S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాధ కృష్ణునికేమవుతుంది?

రాధ కృష్ణుని కేమవుతుంది? వారి మధ్య పరస్పర ఆరాధనా భావం ఎందుకు? అన్నదొక ప్రశ్న.
రాధ కృష్ణునికి మేనత్తయని ఒకరు. కాదు భార్య అని ఒకరు. కాదు కాదు ప్రియురాలని మరొకరు. ఇలా ఎవరికి తోచిన విధానంలో వారు చెప్పడమే కానీ, వారి మధ్యనున్న అసలైన సంబంధాన్ని విప్పి చెప్పినవారు లేరు. చివరికి..
‘కృష్ణా! కృష్ణా! యటంచు తిరుగమేము మీ చుట్టును
రాధా! రాధా! యటంచు పరుగెత్తరె మీరు?
రాగమ్మొ? పరాగమ్మొ? ప్రేమయొ? ఆరాధనయో?
ఏమో? మరి ఏమో అది? వివరించగ వలయు!’
అంటూ నిలదీశారట అతని పత్నులు సైతం. అవును మరి! తమ భర్త మరో స్ర్తి వెంట తిరుగుతోంటే ఏ భార్యయైనా ఎలా సహిస్తుంది? పామరులకే కాదు, పండితులకూ కచ్చితంగా తెలియని పరమ రహస్యమిది. ఐతే ఎవరీ రాధ? ఏమిటా గాథ?
రాధ ఎవరో తెలియాలంటే ముందు కృష్ణుడెవరో తెలియాలి మనకు.. ఇంకెవ్వరు? చంద్రవంశపు రాజు. ఒక యాదవ వీరుడు. దేవకీదేవికి వరపుత్రుడు. యశోద పెంపుడు కొడుకు అంటారు మీరు.
నిజమే.. సత్యమే.. కాదనలేం.. కానీ యిది పై పొరలోని అర్థం మాత్రమే.. ఒక పిట్టకథ మాత్రమే.. అంతరార్థం కాదు.. లోగుట్టు అసలే కాదు. ‘శ్రీ కృష్ణతత్త్వం..’ ఇంతేనైతే.. అతడు మానవ మాత్రుడే అయితే.. విశ్వవాప్తంగా కృష్ణుడంటే ఇంత ఆరాధనా, ఇంత పారవశ్యమూ, ఇంతటి భక్తి ప్రపత్తులూ, సమర్పణా భావం ఎందుకు? మహాకవి వ్యాసుడిలా అర్థరహితమై పిట్టకథల్ని చెప్పడు కదా..?
ఐతే.. కవిహృదయం లేదా.. రుషి హృదయం ఏమిటి?
దానికై లోచూపు కావాలి. అనగా మనిషికి ఒక తార్కిక దృష్టి కావాలి. చల్ల చిలికినట్లుగా భారత భాగవతాదుల్ని చిలకాలి, నల్లనయ్య రహస్యాలు తేటతెల్లం కావాలంటే..
ఇంతకీ ఏమిటా రహస్యం? అతడు చంద్రవంశస్థుడు కాబట్టి చంద్రపత్రిక అనవచ్చు. నిజమే కానీ అది పాక్షిక సత్యమే.. కాదు సూర్యపత్రిక అనవచ్చు. అదీ నిజమే.. కానీ అది కూడా ఒక పాక్షిక సత్యమే.. అయితే పూర్ణ సత్యం ఏమిటి? రాముడు సూర్యప్రతీక కాబట్టి, కృష్ణుడూ సూర్యప్రతీక కావచ్చని అనుకోవడంలో తప్పు లేదు. కానీ కృష్ణుడు పగటిపూట తన మగటిమిని ప్రదర్శిస్తే, రాత్రివేళ రాసలీలల్లో శృంగార మహాసాగరంలో ముంచెత్తాడు గోపికల్ని. అందువల్ల కృష్ణునిది విచిత్రమైన, విశిష్టమైన పాత్ర.
అయితే ఏమిటిది?
అది ద్వంద్వ పాత్ర.. అతడు పగలు సూర్యుడు.. రాత్రి చంద్రుడు.. అని ఎక్కడుంది.
