S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీక్లీ సిబ్బందితో ఆటవిడుపు!

అరుణాఛలం అగ్ని లింగంగా వాసికెక్కిన అరుణాచలేశ్వరుని గుడికి మద్రాసు నుంచి మోటారు శకటం మీద నాలుగు గంటలు పట్టింది -లింగ దర్శనం కన్నా గిరిప్రదక్షిణకి గ్రేడు ఎక్కువట.. కానీ కనీసం పది కిలోమీటర్లు చుట్టి రావాలి. పిక్కబలం ఉన్నవాడికే నాల్గు గంటలు పడుతుంది - ఇక్కడి శివాలయంలో అయిదు ప్రాకారాలున్నాయి.. నాలుగు దిక్కులలో నాల్గు ప్రధాన ద్వారాలు వున్నా, ఈ దేవాలయంలోని అతి పెద్ద ప్రాకారం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కానీ, రమణాశ్రమం మాత్రం మా వీక్లీ బృందం మొదట చూశాము - ఇదో ఉమ్మడి కుటుంబం అన్నాడు అకౌంటెంట్ భాగవతుల నరసింహారావుగారు. కానీ సర్క్యులేషన్ కమల - ఎప్పటి మాట? ఏభై అయిదేళ్ల నాటి సంగతి. మోటారు వ్యానులో బోగినాడు అక్కడికి చేరిన బృందంలో ఆయనే మా ఆఫీసులోను బయట కూడా పెద్దవాడు. అందరికన్నా చిన్న వయస్కుడను నేనే కాబోలు. వీక్లీ ఫ్యామిలీ అన్నాడు - దవే - అతనిది జియం ఆఫీస్‌లో ఇంటెలిజెన్స్ పోస్టు. గడుసు గుజరాతీ - కోసిన కర్బూజా పండు చెక్కలాగా నుదుట విబూది కుంకుమ రెండూ ధరిస్తాడు. అరవం తెలుగు రెండూ నేర్చాడు. స్టోర్ కీపరు. గొప్ప కీ పోస్టు అన్నాడు నరసింహారావు. ఎర్రతేలు అంటుంది కుమారి కమల. ఆమె తమిళ అయ్యన్‌గారి పొన్ను - వాళ్ల నాన్నగారు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఆమె కూడా భౌతికశాస్త్రంలో డిగ్రీ. కానీ కుంచితపాదం గారి కోరిక మీద ఆంధ్రపత్రికలో చేరింది. కాస్త స్థూలకాయం - ముప్పై దాటిన వయసు. తెలుగు కొంజెం కొంజెం వచ్చు. ఆమెకి రమణాశ్రమం తెలుసు. తనే గయుడు మా టీమ్‌కి. వీరాజీ అందరినీ ఒక ఫ్యామిలీ లాగ కలుపుకొని పని చేస్తాడు. కనుక లీడర్ చేసి, ఫ్రంట్ సీటులో పెట్టుకున్నాము - జియం అల్ఫోలైక్స్ హిం దోహి ఈజ్ ఎ జర్నలిస్ట్ - అని కితాబు ఇచ్చాడు అసిస్టెంట్ ఫోర్‌మేన్ మురుగన్. మా బృందంలో ప్రెస్ ప్రతినిధి. ఇంకా కేశవన్ ప్రాసెస్ డిపార్ట్‌మెంట్. మలయాళీ - అయినా నో ప్రాబ్లెం - భాషాతీతుడు - మన మాటలు వినడు (వినలేడు) చూస్తాడు అంతే. కానీ అర్జెంట్ బ్లాక్ కావాలంటే అతన్ని అడిగే చనువు నాకు ఇచ్చాడు. నారాయణ సామీ, రైటర్ రామయ్య గోపాల్ వర్కర్స్. సర్క్యులేషన్ నరసింహారావు సీనియర్ క్లర్కు. లక్ష్మీ నరసింహారావు తాను డి ఫాక్టో మేనేజర్‌ని అంటాడు. మా బృందంలో అతను వున్నాడు కనుక సువర్చల కూడా వున్నది. ఇంకా మొత్తం వున్న ఆడ ఉద్యోగులంతా మొత్తం సబ్ ఎడిటర్ మందరపు లలితతో కలిసి అయిదుగురూ ప్లస్ సత్రకాయ (వారిజగారి చెల్లి) వెరసి ఆరుగురు లేడీస్. అన్నట్టు యాడ్స్ డిపార్ట్‌మెంట్ బసవేశ్వర్ మంచి గాయకుడు - కిశోర్ కుమార్ ఆఫ్ ఏపీ అంటాను నేను. అంటే