శ్రీకాళహస్తి శివానందైక నిలయమే..
Published Sunday, 16 February 2020శ్లో. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వరశ్శివః, కరోతు నిత్యకల్యాణం కరుణా వరుణాలయః .
శ్రీకాళహస్తి ఒక మహాశైవక్షేత్రం. ఈ మాట వినగానే అందరికి గుర్తుకువచ్చేవి మూగ జీవాలైన శ్రీ (సాలెపురుగు), కాళం (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడే. కాని అది ఒక పంచభూత లింగాలలో వాయులింగమని గుర్తుకు వచ్చేది కొందరికే. జంతూనాం నరజన్మ దుర్లభమ్- జీవులలో నరజన్మ దుర్లభమని (వివేకచూడామణి-2) శంకరులు చెప్పినా ‘‘మోక్షసాధన సామగ్య్య్రాభక్తిరేవ గరీయసీ.’’ (వి.చూ.మా.32.) అని చెప్పిన వారి మాటకు నిదర్శనంగా మోక్షాన్ని పొంది కలకాలం భక్తాగ్రేసరులుగా నిలిచినవి ఆ శ్రీ,కాళహస్తులే. కైవల్యం లౌకికజ్ఞానం వల్ల కాక తత్త్వజ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది (జ్ఞానాదైవకైవల్యమ్) అన్న వచనానుసారం శివతత్వజ్ఞుడై స్వయంగా తన కన్నులను పెరికి శివార్పణం చేసి శివసాయుజ్యాన్ని పొందిన భక్తి, జ్ఞాన, వైరాగ్య, సంపన్నుడు కన్న (తిన్నడు) కూడా వారికి సరిజోడే. వీరంతా త్రేతాయుగంలోని వారని చెబితే చాలమంది ఆశ్చర్యపడతారు కానీ ఈ మాట ఎవరో అన్నది కాదు. పద్దెనిమిది పురాణాలు రచించిన వేదవ్యాసుడే శివపురాణాంతర్గతంగా చెప్పిన శివరహస్య ఖండమనే తొంభై అధ్యాయాల గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. వ్యాసుని మాటకు భిన్నంగా ద్వాపరయుగం నాటి అర్జునుడే మరల కన్నప్పగా పుట్టాడని ధూర్జటికవి చెప్పిన మాట కూడా ఆ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది. ఈ రెండింటిని మించి మరేమైనా ఆశ్చర్యకర విషయాలు కనబడతాయేమో ఒక్కసారి శివరహస్య ఖండాన్ని పరిశీలిద్దాం.
దివ్యకైలాసంలో బ్రహ్మ తపస్సు - బ్రహ్మ జీవితకాలపరిమితి వందేండ్లు (అవి మానవుల వందేండ్లు కావు. కోటానుకోట్ల ఏండ్లు) ముగిసిన వెంటనే జరిగేది మహాప్రళయం. అదే ప్రాకృతప్రళయం. అది ఎంతోకాలం గడిచిన పిమ్మట సృష్టి చేయాలన్న సంకల్పం ఆ పరమాత్మలో కలిగింది. పరమాత్మ సంకల్పాన్ని ‘‘ సోచీకామయత బహుస్యాంప్రజాయేయేతి. ‘‘ (తైత్తిరీయో పనిషత్తు. ఆనందల్లి. 6అను. 6.మం), ‘‘ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, నాన్యత్కించ నమిషత్, స ఈక్షతలో కాన్సృజాఇతి’’ (ఐతరీయోపనిషత్తు1.1.1.) ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఆ సంకల్పానుగుణంగా పరమాత్మ కుడివైపు నుండి బ్రహ్మ, ఎడమవైపునుండి శ్రీహరి ఉద్భవించారు. మధ్యలో లయ స్వరూపుడై ఏకపాదం కలిగిన దివ్యాకృతిలో పరమాత్మయే శివస్వరూపంలో నిలిచాడు. వేదాలు ఈ దివ్యమూర్తిని ‘‘ఏకపాదరుద్రు’’నిగా అభివర్ణించాయి. అప్పుడా మూర్తి సృష్టిరచన చేయుమని బ్రహ్మకు ఆజ్ఞాపించింది. కానీ కర్మబంధన హేతువైన సృష్టిని చేయజాలనని బ్రహ్మ తిరస్కరించాడు. అందుకు కినిసిన ఆ దైవం బ్రహ్మపై శివమాయను ఆవహింపచేసాడు. దానితో బ్రహ్మ జ్ఞానహీనుడై జడునివలె పరమేశ్వరుని మ్రోల నిలిచి శివమాయను తొలగించుమని వేడుకున్నాడు. కరుణాళువైన పరమాత్మ నేనే లింగాకారాన్ని వహించిన క్షేత్రంలో దీర్ఘకాలం తపస్సు చేయుమని ఆదేశించాడు. సృష్ట్యారంభం కాని ఈ దశలో అట్టిక్షేత్రం ఎక్కడ ఉందో తెలుపుమని ప్రార్థించాడు బ్రహ్మ. ప్రీతి చెందిన పరాత్పరుడు ‘‘చతురాననా! కైలాసం - మహాకైలాసం, పరకైలాసం, పరతరకైలాసం, దివ్యకైలాసం, ప్రాకృత కైలాసం అని ఐదు విధాలు. వీనిలో దివ్య కైలాసం బ్రహ్మాండ గోళానికి ఆవలఉంది. అది ప్రాకృత ప్రళయంలో కూడా నశింపదు. కారణం నేనాసమయంలో దానిని నాశూలాగ్రంపై నిలిపి ఉంచుతాను. ఆ కైలాసం వేయి శిఖరాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వానిలో మహోన్నతమైన శిఖరం శివానందైక నిలయం. దానిపై ఒకానొక కల్పంలో వాయుదేవుడు నాకై చిరకాలం తపస్సు చేయగా ప్రత్యక్షమైన నన్ను తానిచటలింగాకృతిని ధరించి యుంటాను. సర్వయుగాలలో మీరాలింగంలో సాన్నిధ్యంమై వాయులింగేశ్వరంగా నాకు ప్రసిద్ధి కలిగించండి. నాలో నున్న మిమ్ము కొలిచే వారికి సదా సర్వాభీష్టప్రదాయకులు కండి.’’ అని ప్రార్థించాడు. అలా నేను శివానందైక నిలయశిఖరంపై సాన్నిధ్యమై యున్న వాయులింగాన్ని అర్చిస్తూ నీవు తపస్సు నాచరించు. నా అనుగ్రహం వల్ల నీకు వెనుకటి సృష్టిరచనా సామర్థ్యాలు తిరిగి సిద్ధిస్తాయి.’’అని ఆదేశించాడు. అంటే ఆ వాయులింగేశ్వ్యర లింగాకారమై సాకారంగా కనబడే పరమాత్మ అష్ట మూర్తులలోని (పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు.) వాయు మూర్తియేనని అర్థం. దైవాజ్ఞానుసారం బ్రహ్మ అచ్చటనే తపస్సు చేయ నారంభించాడు. దయాళువైన పరమాత్మ బ్రహ్మ తపస్సునకు అనువుగా ‘‘కైవల్యము’’ అనే ఒక తీర్థాన్ని కల్పించాడు. అందు త్రిషవ (త్రిసంధ్యలలో) స్నానాది విధుల నిర్వర్తించుకొని, దానికి ఈశాన్యంగా రెండమ్ముల వ్రేటు దూరంలో గల (వేగంగా పోయిన బాణం పడునట్టి దూరం) వాయులింగాన్ని ఆరాధిస్తూ చతుర్ముఖుడు చిరకాలం తపస్సు చేసాడు. ప్రసన్నమైన దైవం ప్రత్యక్షం కాగా బ్రహ్మ మహదానంద పరవశుడై కింకర్తవ్యతా విమూఢుడయ్యాడు. పరమేష్ఠి దీనస్థితిని చూచి మహాదేవుడు ‘‘సారస్వతతీర్థ’’ మన్న ఒక సరస్సును కల్పించి అందలి నీటిని త్రాగుమని నిర్దేశించాడు. అట్లే ఆచరించిన బ్రహ్మకు మనోనైర్మల్యమూ,సృష్టిసామర్థం సిద్ధించగా సన్నుతించిన బ్రహ్మను దీవించి పరమాత్మ అంతర్ధానమయ్యాడు.
