లోతు
Published Monday, 13 January 2020మనిషి తాను చాలా తెలివిగలవాడినని అనుకుంటాడు. అన్ని విషయాలు తనకు తెలుసునని అనుకుంటాడు.
ఇది అర్ధసత్యమే.
ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలివిగల వ్యక్తికి కూడా తెలియని విషయాలు చాలా వున్నాయని అర్థమవుతుంది.
సినిమాల్లో చాలా సన్నివేశాలు చూసి వుంటాం. అది ‘దిల్ సే’ సినిమా కావొచ్చు. మరొకటి మరొకటి కావొచ్చు. మన ప్రక్కన ఫ్లాట్‌లో వుంటున్న వ్యక్తుల గురించి మనకు చాలా విషయాలు తెలుసునని అనుకుంటాం. నిజానికి మనకి ఏమీ తెలియదు. ప్రక్కనే టెర్రరిస్ట్ వున్న సంగతి తాము తెలియదని చెప్పిన సన్నివేశాలు వున్న సినిమాలు మనం చాలా చూసి వుంటాం. ఎదుటి వాళ్ల గురించే తెలుసుకోవడం ఇంత కష్టమవుతున్నప్పుడు వాళ్ల లోతు తెలుసుకోవడం అంత సులువు కాదు.
తెలుగులో ‘లోతు’ అన్న కవిత ఒకటి వుంది. అది ఇలా మొదలవుతుంది.
‘మనకేమీ తెలియదు
మనం తెలివిగల వాళ్లమని..
చూడగానే అంతా అర్థం చేసుకుంటామని అనుకుంటాం.
మన ప్రక్కనున్న మనిషి చాలా మంచివాడని అనుకుంటాం. అతనిలోని టెర్రరిస్ట్ మనకు తెలుసా?
ఇది నిజమా? కాదా? అని ఆలోచించాలి. ఆ కవిత ఇంకా కొనసాగుతుంది.
‘అన్యోన్యతని చూసి ప్రేమైక జీవులనుకుంటాం..
ఆ అన్యోన్యత వెనక ఎంత సంఘర్షణ వుందో మనకు తెలుసా?
మన నవ్వుల వెనక ఏం మతలబు ఉందో..
మన కళ్ల వెనుక ఎంత క్రూరత్వం ఉందో..
మన కాంక్ష వెనుక ఎంత కాఠిన్యం వుందో మనకు తెలియదు..
మన లోతు మనకే తెలియనపుడు
ఇతరుల గురించి మనకేం తెలుస్తుంది?’
ఇతరుల లోతు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
మన లోతు గురించి మరిచిపోతాం. ఇంతకీ, మన లోతు మనకు తెలుసా?
ఆలోచించాలి.