S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

శ్రీరామునితో స్నేహాన్ని కొనియాడిన సుగ్రీవుడు
*
కిష్కింధకాండ
*
లక్ష్మణుడి సమక్షంలో ఆయన వింటుండగా వానర రాజైన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. ‘‘నీలాంటి గొప్ప మహిమకలవాడు నాకు స్నేహితుడిగా లభించడంవల్ల దేవతలందరి అనుగ్రహానికి నేను యోగ్యుడనయ్యాను. ఇంతవరకూ నన్ను కొండమీది కోతి అని తలచినవారంతా ఇకమీద నన్ను రాముడి స్నేహితుడని ఎంతగానో గౌరవిస్తారు. నువ్వు కొంచెం ఆలోచిస్తే నీ సహాయంతో నాకు కేవలం కపిరాజ్యమే కాదు, స్వర్గలోక ప్రభుత్వం కూడా లభిస్తుంది. రఘువంశంలో పుట్టినవాళ్లలో శ్రేష్టుడవైన నీతో నాకు స్నేహం లభించడంవల్ల నా చుట్టాలందరికీ, ప్రాణమిత్రులకూ, పూజనీయుడనయ్యాను. నీ కారణాన నన్ను ఇక అందరూ గౌరవిస్తారు. నీకు నేను తగిన స్నేహితుడనని కాలక్రమంలో నువ్వే తెలుసుకుంటావు రామచంద్రా! నా గుణాలను గురించి నేను చెప్పుకోకూడదు. ఆత్మ ప్రశంస మరణప్రాయమని పెద్దలంటారు కదా?’’
‘‘ఇది నా విషయం. నీ విషయంలో నాకేమాత్రం సందేహంలేదు. నీలాంటి ధన్యులు, కృతకృత్యులు స్థిరచిత్తం కలవారిగా వుంటారు కాని, చపల చిత్తులుగా వుండరు. జ్ఞానులలో ధైర్యంలాగా వారిలో ప్రేమ నిశ్చంచలమై వుంటుంది. ఇద్దరు స్నేహితులు సాధువులైతే, చాలా విలువగల పదార్థాలైన వెండి-బంగారు సొమ్ములను కూడా ఒకరి వాటిని ఇంకొకరు తమ సొంత వస్తువుల్లాగే, ఇతరుల ధనమనే భేదంలేకుండా ఉపయోగిస్తారు. తన స్నేహితుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, దుఃఖంలో మునిగివున్నా, సుఖభోగాలు అనుభవిస్తున్నా, దోషైనా, దోష రహితుడైనా, అతడి గుణదోషాలను నిజమైన స్నేహితుడు ఎంచకూడదు. ధనం పోయినా, సుఖాలన్నీపోయినా, తన దేహమేపోయినా, తన స్నేహితుడి పని నెరవేరేలా చూడాలికాని, వాడికోసం మనమెందుకు చెడిపోవాలి అనుకోకూడదు.
ఇలా హితం, ప్రియమైన మాటలను సుగ్రీవుడు చెప్పగా, శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు వింటుండగా ‘‘ఔను, నువ్వు చెప్పింది నిజం’’అని సుగ్రీవుడితో అన్నాడు. ఆ తరువాత సుగ్రీవుడు, రామలక్ష్మణులు కూర్చున్న శాఖలు వాడిపోయి వుండడం గమనించి, కొత్తవైన, మనోహరమైన శాఖలకోసం నాలుగుదిక్కులా చూశాడు. సమీపంలోవున్న ఒక కొమ్మను, చిగుళ్లు, పూలు బాగావుండి ఆకులు తక్కువగావున్న దాన్ని తెచ్చి రామచంద్రమూర్తికి వేశాడు. ఆయన దానిమీద కూర్చున్నాడు. ఆ తరువాత అలాంటిదానే్న హనుమంతుడు తెచ్చిఇస్తే, లక్ష్మణుడు కూర్చున్నాడు. అందరిలా కూర్చున్న తరువాత సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు.
