S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమ్మక్క అంగరక్షకురాలు గట్టమ్మ

గిరిజన వన దేవతలు శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే క్రమంలో మేడారం జాతర వివిధ మార్గాల్లో ప్రతిష్ఠితమైన అనుబంధ దేవత ‘‘గట్టమ్మ తల్లి’ని భక్తులు దర్శించుకుని తనివితీరా భక్తి పారవశ్యంతో మొక్కుకొని అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి, అడవి మార్గాల్లో జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమనగర్ (గట్టమ్మ పల్లి) వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క, సారలమ్మల దేవతలు అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహా మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాతృలై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో చల్లగా వర్థిల్లుతున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు.
ములుగు గట్టమ్మ తల్లి
వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి గుడులు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం, మేడారం ములుగు మార్గంలో ఉన్న ఈ తల్లిని ముందుగా దర్శిచుకుని తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారంకు వెళతారు. ఈ తల్లి పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు.
చారిత్రక నేపథ్యం
ఇంతకూ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏమిటి? ఆ తల్లి చరిత్రను తెలుసుకోడానికి ప్రతీ భక్తుడు ఆరాటపడుతాడు, ఆసక్తిగా తెలుసుకుంటాడు. సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, సోమక్క, లక్ష్మక్కలు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తితో మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం భీకర యుద్ధం సాగించిన క్రమంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా అసమాన, ధైర్య, శౌర్య, పరాక్రమాలతో, అనుపమ త్యాగశీలంతో శతృవులతో రణం చేసి గొప్ప యుద్ధవీరవనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది. గట్టమ్మతల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శతృవుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. ఈ అమర వనవీరులతో పాటు మేడారం యుద్ధ అమరవీరులు గండ్రగొడ్డలి బాలగోము బాలకుమారస్వామి, దూలిమిత్తి, కొలకాడు సీతారామన్న కాసాలనాయుడు, ఉయ్యాల బాలుడు, గట్టమీది ముసలయ్య, ముసలమ్మ, కృష్ణస్వామి, పోతరాజు తదితరులకు కూడా గుళ్ళు కట్టి గొప్ప జాతరలు నిర్వహిస్తున్నారు.
సమ్మక్కకు నమ్మినబంటు
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి, సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లనేనని చెబుతారు. అందుకే శ్రీ ఆంజనేయస్వామి నమ్మినబంటు కావడం వల్లనే శ్రీ రామునితో సమానంగా, శ్రీ నందీశ్వరుడు శివశంకరునితో సమానంగా పూజలందుకుంటున్నట్లుగా, శ్రీ గట్టమ్మతల్లి నమ్మినబంటు కావడం వల్లే శ్రీ సమ్మక్క, సారలమ్మ తల్లులతో సమానంగా పూజలందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు.
పెరుగుతోన్న భక్తులు
గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం మెండుగా నాటుకుపోవడంతో ములుగు సమీపానగల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య దినదినం పెరుగుతోంది. మంచి భర్త దొరకాలనీ, పెళ్ళికాని అమ్మాయిలూ, సంతానం కావాలనీ పలువురు మహిళలూ, మంచిగా పంటలు పండాలనీ రైతులూ, తమ బిడ్డల్ని చల్లగా కాపాడాలని తల్లిదండ్రులు, తమ దీర్ఘకాలిక రోగగాలు నివారించబడాలనీ రోగులు, తమ కష్టాలు మటుమాయం కావాలని పలువురు, తమకు మంచి చదువులు, తద్వారా మంచి ఉద్యోగాలు రావాలని విద్యార్థినీ విద్యార్థులు అనేకమంది ఇలా ప్రతి ఒక్కరు తమ సమస్యల్ని పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలు సాధించుకుంటున్నరు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరోశక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. కాగా 2020, ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో ములుగు జిల్లా సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు.. వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చే కోట్లాది భక్తులు మార్గమధ్యంలోని గట్టమ్మ తల్లికి తొలి పూజలు చేసే సందర్భంలో.. గట్టమ్మ తల్లి గుళ్ళు జనసముద్రంతో మరో మేడారం జాతరను తలపిస్తుంది.
