మిత్రుడు హాకింగ్
Published Sunday, 16 February 2020నాకు మనిషి తెలివి పట్ల అంతులేని నమ్మకం ఉంది. తెలివి ఉండి కూడా వాడని వారి పట్ల అంతగానూ అసహనం కనబరుస్తాను. అది నా బలహీనత. తెలివిని వాడుకుని మన గురించి ప్రపంచం గురించి తెలియజెప్పిన వారంతా నాకు గురువులు. సైన్ల్ నాకు వేదం. వేదం అంటే తెలివిడి అని అర్థం. విజ్ఞానశాస్త్రంలో మరీ లోతైన అంశాలను గురించి అవగాహన కలిగించిన వారు మరీ గొప్ప గురువులు. వారి గురించి, వారు చెప్పిన అంశాలను గురించి తోటివారికి నాకు అర్థమైనంతలో, చేతనయినంతలో అందించాలని రాస్తుంటాను. మాట్లాడుతుంటాను.
నేను ఈమధ్యన ముగ్గురు భౌతిక శాస్తవ్రేత్తలను గురించి పుస్తకాలు రాయవలసి వచ్చింది. వారు న్యూటన్, ఐన్‌స్టైన్, స్టీఫెన్ హాకింగ్. ఆ తరువాత నాకు వాళ్లు ముగ్గురూ బాగా తెలిసిన మనుషులు అన్న భావన మనసులో గట్టిగా నాటుకుపోయింది. హాకింగ్ విషయంలో ఈ భావన మరింత ముందుకు వెళ్లింది. అతను నాకు ఒక మిత్రుడు అనిపిస్తుంది. కానీ ఏనాడూ మేము ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. ఆయన ఉన్నాడు అని నాకు తెలుసు. నేను ఉన్నానని ఆయనకు తెలిసే అవకాశమే లేదు.
ఇద్దరమూ చదువు, పుస్తకాల మీద గౌరవం గల మామూలు కుటుంబంలో పుట్టిన వాళ్లమే. చదువు అవకాశం లేకున్నా చచ్చీ, చెడి బాగా చదువుకున్నాం. ఇద్దరికీ ఆరోగ్యం సర్వనాశనం అయ్యింది. అయినా అతను ఎన్నో గొప్ప పనులు చేశాడు. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నా స్థాయిలో నేను ఇప్పటికి వందకు పైగా పుస్తకాలు రాశాను అంటే, హాకింగ్‌తో సమానంగా గొప్పవాడిని కాను కానీ, ఆ మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్న వారిలో ఒక్కడిని అని సగర్వంగా చెప్పుకుంటాను. హాకింగ్ చనిపోయినప్పుడు ఒక వ్యాసం రాశాను. కానీ ఆనాటికి స్నేహితుడు అన్న భావన అంతగా బాధ పడలేదు. పుస్తకాలు రాయాలన్న అవసరంతో ఆయన గురించి దొరికిన సమాచారం అన్ని మూలల నుంచి వెతికి చదివాను. ఎన్నో ఫోటోలు సేకరించాను.
ఐజాక్ న్యూటన్ గురించిన పుస్తకం గడచిన సంవత్సరం బజారులోకి వచ్చింది. ఇక ఈ సంవత్సరం ఆల్బర్ట్ ఐన్‌స్టైన్, స్టీఫెన్ హాకింగ్‌లను గురించి రాశాను నిజానికి హాకింగ్ గురించి రెండు పుస్తకాలు రాశాను. మొత్తానికి నాకు భౌతిక శాస్త్రంలోని లోతయిన అంశాలను గురించి ఆలోచించడానికి అవకాశం దొరికింది.
విజ్ఞానశాస్త్రంలో సైంటిస్టులు అంతకు ముందు తమ రంగంలో జరిగిన పరిశోధనలు ఆధారంగా చేసుకుని మరిన్ని కొత్త ఆలోచనలకు దారి వేస్తారు. ఈ ప్రయత్నంలోకొన్ని విచిత్రాలు జరగడం మనం సులభంగా గమనించవచ్చు. ముందుగా న్యూటన్ గురించి కొన్ని ముచ్చట్లు ఆపిల్ పండు అతని తల మీద పడ్డదో, లేదో తెలియదు. చాలామంది పడలేదు అన్నారు. ప్రపంచం మాత్రం పడ్డది అనుకుంటున్నది. ఆ సంగతి పక్కనపెడితే న్యూటన్ మూడు వందల సంవత్సరాల నాడు ప్రపంచంలోని పరిశోధకుల ఆలోచనలను ఒక కొత్తదారిలోకి పెట్టాడు. భూమికి గల, అలాగే విశ్వంలోని పెద్ద నిర్మాణాలకు అన్నింటికీ గల ఆకర్షణ శక్తిని గురించి ఆయన చెప్పాడు. చలనం ఇంటే కదలికలకు సంబంధించిన సిద్ధాంతాలను కూడా సిద్ధం చేసి చెప్పాడు. అంతకుముందు ప్రపంచంలో కదలికలు లేవా, ఉన్నాయి. కానీ వాటి పద్ధతి గురించి ఎవరికీ తెలియదు. మొత్తానికి దానితో భౌతికశాస్త్ర ప్రపంచమే కాక మామూలు ప్రపంచంలో కూడా ప్రపంచం గురించిన అవగాహన విషయంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి.
