S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుముహూర్తం

‘సుముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల 30 సెకెండ్లకు ముగుస్తుంది’ చెప్పాడు పెళ్లి చేయటానికి వచ్చి పూజారి -కం- పురోహితుడు.
‘ఆపైన దుర్ముహూర్తం’ అనీ హెచ్చరించాడు.
‘ఎంత దుర్ముహూర్తం?’ అడిగాడు పెళ్లికూతురు తండ్రి.
‘ఘోరమైన దుర్ముహూర్తం. ఆపైన క్షణం కూడా ఉండను. క్షణం ఆలస్యం అయినా నేనుండను. ఇక్కడ ఉండటమే కాదు, ఎక్కడా ఉండను. ఎవరికేమి ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేను’ అన్నాడు పూజారి -కం- పురోహితుడు.
‘అంత ప్రమాదకరమైన ముహూర్తం ఎందుకు పెట్టారండీ?’
‘నేను నిర్ణయించినంత సుముహూర్తం అంతకు ముందు పదేళ్లలో, ఇక ముందు పదేళ్లలో లేదు.’
‘అయితే ఆ సమయానికి మాంగల్య ధారణ చేయించండి’
‘అదే నా అభీష్టం! మీరు సహకరించాలి’
‘తప్పకుండా! రెండు నిమిషాలకు మించి ఆలస్యం చేయరాదు. రాబోయే పరిణామాలు ముహూర్తానికి ముందయితే పరమ అద్భుతంగా తర్వాత అయితే పరమ ఘోరంగా ఉంటాయి. దుర్ముహూర్తంలో పెళ్లి చేస్తే, చేసిన నాకు చెప్పరాని ప్రమాదం సంభవించవచ్చు. వధూవరులకే కాదు వాళ్ల మాతాపితలకు సంభవించే ప్రమాదం నేనూహించలేను. బంధుమిత్రులకు పెళ్లికి వచ్చిన ఆహ్వానితులకు, అనాహ్వానితులకు ఏమయినా జరగవచ్చు’ పురోహితుడు హెచ్చరించాడు.
‘పది నిమిషాలకు ముందే, ముహూర్తం కంటే ముందే పెళ్లి జరిపించేస్తే?’ తండ్రి అడిగాడు.
‘సర్వశ్రేష్ఠం’ పూజారి -కం- పురోహితుడు చెప్పాడు.
‘ఎవరొచ్చినా, రాకపోయినా పెళ్లి చేయించండి’
‘బంధువులు రాలేదు. మినిస్టరు రాలేదు అంటూ నన్ను ఆపరాదు. మీరు ఆపాలని చూచినా, నేను ఆపను. ఆగను. పెళ్లి చేసేస్తాను’
‘మీ ఇష్టం!’
ఉదయం అంతా సిద్ధమయింది.
పెళ్లికూతురి విడిదీ గది కిటకిటలాడుతూ ఉంది. బంధువులు, స్నేహితురాళ్లు చుట్టూ చేరి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు.
పెళ్లికొడుకును తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు అలంకరించటం, సతాయించటం, ఒకవైపు సాగుతుంటే, మిత్రులు వచ్చి, గోల చేయటానికి, అదే అభినందించటానికి, గది వెలుపల గందరగోళం సృష్టిస్తూ మరోవైపు గుమిగూడారు.
నిక్కర్లు, త్రీఫోర్తులు, పేంటులు వేసుకొనే పెళ్లికొడుక్కు పంచె ఒక ప్రమాదకరమైన అలంకారమై కూర్చుంది. అవసరం కంటే కూడా. అసలు పెళ్లెందుకు పంచె కట్టుకొనే చేసుకోవాలి?
అసలు పెళ్లికి పంచె - లాల్చీ - పైపంచె ఏమనవసరమో ఏమవసరమో పెళ్లికొడుక్కు అర్థం కాలేదు. విసుక్కొంటున్నారు.
