ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -10
Published Sunday, 16 February 2020అందరూ ఆ న్యూస్ కవరేజ్ కోసం ఎలర్టయ్యారు.
రిపోర్టర్సందరి మనోభావాల్ని ప్రశ్నగా మలచి వదిలాడొక విలేకరి. ‘‘ఏ కేసుని ఓపెన్ చేయబోతున్నారు?’’ అని. సమాధానం కోసం చెవులు రిక్కరించారు.
ఉత్తేజభరితమైన ద్వివేది పెదాల నుండి ఉద్వేగభరితంగా వెలువడ్డాయా మాటలు. ‘‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ కేసు’’.
ఉలిక్కిపడ్డారంతా. రోమాంచితమైన శరీరాలతో ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నారు.
‘‘ఆ కేసు క్లోజ్ చేశామని ప్రకటించారుగా?’’ సందేహం వెలిబుచ్చారెవరో.
‘‘వాస్తవానికా దోపిడీ కేసు క్లోజ్ చేయబడలేదు... జస్ట్... పెండింగ్‌లో పెట్టబడింది అంతే.’’
‘‘బ్యాంక్ దోపిడీకి గురయ్యాక కేసు దర్యాప్తు బాధ్యత సి.బి.సి.ఐ.డి వారికి అప్పగించబడిందిగా, మళ్లీ వాళ్లే దర్యాప్తు కొనసాగిస్తున్నారా?’’
‘‘లేదు మా పోలీసు డిపార్ట్‌మెంట్.’’
‘‘ఎందుకు?’’
వౌనం వహించాడు.
‘‘దేశంలోనే పెద్ద పరిశోధనా సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) వంటి సంస్థలే అవినీతికి, లంచాలకు, బ్లాక్‌మెయిలింగ్‌కి నిలయాలుగా పేరుపొందాయని పేరుంది కదా. అలాగే సి.బి.సి.ఐ.డి అందుకనే ఈ విచారణ సంస్థకి ఈ కేసు దర్యాప్తు సాధ్యం కాలేదంటారా?’’
చప్పున ఏం చెప్పాలో అర్థం కాలేదాయనకి.
పోనీ నేరస్థులతో లాలూచీ పడి కేసుని పెండింగ్‌లో పెట్టారంటారా?’’ అని ఈలోగా మళ్లీ ఎవరో విలేకరి అన్నాడు.
‘‘నో. సి.బి.సి.ఐ.డి దర్యాప్తు బృందం యొక్క శక్తి సామర్థ్యాల్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మీరు అనవసరంగా నిందారోపణ చేస్తున్నారు’’ ఆవేశపడిపోతూ కాస్త తీవ్రంగానే బదులిచ్చారాయన.
‘‘మరెందుకని మీ డిపార్ట్‌మెంట్ టేకప్ చేసిందీ కేసుని?’’ ఆయన్ని ఇరకాటంలో పడేయాలన్న తలంపుతో ప్రశ్నించాడింకొకాయన.
‘‘కేవలం ఎలాంటి ఆధారాలూ, సాక్ష్యాలు లేవని, లభ్యం కాలేదని ఆనాడు సి.బి.సి.ఐ.డి. చేత కేసు పెండింగ్ పెట్టబడి అలా మరుగున పడింది. అంతే తప్ప మరో కారణం కాదు. పోతే సి.బి.సి.ఐ.డి. వారి దర్యాప్తులో దొరకని సాక్ష్యాధారాలు మా డిపార్ట్‌మెంట్‌కి దొరికే అవకాశం ఉందని భావించడం వల్ల కేసుని మేం టేకప్ చేశాం. మా డిపార్ట్‌మెంట్ కోణం నుండి పరిశోధన కొనసాగిస్తే ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువని మేం అనుకొంటున్నాం.’’
‘‘ఇంతకీ మీ డిపార్ట్‌మెంట్ నుండి ఈ దర్యాప్తుకి నడుం కట్టిందెవరు?’’
‘‘ఈ కేసుని తన సొంత రిస్క్‌తో టేకప్ చేసి విజయం సాధించడానికి సాహసించబోతున్నది మరెవరో కాదు. రియల్ హీమాన్ అంటూ మీ మాస్ మీడియా రంగాలన్నీ పొగడిన యస్సై వేదవ్యాస్.’’
ఆయన ప్రటించడం ఆలస్యం కెమెరాలన్నీ వ్యాస్ వైపు తిరిగాయ్.