ఆంధ్రపత్రిక అన్న మాట. ఇదీ సంక్రాంతి విహార బృందం. నిజానికి వీళ్లే నాకు విఐపీలు. నువ్వు సర్క్యులేషనో అంటూ మడుసుల్ని చంపుకు తింటావుగా వాళ్లే ఇప్పుడు ఎక్కువ వచ్చారు. సంబడం చేసుకో అన్నాడు మా వెంకటేశ్వర్లు. వీళ్లంతా అపశ్రుతి లేకుండా - నన్ను వాళ్లతోపాటు మధురాంతకం, మీదుగా సాతనూర్ బృందావనం ఆనంద యాత్ర చేయించి - ఒక్కచోట, మాట బాట జారకుండా - సోమవారం ప్రొద్దునే్న జార్జ్ టవున్‌లో (మద్రాస్) లైట్ హౌస్ ముందు దింపేశారు. పది గంటలకి నేను రెడీ, పేజీలెక్కడ అంటూ - వాళ్లూ అందరూ రెడీ. లేకపోతే అందర్నీ చెడగొడుతున్నాను అనేవాళ్లు. సరే, జర్నలిస్టులు నాన్ వర్కింగ్ జర్నలిస్టులు అన్న విభజన న్యూస్ పేపర్ ఆఫీసులలో వుంటుంది. వర్కింగ్ జర్నలిస్టులకు ఒక చట్టం దాన్నిబట్టి స్టాండింగ్ ఆర్డర్స్ వగైరా వుంటాయి. వర్కర్స్‌ని నేను ఎప్పుడూ నాన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అనే వాణ్ణి కాదు. వాళ్లు ఎల్లవేళలా వర్కింగే.. వాళ్లకో కల్చరల్ సొసైటీ ఏర్పడ్డాక - సర్క్యులేషన్ అడ్వర్టయిజ్‌మెంట్ శాఖల మధ్య సయోధ్య పెరిగింది. ఇరవై నాలుగు గంటలు - కదిలే ప్రపంచం వార్తలు విశేషాలు రాసే చేసే సిబ్బందికి వాళ్లతో దాగిన కోరికని బయట పెట్టాలనిపిస్తుంది. స్టేజీ మీదో క్రీడా స్థలిలోనో అందుకే అప్పుడప్పుడు ఆట విడుపు కావాలి. కానీ, మా ఆఫీసులో హృదయ వైశాల్యం బోలెడు కానీ చోటు చాలా ఇరుకు. రెండు రోజులు వరుసగా సెలవు అరుదు. కానీ, అంతవరకూ మద్రాసు సంప్రదాయం ప్రకారం - బోగికి ఇచ్చే సెలవును సంక్రాంతికి మార్చడంతో వీక్లీ స్ట్ఫాకి రెండు రోజులు హాలీడే దొరికింది.. పోతాం సార్! తిరువన్నమలైకి పోయి అట్నుంచి సాతనూర్ డ్యాం చుట్టి వద్దారి అన్నాడు నారాయణస్వామి. గుడ్‌లక్ - మర్నాడు పడకవేయకండి.. మిమ్మల్ని కూడా తోడ్కొని పోతుండాం సామి అన్నాడు రామయ్య. కథలు రాస్తాడు. ఏకాంకిక నాటకాలు రాస్తాడు. మీరు రావాలి సార్ - అని నేల మీద మఠం విషయం చెప్పారు. మొత్తం పదహారు మంది - వ్యాన్ బుక్ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భోజనాలు బస అన్నీ సింపుల్‌గా చేశాం అని చెప్పారు. డ్రైవర్ ప్రక్క సీటు - మీకు రిజర్వ్ చేశాము. లేడీస్ అందరూ వస్తున్నారు. ఎడిటోరియల్ నుంచి మందరపు లలితమ్మ ముందే రెడీ అయిపోయింది సర్ - కుటుంబంలాగ వున్నాము అంటే మేము మీరే కారణం... అంచేత పైగా అకౌంటెంట్ పెద్దాయన - స్టోర్ కీపర్ దవే కూడా వున్నాడు సార్.. మై యాత్రకి మీరే చీఫ్ గెస్ట్... అంటూ నన్ను ఒప్పించారు.. లోగడ విద్యార్థి జీవితంలో సరదాగా సాగిన నవ్వుల నదిలో పువ్వుల పడవ అన్నట్లుగా ఒక ఆటవిడుపు దొరికింది అదీ నా కొత్త కుటుంబంలో.. ఒక సమతుల్య ప్రవర్తనకి కార్మిక బృందం ఇచ్చిన మధుర స్మృతిగా ఉండిపోయింది.