ఎక్కడా ఉండదు.. మనం పట్టుకోవాలి దాన్ని! అతడు వెన్నదొంగ. మరో మాటలో వెన్న. జారిపోతుంటాడు చేతుల్లోంచి.. తొందరగా చిక్కడు.. పాలల్లో వెన్న ఎక్కడుంటుంది? చిలకగా చిలకగా చేతికి చిక్కుతుందది. చివరికి భగవత్తత్వమైనా అంతే! కొన్ని జన్మలు పడుతుంది పట్టుకోవడానికి.. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. సూర్య ప్రకాశమే చంద్ర ప్రకాశం అన్నది నిజమే.. అది ఒక శాస్ర్తియ సత్యం. కానీ సూర్యుని విషయమే.. సూర్యుడైనా అంతే.. ఏ నక్షత్రమైనా అంతే..
సూర్యుడు లేక చంద్రుడు లేనట్లే.. నక్షత్రాలు లేక సూర్యుడూ లేడు. నక్షత్రాల శక్తిపాతం వల్లనే సూర్యుడు శక్తివంతుడు. జగత్తు చైతన్యవంతం. అందుకే.. సూర్యప్రతీకయైన రాముడు సైతం నక్షత్ర ప్రతీకయైన విశ్వామిత్రుని వెంట తిరగాల్సి వచ్చింది. విశ్వామిత్రుడు బలాతిబల విద్యల్నీ, అస్తశ్రస్త్రాల్ని ప్రసాదించకుంటే.. రాముడంత శక్తివంతుడయ్యేవాడా? రావణాది రక్కసులను సంహరించేవాడా? అని సూటిగా ప్రశ్నిస్తే.. లేదనే చెప్పాల్సివస్తుంది.
ఇక అర్జునుని మాటో..? అతడు ‘పాశుపతాస్త్రం’ కొరకు శివునికై తపస్సు చేయలేదూ? ఆ శివుడెవరు? ఒక మహానక్షత్రం కాడూ? అతను అనుగ్రహమంటే శక్తిపాతం కాదూ? ఇలా తవ్వుకుంటూ వెళ్తే రహస్యాలు కోకొల్లలు.. అందువల్ల ఒక్క చంద్రుడే కాడు. సూర్యుడైనా అంతే.. నక్షత్రమైనా అంతే.. ఒకరి నుండి మరొకరికి.. అనగా పాల పుంతల నుండి నక్షత్రాలకీ, నక్షత్రం నుండి మరో నక్షత్రానికీ, సూర్యచంద్రులకీ, గ్రహోపగ్రహాలకీ, చివరికి మనకూ.. అనగా సమస్త జీవకోటికీ అందుతుంది. ఇదే శక్తిపాతం లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి.
ఒక తల్లి తన శక్తిని, రక్తాన్ని ధారపోస్తేనే కదా ఒక శిశువు ఉదయించేది. ఆ శిశువు పెరిగి, పెద్దవాడై ప్రయోజకుడయ్యేది? ఇదీ అంతే.. కృష్ణుడు పగలు సూర్యుడు కావడం వల్లనే అతని తలపై సప్తవర్ణ మయూర పించాన్ని ఉంచాడు వ్యాసుడు. దాని సప్త వర్ణాలే సూర్యుని సప్త కిరణాలు! దాంతో ఊరుకొనక అతని చేతికో చక్రాన్నిచ్చాడు.. అంటే? జ్యోతిర్మండలమే ఆ చక్రం. ‘సవితృ మండల మధ్యవర్తి’ కదా అతడు? అనగా.. చుట్టూ ప్రకాశం.. మధ్యలో కృష్ణుడనే సూర్యుడు.. అనగా.. అతని ప్రకాశమే అతని చక్రం. అదే శత్రువుల పాలిట ఆయుధం. భక్తుల పాలిటి ఛత్రం. అనగా రక్షకుడూ ఆయనే.. శిక్షకుడూ ఆయనే.. చివరికి సృష్టికర్త సైతం ఆయనే..