వేదని ప్రశ్నలతో ముంచెత్తడానికి రిపోర్టర్సంతా సమాయత్తమవుతున్నారు.
* * *
గాలం తన ప్రాణాల్ని హరిస్తుందని తెలిసీ ఎర కనిపించగానే దానికి ఆశపడి గాలానికి చిక్కిపోతుంది చేప. అది ఆ జలచర నైజం.
ఈ నేరమయ ప్రపంచంలో ఎదుటివారి ట్రిక్కులికి ప్రలోభపడి ఎన్నో సార్లు ఏదో ఒక విధంగా మోసాల వలలో పడి చింతిస్తూనే ఉన్నారు జనం. ఒకసారి జరిగిన పరాభవాన్ని గుణపాఠంగా మలచుకొని తెలివిగా వ్యవహరించాలన్న జ్ఞానమే నశించిపోతోంది. శతాబ్దాలు గడిచినా మార్పు జరగడం లేదు ఈ విషయంలో. ఈ నిరంతర చైన్ సిస్టమ్‌లో నివేదిత కూడా తనకి తెలియకుండానే ఓ పార్టీ కాబోతోందనడానికి నిదర్శనంగా జరిగిందొక సంఘటన.
అదేమిటంటే-
వంట పనంతా ముగించేసుకుని అఖిల్‌ని రెడీ చేసింది నివేదిత. పదకొండవుతోందప్పుడు. నిట్టూకి జ్వరంగా ఉండడంతో స్కూల్‌కి పంపలేదు. బలవంతంగా ఇంట్లో ఉంచేసింది. వాడు వెళ్తానంటే వారించి, గృహలక్ష్మి ఏజెన్సీకి సంబంధించిన పాంప్లెట్‌ని ఫైల్లోంచి బయటకు తీసింది. దాని చివరన ఉన్న అడ్రస్ ఒకసారి చెకప్ చేసుకుంది. బీరువాలోంచి కొంత క్యాష్ తీసి పాంప్లెట్‌తో పాటుగా హ్యాండ్‌బ్యాగ్ సర్దింది.
క్షణంలో డ్రెస్ మార్చుకొని అఖిల్‌ని వెంటేసుకుని బయటపడింది.
పదిహేను నిమిషాల్లో గృహలక్ష్మి ఏజెన్సీస్ ముందు ఆటోలోంచి దిగింది. అక్కడ విపరీతంగా జనం ఉన్నారు.
ఆ జనమంతా సగం ధరలకే గృహోపకరణాలు అనే ప్రకటనకి ఆకర్షితులై వచ్చిన వాళ్లు, అందులో ముప్పాతిక మంది స్ర్తిలే ఉన్నారు.
నివేదిత అక్కడి వాతావరణాన్ని నిశితంగా పరిశీలించింది. అక్కడ మూడు కౌంటర్స్ కనిపించాయి. సెకండ్ కౌంటర్ దగ్గర ఉన్న క్యూలో జాయినయ్యింది. దాదాపు గంట గడిచాక ఆమె వంతు వచ్చింది.
కౌంటర్‌లో వస్తువు నమోదు చేయించి, దాని ఖరీదులో సగం క్యాష్ పే చేసి రిసీప్ట్ తీసుకుంది. ఫ్రిజ్ ఇష్యూ తేది ఆ రోజుకి ఇరవై అయిదవ నాడు వేయబడి ఉంది. ఆ రోజున వచ్చి ఫ్రిజ్ తీసుకుపోవచ్చు. ఆ నెక్స్ట్ మంత్ నుండి వరుసగా ప్రతి నెలా మిగతా ఎవౌంట్‌ని డివైడ్ చేసినట్లుగా పే చేయాల్సి ఉంటుంది. అదీ ప్రొసీజర్.
రిసీప్ట్ తీసుకున్నాక ఒకసారి ఏజెన్సీ చైర్మన్‌ని కలవాలని చైర్మన్ గదిలోకి వెళ్లింది. చైర్మన్ చైర్‌లో ఓ యువతి కూర్చుని ఉంది. బాబ్డ్ హెయిర్ కటింగ్‌లో స్టయిలిష్‌గా ఉంది. ముప్ఫై - ముప్ఫై అయిదు మధ్యన ఉండే తన వయస్సుని ఓ పదేళ్లు తగ్గించుకోవాలన్న తాపత్రయం ఆమె డ్రెస్సింగ్‌ని బట్టి తెలుస్తోంది. చూడగానే ఆ విషయం అర్థమైంది నివేదితకు.
