S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

శ్రీరాముడికి ధైర్యం చెప్పిన సుగ్రీవుడు
*
కిష్కింధకాండ

శ్రీరామచంద్రమూర్తి బాధపడటం చూసిన సుగ్రీవుడు కన్నీళ్లు తన గొంతుకు అడ్డంగా వస్తుంటే ఇలా అన్నాడు. ‘అయ్యా! రామచంద్రమూర్తీ! ఆ రాక్షసుడు కాపురముండే దేశం కానీ, అతడి బలం కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ, ఆ అనీచుడి కులం కానీ నాకు నిజంగా తెలియదు. అయితే ఎలా అని విచారపడవద్దు. ఏ విధంగానైనా నీ భార్య నీతో కలిసే మార్గాన్ని అనే్వషిస్తాం. నా మాట నమ్ము’
(ఇక్కడ సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడు. రావణాసురుడి విషయం హనుమంతుడికి తెలియదు కాని సుగ్రీవుడికి బాగా తెలుసు. రావణాసురుడు వాలి చేతిలో ఓడిపోయి సంధి కుదుర్చుకున్న వాడే. అప్పుడు సుగ్రీవుడు కూడా అక్కడ ఉన్నాడు. అలాంటప్పుడు తెలిసి తెలిసి అబద్ధం చెప్పడం మిత్రద్రోహం కాదా? కాదు.. కానేకాదు. ఇప్పుడే రావణాసురుడి గురించి సుగ్రీవుడు చెప్తే చాలా తొందరలో వున్న రామచంద్రమూర్తి వెంటనే లంక మీదకు యుద్ధానికి పోదామని అనవచ్చు. వాడి బలం ఈయనకు తెలియదు. తానేమో వాలి జీవించి ఉన్నంతదాకా ఈ స్థలాన్ని విడిచిపోవడానికి వీల్లేదు. ఒకవేళ పోయినా ఇప్పుడున్న ఐదుగురితో చేయగలిగింది ఏమీ లేదు. తాము బయల్దేరిపోతే వాలి సైన్యంతో దండెత్తి వస్తాడు. వాలి, రావణుడు ఒకటౌతారు. అప్పుడీయన ఎవరితోనని యుద్ధం చేస్తాడు? తొందరపాటు వల్ల కార్యభంగమే కానీ అనుకూలం కావు. వాలిని చంపి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తే తానూ సర్వాధికారి అవుతాడు. అప్పుడు నిర్భయంగా లంక మీదకు దండెత్తవచ్చు. ఇలా కార్యభారం, సాధన మార్గం ఆలోచించి సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు. దీనివల్ల రామచంద్రమూర్తి పని పాడవలేదు. స్నేహధర్మాన్ని అనుసరించి ఆడిన అబద్ధం తప్పు కాదు. రోగి మేలు కోరిన వైద్యుడు రోగి ఇష్ట ప్రకారం చికిత్స చేయదు. వాడి మేలు ఆలోచించి చేస్తాడు.)
సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు రాముడితో.. ‘రామచంద్రా! నా ప్రతిజ్ఞ విను. సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుడిని బంధువులతో, కొడుకులతో, స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి నీ మనస్సుకు సంతోషం కలిగేట్లు చేస్తాం. నీ ప్రియురాలిని నీతో కలిసేట్లు చేస్తాం. తండ్రీ! నా మాట నమ్ము. అయ్యా! బాధపడవద్దు. సాహసం వదలవద్దు. ధైర్యం, తేజం వదిలి పెట్టవద్దు. గౌరవం చెడిపోయే విధంగా పరితాపపడవద్దు. దేవాత్మా! నీలాంటి మహాత్ములు ఈ విధంగా దుఃఖపడతారా? గౌరవం చెడడానికి బాధపడడమే కారణం అని నీకు తెలియదా? నీ దుఃఖం నాకెలా తెలుస్తుంది అంటావేమో? నీలాగా నేను కూడా భార్యను పోగొట్టుకొని అనేక కష్టాలు అనుభవిస్తున్నాను కదా? అయినా నీలాగా నేను ఏడుస్తున్నానా? ధైర్యం వదిలానా? నేనా కోతిని, మూఢుడను అయినప్పటికీ ఆడదానికై దుఃఖపడను. నువ్వేమో మంచి పండితుడివి. ధీరుడివి. మహాత్మా నువ్వు ఇలా చేయడం తగునా?’