బ్రహ్మశివారాధన.. ఆ విధంగా సిద్ధించిన సృష్టి రచనా సామర్థ్యంతో కమలాసనుడు సర్వాంగ శోభితంగా చరాచర జీవజాలంతో చతుర్దశ భువన భాండాలను సృజించాడు. తదనంతరం ఆయనలో నేనే సర్వశ్రేష్ఠుడనన్న అహంకారం ప్రబలిపోయి తనను సృజించిన పరమేశ్వరారాధననే విస్మరించి విర్రవీగసాగాడు. సర్వగర్వాపహారుడైన పరమాత్మ మరల చతుర్ముఖుని శైవమాయా ప్రభావితుని చేసి నిస్తేజుని చేసాడు. దానితో దీనుడై పోయిన బ్రహ్మను చూచి పరాత్పరుడు అకాశవాణి రూపంగా‘‘పశ్చాత్తప్తుడవై పూర్వంవలె పరమేశ్వరారాధన చేయుమని’’ హెచ్చరించాడు. ఆ దివ్యాజ్ఞను తలదాల్చి పద్మభవుడు మరల పరమేశ్వరా రాధనలో నిమగ్నమయ్యాడు. కృపాళువైన పరమాత్మ ప్రత్యక్షమై‘‘పరమేష్ఠీ!పశ్చాత్తాపచిత్తుడవైన నీవు నా దయాపాత్రు డవయ్యావు. నీవు తపస్సు చేసిన ఆ శివానందైక శిఖరాన్ని భూలోకంలో స్థాపించి అచట తపస్సు చేయుము. తపస్సిద్ధి పొందిన నీ కచట సృష్ఠి సామర్థ్యాది సర్వశక్తులు అనుగ్రహింపగలను.’’ అని పలికాడు.
శ్రీకాళహస్తిలో శివానందైక నిలయ శిఖరస్థాపన.. శివమాయా ప్రభావితుడైన విరించి(బ్ర) తానే సృజించిన చతుర్దశ భువనాలను గుర్తింపజాలక శిఖరస్థాపన యోగ్యమైన భూలోక ప్రదేశాన్ని నిర్దేశింపుమని పరాత్పరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు బ్రహ్మ విన్నపాన్ని మన్నించి సప్తద్వీపాది విశాలమైన భూమండలాన్ని సవివరంగా వివరిస్తూ వాటిని దర్శింపచేసాడు. హిరణ్యగర్భుడు ఈశ్వరాజ్ఞానుసారంగా శివానందైక నిలయ శిఖరాన్ని చతుర్భుజాలతో ధరించి శిఖరస్థాపనకు యోగ్యమైన స్థలాన్ని అనే్వషిస్తూ భూలోకమంతా సంచరించసాగాడు. కానీ అట్టి స్థలాన్ని కనుగొనలేక చింతాక్రాంతుడై యున్న సమయంలో పరమాత్మయే దివ్యవాణి రూపంలో ‘‘కమలగర్భా! నీవిక్కడకు దక్షిణంగా పొమ్ము. ఆ శిఖరం నీవు మోయలేనంత భారవంతమై తనంత తానుగా నేలకు జారిపోగలదు. అదే ఆ శిఖర స్థాపనకు తగిన ప్రదేశం.’’ అని తరుణోపాయాన్ని చెప్పాడు. ఆ ప్రకారం బ్రహ్మ దక్షిణదిశకు రాగా ప్రస్తుతం శ్రీకాళహస్తి నెలకొనియున్న చోట శివానందైక నిలయ శిఖరం ఆయన చేతి నుండి జారి భూమిపై పడిపోయింది. దానిని పైకి లేపేందుకు చతురాస్యుడు ఎంత యత్నించినా సాధ్యం కాలేదు.