నుదుట ఒక బాసికం, బుగ్గనొక దిష్టిచుక్క చాదస్తపు అలంకారాలుగా అసహ్యించుకొన్నాడు కానీ, అమ్మంటే భయంవల్ల, పిడికిలితో ఆమె వేసే నెత్తిపోట్లు నూరేళ్ల దాకా ఉండేవి కావటంవల్ల, నోరు మూసుకొని ఉన్నాడు.
పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు పట్టుపంచె, పట్టులాల్చీ గరగరలు, గురగురలు, బన్నీను, డ్రాయరు తీర్చి బ్రతికించాయి.
తనకే ఇంత అసహ్యభారం ఉంటే పెళ్లికూతుర్ని ఇంకెంత భరింప శక్యంకాని బరువు బంధనాలతో బిగదీసి చంపుతున్నారో అని సానుభూతితో ఆమెను గుర్తు తెచ్చుకొని బాధ పడ్డారు కానీ, ఆమెకు చీరెలు అలవాటే కదా అని ఆనందించాడు.
అవస్థ తనదే! ఎవరికి అర్థమవుతుంది?
‘నేను గంగిరెద్దునా?’ తల్లినే అడిగాడు.
‘కాదు. బంగారుకొండవి!’ అని మెళ్లో తాడులాంటి బంగారు గొలుసు వేసింది.
వేయించుకోకపోతే ఆమె పిడికిలి ఎత్తుతుంది. మొట్టికాయ అని దాని పేరు ఆటంబాంబు అంటే ఎవరికీ అర్థంకాదు.
స్నేహితులు వెంటపడ్డారు. సినీమాల్లో, డ్రామాల్లో, యూ టూబుల్లో హాస్యగాళ్ల పేర్లన్నీ చెప్పి, వాళ్ల తలదనే్నటట్లున్నావని అభినందించారు.
తండ్రి వచ్చి ‘సమయం దాటరాదు’ అని ఒక కేక పెట్టాడు. ఆయన చండశాసనుడు. పొలాల్లో కూలోళ్ల మీద అరిచే స్థాయిలో అరిచి, భార్యను బెదరగొట్టి, ఇంక ఎవరినో ఎక్కడో చెదరగొట్టడానికి వెళ్లాడు.
పెళ్లికొడుకును సాఫ్ట్‌వేర్ సంతానం సతాయిస్తూ వెంటపడింది.
ఒక పెద్ద ప్రొసెషిన్ వెంటరాగా, ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి ప్రవేశించాడు పెళ్లికొడుకు.
ఒక పీట వేశారు. బెత్తెడెత్తు కూడా లేదు. కుషన్ కూడా లేదు. దాని మీద కూర్చున్నాడు. అది ఎదురు పొడుచుకొంది. మంట! ‘పెళ్లిపీటలు ఏమిటి? కుర్చీలు వేస్తే ఏం నష్టం?’ పెళ్లికొడుకు గొణుక్కొన్నాడు. తన గొణుగుడు తనకే వినిపించలేదు. వినిపిస్తే తల్లి పిడికిలి ఉండనే ఉంది. మొట్టికాయ అంటే సామాన్యమా?
బ్రహ్మ అనుమతి ఇస్తే అమ్మ పిడికిలితో పిల్లల్ని కనగలదు. పెంచగలదు. అవసరమైతే మొట్టికాయతో యముడి శ్రమ తప్పించగలదు.
ఈ పెళ్లికూతురు ఏం చేస్తుందో, తొందరగా వస్తే బాగుణ్ణు! పీట మంట! తాళి కట్టేస్తే ఒక పనయిపోతుంది. పీట తంటా తప్పుతుంది. ఆలోచిస్తున్నాడు పెళ్లికొడుకు.
రావలసిన బంధుమిత్రులందరూ పూర్తిగా రాలేదు. పెళ్లి కాగానే రిసెప్షన్. బహుమతులు ఇంకా కొనని వాళ్లు అప్పటికప్పుడు కొంటూ కూడా ఉంటారు.