సమ్మక్క ఆడపడుచు లక్ష్మీదేవక్క
మేడారంలోని సమ్మక్క, సారలమ్మ దేవతలకు పూజూరులున్నట్లే పరివార వనదేవతలకు సహితం ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని నగరం పల్లిలో సమ్మక్క తల్లి ఇంటి ఆడపడుచు లక్ష్మీ దేవక్కకు పూజారులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పూర్వకాలంలో ప్రాచుర్యంలోకి రాలేదు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు నగరం పల్లి నుండి లక్ష్మీదేవక్క, ఆమె భర్త కృష్ణస్వామి, మరిది పోతురాజుల విగ్రహాలుజాతరా తొలిరోజు గద్దెలపైకి వచ్చే ప్రక్రియ మొదలవుతుందని గిరిజనులు చెబుతారు. గనరం పల్లిలోని నాయకపుపోడ్‌వారు రెడ్డి, మేకల తదితర వంశాల వారి ఆధ్వర్యంలో దేవతల పూజా కార్యక్రమాలు జరుపుతారు. ఈ గ్రామ నాయకపువారు గిరిజిన సంప్రదాయరీతిలో ఆ దేవతలకి రెండు గుళ్ళు కట్టుకున్నారు. సదరు నాయకపుపోడ్‌వారు గ్రామం నుంచి మేడారం జాతరకు రెండు రోజుల ముందు నుండే దేవతల విగ్రహాలతో, పూనకాలతో, నియమ నిష్టలతో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళతారు. బూర్గుపేట, పొట్లాపురం, కాల్వపల్లి, దూదేకుల పల్లి మీదుగా మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెలను చేరుకుంటారు. వీరితో పాటు ఆ దేవతల్లి ఏలుకునే గుర్రంపేట, బూర్గుపేట, వజిన పల్లి, జంగేడు, కాళేశ్వరం, మంగపేట, ఏటూరునాగారం తదితర ప్రాంతాల నుంచి నాయకపుపోడ్ పూజారులు లక్ష్మీదేవక్క, కృష్ణస్వామి, పోతురాజు విగ్రహాలు తెచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ విగ్రహాల ప్రతిష్టలో మొదటి అవకాశం తమదేనని నగరం పల్లి నాయకపుపోడ్ పూజారులు చెబుతారు.
వారికే ఎందుకు?
కాకతీయులలో జరిగిన యుద్ధంలో సమ్మక్క కూతురు సారలమ్మ భర్త పగిడిద్ద రాజు, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజుతో పాటు ఆడపడుచు లక్ష్మీ దేవక్క కూడా వీరోచితంగా పోరాడి యుద్ధంలో వీరమరణం పొందారు. సమ్మక్య సైన్యం మరణించడంతో మేడారమంతా శ్మశానంగా మారింది. యుద్ధంలో మిగిలిన కొంతమంది మేడారం వదిలి దూరప్రాంతాలకు వలస వెళ్ళారు. ఆ క్రమంలో మిగిలిన లక్ష్మీదేవక్క కుటుంబం నగరం పల్లి, బూర్గుపేట, గుర్రంపేట, వజినపల్లి, జంగేడు, కాళేశ్వరం, మంగపేట, ఏటూరునాగారం, ములుగు తదితర గ్రామాలకు వలస వెళ్ళింది. ఈ నేపథ్యంలో తొలుత జాతర నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా నగరం పల్లి నుండి లక్ష్మీదేవతను కొలువడానికి రెడ్డి, మేకల వంశం వారు గద్దెలపైన విగ్రహాల ప్రతిష్ఠ బాధ్యతను తీసుకుని పూర్వం నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఒక్కొక్క వంశానికి ఒక్కో బాధ్యత
బుధవారం సారక్కను తెచ్చే బాధ్యతను కనె్నపల్లి నుంచి కాకవంశంవారు నిర్వహిస్తున్నారు. పగిడిద్దరాజును ఆయన సొంత గ్రామం పూనుగుండ్ల నుంచి పెనుక వంశంవారు తెస్తారు. జంపన్నను మేడారం నుంచి సిద్దబోయిన వంశంవారు, గోవిందరాజు, నాగులమ్మలను వారి సొంత గ్రామం కొండాయి నుంచి దబ్బకట్ల వంశంవారు తీసుకొస్తారు. సమ్మక్క తల్లి పసిబిడ్డగా దొరికిన పడిగపురం వనగట్టు నుండి వనదేవతలను కొక్కెర, మల్యాల వంశీయులు మేడారంలోని చిలుకల గట్టు నుంచి తెస్తారు. చందయంపలి, కొక్కిరి, సిద్ధబోయిన, బంగారి, మల్లెల వంశాలవారు తీసుకురావడానికి బాధ్యతలు తీసుకున్న క్రమంలో గణపురం మండలం నగరం పల్లి నుండి మేకల వంశం వారు లక్ష్మీదేవక్క, కృష్ణస్వామి, పోతురాజు వనదేవతలను గద్దెల మీదకు తీసుకురావడానికి బాధ్యతలు తీసుకుని ఆ మేరకు పూర్వకాలం నుంచి ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మల మహాజాతర మేడారంలో 2018, జనవరి 31, ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో జరుగుతున్న క్రమంలో జనవరి 25న నగరం పల్లి నుంచి లక్ష్మీదేవక్క పరివార దేవతల విగ్రహాలను తీసుకుని మేడారం బయలుదేరుతున్నట్లు పూజారులు తైదం సారయ్య, బుచ్చాలు, మంగపోషయ్య, మేకల కైలాసం, మంగ భీమయ్య, మేకల సంపత్, తైనం లక్ష్మయ్య, చేనుచంద్రు, మేకల లక్ష్మయ్య, మంగ మల్లయ్య, సీతయ్య, నరేష్, లచ్చులు, సాంబయ్య, మల్లేష్ తదితరులు తెలిపారు. తాము మేడారంకు రాను పోను కాలినడకన ఐదురోజులు పడుతుందని చెప్పారు. లక్ష్మీదేవక్కను తాము తమ ఇలవేల్పుగా సమ్మక్క, సారలమ్మల వలే కొలుస్తామన్నారు. లక్ష్మీదేవక్క శక్తి దేవతై కోరినవారికి కొంగుబంగారంగా వరాలిచ్చే తల్లి దేవత అయినందుననే ఆ దేవతను నమ్ముకున్నవారు మేడారం మార్గమధ్యంలోని పల్లెల్లో అనేకమంది భక్తులు కానుకలు, నగదు రూపేనా వేస్తుంటారని చెప్పారు. ఆ డబ్బును తాము జాతర తల్లి దేవతల పేరున ఖర్చు చేస్తామని చెప్పారు. ఆ డబ్బు నుంచి ఒక్క రూపాయి మిగలకుండా ఖర్చుచేసి గ్రామానికి తిరిగి వస్తామని నగరం పల్లి లక్ష్మీదేవక్క నాయకపోడ్ పూజారులు తెలిపారు.
