పుంభావ సరస్వతులైన వీణాపాణులు
Published Sunday, 23 February 2020వేదికపై కంటికి నిండుగా కనిపించే సంగీత వాద్యం వీణ.
సంగీత భాషలో వినబడే గమకాల పుట్టుకంతా ఈ వీణలోనే. ప్రస్ఫుటంగా గమకాలన్నీ తేలికగా ఈ వాద్యంలోనే పలికించవచ్చు. గాత్రాన్ని పోలిన వాద్యం నాదస్వరం.
సంగీతమూర్తి త్రయంలో వీణతో కనిపించే వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు.
మిగిలిన ఇద్దరూ తంబూరాతో ఉంటారు. అలంకారప్రాయమని కొందరూ, వీణావాదానికి మెట్లుంటాయని నేర్చుకోవటం సులభమని మరికొందరు దిగుతారు. దిగితేగాని లోతు తెలియదుగా. వీణతో దిగే ఫోటోలు ఆకర్షణగా, అందంగా బాగుండవచ్చునేమో! కానీ కఠోర సాధన చేస్తేనే తప్ప లొంగని సంగీతవాద్యాల్లో ఇదొకటి. ఆ మాటకొస్తే సాధన లేనిదే అసలు సంగీతమే లేదు. రెండుపదుల వయసులో గమకాలు పలికించలేని బెత్తెడంత మాండలిన్ వాద్యాన్ని స్వాధీనం చేసుకుని విశ్వవ్యాప్తమైన శ్రీనివాస్ ఎటువంటి సాధన చేసి ఉంటాడో ఓసారి ఊహించండి
‘‘ఉపాసన’’ అంటే అది. ఉపన్యాసాలు కాదు.
వీణావాద్యం పేరు చెప్పగానే స్ఫురించే దేవత సరస్వతీదేవి మాణిక్యవీణా వాదనం చేస్తూ బ్రహ్మ పక్కనే ఉంటుంది పలుకుతేనెల తల్లి. వాగ్వైభవానికి కారణం ఆ తల్లే. కానీ సంగీత సృష్టి చేసిన బ్రహ్మ మాత్రం సంగీత రసికుడు కాదు.
‘‘బ్రహ్మ వేద జడ: కానీ జడుడైన బ్రహ్మ ముందు వీణ వాయించే స్థితి సరస్వతిది. అదే ఆశ్చర్యం... అదలా ఉంచండి. సంగీత భాషలో వినిపించే గమకాలన్నీ వీణలోనే పలుకుతాయి. సమర్థుడైన విద్వాంసులకే ఇది సాధ్యం. గమకాల సంగతి దేవుడెరుగు.
ముందు వీణకున్న తీగలన్నీ శృతి చేయగలిగితే చాలు. అసలు సమస్య ఇక్కడే ఉంది. వీణ బుర్రలో ఉండదు శృతి. వాయించే వారి బుర్రలో ఉండాలి.
వీణాధ్యయనం చేసే విద్యార్థులలో శృతిజ్ఞానం కలిగిన వారి సంఖ్య చెప్పాలంటే తక్కువ. పొరబాటున షడ్ర పంచమాలు శృతిలో ఉంటే అమాయకంగా చూస్తూ మధ్యమధ్యలో తాళాన్ని సూచించే తంత్రులు అపశృతిలో ఉన్న సంగతి గుర్తించలేని వారెందరినో నిత్య సంగీత జీవనంలో నేను చాలామందిని చూశాను.
నోరు లేని వాద్యాల్లో సాహిత్య భావాన్ని ప్రతిబింబించేలా వాయించటానికి సాధకులు ఎంతో శ్రమించాలి. అన్నీ గురువు వల్ల లభించేవి కావు క్షణాల్లో సిద్ధించేవీ కావు. సంపూర్ణ సంగీత విద్వాంసుడంటూ కనిపించడు.
మొత్తం జీవితమంతా దారపోసినా సాధారణంగా సంగీత విద్య కైవసమవుతుందన్న దాఖలా లేదు. అలాంటి దివ్యమైన విద్య ఊరికే కాలక్షేపం కోసం సరదాగా నేర్చుకోవాలనుకుంటే సరిపోదు. ఉపాసనా బలముండాలి. మీరు నమ్ముతారో లేదో.
పాతిక ముప్ఫై మందికి పైగా ఆంధ్ర దేశంలోనే ఎక్కువగా వీణ విద్వాంసులున్నారు. వీణ కుటుంబాలున్నాయి.