అదే శివ ప్రీతికరమైన పవిత్రస్థలంగా తలంచి శతానందుడు(బ్ర) శివస్వరూపమైన శివానందైక నిలయుడైన పరమేశ్వరునకు నమస్కరించి పరమానందభరితుడై బహుధాసన్నుతులు చేసాడు. శివాజ్ఞానుసారం అందు గల బ్రహ్మతీర్థానికి (కైవల్య తీర్థం) దానికి అత్యంత సమీపాన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే ఈశ్వరుని పంచముఖాలతో కూడిన ఒక మహాలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించి వాయు లింగానికి రెండమ్ముల వ్రేటు దూరంలో నిలిచి వాయులింగేశ్వరుని కృపకై తపస్సు చేయనారంభించాడు. ఆ తపస్సు బ్రహ్మ తన కాలమాన ప్రకారం ఒకరోజు పాటు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు కొనసాగించాడు. సంప్రీతి చెందిన పరమేశ్వరుడు శివానందైక నిలయ శిఖరాన వాయులింగం నుండిస్వాయంభువ మన్వంతరంలోని కృతయుగంలో మాఘమాసశుద్ధమఖానక్షత్రయుక్తపూర్ణిమీ సోమవారం నాడు ఆవిర్భవించాడు. కైవల్యతీర్థం- సారస్వతతీర్థం---అందుకే దివ్యకైలాసంలోని శివానందైక నిలయ శిఖరంతో సహా శివపరమాత్మ స్వయంభువుగా అవతరించిన ఈ శ్రీకాళహస్తిక్షేత్రం సాక్షాత్తు దివ్యకైలాసమే. అయితే కేవలం దక్షిణదిశలో ఉన్న కారణంగా మాత్రమే ఇది దక్షిణకైలాసంగా శివక్షేత్రా లన్నింటిలో ప్రఖ్యాతి పొందింది. పౌరాణికంగానే గాక చారిత్రకంగా కూడా ఇది దక్షిణకైలాసమే. కుష్ఠవ్యాధిగ్రస్తుడవు కమ్మని మహేశ్వరునిచే శపింపబడి శాపవిముక్తికై పరమకైలాసాన్ని చేరుకోలేక దుఃఖితుడైయున్న నత్కీరుడికి పరమకైలాసమంతటి మహిమాన్వితమైన కైలాసమని కుమార స్వామి చెప్పి పంపింది దక్షిణకైలాసమైన శివానందైక నిలయమైనట్టి ఈ శ్రీకాళహస్తికే. అందుచేతనే దివ్య కైలాసంలో ఉన్న సారస్వత తీర్థాన్ని ప్రధానాలయ ప్రాంగణంలోనూ, దానికి వెలుపల కైవల్యతీర్థాన్ని నేటికీ మనం దర్శించి సేవించుకోవచ్చు. ఈ కైవల్యతీర్థానికి సమీపానే్న బ్రహ్మ స్థాపించిన పంచముఖ లింగం కూడా నేడు దర్శనమిస్తుంది. దాని పేరు ‘‘సదాశివలింగం.’’ ‘‘బ్రహ్మగుడి’’గా నేడు స్థానికులు పిలిచేది దానే్న. ఇచ్చటనే శివాజ్ఞానుసారం తపస్సుచేసి సకల సృష్టి సామర్థ్యాన్ని పొందాడు. ఆ సందర్భంలో పరమేశ్వర నిర్మితమైన ‘‘కైవల్యతీర్థం’’ బ్రహ్మ ప్రార్థన మేరకు ‘‘బ్రహ్మతీర్థం’’ గా ప్రసిద్ధికెక్కింది. ఇచట తపస్సు నాచరించి వాయులింగేశ్వరుని కృపాపాత్రుడైన కమలాసనుని కేవలం ధ్యానించినంత మాత్ర చేతనే సర్వజనులకు బ్రహ్మ లోకప్రాప్తి కలుగుతుంది.