నివేదిత రాకను గమనించి ‘‘రండి కూర్చోండి’’ అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది.
వచ్చి కూర్చుంది నివేదిత.
కస్టమర్స్‌కి సంబంధించిన ఫైల్ చూడ్డం ఆపి ‘‘చెప్పండి’’ అంది తలెత్తి చూస్తూ.
‘‘నా పేరు నివేదిత. డిగ్రీ హోల్టర్‌ని. మా వారు అగ్రికల్చర్ ఆఫీసర్. మీ అడ్వర్టయిజ్‌మెంట్ చూసి మీ స్కీమ్‌లో పార్టిసిపేట్ అవ్వాలని వచ్చాను’’ తనని తాను పరిచయం చేసుకుంది.
‘‘నా పేరు...’’
ఆవిడ చెప్పబోయేంతలో ‘‘మిస్ శకుంతల’’ అని తనే చెప్పింది నివేదిత నవ్వుతూ.
ప్రశ్నార్థకంగా చూసింది చైర్మన్.
‘‘మీ నేమ్ ప్లేట్ చూసి చెప్పా’’అంది వేలు పెట్టి ఆవిడ టేబుల్ వైపు చూపిస్తూ.
నివేదిత చురుకుదనానికి అబ్బురపడింది శకుంతల.
ఆమె ఎడ్యుకేటెట్ కావడంతో పరిచయం పెంచుకోవడం తన బిజినెస్‌కి ఎంతో అవసరం ఉంటుందన్న ముందుచూపుతో శకుంతల సంభాషణ కొనసాగించిందిలా.
‘‘ఎంతమంది పిల్లలు?’’ అడిగింది.
‘‘ఒక్క బాబు’’ అంటూ పక్కకు చూసింది నివేదిత.
అఖిల్ అక్కడ లేడు. బయటే ఉండిపోయాడు.
‘‘నిట్టూ లోపలికి రా నాన్నా’’ పిలిచింది రమ్మని చేత్తో సైగ చేస్తూ. లోపలికి అడుగు పెట్టాడు వాడు.
వచ్చీ రావడంతోనే వాడి దృష్టి శకుంతల మీద పడింది. ఆవిడ కూడా చూసిందా కుర్రాడి వైపు. లిప్తకాలం పాటు అసంకల్పితంగా చూపులు కలిశాయి. ఆ పిల్లవాడి కళ్ల నుండి ఏదో సంకేతం తన కళ్లని చేరిన ఫీలింగ్ కలగడంతో తత్తరపడిందామె. క్షణంలో తన కంగారుని కప్పిపుచ్చుకుంది. కానీ పెద్దగా పట్టించుకోలేదా విషయాన్ని.
సీరియస్‌గా తీసుకొని అఖిల్ వివరాలు ఆరా తీయించి పరిశీలిస్తే తెలిసి ఉండేదామెకి. వాడెంతటి అద్భుత బాలుడో.
ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టి ఉండేది. తగు జాగ్రత్తలో తానుండేది. కనీసం జరగబోయే అనర్థాన్ని ఊహించడానికైనా ఆస్కారం ఉండేది. కానీ మిస్సయ్యిందామె.
శకుంతల నుండి చూపులు మరల్చుకొని అఖిల్ తల్లి ఒడిలో చేరి గువ్వలా ఒదిగిపోయాడు.
‘‘వీడేనండి మా బాబు. పేరు అఖిల్.’’
‘‘బావున్నాడు’’ అంది.
ఆ గదిని పరిశీలనగా చూడడంలో నిమగ్నమైపోయాడు వాడు.
‘‘ముగ్గురు ఆడపడుచుల పెళ్లిళ్లు చేసి, ముగ్గురు మరుదులు ఉద్యోగస్థులయ్యేంత వరకు ఉమ్మడిగా ఉండడంతో ఇప్పటి వరకూ ఆర్థికంగా పుంజుకోలేకపోయాం. అందుకే ఖరీదైన వస్తువులేం కొనుక్కోలేకపోయాం. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ఒక స్కూటర్ కొన్నాం. ప్రస్తుతానికి ఫ్రిజ్ కావాలనుకుంటున్నాం సగం డబ్బు చెల్లంచానండి. 165 లీటర్ల నేవీ బ్లూ కలర్ ఫ్రిజ్ కావాలండి’’ తను ఆ స్కీమ్‌లో చేరడానికి గల నేపథ్యాన్ని వివరించింది నివేదిత.
