నేటి లోకం తీరు
Published Sunday, 16 February 2020వలసకై ఎగిరే పక్షులు ఆహారానికై నేల దిగి దిగబడినట్లు
నీటిపై ఎగిరేటి చేపల వల చేత చిక్కి విలవిల్లాడినట్లు
రామచక్కని నీ రూపు మృగాళ్ల చెరకు చిక్కినట్లు
కొడకా! అమ్మకు నీవు ఓదార్పు ఇవ్వటానికి వొచ్చినట్లు
కలలు కనేటి కనె్నపిల్ల కల్లోకి చేరబట్టెటోడు వచ్చినట్లు
వేలు పట్టి నడిపినోడు నడిపోడు నందకాడ సమిదైనట్లు
జాతరలో కత్తిపదునుకు బలైన మేకపోతులాగైనట్టు
కొడకా! అమ్మకు నీవు ఋణం తీర్చటానికి వొచ్చినట్లు
నిర్మలమైన నీలాకాశంను నల్లని మబ్బులు కమ్మినట్లు
బొట్టు బొట్టుతో కురిసేటి వర్షము కుండపోతై కురిసినట్లు
తూర్పుదిక్కు సంద్రము సునామికి తలొదిక్కయినట్లు
కొడకా! అమ్మకు నీవుకుశలం అడగటానికి వొచ్చినట్లు
మంచోడు చెడ్డోడు చేత ఈ లోకమున మోసగించబడినట్లు
నీది నాది అని వేరు చేసి ఇహలోకము సుడిగుండమైనట్లు
ఉన్నోడు అందలం కోసం లేనోడిని సంకలనం చేసినట్లు
కొడకా! అమ్మకు నీవు శుద్దులు చెప్పటానికి వొచ్చినట్లు
తండ్రి మాటకై వనవాసంనకు తరిలి లోకాభిరాముడైనట్లు
అవనిపై హితము కోరి శంఖం పూరించి పరమాత్ముడైనట్లు
అవకాశం చేత సమూహంలో మానవుడు దానవుడైనట్లు
కొడకా! అమ్మకు నీవు యుగాల తేడా చెప్పటానికి వొచ్చినట్లు