కీర్తి కాంక్ష, ధన కాంక్ష ఈషణ్మాత్రం లేకుండా వీణానాదంతో కరిగిపోతూ జీవితాలను గడిపిన వైణికులు ఇక్కడే పుట్టారు. ప్రారబ్ధం ఏమంటే గంధర్వాంశతో ఇక్కడే జన్మించిన ప్రజా దురంధరులను గుర్తించకపోవటం మన తెలుగు వారిలో ఉన్న పెద్ద లోపం శాపం కూడా. త్యాగయ్య తంజావూరులో ఎందుకు సిద్ధపడ్డాడు.
త్యాగరాజస్వామి వారెంతటి గాయకులో, వాగ్గేయకారులో, అంతటి వైణికులన్న సంగతి చాలామంది ఎరుగరు. ఆ వివరాలు నిజానికి మనకూ తెలియవు.
దాక్షిణ్యాత్యులైన పూర్వ వైణికులలో చాలామంది తెలుగువారే.
ముత్తుస్వామి దీక్షితులు, సోదరులైన బాలస్వామి దీక్షితులు, వీణ కుప్పయ్యర్ (త్యాగయ్యగారి శిష్యుడు), ఉమయాల్పురం సోదరులతో కృష్ణ్భగవతార్, శొంఠి వెంకట రమణయ్య (త్యాగయ్య శిష్యుడు, పచ్చిమిరియం ఆది అప్పయ్య, భైరవి రాగంలో (ప్రసిద్ధమైన విరిబోణి వర్ణ రచయిత) వీణ సుబ్బయ్య, వీణ శేషన్న, వీణ కరిగిరిరావు, (మైసూర్ సదాశివరావు గురువు) వీణ వెంకట రమణదాసు, వీణ ధనమ్మాళ్ మొదలగు ఇంచుమించు ఓ పాతిక మందికి పైగా వీణే వారి ఇంటి పేరు. దీనికెంతో ధైర్యముండాలి.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడైన గొప్ప వైణికుడు. శ్రీరంగం గోపాలరత్నంకు ఆది గురువైన కవిరాయని జోగారావుగారు (కాకినాడ) వీణావాద్య నిపుణుడే.
వీణ పెదగురు రామాచార్యులు, వారి కుమారులు వీణ వెంకటరమణదాసు, ఈమని కుటుంబం (సుబ్బన్న, అచ్యుతరామశాస్ర్తీ, శంకరశాస్ర్తీ) వీణ చిట్టిబాబు.
వాసావారి కుటుంబం, దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు, నందిగాన వెంకన్న, ఆయన శిష్యుడు తుమ్తరాడ సంగమేశ్వరశాస్ర్తీ, మంచాల జగన్నాథరావు, అయ్యగారి కుటుంబం, పప్పు వారి కుటుంబం, దుడ్డువారి కుటుంబాలన్నీ ఈ వీణా వాద్యానికే అంకితమయ్యాయి. నేను 1970లో రేడియోలో చేరే రోజుల్లో పరిచయమైన సుప్రసిద్ధ వైణికుడు కంభంపాటి అక్కాజీరావు. ఆయనతో సాన్నిహిత్యం పెంచుకున్నాను. ద్వారం వెంకట స్వామినాయుడిగారి వయొలిన్‌తో సహకారంగా ఖండవిల్లి జనార్థనాచార్యులు, మంచి వైణికుడై నాయుడుగారితో గ్రామ్‌ఫోన్ రికార్డులిచ్చారు కూడా.
వాద్య ధర్మం బాగా తెలిసి, బోధించగల నేర్పున్న గురువుల వల్లా, మొహమాటం లేకుండా దోషాలు సవరించుకోగల సంస్కారం కలిగిన శిష్యుల వల్ల మాత్రమే సంగీతం పెరుగుతుంది.
ధనకాంక్ష ప్రధానమై ఒకరినొకరు పొగిడేసుకుంటూ సాగే సంగీత శిక్షణతో విద్య పెరగదు. వంచన ఒక్కటే మిగులుతుంది.
అంచనాకు మించిన వ్యయప్రయాసలే మిగులుతాయి. ఈ సత్యాన్ని గ్రహించగల గురుశిష్యులే మనకు ఆదర్శం.
ఆంధ్ర దేశంలో వీణ గుర్తుకొస్తే స్ఫురించే వ్యక్తి తుమరాడ సంగమేశ్వర శాస్ర్తీ. ఈ తరం కొందరికి ఈయనెవరో తెలియదు.
