స్నేహ ఋతువు
Published Saturday, 18 January 2020జీవన సమరంలో..
పాయలు పాయలుగా చీలిన జీవికల్ని
ఊసుల ప్రవాహమై ఒక్కటి చేసి
మొద్దుబారిన మనోసీమపై మెత్తగా ప్రవహింపచేసి
మట్టి నవ్వుల పరిమళాలతో మనసు నింపడానికి
కలల జలపాతమై.. ఈ కొత్త ఋతువు
ఇంత అకస్మాత్తుగా దూకి వస్తుందనుకోలేదు.
కాలం బండరాయి క్రిందపడి
శిథిలమైన అపురూప జ్ఞాపకాల్ని
మళ్లీ ఇన్నాళ్లకు... మురిపెంగా మూటకట్టి
చరవాణి మాద్యమపు సమూహపు చెక్కిలిపై
పత్తి పువ్వుల్లా చిగురింపచేస్తూ.. ఈ కొత్త ఋతువు
ఇంత అకస్మాత్తుగా పూతకొస్తుందనుకోలేదు.
మనసు పుస్తకంపై రంగులు నింపిన చేతుల్ని,
మధు గాత్రంతో గుండె తడిపిన గొంతుల్ని
అడుగులు తడబడినప్పుడు తోడుగా కదిలిన పాదాల్ని
బెదురు లేళ్ళకు ధైర్యం చెప్పిన చూపుల్ని
కట్టగట్టి కళ్ళముందు నిలిపే ఈ కొత్త ఋతువు
ఇంత అకస్మాత్తుగా కరుణిస్తుందనుకోలేదు.
గాలి వాటానికి చెల్లాచెదురైన జీవితపు గూళ్ళను
పుల్లాపుల్లా చేర్చి శ్రద్ధగా పునర్నిర్మించుకొని
గాయమోడుతున్న రెక్కల్ని ఓర్పుగా బలపెట్టుకొని
బ్రతుకు ఆకాశంలో ఎగురుతున్న ఒంటరి పక్షుల్ని
ఆత్మీయ వేదికపైకి.. ఈ కొత్త ఋతువు
ఇంత అకస్మాత్తుగా ఆహ్వానిస్తుందనుకోలేదు.
చిన్నారి చందమామలకు వెనె్నల ముద్దులు తినిపిస్తూ
మురిసిపోయే తల్లి ఆకాశాల్ని,
కంటిపాపల్ని బాధ్యతల భుజాలకెత్తుకొని
రేపటి లోకాన్ని చూపిస్తున్న మహోన్నత
తండ్రి శిఖరాల్ని..
నూనూగు కాలాల స్మృతుల సారస్వతంలో మధించి
మబ్బుకట్టిన కన్నీళ్లను నవ్వుల వరద గుడిగా మెరిపించి
దిగులు సందర్భాలని పూల వానల సందడిలో మరిపించి
మళ్లీ కవ్వింపుల అల్లరి వనాన్ని నేలకు దించిన
తొలినాళ్ళ తొలకరి ఉత్సవాన్ని..ఈ కొత్త బుతువు
ఇంత అకస్మాత్తుగా వర్షిస్తుందనుకోలేదు.
అప్పుడెప్పుడో నాటుకున్న విత్తనాలు
ఇప్పుడిలా గుండె మడినిండా..
తీపి గుర్తుల్ని..గుత్తులు గుత్తులుగా పూస్తూ...
పరిపూర్ణమైన పంటతనమై పలకరిస్తూ
కనుల నిండా చెమ్మగింతల్ని చిలకరిస్తూ..
గడ్డిపూల మెతక స్పర్శగా మాటల కొలనులో ముంచి
ఈ కొత్త ఋతువు అపూర్వ స్నేహ ఋతువై
నన్నింతలా చుట్టుముడుతుందనుకోలేదు.