చెన్నై - నాటి మద్రాసుకి ఎనభై కిలోమీటర్ల దూరంలో వున్నాది, అరుణాచలం తిరువన్నామలై - రమణాశ్రమం నుంచి బెజవాడ నుంచి తెనాలి అంత దూరం ఉంది ఈ సాతనూర్ డ్యాం - పెన్నయ్యార్ నది మీద కట్టిన ఈ ఆనకట్ట - ఒక అందాల బృందావనంగా తీర్చిదిద్దారు. ఒక మొసళ్ల పెంపకం కేంద్రం స్థాపించారు. దీనితో సినిమా షూటింగ్‌లు కాశ్మీర్‌కు పోవడం మానేశాయ్. అప్పట్లో అదో పెద్ద టూరిస్టు ప్లేస్ అయిపోయింది. అక్కడికి చేరుకోవడానికి ముందు - మధురాంతకంలో ఆగా. ఇది చెంగల్పట్టు జిల్లాలో పెద్ద మున్సిపాలిటీట. కోదండరాముడి గుడి పెద్దదే.. సీతమ్మవారికి వేరే గుడి ఉంది. జానకివల్లి అంటారు అమ్మవారిని. పుణ్యక్షేత్రంగానే కాదు - ఇక్కడ చాలా పెద్ద సరస్సు - 2400 ఎకరాల విస్తీర్ణం దానిది. గుడిని పల్లవులు కట్టించారు అన్నది చరిత్ర. కానీ రాముడు లంక నుంచి పుష్పక విమానంలో తిరిగి వస్తూ వుంటే - అది ఈ ఊరిపైన అట్లా స్తంభించి ఉండిపోయిందిట. ఓ మునికి ఇచ్చిన హామీని మరచిన కోదండరాముడు అక్కడ కోదండంతో వెలిశాడు. విగ్రహం మెజెస్టిక్‌గా ఉంది. ఎనిమిది అడుగులు ఎత్తు అన్నాడు పూజారి. ఇక్కడో తమాషా జరిగింది. ముందు చొక్కాలు విప్పి తుండు మెడలో వేసుకుని రండి పొండి అన్నాడు అర్చకుడు. ఇది ఇప్పాల్సిన చొక్కా కాదులే అన్నాను - ముడియాదు అనో కడియాదు అనో ఆపేశాడు - చొక్కా విప్పుకొని యాక్టు చేస్తే మలయాళీ వెండితెర మీద వెలిగేవాణ్ని - అనుకుని మీరు పోయి రండి - అడాళ్లకో రూలు - మగాళ్లకో రూలునా? వాళ్లని రానివ్వడమా? అంటూ జోకేను. అబ్బే.. చలనం లేదు. మావారిజమ్మ కమలమ్మా తమిళ్‌లో లెక్చర్ దంచగా - పూజారి మెత్తబడి.. బనియను ఉంచుకో మనుమీ అని తెలుగులో అన్నాడు. చెప్పాడు. షర్టు తీసి మెడలో వేసుకోమని మా పురజనుల అభ్యర్థన మేరకు నేను మొత్తానికి పొజకి గోత్రనామాలు చెప్పాను. అర్చకుడు మంత్రం తమిళా? సంస్కృతమా? అనడిగాడు. అప్పటికే వాళ్లు దేవుడికి తమిళం మప్పేశారన్నమాట. రెండూ ఒకటేలే అన్నాను. ఈవో వచ్చాడు. ఇంగ్లీషులో చెప్పాడు - తమిళం సర్వోత్క్రుష్టం - జోకులెయ్యకండి ప్లీజ్.. అక్కడి నించి సాతనూర్ అందాల పార్కులకి చేరుకునేసరికి కనులు శరీరం రెండూ సేద తీరాయి. లక్కీగా నా దగ్గర 35 ఎంఎం కెమెరా ఉంది. అదీ రాధాకృష్ణగారు ఇచ్చారు. అచ్చంగా కాదు సుమా! ఎపుడో మూడ్ చెడితే - అన్నట్లు ఆ కెమెరా మీ దగ్గర