‘‘మా అన్న వాలి నామీద పగపట్టి, నన్ను ఇల్లువెళ్ళగొట్టి, నా భార్యను అపహరిస్తే, ఇక ఇక్కడ వుంటే చంపుతాడన్న భయంతో ఈ ఋశ్యమూక పర్వతంమీద పడివుంటున్నాను. సమస్త జీవరాసుల భయం పోగొట్టగలిగే వాడివి నువ్వు. రక్షకుడు లేని నన్ను, దుఃఖపడే నన్ను రక్షించు.’’
ఇలా సుగ్రీవుడు చెప్పడంతో రామచంద్రమూర్తి తాను ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పానుకదా అనుకుంటాడు. అదొక గొప్ప విషయం కాదనుకుంటాడు. చిరునవ్వుతో సుగ్రీవుడితో ఇలా అన్నాడు.
‘‘పుణ్యాత్మా! సుగ్రీవా! మేలుచేయడం స్నేహ ధర్మం. కీడుచేయడం శత్రువుల లక్షణం. నువ్వు నాకు స్నేహితుడివి. నీ భార్యను అపహరించిన మూర్ఖుడిని ఇప్పుడే చంపుతాను. దీనికొరకు విచారించవద్దు. సుగ్రీవా! నా బాణాలు ఎలాంటివో తెలుసా? అమితమైన వేగంగాపోతాయి. మిరుమిట్లుగొలిపే కాంతికలవి. చూడడానికి భయంకరాకారాలు కలవి. బంగారు పింజలున్నాయి. కుమారస్వామి వనంలో పుట్టాయి. ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనవి. భయంకరంగా, కోపంతోవున్న పాముల్లాగా, మిక్కిలి వాడికల ముఖాలున్నాయి. నువ్వు వీటినిచూసి ధైర్యంతెచ్చుకో. వాలిని తప్పక చంపుతాను. భయపడవద్దు. పాపపు మనస్సుకల వాలి నేలబడి చావగా సుగ్రీవా! సంతోషంగా చూస్తావు.’’
ఈ విధంగా చెప్పిన రామచంద్రమూర్తి మాటలు విన్న సుగ్రీవుడు సంతోషంతో శ్రీరామచంద్రమూర్తిని మేలు-మేలని ప్రస్తుతించి ఇలా అన్నాడు.
‘‘దేవా! శోకపీడితులకు నువ్వే గతి. నేనో శోకపీడితుడిని. కాబట్టి నువ్వే నాకు గతి. అంత మాత్రమేకాకుండా నువ్వు నాకు స్నేహితుడివి. నన్ను రక్షించాల్సిన భారం నీమీదే ఎక్కువగా వుంది. ఈ కారణాన దీనుడినై ఏడుస్తున్నాను. అగ్నిసాక్షిగా నువ్వు నా చేతిలో నీ చేయి వేసి స్నేహం చేసి, నాకు ప్రాణదానాన్ని నిస్సందేహంగా ఇచ్చిన కారణాన ధైర్యంతో వున్నాను. దేవుడైన నినే్న నా ప్రాణ స్నేహితుడివని నమ్మి నా మనస్సును ఎల్లవేళలా కాల్చే దుఃఖాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నించాను. అల్పవిషయమైతే నేనెందుకు చెప్పేవాడిని?’’
ఇంతవరకు చెప్పి, కళ్ళనిండా నీళ్లుకారుతుంటే, గొంతు గద్గదమై, నోట మాటరాక వౌనం దాల్చాడు.
ధీరుడైన సుగ్రీవుడు తన కళ్ళవెంట కారుతున్న నీళ్లను అణచుకుంటూ, రాముడేమనుకుంటాడో అని భయపడ్తూ, మళ్లీ ధైర్యంతెచ్చుకుని రామచంద్రుడితో తన కథ ఇలా చెప్పసాగాడు.