శ్లో. త్వత్పూజారూపతపసోమత్సంకీర్తనంసకృత్,
క్రియతేయేనతస్యాస్తుమల్లోకే వసతి ధ్రువమ్. శి. ర. ఖం. అధ్యా. 16. శ్లో. 29.
ఇలా ధ్యానం చేసి సమీపాన గల సరస్వతీ తీర్థంలో నిత్య స్నాన విధులతోబాటు ఆ తీర్థజలాన్ని సంవత్సరకాలం పాటు పానంచేసిన వారి నోట సరస్వతి నాట్యమాడి సర్వజ్ఞత్వం నిశ్చయంగా సిద్ధిస్తుంది.
శ్లో. తీర్థే మదీయేయస్స్నాత్వాకృత్వామల్లింగదర్శనం,
శుభం సారస్వతం తీర్థం మనసా నిర్మితం పురా.
వాక్సిద్ద్యర్థం మమస్వామిన్ శుద్ధం పిబతినిత్యశః,
శ్రద్ధయా వత్సరం తస్య వాచి నృత్యతిమప్రియా.
శి.ర.ఖం. అధ్యా.16. శ్లో. 31,32.
శ్రీకాళహస్తి- ప్రాచీనత.. ఇలా స్వాయంభువ మన్వంతరంలో దివినుండి భువికి దిగిన ఈ వాయు లింగేశ్వర క్షేత్ర మహిమను గూర్చి ఎంతని కొనియాడగలం? ఈ స్వాయంభువ మనువు పదునాల్గుమంది మనువులలో మొదటివాడు. ఈతడు ప్రాకృత ప్రళయకాలంలో బ్రహ్మతోబాటు జన్మించిన వాడు. ప్రతి మనువు కాలంలో కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాల్గు (4320000 ఏండ్లు) డెబ్బది ఒక్కమార్లు ఆవృత్తవౌతాయి. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరం ఆ పదునాలుగింటిలో ఏడవది. దీనినిబట్టి శివానందైక నిలయ శిఖరం శ్రీకాళహస్తిలో స్థాపింపబడి ఎన్ని కోట్లకోట్లకోట్ల సంవత్సరాలు గడిచిపోయాయో మీరే లెక్కించుకోవచ్చు. ఈ మధ్యలో జరిగిపోయిన ఎన్నో త్రేతాయుగాలలో కన్నప్ప ఏ యుగంలోని వాడో వ్యాసుడు చెప్పలేదు. అయినా ప్రస్తుత యుగక్రమంలో త్రేతాయుగం వాడేనని భావించినా వ్యాసునకు భిన్నమైన ధూర్జటి వచనానికి గల ప్రమాణం పండిత విచారణీయమే. ఆ మాట అటుండగా పంచభూత లింగాలలో అగ్నిలింగంగల అరుణాచలం వయస్సును శాస్తజ్ఞ్రులు రెండువందల అరవైకోట్ల ఏండ్లనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్తవ్రేత్త బీర్బల్ సహాని నిర్ణయించారు. ఉపనిష ద్వచనానుసారం అగ్నికంటే వాయుభూతమేముందుది. (ఆకాశాద్వాయుః వాయోరగ్నిః). కాబట్టి అరుణాచలంకంటే ఈ వాయులింగం మరియు శివానందైక నిలయనిలయ శిఖరమూ ఇంకా ఎన్నోకోట్ల ఏండ్లు ముందునాటిది. వాయు లింగేశ్వర మాహాత్మం.. అప్పటి నుండి ఆయా యుగాలలో ఆ శైలాన్ని బ్రహ్మాది దేవతలు, యక్ష, కిన్నర,
