బతుకు మంత్రం
Published Saturday, 28 December 2019మదిని చొచ్చిన వ్యాకులత
సమస్యల వలయంపై వాలి
ముందుకెళ్లాల్సిన గమనానికి
అడ్డు సంకెళ్లు బిగిస్తుంది
ఎదను మొలిచిన బతుకు చింతన
విశ్వరూపాకృతిని పొంది
సంక్షోభపు పంట పండిస్తుంది
జీవనం బాధాతప్తమైన దారుల వెంట
పయనించాల్సి వచ్చిన విషమ స్థితి
వెంటాడి వేటాడి తరుముతుంది
ఎంతకూ ఫలించని ఎదురుచూపులకు
నిర్లిప్తత అవాహన జరిగి
ఉపకరించే ప్రయత్నం నిరర్థకమవుతుంది
కలిసిరాని కాలంతో సహవాసం
అసహనం రగిల్చి
ఆశను హతమార్చుతుంది
పట్టినదంతా అవహేళనై
ఎటు తిరిగినా పొద్దు ఎదురై
నిస్తేజం నిండి నిబ్బరం కోల్పోతుంది
మూసుకున్న తోవలలో పలాయనం
విఫలమై వెతలు చుట్టుముట్టి
ఊపిరి సలపనీయవు
బతుకు భయం దేహపర్యంతం పాకి
ప్రమోదం నుంచి
ప్రమాదంలోకి నెట్టుతుంది
అలసితనం ప్రాయోపవేశం దిశగా
అడుగులు వేసే దీనత్వాన్ని
దాపరించుకున్నప్పుడు
తత్వ రహస్యం తెలిసిన తాత్వికుడెవరో
ఎదుటపడి బతుకు మంత్రమేదో
చెవిలో ఊదుతాడు
మరణోన్ముఖం కాస్త
గృహోన్ముఖమవుతుంది
*