రిసెప్షన్ జరుగుతున్నప్పుడే భోజనాలు సిద్ధంగా ఉంటాయి. కూర్చునే వాళ్లు, నిలబడేవాళ్లు, వాళ్ల ఇష్టం వచ్చినట్లు, భోం చేస్తారు. టేబిళ్లూ వేశారు. కౌంటర్లూ తెరిచారు. అంతా సిద్ధం. క్యూలదే ఆలస్యం!
కళ్యాణ మండపం సగం నిండింది. వేదిక పూర్తిగా నిండింది. ఇంకా పెళ్లికూతురు రాలేదు. ఆమెతో వచ్చే జనం కూడా సిద్ధమయితే, వేదిక కిటకిటలాడుతుంది. కిటకిట బొమ్మ, కిటారి బొమ్మ అయ్యేది ఖాయం.
పురోహితుడు వాచీ చూసుకొంటున్నాడు. ఫొటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఇరుపక్షాల అడ్వాన్సులు తీసుకొన్నా వాళ్లు చేరారు.
తల్లికొడుకు పక్కనే కూర్చుంది. మెడ సర్దుతుంది. జుట్టు సర్దుతుంది. చొక్కా లాగుతుంది. అవసరం లేకపోయినా ఆనందంగా సందడి చేస్తూ ఉంది. పెద్దక్కను రానీదు. చిన్నక్కను చేరనీదు. సింహాసనం మీద కూర్చున్న మహారాణిలాగా ఎవర్నీ పక్కన కూర్చోనీయలేదు. నిలబడనీయలేదు.
తండ్రికి ఎంత పొలం ఉన్నప్పటికీ, ఆమే దున్నిస్తున్నట్లు భర్త మీద పెత్తనం చేసే ఇల్లాలు కావటాన భర్తను ఆ ప్రాంతంలోకి రానియ్యలేదు.
ఎంతసేపూ తన నగలు సవరించుకోవటమో, చీరె సరిచేసుకోవటమో తల జుట్టు రేగకుండా రక్షించుకోవటమో చేయలేక సతమతమవుతూ ఉంది, ఆమె.
అప్పుడు పెళ్లికూతురు రాసాగింది. ఆమె వొంటి మీద ఎన్ని కేజీల బంగారం ఉందో అంచనా వేస్తూ ఉంది పెళ్లికొడుకు తల్లి.
‘పిల్లకి గాలాణ్ణీండి’ అని ఆందోళనగా కేక పెట్టింది.
కోడలై, ఇంటికి వచ్చాక ఇంకెంత గావుకేకలు పెడుతుందో తెలుసుకోవటానికి ఇది శాంపుల్ మాత్రమే.
పువ్వు కూర్చున్నట్లు కూర్చుంది పెళ్లికూతురు. కోడల్ని చూచుకొంటూ మురిసిపోతూ ఉంది తల్లి.
వచ్చే వాళ్లను ఆహ్వానిస్తున్నాడు తండ్రి.
పెళ్లికూతురు తల్లి, అక్క, చెల్లి పక్కన చేరారు. వీళ్లు ముగ్గురూ కలిసి చేయబోయే మహత్తర ఘనకార్యం. జడ ఎత్తి పట్టుకోవటం, తాళి కట్టేప్పుడు, కట్టేవాడికి కష్టం కలక్కుండా చూడటం.
వాళ్లిద్దరూ, వధూవరులు, ఒకర్ని ఒకరు చూచుకొని నిస్సందేహంగా నవ్వుకొన్నారు. వాళ్లు సాఫ్ట్‌వేరు సహోద్యోగులు.
అటు బంధుమిత్రులు, ఇటు బంధుమిత్రులు ఏకధాటిగా రాసాగారు.
మహానగరంలో ఎన్ని బట్టల షాపులు, బంగారు దుకాణాలు ఉన్నాయో తెలియాలంటే ఇటువంటి సంపన్నుల పెళ్లి చూడాలి.