‘‘మీరే మోడల్ కోరినా, కంపెనీ ఏదైనా, మీరు ఆశించినట్లుగానే ఆయా వస్తువుల్ని మీకు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.’’
‘‘్థంక్స్...’’
‘‘ఇంతకీ ఏ కంపెనీ కావాలి.’’
అప్లికేషన్ ఫారమ్‌లో ఆ వివరాలన్నీ ఉంటాయని తెలిసినా సంభాషణ కొనసాగింపు కోసం అడిగింది శకుంతల కావాలనే.
ఒక కంపెనీ పేరు చెప్పింది.
‘‘గుడ్ సెలక్షన్’’ తనదైన ధోరణిలో ప్రశంసించింది.
బదులుగా నవ్వింది నివేదిత.
‘‘ఈ రోజే మీరు మనీ పే చేశారు కదా. వారం రోజుల్లో మా ఆఫీసు నుండి మీకు ఒక అప్లికేషన్ ఫారమ్ వస్తుంది. మీరు కోరే మోడల్, కలర్, కెపాసిటీ తదితర వివరాలని అందులో మెన్షన్ చేసి ఆ ఫారమ్‌ని మాకు రీ పోస్ట్ చేయవలసి ఉంటుంది చెప్పింది శకుంతల.
‘‘తెలుసుకున్నానండీ ముందుగానే’’ అంది నివేదిత.
‘‘వెల్ మీ లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మా బిజినెస్‌లో పార్టిసిపేట్ కావడం హర్షణీయం. మీతో పాటుగా మీ కాలనీ వాళ్లని మీ హజ్బెండ్ కొలీగ్స్‌నీ కూడా మా సేవలు అందుకునేలా చూడండి’’ అంది ప్లీజింగ్‌గా.
‘‘తప్పకుండా. బై ది బై! వెళ్లొస్తానండి’’ లేచి నిలబడింది నివేదిత.
‘‘ఉండండి, టీ రాబోతోంది’’ అంది వారిస్తూ.
‘‘్ఫర్వాలేదు. ఏమనుకోకండి. ఇంకా షాపింగ్ చేయాల్సి ఉంది’’ అని చెబుతూ అఖిల్‌ని తీసుకొని బయటకు నడిచింది.
* * *
‘‘దేశంలో ఇటీవలె వెలుగు చూసిన జె.యమ్.యమ్ ముడుపులు, చైన్ హవాలా కేసులపై అంత పెద్ద సి.బి.ఐ. పరిశోధనలే నత్తనడక నడుస్తూ దాని వైఫల్యాన్ని సూచిస్తున్నాయి కదా. అలాగే ఈ మనీ మనీ బ్యాంక్ దోపిడీ దర్యాప్తు ఇన్ని సంవత్సరాల తర్వాత కొనసాగుతోందా? ఈ సాగతీత ధోరణి కారణంగా కీలకమైన సాక్ష్యాలు అదృశ్యమయ్యే అవకాశాలు లేవంటారా? మరాలంటప్పుడు పరిశోధన ఎలా కొనసాగించగలరు?’’ అంటూ అడుగడుగునా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ని ఏకుతూనే గుక్క తిప్పుకోనీయకుండా వేదవ్యాస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
వేద పెదాలపై చిరునవ్వు మెరిసిందో క్షణం. నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు.
‘‘ఇంతవరకు ప్రాథమిక సాక్ష్యాలు సైతం లభ్యమవ్వలేదు. అలాంటప్పుడు సాక్ష్యాలు అదృశ్యమవుతాయని మీరనడంలో అర్థం లేదు. బట్ వన్ థింగ్ వుయ్ హావ్ టు రిమెంబర్ నో, నేరస్థుడు ఎంత తెలివైన వాడైనా, నేరాన్ని ఎంత పకడ్బందీగా చేసినా ఎక్కడో ఒక చోట తప్పు చేయకుండా ఉండలేడని నేర చరిత్ర చెబుతోంది. నిజంగా అది సహజం. నేరం చేస్తున్నప్పుడు ఆ నేరస్థుడి వలన దొర్లే పొరపాట్లే అతడిని చట్టానికి పట్టిస్తాయి.’’
వేద మాటలు ప్రతిధ్వనించాయా హాల్లో.
(ఇంకా వుంది)