వాలి తనను పరాభవించిన విధానం రాముడికి చెప్పిన సుగ్రీవుడు
వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడిలా. ‘‘రామచంద్రా! వాలి నాకు చేసిన కీడుచెప్తా విను. వాలి రాజుగా వుండగా నేను యువరాజుగా వున్నాను. అప్పుడు నన్ను నానావిధాలుగా దూషించి దయలేకుండా వెళ్ళగొట్టాడు. నా ప్రాణాలకంటే ప్రియమైన నా భార్యను అపహరించాడు. నామీద ప్రేమగల స్నేహితులను, బంధువులను, చెరసాలలో బంధించాడు. ఇంతటితో ఆగకుండా నా ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాడు. నన్ను చంపడానికి అనేకమందిని పంపాడు. ఇంకా నన్ను మోసంచేసి చంపడానికి అనేక ఆలోచనలుచేశాడు. అతడు నాకుచేసిన కీడులు చెప్పడం సాధ్యపడదు. నన్ను చంపడానికి వాలి ఎవరెవరినో పంపడం, నేను వాళ్లను చంపడంతో కాలం గడిచిపోతున్నది. ఆ కారణానే నేను మిమ్మల్ని చూసినప్పుడు, మీరుకూడా వాలితో పంపబడిన వారని భయపడ్డాను. ఈ హనుమంతుడు మొదలైన వానరులు మాత్రమే నాకు తగిన సహాయంచేస్తూ వుంటే, ఎన్ని కష్టాలోపడ్తూ, ప్రాణాలతో వున్నాను. నాకు వీళ్లు అన్నివేళలా అండదండలుగా వుంటూ, నా ప్రాణాలను కాపాడుతున్నారు. రామచంద్రా! ఎక్కువగా మాటలు చెప్పకుండా సారాంశాన్ని సంగ్రహంగా చెప్తా విను. వాలి మహాపరాక్రమశాలి. సూర్యుడిలాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటివాడు చచ్చి నేలబడితేనే నా దుఃఖాలు పోవు...అన్నం సహించదు... కంటికి నిద్ర రాదు. రామచంద్రా! నాకు కలిగిన దుఃఖం ఎట్లాపోతుందో ఆ విషయమే చెప్పాను. కష్టాల్లోకానీ, సుఖాల్లోకానీ మిత్రుడికి మిత్రుడే దిక్కు.’’
సుగ్రీవుడు చెప్పినదంతా విన్న రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. ‘‘వాలి నీకు అన్నకదా? అతడితో నీకింత విరోధం ఎందుకు కలిగింది? దానికి కారణం ఏమిటి? నువ్వేం తప్పుచేశావు? అంతా వివరంగా చెప్పు. మీ తప్పుల్లోని బలాబలాలు విచారించి, నీ తప్పు చిన్నదే అయితే, అతడి విరోధం ఎక్కువైతే, వాడిని ఇప్పుడే చంపుతాను. నీ తప్పు పెద్దదై, విరోధం చిన్నదైతే, ఇద్దరికీ సమాధానం కుదిరింది కార్యం చక్కదిద్దుతాను. నువ్వు విచారపడవద్దు. ధైర్యంగా మొదటినుండి మీ చరిత్ర చెప్పు. నీకు కలిగిన అవమానం వింటేనే నాకు కోపం వస్తున్నది. మనస్సు చలిస్తున్నది. నీకు విరోధి అయితే నాకూ విరోధే కదా? నేను విల్లు ఎక్కుపెట్టకముందే నీ సమాచారమంతా వివరంగా చెప్పు. నా విల్లునుండి బాణం బయటికి వస్తే ఇక వాలి చచ్చిపోయినట్లే అని నమ్ము.’’
ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా విన్న సుగ్రీవుడు, తనకు, తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690