కింపురుష, మహర్షులు సేవించారు. ఎందుకంటే అదిశివ పరమాత్మ బహిశ్శరీరమే. అంతేకాదు ఐదుశిఖరాలతో కూడిన ఆ శివానందైక నిలయం సాక్షాత్తు ఆయన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనబడే ఐదు ముఖాలే. (శి.ర.ఖం.అధ్యా. 10.శ్లో. 99.). ఇటువంటి శైలంపై వెలసిన వాయు లింగమంటారా అది వాయుదేవుడే లింగాకారాన్ని వహించగా అందు పరమేశ్వరుడు తన సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోధాన, శక్తులతో
కూడి స్వయంభువుగా వెలసిన మహాలింగం. (శి.ర.ఖం.5. అధ్యా.55,56. శ్లో.) కాబట్టి అది అనాదియూ, అచింత్యగుణోపేతమూ, స్వయంవ్యక్తమూ అయిన స్వయంభూలింగం. (శి.ర.ఖం.5అధ్యా.53. శ్లో.) కాశీలో మరణిస్తే ముక్తి (కాశ్యాం తు మరణాన్ముక్తిః) కానీ మహిమాన్వితమూ, అగణితకాలాన్వితమూ అయిన ఈ శివానందైక నిలయ శిఖరాన్ని, మరియు వాయులింగేశ్వరుని మానవులెక్కడున్నా గానీ కేవలం స్మరిస్తే చాలు వారు జ్ఞానిఐనా, అజ్ఞానిఐనా, చండాలుడైనా బ్రాహ్మణుడైనా, స్ర్తీలైనా పురుషులైనా, వారికి సకలపాపాలు నశించడమే కాదు జ్ఞాన వైరాగ్యాలు కూడా కలిగి సాక్షాత్తు శివసాయుజ్య వైభోగమే సిద్ధిస్తుంది.
శ్లో. శ్రీ మద్దక్షిణ కైలాసకీర్తనా దేవమానవాః, ముచ్యంతే, ఘోర సంసార బంధనా త్దేశాంతరగతాపి వా,
చండాలః పుల్కశోవాపి శ్రుత్వాదేశాంతరే సకృత్. (శి.ర.ఖం.4.అధ్యా. శ్లో. 66,67.).
శ్లో.శ్రీమద్దక్షిణకైలాసాభిఖ్యంస్థలవరోత్తమం,పునఃప్రోక్తాశేషముక్తినిదానంకథితంపరమ్,
జ్ఞానవైరాగ్యదం సాక్షాత్ శివ సాయుజ్య కారణం, తస్మాత్సర్వోత్తమం స్థానమిదమేవ మునీశ్వరాః.
(శి.ర.ఖం.అధ్యా.4. శ్లో.66,67.).
శ్లో. శ్రవణాన్ముక్తిదంశశ్వద్శాశ్వతైశ్వర్యశాలి చ,
లింగం వాయుమయం పూర్వ కల్పేవాయుప్రపూజితమ్. (శి. ర. ఖం. అధ్యా. 5. శ్లో. 57.)
దీనికి తార్కాణం శ్రీ,కాళ, హస్తి, కన్నప్పలే. విశేషమేమంటే మానవుల వలె దైవాన్ని స్మర్యిచి ముక్తి పొందలేని పశు, పక్షి, తరు, గుల్మాదులకు సహితం న్యిస్సశయంగా ఈ దైవం ముక్తిప్రదమే. (శి.ర.ఖం.4.అధ్యా.4.37,38.) ముక్తిప్రదాయకత్వంలో కాశీ విశ్వనాథుని వలే వాయులింగేశ్వరుడు ఈ క్షేత్రంలో మరణించిన వారికి దక్షిణ కర్ణంలో ప్రణవాన్ని ఉపదేశించి శివసాయుజ్యం ప్రసాదిస్తాడు.