అతడు ‘యాదవుడు’ అనగా ‘దయా’ దృష్టి కలవాడని అర్థం. పాలు పితికాడు.. వెన్న చిలికాడు అంటే వెలుగుల్ని పితికాడనీ, చిలికాడనీ అర్థం. అతనికి ఇద్దరు తల్లులు. ఒకరు కన్నతల్లి దేవకీదేవి అనగా వెలుగుల తల్లి. రెండోవారు యశోద.. అనగా భూప్రతీక. అనగా కృష్ణుడు భూమ్యాకాశాల ముద్దులపట్టి యని అంతరార్థం. ఋగ్వేదంలో ఒక మంత్రముంది. అందులో ‘అగ్ని’ని ‘ద్విమాతాశయః’ (అ:1, ఆ:2, వ:70 మం.1) అని సంబోధింపబడింది. అనగా, అతనికి భూమ్యాకాశాలే యిద్దరు తల్లులని అర్థం. సూర్యప్రతీకయైన కృష్ణుడూ మహాగ్నిస్వరూపుడే మరి! అందుకే అతనికీ ఇద్దరు తల్లుల్ని అంటగట్టాడు వ్యాసుడు వేదాన్ని అనుసరిస్తూ..
ఐతే, అష్టపత్నులమాటో? పదహారు వేలమంది గోపికల మాటో?
‘ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః’॥
అంటూ నవగ్రహాల స్తోత్రం చేస్తాం మనం. ఆ నవగ్రహాల్లో సూర్యుడొకడు. కానీ స్వయం ప్రకాశం గల గ్రహం. అతడు లేక మిగతా ఎనిమిది గ్రహాలూ లేనట్లే.. ఆ సూర్యుడే కృష్ణుడు. ఆ అష్టగ్రహాలే ఆయన అష్టపత్నులు. సూర్యునిది సూర్యాకర్షణ శక్తి అయితే, కృష్ణునిది ప్రేమాకర్షణ శక్తి. ఆ శక్తినే తన చుట్టూ తిరిగే గ్రహోపగ్రహాలకు పంచుతున్నాడతడు. అదియే గ్రహాల ఆకర్షణ శక్తి. అందుకే ఘడియ సైతం అతన్ని విడిచి ఉండరు వారు. ఉండలేరు కదా!
ఐతే, గోపభామినులో? వారెవరు? అతని చుట్టూ తిరిగే ధవళమేఘాలే! (తెలుగు రంగు సాత్వికతకీ, విజ్ఞతకీ ప్రతీక. నలుపురంగు తామసికతకీ, అజ్ఞానానికీ ప్రతీక. అందుకే రామాయణ భారతాదుల్లో తెల్లని మేఘాలు కింనర, కింపురుషాదులకూ, నల్లని మేఘాలు రాక్షసులకూ ప్రతీకలు). అవి నీటిని మోసుకెళ్తుంటాయి. వాటి దారికడ్డంగా వెళ్లి, గులకరాళ్ళు విసిరి, కుండలకు చిల్లులు వేసి, అల్లరి చేస్తాడు కొంటె కృష్ణుడు. లేకుంటే వర్షం లేక నీళ్ళు లేక మనం అల్లాడిపోమా? ఆ నీరమే క్షీరం. ఆ మంచు ముద్దలే వెన్నముద్దలు! అవి నీటిని చిమ్మడమే వసంతకేళి! ఇలా, అనేకానేక రహస్యాల్ని ముడివేసి, మూటకట్టి మనకందించి వెళ్లాడు వ్యాసభగవానుడు.
సరి.. బాగుంది.. కానీ పదహారు వేలమంది గోపికలమాటో?
వాళ్ళు నరకుని చెరలోని కన్యలు.. పూర్వజన్మలో మునులు. నరకుడు చీకటికి లేదా చీకటి మబ్బులకి ప్రతీక (్భరతమంటే చీకటి, వెలుగుల క్రీడ). అనగా వాళ్ళు చీకటి చెరలో చిక్కిన నక్షత్రాలని అర్థం. (చివరికి ఉత్తర గోగ్రహణమన్నా ఇదే). సూర్యప్రతీకయైన కృష్ణ దర్శనంతో విముక్తినందాయని (రామపాదం సోకి రాయి అహల్యగా మారినట్లు), ఆపై కృష్ణపరమాత్మపై మనసు పారేసుకున్నాయి. అతని పత్నులమగు ప్రకటించుకున్నాయి. అయినా అభయహస్తం పెట్టాడు. లేకపోతే అనాథల్ని ప్రపంచం బతకనీయదు కదా? అందుకని..!
