీద ఉన్న అభిమానాన్ని తెలియపర్చాడు వసంత్.
‘‘మిస్టరీగా మారిన ఓ కేసు ఇనె్వస్టిగేషన్‌లో మీ అబ్బాయి ఇన్వాల్వ్‌మెంట్ అవసరం ఉంది’’ అంటూ వసంత్ వైపు చూశాడు.
వేద గెస్ చేసినట్లుగానే వసంత్ ముఖం వివర్ణమయ్యింది.
‘అఖిల్ ఆ కేసులో అతి కీలకమైన పాత్ర వహించగలడని నిర్ధారణ అయ్యేకే క్లోజ్ చేయబడిన ఫైల్‌ని తిరిగి ఓపెన్ చేయించాను. ఆ కేసు మిస్టరీ ఛేదించబడాలంటే మీవాడే తిరుగులేని ఆయుధం. ఆధారం కూడా!
చాలా స్లోగా వసంత్ మైండ్‌లోకి ఇంజెక్ట్ చేశాడు వేద.
‘‘వెరీ ఇంట్రెస్టింగ్. మీ కేసుకి మా వాడు ఉపయోగపడడమేంటి? ఇంకా ఎనిమిదేళ్లయినా పూర్తిగా నిండలేదు వాడికి. అనె్నం పునె్నం ఎరుగని పసివాడు. వాడు మీ కేసుని ఛేదించడమేంటి? ట్రాష్!’’ ముఖం చిట్లించాడు వసంత్.
వెంటనే వేద అన్నాడిలా.
‘‘ఐ నో హి ఈజ్ ఎ సూపర్ కిడ్! అందరిలా సాధారణ బాలుడు కాదు. వాడు వండర్ బాయ్! జరిగిపోయిన గతం తాలూకు పుటల్ని వెనక్కి మరల్చి ఆనాటి సంఘటనల్ని ఉన్నదున్నట్లుగా మన కళ్ల ముందు ఆవిష్కరించే అరుదైన అద్భుత బాలుడు. ఆ కుర్రాడికున్న ఆ అపూర్వమైన శక్తిని ఈ కేసుకి బేసిక్‌గా తీసుకోవాలన్నదే నా ప్లాన్.’’
అప్పుడు... అప్పుడు ఉలిక్కిపడ్డాడు వసంత్. ఎక్కడో డైనమేట్ పేలిన ఫీలింగ్!
రెండు సెకన్ల నిశ్శబ్దమనంతరం అడిగాడు.
‘‘వాడి గురించి ఇన్ని విషయాలు మీకెలా తెలుసు?’’
చాలా గోప్యంగా ఉందనుకున్న అఖిల్ విషయం ఏకంగా పోలీసుల దృష్టిలో పడడం అతన్ని విభ్రాంతికి గురిచేస్తోంది.
‘‘నాకు ఈ విషయం తెలియకపోతేనే అదొక విడ్డూరంగా భావించాలి. తెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వేదవ్యాస్ ఇక్కడ ఉన్నంత కాలం నగర నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియాల్సిందే! అలాగే అఖిల్ విల్ పవర్ కూడా నా కనుసన్నలను దాటిపోలేదు....పోదు’’ అన్నాడు.
వేద గొంతులో అధికార స్వరం ధ్వనించింది.
వేదవ్యాస్ శక్తిసామర్థ్యాలు తెలియనివి కావు. అతను వచ్చాకే నగరంలో దోపిడీలు, దొంగతనాలు, మోసాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి.
వేద అంటేనే చీకటి బజార్‌కి హడల్. రౌడీ మూకలు, చిల్లర గ్యాంగ్‌లు దాదాపుగా అంతరించాయి. కొన్ని మాఫియా ముఠాలు మాత్రం చాపక్రింద నీరులా తచ్చాడుతున్నాయి. తను ఉన్న ఏరియాలోనే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అలా అన్ని వర్గాల మెప్పు పొందగలిగిన రేర్ మ్యాన్.
వసంత్ తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చాడు.
(ఇంకా ఉంది)