శ్లో. ఆ సీత్శి వస్య కృపయాతత్ర క్షేత్రేవరేశుభే, మణిః ప్రణవ పర్యాయ వాచకః శంకరాత్మనః. శ్లో. 85.
నాన్యాత్మకఇతిస్పష్టఃసర్వవేదాంతడ్యిడిమఃతస్మాదహోతదారభ్యక్షేత్రేతత్ర మృత్యి,మునే!శ్లో. 86.
యే యాంతితేషామపి చ కర్ణే దేవోమణింశివః, తీరే మణికర్ణికాయాః స్థిత్వావర్ణయతిస్ఫుటమ్. శ్లో. 87.
(శి.ర.ఖం. అధ్యా.32.)
అట్టి మహామహిమాన్వితమైన తీర్థం కాశీలో వలెమణికర్ణికాతీర్థ మన్న పేరుతోనే ఈ క్షేత్రంలో విరాజిల్లుతూ ఉంది.ఆ తీర్థాన్నీ, అక్కడ మణికర్ణేశ్వర నామంతో వెలసియున్న వాయులింగేశ్వరుని, నేటికీ మనం దర్శించి, సేవించుకోవచ్చు. ..సువర్ణముఖరీ నది...దైవంతోబాటు ఇక్కడ ప్రవహించే సువర్ణముఖీ నది కూడా కాశీలో ప్రవహించే గంగానదివలె ఊత్తరవాహినియే. మరియు గంగను భగీరథుని వలె అగస్త్యునిచే దివి నుండి భువికి గొనిరాబడిన దివ్యనది అది. అందుకే సువర్ణముఖి గంగవలె ముక్తిప్రదాయిని.
శ్లో. యత్రాస్తి స్వర్ణముఖరీ పాప ప్రణాశినీ, ఉత్తరాభిముఖీ భూత్వాయత్ర ప్రవహతిస్వయమ్,
తత్పూర్వతీరే విపులే సర్వసస్య మనోహరే, స్థలం కైలాసాభిదం ముఖ్య స్థలేషుతత్
...అతీవశోభతే వ్స సర్వనిర్వాణ కారణమ్9. (శి.ర.ఖం. అధ్యా. 5. శ్లో. 41,42,43.)
మోక్షం కోరుకునేవారు ఇట్టి తీర్థ, క్షేత్ర, రాజమైన శ్రీకాళహస్తికే పోయి అక్కడ గలసువర్ణముఖీనదిలో
శ్లో. ఆగస్త్యా చల సంభూత్యా పూర్వసాగరగా మిన్యీ, సమస్తపాప హంత్య్రీత్వాం సువర్ణముఖరీంశ్రయే,
శ్లో. మహాపాతకవిప్లుష్టం గాత్రం మమ శుభోదకైః, క్షాళయామి జగద్ధాత్రీశ్రేయసాపూరయస్వ మామ్.
అంటూసంకల్పపూర్వకంగాస్నానమాచరించిశివానందైకనిలయాన్ని,శ్రీవాయులింగేశ్వరునిసేవించండని
శ్లో. ఫలం యః శ్రుతయోఃముఖ్యాఃప్రమాణేషు వదంతిహి,
తస్మాత్తత్రైవగంతవ్యంమోక్షమక్షతమిచ్ఛతా.(శి.ర.ఖం.4.అధ్యా.72.శ్లో)
వ్యాసుడు, సకలపాప పశుసంహారకుడూ, సర్వ ప్రపంచకారణుడూ అయిన పరమాత్మ మోక్షప్రదాతయై శ్రీకాళహస్తిలోని శివానందైక నిలయ శిఖరంపై నుండి వాయులింగేశ్వరుడూ, గొంతెత్తి ఆహ్వానిస్త్యుడగా శివభక్తులారా!
శ్రీకాళహస్తిని దర్శించి సేవించేందుకు రండి రండి. బ్రహ్మతీర్థాన్ని, సారస్వత తీర్థాన్ని సేవించి ధన్యులకండి.