ఐతే, పదహారువేల మాటేమిటి? అది అనంత సూచిక. అంతేకాదు, ఏ పరికరమూ లేకుండా మనిషి తన నగ్ననేత్రంతో వేల నక్షత్రాల్ని చూడగలడంటున్నాడు జ్యోతిష్యులు. అదే ఇందలి రహస్యం. బాగుంది.. కానీ ఇంతకీ రాధ ఎవరో, రాధకీ కృష్ణునికీ మధ్య ఉన్న సంబంధమేమిటో చెప్పరేం?
ఇదిగో.. అక్కడికే వస్తున్నా! నేరుగా చెప్పలేం. చెప్పినా అర్థం కాదు. పూవుతో పాటు తొడిమనీ అందించాలి కదా! దాని వెనుక ఇంత నేపథ్యం ఉంది మరి! ఇక రాధ విషయానికొస్తే.. ఆమె పేరులోనే అర్థం దాగుంది. అదేమిటి?
‘రాధ’ శబ్దాన్ని తల్లకింద్రులు చేయండి. ‘్ధర’ అవుతుంది. ఏ ధార? కాంతి ప్రవాహ ధార. కొందరు ‘అనూరాధ’ నక్షత్రం అంటున్నారు. ఐనా బేధముండదు.
ఐతే ఏమిటి?
అంటే నక్షత్రధార. అది నక్షత్రలోకం నుండి ప్రవహిస్తూ, పరుగిడుతూ, కాంతివేగంతో శ్రీ కృష్ణున్ని అనగా సూర్యున్ని చేరే కాంతిధార! అది కృష్ణున్ని చేరుకుంటుంది. కృష్ణుని చుట్టూ తిరుగుతుంది. కృష్ణునితో కలిసిపోతుంది. అనగా రాధ కృష్ణుడై పోతుంది. కృష్ణుడు రాధయైపోతాడు. శక్తిమంతుడూ, పునీతుడూ అవుతాడు.
ఇచట విచిత్రమేమంటే, రాధ కృష్ణున్ని చేరాలని ఎంత తపిస్తుందో, కృష్ణుడూ ఆమెను అందుకోవాలని అంతే తపిస్తాడు. అందుకే, అతడు ‘ఊర్ధ్వబాహువై’ అనగా పైకి చేతులెత్తి ‘నా రాధా.. నా రాధా!’ అని అలమటిస్తాడు. ఆహ్వానిస్తాడు. ఆరాధిస్తాడు. తన అక్కున చేర్చుకుంటాడు. ఆమె ఒడిలో తాను సేదతీరుతాడు. అందుకే రాధ పట్ల కృష్ణునికీ, కృష్ణుని పట్ల రాధకీ అంతటి ప్రేమా! ఆరాధనా! సమర్పణా భావం! ఇత్యాదులు.. ఇదే అగాఢమైన, అనంతమైన, అనిర్వచనీయమైన విశ్వప్రేమ. అదే రాధాకృష్ణుల ప్రేమ!
ఇది ‘గంగావతరణ’ ఘట్టాన్ని గుర్తుచేయడం లేదూ.. శివుడు(సూర్య) నక్షత్రమే కదా! వెలుగుల ప్రవాహమే గంగా ప్రవాహం. పాత్రలు వేరు వేరు. కానీ పరమార్థం ఒక్కటే! అందువల్ల రాధామాధవతత్త్వం అద్భుతం. అనుపమేయం. కమనీయం. అది మాటలకందనిది. అందుకే రాధామాధవుల్ని ఆరాధించండి! పునీతులుకండి!

- గన్ను కృష్ణమూర్తి 92472 27087