S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బూడిద వర్ణమా? పత్రహరితమా?

ఈ ప్రపంచం ప్రకృతి పచ్చదనం, పత్రహరితం ఒకదాన్నుంచి ఒకటి వేరు చేసి చూడలేం. అవి పరస్పర ఆధారితాలు. వాటి మధ్య అవినాభావ సంబంధమున్నది. అవి లేకపోతే మిగిలేది బూడిద. బూడిద వర్ణం అని చిత్రకారుడు రఘు ఆకుల బలంగా నమ్ముతున్నాడు. నమ్మడమే గాక తన సృజన ద్వారా ప్రజలను మేలుకొల్పుతున్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాడు. జీవితాల్ని నందనవనంగా తీర్చిదిద్దుకోవాలంటే పచ్చదనం, పత్రహరితం ప్రతీచోట తప్పనిసరి అని తన బొమ్మల ద్వారా బలంగా చెబుతున్నాడు. ఎంత బలంగా అంటే, పిట్ట పొట్ట కింద వెచ్చదనం బదులు పచ్చదనం, పత్రహరితం ప్రకృతిని ఆయన తిలకిస్తున్నాడు. పచ్చదనం ఉంటేనే వెచ్చదనం ఉంటుంది. పిట్ట ఉంటుంది, దాని కువకువ వినిపిస్తుంది. ఆ పచ్చదనం లుప్తమైతే అంతా శ్మశానం. బూడిద. బూడిద వర్ణం అని రఘు బలంగా విశ్వసిస్తూ ప్రకృతికి, పశుపక్ష్యాదులకు, పచ్చదనానికి హారతులు పడుతున్నారు.
పచ్చదనం - పత్రహరితం లేకుండా పులి ఎలా కనిపిస్తుందో ఆయన కాన్వాస్‌పై ఇంకుపెన్నుతో చిత్రించి వీక్షకుల్ని ఆలోచింపజేశారు. అడవులు కరవై, ఆకుపచ్చదనం ఆవిరై అంతా రాశీభూతమైన ...బూడిద వర్ణం పరచుకుంటే పులి సైతం దీనంగా కళావిహీనంగా, పసలేని దానిగా కళ్లకు కనిపిస్తుంది. ఆ కళావిహీన, పత్రరహిత చెట్లు, తీగల మధ్య, అడవి కాని అడవి జీవం లేని పరిసరాల మధ్య బేలగా బిక్కుబిక్కుమంటూ పులితో పాటు కోతి, జింక, పక్షి కనిపిస్తాయి. ఆ కళావిహీన ‘బ్యాక్ గ్రౌండ్’లో జంతుజాతుల్ని చూసే అవసరం కాకూడదని, ఆ ‘దృశ్యం’ ఎంత మృతప్రాయంగా, జీవరహితంగా, కృత్రిమంగా అనిపిస్తుందో చిత్రకారుడు ప్రతిభావంతంగా చూపాడు. పులిచూపుల్లో క్రౌర్యం ఉన్న పరిసరాల్లో జీవం లేదు. వేటాడాలన్న ‘ఇచ్ఛ’ కూడా చచ్చిపోయినట్టు అనిపించే ఆ పులి పట్ల వీక్షకులకే జాలి కలుగుతుంది. అంటే అడవి.. ఆకుపచ్చదనం, పత్రహరితం, అది అందించే ప్రాణవాయువు, పరిసరాలకు శోభను చేకూర్చే ఆకులు, అలములు ఎంత కీలకమో, ఎంత అవసరమో, ఆకుపచ్చదనం మినహా ఈ లోకం శూన్యం అన్న ఓ వేదాంత భావనతో పాటు వాస్తవికతను , వర్తమాన స్థితిని ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘గ్లోబల్ వార్మింగ్’ గూర్చి రఘు తనదైన శైలిలో ఎంతో శక్తిమంతంగా తన భావాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.