కొత్త చీరెల పెళపెళార్భటులు, కొత్త నగల ధగద్ధగాయమాన కాంతులు, వినాలన్నా, చూడాలన్నా రెండింటి వల్ల తరించాలన్న ఈ పెళ్లికి వచ్చిన వాళ్లదే భాగ్యం.
పెళ్లిళ్లలో పెత్తనమంతా, ఆరుూ తల్లిదండ్రులది కాదు. ఆరుూ బంధుమిత్రులది కాదు. పురోహిత్ వర్గంది కాదు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లది.
వాళ్లు తిరగని చోటు లేదు. తీయని సన్నివేశం లేదు. మంటపం వాళ్లదే! వేదికా వాళ్లదే! అవసరమైతే అంగుళం స్థలంలో ఆరు అడుగుల మనిషి ఇరుక్కుపోగలడు.
ఏ భంగిమ కావాలి. ఏ ఠీవి కావాలి. ఏ దర్జా వెలగాలి. ఏ దర్పం పడాలి అంటే వాళ్లకు తెలిసినంత బాగా సృష్టికర్తకు కూడా తెలియదు.
పెళ్లిళ్లలో వాళ్లు అప్రకటిత అధికార గణం. వాళ్ల మాటకూ చేతకూ తిరుగులేదు.
పురోహితుడు వాచీ చూచుకొంటున్నాడు.
ఫొటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు మధ్య మహానుభావులున్నారు. వాళ్లను సెల్‌గ్రాఫర్లు చుట్టుకోసాగారు.
సెల్‌లు చేతుల్లోకి వచ్చాక అంతరిస్తున్న సంప్రదాయ కళలు ఫొటోలు, వీడియోలు.
సెల్‌తో చేయలేని పనీ, చేయరాని పనీ లేదు. సెల్‌గ్రాఫర్లు పెళ్లికూతుర్ని తీసినంతసేపు తీశారు. పెళ్లికొడుకును సెల్‌లో బంధించినంత సేపు బందించారు.
భార్యల్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసేవాళ్లు, స్నేహితురాళ్లను, వాళ్ల సొగసు సోయగాలు చిత్రించేవాళ్లు సెల్‌లతో విసుగు విరామం లేకుండా ఉన్నారు. ఈ యంత్రశక్తులు వేదిక చుట్టూ చేరి, వేదిక మీద ఏం జరుగుతూ ఉందో మంటపంలో వాళ్లకు తెలియకుండా చేస్తున్నారు. శబ్దాల కోసం మైకుల్ని, లౌడ్‌స్పీకర్లను, దృశ్యాలు శబ్దాలు కోసం స్క్రీన్‌లను ఆశ్రయించారు. ఆహ్వానితులు, స్ర్తి పురుష అనే్వషణలో ఉన్నవాళ్లు, వినోద ప్రేక్షకులు, ఆకలిని అణచుకొంటున్న మృష్టాన్న భోజన ప్రియులు. పెళ్లంటే కుక్కలకే కాదు, పిల్లలకు కాలు నిలువదు. వాటిని తోలలేక, వీళ్లను పట్టుకోలేక, జనం పడే హైరానా పెళ్లిలోనే చూడాలి.
పురోహితుడు వాచీ చూచుకొంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.
పెళ్లికూతురు నెత్తిన పెళ్లికొడుకు, చింతపండు లాంటి బెల్లం లాంటిది జిలకరతో కలిపి పెట్టబోతుంటే పెళ్లికూతురు తల్లి తమలపాకు పెట్టింది. దాని మీద దీన్ని పెట్టమని అల్లుణ్ణి ఆజ్ఞాపించింది.
పెళ్లికొడుకు తల్లి ఆక్షేపించింది. ఆకు వీల్లేదండి. ఆ తల్లి వీలుంది అంది. పెద్ద గలాటా కాబోయే వ్యవహారాన్ని కాలం దృష్టితో పురోహితుడు పరిష్కరించాడు.