వనదేవుళ్ళ పూజారుల వంశాలు
‘మేడారం వనదేవతల (వనవీరులు) పూజారుల వంశాలు ఇలా ఉన్నాయి. సమ్మక్కను ‘సిద్ధబోయిన, చందా, కొక్కెర’ వంశస్తులు, సారలమ్మను ‘కాక’ వంశస్తులు, అలాగే గుట్టమీది ముసలయ్య(అనువారి కన్నయ్య)ను ‘తవిటి’ పగిడిద్దరాజును ‘పెనక’, గోవిందరాజును ‘దబ్బకట్ల’, బాలగోముడు(బాలకుమారస్వామి)ను ‘కొటెం’, గుంజేడు ముసలయ్యను ‘తోలెం’, బంగారు వజ్జయ్యను ‘వజ్జ’, కొమ్మాలమ్మను ‘వాసం’, గుండం మీది రామక్కను ‘గట్టి’, పాలంపేటరామక్కను (కొలిచేసంతలు లేదు), గట్టమ్మను ‘నాయకపోడు’, సూరక్క, మారక్కను ‘నాలి’ వంశస్తులు అనాదిగా దైవాలుగా కొలుస్తూ పూజారులుగా వ్యవహరిస్తున్నారు.
సమ్మక్క సారలమ్మల ఉపజాతరలు
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్కపై సారలమ్మల జాతరకు దూర భాగంతో, వ్యయప్రయాసలతో వెళ్ళలేని భక్తులకు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో తల్లి దేవతల ఉపజాతరలు అనేకం వెలిశాయి. వెలుస్తూనే ఉన్నాయి. అందిన సమాచారం ప్రకారం ఉపజాతరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగ్రం పహాడ్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూర మండలం ఆగ్రం పహాడ్‌లో రెండో అతి పెద్ద సమ్మక్క-సారలమ్మ జాతరా పూర్వం నుండి జరుగుతోంది.
గుర్రంపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుర్రంపేటలో వైభవోపేతంగా జాతర జరుగుతుంది. సమ్మక్క తల్లి పుట్టింది గుర్రంపేట, మెట్టింది మేడారంగా స్థలపురాణం ఉండడంతో గుర్రంపేట జాతరకు విశిష్టత ఏర్పడింది.
మద్దిమేడారం జాతర: ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లచెల్లి మండలం, నాగరాజుపల్లి శివారులోని మద్ది మేడారంలో జరుగుతోంది.
లింగం పల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపురం మండలం లింగంపల్లి సమ్మక్క సారక్క జాతర నిర్వహించబడుతోంది.
శంకర పట్నం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండల కేంద్రంలో చాలా ఏళ్ళుగా జాతరను నిర్వహిస్తున్నారు.
గుమ్లాపూర్, రాగంపేట గ్రామాల్లో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం గుమ్మాపూర్, రాగంపేట గ్రామాల్లో జాతర జరుగుతోంది.
అమ్మవారి పేట: వరంగల్ జిల్లా ఉర్సు శివారు అమ్మవారి పేట దామెర గుట్ట వద్ద జాతర జరుగుతోంది.
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని రంగనాయకుల గుట్ట వద్ద సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది. అలాగే మాదన్న పేటలో జరుగుతోంది.
గోలివాడ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం మండలం గోలివాడ గ్రామంలో జాతర జరుగుతోంది.
అనేక గ్రామాల్లో: రేగొండ మండలం తిరుమలగిరి, సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ళ, పెద్దపల్లి మండలం హన్మంతుని పేట, హుజురాబాద్ మండలం జూపాక, మొగుళ్ళపల్లి మండలం ములకల పల్లి, మొగుళ్ళపల్లి, మహదేవపురం మండలం, కాళేశ్వరం ఇంకా ఎన్నో గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మల ఉపజాతరలు జరుగుతున్నాయి. జాతరల్లో వేలాదిమంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ సమ్మక్క, సారలమ్మ వనదేవతల ప్రీతిపాత్రమవుతూ పాడిపంటలతో, పిల్లాపాపలతో, సకల సంపదలతో, సుఖసంతోషాలతో జీవిస్తున్నారు.

- గౌడ్