రైల్వే ప్లాట్‌ఫామ్
Published Sunday, 2 February 2020
నగర నడిబొడ్డు కాదు
కాస్తా శివారు ప్రాంతం
అడపాదడప
పట్టాలపైకి చుట్టంలాగా
కూతపెడుతూ
గూడ్సు - పాసింజర్
ఆకుపచ్చని
పలుకరింపుగా...
ఉదయం సాయంత్రం
ఆరింటికి
కాస్తా అటుగాఇటుగా
అరమైలుకు మేర
ఉత్తర దక్షిణ
ధృవాలుగా విస్తరించిన
ప్లాట్ ఫామ్‌పై
ఆరు పదుల కోలాహలం
కడుపు పంట
విదేశాలకు
ఎగుమతి అయితే
బరువైన గుండె
పదిలము కోసం
నమ్ముకున్న
చేతికర్ర ఊతంగా
ఆత్మ బంధువులైన
మలిదశ మిత్రుల
సహచర్యముగా
నడక వ్యవసాయం
ఏడు దాటిందో లేదో
తన నియంత్రణలో ఉన్న
శ్వాసక్రియ
కనుమరుగవుతుంటే
బోసిపోయిన
రైల్వే ప్లాట్‌ఫామ్
బేలగా తిరిగి
ఆరింటికై ఎదురుచూపు
*