ఉందా? బాపుకి కావాలిట. రోజూ మరిచిపోతున్నాను - అని చిన్నపిల్లాడు ఇచ్చిన తాయిలం నాది నాకిచ్చీమన్నట్లు అడుగుతాడు. అలాగే తిరిగి బాపు దగ్గర నుంచి తెచ్చి నాకిచ్చినా ఆశ్చర్యం లేదు. సరే, అందులో మా సినీ విలేఖరి స్టూడియోలో ఫిలిం ముక్క వేయించి పెట్టాడు. బొమ్మలు తీశాను మా సైన్యానికి.. చిక్కేమిటీ అంటే ముప్పై ఐదు చిన్ని కాంటాక్టు ప్రింట్లు మాత్రం వస్తాయి. ఇప్పటికీ కొన్ని బొమ్మలు గుభేల్ దస్త్రాల్లో పాత ఆల్బమ్స్‌లో ఉంటాయి. రెండో రోజు రాత్రి చౌల్ట్రీయో, గెస్టు హౌసో మొత్తానికి నాకూ అకౌంటెంట్ గారికి రెండు మంచం బల్లలు ఏర్పాటు చేశారు. అటువైపు మహిళామణులు.
బసవేశ్వర్ ఓ పాట అందుకో అన్నాను. సోలోనా? డ్యూయెటా సార్! ఇక్కడ లతామంగేష్కర్ లేదులేవయ్యా.. అన్నాడు నరసింహారావుగారు.
ఆ మాటే అనొద్దు.. లలితగారు అద్భుతంగా పాడుతుంది తెరియుమా? వారిజ కమల ఒకేసారి చెప్పారు.. ఏమిటి నమ్మకం? అడిగాను నేను.. ఆమె మంచి రచయిత్రి అని తెలుసు. బాగా పొడగరి ప్రక్కన ఎవరూ మగాళ్లు ఫొటోలో కూడా నిలబడటానికి ముందుకి రారు. కానీ, సంగీత సాధన చేసింది అని ఆమె తమ్ముడు ఆర్టిస్టు కార్టూనిస్టు సాంబు చెప్పలేదు.. వీరాజీగారు నవ్వనంటే.. అంటూ ఆ వున్నా జీరో బల్బు కూడా ఆఫ్ చేయించి పాట ఎత్తుకున్నది - లతామంగేష్కర్ పాడిన అద్భుతమైన తెలుగు పాట ‘నిదుర పోరా తమ్ముడా...’ లతగారి రికార్డు పెట్టినంత సహజంగా ఉన్నదామె వాయిస్.. మర్నాడు అందరూ గుడ్‌మార్నింగ్ మాడం అంటూ ఆమె చుట్టూ చేరి అభినందించేసరికి - ఎడిటర్‌గారు మాట్లాడలేదు అన్నదామె నావేపు గర్వంగా ఆసక్తిగా చూస్తూ... ఆటోగ్రాఫ్ ప్లీజ్! అంటూ ముందుకి వంగి సిన్సియర్‌గా అభినందించాను. ముఖేముఖే సరస్వతి అన్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక అనితర సాధ్యమైన టాలెంట్ ఉంటుంది. ఆమెను లతాజీ అన్నామంతా.. ఇప్పటికీ ఆ రాత్రి ఆమె పాడిన పాట - కమ్మని గొంతు.. లత పాడిన తెలుగు జోలపాటకే అందం తెచ్చినట్లు స్ఫుర్తిస్తూ ఉంటుంది. లలితమ్మా ఆనక హైదరాబాద్ డైలీకి బదిలీ అయ్యింది. వీక్లీ నుంచి నేను బెజవాడ డైలీకి బదిలీ అయిపోతున్నప్పుడు - మా స్ట్ఫా ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తున్నట్లు చలించి పోవడం నేను ఎన్నటికీ మరిచిపోను.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com