ఇక ఒక వంద సంవత్సరాల క్రితం ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ అనే మరో పరిశోధకుడు వచ్చాడు. న్యూటన్ చెప్పిన దాంట్లో పొరపాట్లు ఉన్నాయి అన్నాడు. న్యూటన్ స్థలకాలాలను ఒక రకమైన దృష్టితో అర్థం చేసుకున్నాడు. ఐన్‌స్టైన్ మాత్రం కాలం విషయంగా కొత్త ఆలోచనలను ప్రతిపాదించారు. అది కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఇక స్థలం సంగతి ఏమిటి? మనకు స్థలం అంటే ఇళ్ల స్థలాలు గుర్తుకువస్తాయి. మన మానసిక పరిణతి అంతవరకే ఉన్నది. అయితే విశ్వం మొత్తంలోనూ ఉన్న ప్రదేశాన్ని స్థలం అన్నాడు ఈ పరిశోధకుడు. అది వంగి ఉన్నది అన్నాడు. ఈ విషయం మన ఆలోచనకు కూడా రాదు. భౌతిక శాస్తవ్రేత్తలు దీనిని గురించి బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. మనం సమాంతరం అనుకుంటున్న గీతలు ఈ వంపు కారణంగా ఎక్కడో ఒకచోట ఒకదాని మీదుగా మరొకటి వెళ్లిపోతాయి. రైలు గ్రహాలు పట్టాలు మనకు తెలిసి కలవవు. కానీ కలుస్తాయి అన్నాడాయన. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగతున్నాయి అంటే అందులో ఏదో అద్భుతం ఉంది అని చాలామంది అనుకున్నారు. స్థలం వంగి ఉన్నందుకే గ్రహాలు అలా తిరుగుతున్నాయి అని ఐన్‌స్టైన్ చెప్పాడు. జాన్ వీలర్ అనే మరొక పరిశోధకుడు ఈ సంగతిని మరింత సులభంగా చెప్పాడు. విశ్వంలోని పదార్థం, స్థలం వంపు తిరిగే రీతిని నిర్ణయిస్తుంది. స్థలం ఆ పదార్థం కదిలే తీరును నిర్ణయిస్తుంది అన్నాడాయన. భౌతికశాస్త్రం ముందే మామూలుగా అర్థం కాదు. అది కేవలం ఆలోచించి అర్థం చేసుకోవలసిన విషయం. అందులో ఏదీ కళ్ల ముందు కనిపించదు. వాళ్లు చెబుతున్న విషయానికి సంబంధించి అనుభవాలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని ఊహించగలగాలి. విశ్వంలోని స్థలం చదునుగా లేదు అంటే ఎట్లా ఊహించాలి, చెప్పడం చేత కాకుండా ఉంది. ఇటువంటి విషయాలను బడిలో కూడా చెప్పరు.