పిచ్చుక పిడికెడంత ఉంటుంది. దాని చలాకీతనం బ్రహ్మాండమంత కనిపిస్తుంది. అలాంటి పిచ్చుక వచ్చే తరాలకు తన చలాకితనంతో ఆకర్షిస్తూ అబ్బురపరచాలంటే... పచ్చదనం... పత్రహరితం... ఆకుపచ్చదనం అంతటా కనిపించాలని చివరికి పిట్ట పొట్ట వెచ్చదనం కూడా ఆకుపచ్చదనంగా మారితే ఈ ప్రపంచం ప్రమాదం నుంచి బయటపడుతున్న ఓ ఆశాభావంతో చిత్రకారుడు ఆశాభావంతో, ప్రకృతి ప్రేమికుడిగా, తన చూపు నిండా పచ్చదనమే. పత్రిహరితమేనని చాటుతూ పిచ్చుక తలపై, పొట్ట కింది పదిలంగా ఆకులను పత్రహరితాన్ని పసందుగా చిత్రించి తన దృష్టికోణాన్ని, తన మనోభావాల్ని, ప్రజలు మేల్కోవలసిన అవసరాన్ని సునిశితంగా చాటిచెప్పారు.
అంతేనా?.. కాదు బలిష్టమైన ఎద్దు.. దాని తోకను అంతే బలిష్టమైన ఆకుపచ్చని కాడగా చిత్రించి చిత్రకారుడు అబ్బురపరుస్తాడు. పచ్చదనం, పత్రహరితం పట్ల ఆయనకున్న అభినివేశం, ఆర్తిని ఇది ఎంతో సృజనాత్మకంగా తెలియజేస్తోంది. పొగరుమోతు గిత్త తోక అంటే పొగరు గల ఆకుపచ్చ వర్ణం కాడను చిత్రించి పశువులలో సగ భాగం పచ్చదనమే. పచ్చదనం లేకపోతే పశువులు, పక్షులు, జంతువులు, మనుషులు.. బొమ్మలు.. రంగులు.. రసజ్ఞత.. నాజూకుదనం.. నగిషీలు లేవని ఆయన తనదైన రీతిలో బలంగా తన బొమ్మ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు.
సరే.. ఎద్దు సంగతి అలా ఉంటే నెమలి నాట్యమాడినా.. కొమ్మపై కొలువుదీరినా దాని పించం అంతా పత్రహరితమే. ఆకుపచ్చని ఆకుల గూఢమే. నెమలి ఎన్ని హోయలు పోయినా... వర్ణాలను వెదజల్లి, వయ్యారాలు ఒలకబోసినా చూపులతో హృదయాలను కొల్లగొట్టినా అంతిమంగా ఆకుపచ్చని పత్రహరితం దానికి సంపూర్ణత తీసుకొస్తుందని చిత్రకారుడు తన చిత్రాల్లో ప్రతిపాదించాడు.
గొర్రె, పొట్టేలు మెడ చుట్టూ ‘ఉన్ని’ (నూలు) ఉంటుంది. దాంతో అది బలిష్టంగా కనిపిస్తుంది. రఘుకు మాత్రం ఉన్ని బదులు, నల్లని బూర బదులు వసివాడని ఆకుల గుచ్ఛం దర్శనమిస్తుంది. పొట్టేలు కొమ్ములు వాడిగా వంపులు తిరిగి కనిపించినా తల చుట్టూ ఆకులు, పత్రహరితం చుట్టలు చుట్టలుగా తాజాగా మెరుస్తూ ఆకర్షిస్తుంది. ఇందుగలడందు లేడని సందేహంబు వలదన్న చందంగా చిత్రకారుడికి అంతటా ... అన్ని చోట్ల పత్రహరితమే ప్రత్యక్షమవుతున్నది. తన సృజన ద్వారా, రంగుల మహిమ ద్వారా అది సహజ సిద్ధమన్నంతగా భ్రమ కల్పిస్తూ ఆయన బొమ్మలు గీశారు. ఇంధనాన్ని, శక్తిని...ఆకుపచ్చదనాన్ని, అమ్మతనాన్ని కాపాడుకోవాలన్నదే తన నినాదమని చిత్రకారుడు పదేపదే తన బొమ్మల ద్వారా, ఆకృతుల ద్వారా చెబుతున్నారు.