ఈయన గురువు నందిగాన వెంకన్న (1852-1916). విశాఖ జిల్లా బిటువాడ అగ్రహారంలో ఉండేవారు. ఆ రోజుల్లో వీణ వాయిస్తూ పాడటం ఓ ఆకర్ణగా ఉండేది. అందు వెంకన్నకు చాలా పేరుంది. మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో ఆయన గానం, వాద్యంతో కలిసిపోయి ఆనంద లోకాల్లో విహరింపజేసేదని, మా గురువులు చెప్పేవారు. ఇది చాలా అరుదు. నాభి స్థానం నుండి నాదాన్ని పూరించి ఝుమ్మని పాడేవారుట.
తెల్లవారున లేచి గొంతు వరకూ నీటిలో మునిగి మంద్రస్థాయి సాధన చేసేవారుట.
ఈయన శిష్యుడే సంగమేశ్వరశాస్ర్తీ. భగవంతుడిచ్చే విభూతులు, పుట్టిన ప్రతి ప్రాణికి ఇవ్వడు. కొందరినే ఎంపిక చేస్తాడు. తనకు లభించిన విభూతిని పంచాలని కోరుకుంటే ఇహపరాలు రెండూ దక్కుతాయి. పాఠాలు మాత్రమే చెప్పుకుంటూ బ్రతకాలనుకుంటే ఆ సంగీతం జీవనోపాధిగానే మిగిలిపోతుంది.
క్రమంగా కీర్తి కండూతి కూడా పెరగవచ్చు. అంతే. సంగీత పరమార్థం కాస్తా మాయమై అటకెక్కుతుంది. మహోన్నత వ్యక్తిత్వంతో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ ప్రశంసలకు పాత్రుడైన వీణ సంగమేశ్వరశాస్ర్తీ, నందిగాన వెంకన్న శిష్యుడు గురువుకు తగ్గ శిష్యుడై లౌకికమైన ఆడంబరాలకూ, ఆవలకు సన్మాన సత్కారాలకు లొంగిపోకుండా సంగీతోపాసనతో తరించిన సంగమేశ్వరశస్ర్తీ గార్ని తలుచుకుంటే సంగీత సాధన ఎందుకు చేయాలో, ఎలా చేయాలో నేటితరం వారు తెలుసుకునే అవకాశముంటుందనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నా. సంగమేశ్వర శాస్ర్తీ, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, డా. బాలాంత్రపు రజనీకాంతారావు సంగీత కళానాధి, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖులంతా పిఠాపుం వారే.
మైసూర్ రాష్ట్రంలో వీణ శేషన్న గారికి ఆ రోజుల్లో ఎంత పేరుండేదో మన పిఠాపురం సంగమేశ్వరశాస్ర్తీకి అంతటి కీర్తి ఉంది.
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన తిరుకోడికావల్ కృష్ణయ్యర్, వీణ శేషన్న, గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, శిష్యులైన నాదస్వర విద్వాంసుడు దావిపర్తి పిచ్చహరి వంటి మహా విద్వాంసులు, సంగమేశ్వరశాస్ర్తీగారి వీణా వాద్య వైదుష్యానికి ఆశ్చర్యపోయేవారు. నందిగాన వెంకన్న, సంగమేశ్వరశాస్ర్తీ ఊర్థ్వంగా నిలబెట్టి వీణ వాయించుట పెద్ద విశేషం.
ఒక మెట్టు మీద సాధారణంగా, రెండు మూడు స్వరాలు పలికించవచ్చు.
ఒక స్థాయికి స్థాయినే పలికించటం దుస్సాధ్యం. ఒక మెట్టు మీదనో సప్తస్వరాలనూ పలికితే నేర్పు సంగమేశ్వరశాస్ర్తీది.
దక్షిణాదిలో ఇలా వాయించగలిగిన విద్వాంసుడు వీణ బాలచందర్. గమకాలను ప్రస్తావిస్తూ వెనకటి తరంలో ప్రసిద్ధులైన ఈ వీణా విద్వాంసులను తరుచూ గుర్తు చేస్తూ సోదాహరణంగా, పినాకపాణి గారు పాడి వినిపించే వారు.
ఆదర్శప్రాయులైన ఇటువంటి గురు శిష్యులనూ, విద్వాంసులనూ తలుచుకోవటం సంగీతజ్ఞుల బాధ్యత. నాకు లభించిన అవకాశం.