ఇక్కడికి కావల్సినంత తికమక తయారయింది. ఇక స్టీఫెన్ హాకింగ్ అనే మరొక పెద్ద మనిషి వచ్చాడు. అతను నిజానికి మరేదో చేయాలి అనుకుని విశ్వం పుట్టుక గురించి పరిశోధించవలసిన పరిస్థితిలోకి ఇరుక్కున్నాడు. కానీ అతను ప్రపంచానికి అందించిన ఆలోచనలు భౌతికశాస్త్ర రంగంలో వారిని మరి కొన్ని పదుల సంవత్సరాల దాకా పనిలో పెట్టి, నిద్ర రాకుండా చేసే రకంగా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో పుస్తకాల సంత జరుగుతుంది. మామూలుగా నేను అక్కడికి వెళ్లాను. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే అంగళ్లు అందులో చాలా ఉంటాయి. అమ్ముడుపోని పుస్తకాలను చవకగా అమ్మే అంగళ్లు కూడా ఉన్నాయి. అటువంటి అంగళ్లలో స్టీఫెన్ హాకింగ్ తన కూతురు లూసీతో కలిసి రాసిన ఐదు నవలలు నా కళ్లపడ్డాయి. వాటిని వందకు ఒక్కటి ప్రకారం అమ్ముతున్నారు. అంతకంటే అన్యాయం మరొకటి లేదు అనుకుని ఐదు పుస్తకాలను కొని తెచ్చుకున్నాను. వాటిలో మొదటి పుస్తకాన్ని నేను చాలాకాలం క్రితమే హాకింగ్ బతికి ఉండగానే తెలుగులోకి రాశాను. అది అచ్చయ్యింది. అమ్ముడు అవుతున్నది అన్న సంగతి ఇక్కడ చెపితే అప్రమత్తం కాదు అనుకుంటాను.
ఈలోగా స్టీఫెన్ పుట్టినరోజు వచ్చింది అని ఒక మిత్రుడు నన్ను హెచ్చరించాడు. నా పుట్టినరోజే నాకు గుర్తుండదు. ఇక నేను మిగతావారి పుట్టినరోజలు ఎందుకని గుర్తుపెట్టుకుంటాను?
కానీ స్టీఫెన్ హాకింగ్‌ను అంత సులభంగా మరిచిపోవడం వీలు కాదు. అతని బొమ్మ ఒకటి అచ్చు వేసుకుని గోడకు తగిలించి ప్రతినిత్యం పొద్దునే్న దండం పెట్టాలి అన్న ప్రయత్నంలో ఉన్నాను.
అక్కడ ఐన్‌స్టైన్ బొమ్మ కూడా ఉంటుంది. అతని బతుకు నడిచిన తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే నేను నా పుస్తకాలలో ముగ్గురు పరిశోధకుల విషయంలోనూ వాళ్ల సైన్స్ కన్నా బతుకు తీరు గురించి ఎక్కువగా రాసినట్లు ఉన్నాను. గొప్పవారు కావాలంటే వాళ్ల బతుకులు అవేవో మరొక మార్గంలో ఉంటాయి అన్న భావన నుంచి అందరూ బయటపడాలి అన్నది నా బాధ. ఈ ముగ్గురు పరిశోధకులూ విచిత్రమైన జీవితాలను గడిపారు. కానీ ఎవరికీ వీలుకాని సైన్సును, విశ్వం గురించిన అవగాహనను ప్రజలకు అందించి వెళ్లిపోయారు. ఆ సంగతి అర్థం చేసుకోవడానికి మనం వాళ్లతో సమానంగా ఎత్తుకు ఎదగవలసి వస్తుంది. అది మనకు అంత సులభంగా వీలు కాదు అని నాకు తెలుసు. ముగ్గురూ మరెవరినీ పట్టించుకోకుండా తమ దారిన తాము బతుకు సాగించారు. పరిశోధన సంగతీ అంతే.
స్టీఫెన్ హాకింగ్ బుర్ర నిండా ఆలోచనలు ఉండేవి. అతనికి ప్రతి క్షణం చెప్పడానికి ఏదో ఒక విషయం కనపడుతూనే ఉండేది. 150 పరిశోధన పత్రాలు రాశాడు. వాటిలో కొన్ని మరీ పేరు పొందాయి. అసలు సంగతి అతని వయసు ఇరవై ప్రాంతాలలో ఉండగా మరొక రెండేళ్లలో చనిపోతాడు అని చెప్పారు. నాలాగే అతను అంతంత ఆరోగ్యం మనిషి, నేను బాగానే ఉన్నాను. అతను మాత్రం మరీ కదలలేని స్థితికి చేరుకున్నాడు. అంతకన్నా గొప్పగా సైన్సు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అతని పరిశోధన కేవలం మనసులో జరిగింది. బతికినన్నాళ్లు అతను కదలలేక చక్రాల కుర్చీలో ఉన్నాడన్న సంగతి తెలియనివాళ్లు బహుశా ఈ ప్రపంచంలోనే లేరేమో. అతను ప్రపంచమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాల్లో కనిపించాడు. సినిమాల్లో నటించాడు. అందరికీ అభిమానపాత్రుడయ్యాడు. పుస్తకాలు రాశాడు. అవి ప్రపంచంలోనే గొప్ప పుస్తకాలు అనిపించుకున్నాయి.