‘రామచంద్రా! కారుతున్న కన్నీటిని ఇనుమడించిన ధైర్యంతో అడ్డగించు. కార్యోన్ముఖుడు నిలకడగా వుండాల్సిన ధైర్యాన్ని విడువవచ్చా? వ్యసనపడేటప్పుడు, ధననష్టం జరిగినప్పుడు, ప్రాణాపద కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, తన బుద్ధిబలంతో ధీరుడనేవాడు ధైర్యంగా వుండాలి కానీ అధైర్యపడకూడదు. ఎప్పుడూ ఏడిచే బుద్ధిహీనుడు శోకంతో బరువెక్కిన పడవ సముద్రంలో మునిగినట్లు మునుగుతాడు. చేతులు రెండూ జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను.. నా మీద స్నేహ భావం వుంచి నన్ను మన్నించు. కొంచెం కూడా దుఃఖపడవద్దు. పౌరుషంగా వుండు పండితాగ్రణీ! రామచంద్రా! శోకమే అన్నిటికీ సమాధానం, అంతకు మించి మనం ఏమీ చేయలేం అనే వాళ్లకు సుఖం ఉండదు. శోకంలో మునిగిన వాడికి తేజస్సు చెడిపోతుంది. శోకపడే వాడికి బతుకు దుర్లభం అవుతుంది. కాబట్టి శత్రు సంహారకా! ధైర్యాన్ని తెచ్చుకో’
‘రామచంద్రా! స్నేహం వల్ల నేను నీకు హితమైన దానే్న చెప్తున్నాను కానీ నీకు తెలియని విషయం ఉపదేశం చేయడం లేదు. నీకు చెప్పేటంతటి వాడినా నేను? కాబట్టి నా స్నేహాన్ని గౌరవించి నేను చెప్పిన మాటలను ఆదరించి మన మేలుకే కదా చెప్తున్నాడని భావించి నీ మొహాన్ని, మనస్తాపాన్ని తగ్గించుకో.’
స్నేహం, ప్రేమ ప్రకాశించే రీతిలో సుగ్రీవుడు చెప్తుంటే, కళ్ల నుండి కాలువల్లాగా కారుతున్న నీళ్లను నెమ్మదిగా తుడుచుకుని, సుగ్రీవుడిని చూసి, రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. ‘కౌగిట్లో వుంచుకుని, ప్రేమతో, గుణ సంపన్నుడైన స్నేహితుడు తన స్నేహితుడికి ఆపద సమయంలో ఎలా మసలుకోవాలో, అలాగే నువ్వు నీ మాటలతో నన్ను ఓదార్చావు. మిత్రుడా! బంధువులంటే రక్త సంబంధీకులు మాత్రమే కాదు. అలాంటి సంబంధమున్నా, లేకపోయినా, అవసరానికి సహాయపడేవారే నిజమైన బంధువులు. ఇలా నా హితం కోరేవాడు, అవసరానికి ఆదుకునేవాడు నాకెక్కడ దొరుకుతాడు? సంపదలో తులతూగే వాడికి ఎవరన్నా లభిస్తారేమో కాని, ఆపదలో వున్న నాలాంటి వారికి, నీచ స్థితిలో ఎవరూ లేని సమయంలో నీలాంటి స్నేహితులు ఎలా దొరుకుతారు? కాబట్టి నువ్వు నిజమైన చుట్టానివి. నీ మాటల వల్ల నా మనసు నిర్మలమైంది.’
‘సుగ్రీవా! నీకు నా మీద ఇంత ప్రేమ వుంది కాబట్టి, ఇక నువ్వు ‘ఇలా చేయి, అలా చేయి’ అని చెప్పను. దుష్టబుద్ధితో క్రూర కార్యాలు చేసే రాక్షసుడిని వెతకడానికి చేయాల్సిన ప్రయత్నాలు నువ్వే చేయి. ఇక ఆ విషయాలు నేను ప్రస్తావించను కాని, ఇప్పుడు ననే్నమి చేయమంటావో చెప్పు. వానాకాలంలో విత్తనం సిద్ధం చేయబడిన మడికయ్యగా నన్ను భావించు. నువ్వు వేసే విత్తనం కొద్దీ నీకు ఫలితం ఉంటుంది. ఆలోచన చెప్పాల్సిన బాధ్యత నీది.. అది ఫలించేలా చేయడం నా వంతు. నేను చెప్తున్నది సత్యం అని నమ్ము. ఇంతవరకు నేను అసత్యమాడలేదు. ఇక ముందు ఆడబోయేది లేదు. మిత్రమా! సందేహం వదులు. సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.’
రామచంద్రమూర్తి చెప్పిన హిత వాక్యాలు, ప్రతిజ్ఞ, విన్న సుగ్రీవుడు, ఆయన మంత్రులు చాలా సంతోషించారు. ఈ విధంగా రామసుగ్రీవులు వారి వారి సుఖ దుఃఖాలు ఒకరితో మరొకరు ఏకాంతంగా చెప్పుకున్నారు. ఏక నిశ్చయంతో రామసుగ్రీవులు ఇలా తమ సుఖ దుఃఖాలు ఒకరికొకరు చెప్పగా, సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని మిక్కిలి సంతోషించాడు.
-సశేషం
-వనం జ్వాలా నరసింహారావు
80081 370 12
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690