చివరికి కోడిపుంజు పొట్ట కింద సైతం పత్రహరితాన్ని పొందుపరచి తనలోని భావ తీక్షణతను తనలోని ఆర్తిని కొక్కొరోకో.. అని చాటుతున్నారు. ఆఖరికి ఎవరూ పట్టించుకోని గుడ్లగూబను సైతం వదిలిపెట్టక తన పచ్చదనం
కానె్సప్ట్‌తో ప్రపంచం ముందు పెట్టారు. గుడ్లగూబ పొట్ట చుట్టూ ఆకుపచ్చని ఆకులు అదిమిపెట్టినట్టు, సహజంగా ఆ పచ్చదనం పుట్టుకొచ్చినట్టు చిత్రకారుడు తన బొమ్మలో పొందుపరిచాడు. చిత్రకారుడికి పిసరంత ‘పత్రహరిత పిచ్చి’ ఉందేమోనని కొందరు అనుమానపడినా అందుకాయనేమీ నొచ్చుకోడు. తన భావాల్ని బలంగా చెప్పడమే లక్ష్యం తప్ప ఎవరి వ్యాఖ్యానంతో, ఎవరి విపరీత వ్యాఖ్యతో తనకు సంబంధం లేదంటారాయన.
అడవులు కరవై, పచ్చదనం లుప్తమై పులులు, కోతులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు ఆవాసాల వైపు, పల్లెలు, పట్నాలలోకి వస్తున్నాయన్న తెలివి అందరిలో కలగాలన్నదే తన తపన అని ఆయన ఎంతో ఆర్తితో భావస్ఫోరకంగా బొమ్మల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు.
ప్రకృతిపై, పశుపక్ష్యాదులపై పత్రహరితంపై, ప్రపంచ మనుగడపై ఇంతగా తపించే తనలో తాను మదనపడే ఆకుల రఘు హైదరాబాద్‌లోని ఘోషామహల్ ప్రాంతంలో 1966లో జన్మించారు. ఘోషామహల్ ప్రభుత్వ పాఠశాలలోనే పదవ తరగతి వరకు చదివారు. తన చిన్నాన్న చిత్రలేఖనంపై ఆసక్తితో బొమ్మలు వేసేవాడని, తానూ భవనాల నమూనాలను అట్టముక్కలతో తయారుచేసేవాడినని అలా చిత్రరచన పట్ల ఆసక్తి పెరిగిందని రఘు చెప్పారు. నాంపల్లి జూనియర్ కాలేజీ చదువు అయ్యాక, కొంతకాలం వి.వి.కాలేజీలో సాయంత్రంపూట ‘డోంగ్రే సర్’ చెప్పే చిత్రలేఖనం తరగతులకు హాజరై బేసిక్స్ తెలుసుకున్నానని, ఆ తరువాత 1988 సంవత్సరం జె.ఎన్.టి.యులో బి.ఎఫ్.ఏ కోర్సులో చేరి అప్లైడ్ ఆర్ట్ తీసుకున్నానని అలా తన కెరీర్ ప్రారంభమైందని రఘు తెలిపారు. కొంతకాలం బొంబాయిలో అడ్వర్‌టైజ్‌మెంట్ కార్యాలయం అనంతరం హైదరాబాద్‌లోనూ అదేపని కొనసాగించానని, దాదాపు దశాబ్దకాలంగా పెయింటింగ్స్ వేస్తూ, పిల్లలకు డ్రాయింగ్ తరగతులు తీసుకుంటున్నానని, త్వరలో పెద్ద సోలో షో నిర్వహించే పనిలో నిమగ్నమవుతున్నానని రఘు ఆకుల సాక్షిగా చెప్పారు.
*
*చిత్రాలు.. రఘు ఆకుల.. 9052125352

- వుప్పల నరసింహం 9985781799