నివేదన
Published Sunday, 26 January 2020చక్కటి విశాలనేత్రాలిచ్చావు
కోటేరు ముక్కునిచ్చావు
సరిపోలిన పెదవులిచ్చావు
అందందమైన పలు వరసలిచ్చావు
పలువరసల మాటున దాగిన నాలికనిచ్చావు
ఆరణాల అందమైన ముఖానికి సరితూగే తేజస్సు
ఎవ్వరెవ్వరు ఏ కోణంలో చూసినా చక్కటి ముఖ వర్ఛస్సు
మంచి చూడగా వచ్చు నేత్రములతో
మంచి నాఘ్రాణించగలవచ్చు నాసికతో
మంచి వచియించగవచ్చు
మంచి రుచియించగవచ్చు
చక్కటి నాలికతో
మంచిగ మురియగవచ్చు పలువరుసలతో
వర్తనలో.. ప్రవర్తనలో.. వచనంలో..
ప్రవచనంలో.. క్రోధమే కాని.. మోదమెరుగని
దృక్కులతో.. మితిమీరిన హక్కులతో..
బలవంతుడు బలహీనుడి పట్ల.. అమానుషం...
దౌర్జన్యం.. దురహంకారం.. తృణభావం..
ఎక్కడ కనుపించదు సమభావం.. సమనాదం..
సామ్యవాదం.. సౌజన్యం.. సహకారం
వివేకము విచక్షణ ఇచ్చుట
మరిచావా.. స్వశిక్షణకు విడిచావా..
అందం కాసింత లోపించినా పరవాలేదు
కాని..
బుద్ధిరహితుల చేసి
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధిని రానీయక
మంచి మంచి జరిగితే (ఎవరికి తనకి) కర్తను తానే నంటున్నాడు
రణమారణం జరిగితే నీ ఖాతాకే ఖర్చు రాస్తున్నాడు
హే! భగవాన్.. ఏమిటి ఈ దారుణ రణం.
*