‘ఎలాగయినా శాస్త్రం అంగీకరిస్తుంది’ అన్నాడు. తల్లుల నోళ్లు టక్కుమన్నాయి.
నెత్తిన పెట్టిన చేయి తీయవద్దన్నారు ఫొటోగ్రాఫర్లు. ‘చేయి అట్లాగే ఉంచు’ అన్నారు వీడియోగ్రాఫర్లు.
మధ్యలో సందు చేసుకొని సెల్‌గ్రాఫర్లు దూరారు. వీళ్ల దండు పెద్దది. వీళ్ల ధాటికి తట్టుకొనే జనం లేరు. ‘మళ్లీ నెత్తిన చేయి పెట్ట’మన్నారు. నెత్తిన చేయి పెట్టమనకూడదు
సుముహూర్తం (7వ పేజీ తరువాయ)
అని తల్లులు ప్రతిఘటించారు.
సెల్‌లోళ్లు, ఫొటోలోళ్లు, వీడియోలోళ్లు తృప్తి చెందాక పెళ్లికూతురి నెత్తి మీద చేయి, పెళ్లికొడుకు తీయగలిగాడు.
హోరు ఒక్క రకమా? బ్యాండు వాళ్లు, సన్నాయి వాళ్లు, మైకు వాళ్లు, స్క్రీన్ వాళ్లు, వేదిక వాళ్లు, మంటపం వాళ్లు, స్ర్తిలు పురుషులు పిల్లలు యువతులు యువకులు ఒక్క రకమా? ఒక్క వయ్యారమా? ఒక్క శబ్దమా? ఒక్క గోలా? భారతదేశమే పెళ్లికి వచ్చినట్లుంది.
పురోహితుడు వాచీ చూచుకొంటున్నాడు. పెళ్లికొడుకు తండ్రిని హెచ్చరిస్తున్నాడు. తల్లిని తొందరపెడుతున్నాడు.
‘సూత్రధారణ! సూత్రధారణ!’ అరుస్తున్నారు.
మంత్రాలు చదివే పురోహిత వర్గం హోరెత్తిస్తున్నారు. అంతా సందడి. పెళ్లికొడుకు తండ్రికీ, పురోహితుడికీ ఆందోళన.
‘సుముహూర్తం దాటుతూ ఉంది. దుర్ముహూర్తం వస్తూ ఉంది’ అరుస్తున్న శబ్దం ఆలకించే నాథుడు లేడు.
సూత్రం తెచ్చారు. పదిమంది దీవెనలు పొందారు. పురోహితుడికిచ్చారు, అది పెళ్లికొడుక్కు ఇచ్చి ‘తొరగా కట్టు’ అన్నాడు.
తలంబ్రాలు పంచుతున్నారు.
పెళ్లికొడుకు పట్టుకొన్న తాళిబొట్టును అందరికీ చూపించాడు. ఫొటోలు, వీడియో, సెల్‌లు క్లిక్కులు! క్లిక్కులు క్లిక్కులు.
‘తొరగా! తొరగా’ అంటున్నాడు పురోహితుడు.
‘ఆగు! ఆగు!’ అంటున్నారు యాంత్రికులు.
పురోహితుడు గడియారం తీసి నేలకేసి కొట్టి ‘కట్టు’ అన్నాడు.
పెళ్లికొడుకు మంగళసూత్రం కట్టటానికి నిలబడ్డాడు. క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు..
వంగాడు పెళ్లికొడుకు.
క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు..
మెళ్లో మంగళసూత్రం వేలాడుతుండగా మెడ మీద మూడు ముళ్లు వేయటానికి పెళ్లికొడుకు సిద్ధమయ్యాడు.
పదిమంది ఆడవాళ్లు పెళ్లికూతురి జడ ఎత్తి పట్టుకున్నారు.
క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు..
పెళ్లికొడుకు పొజిషన్-
క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు...
‘కట్టు! కట్టు! కట్టు’ పురోహితుడి కేకలు.
‘ఆగు! ఆగు! ఆగు!’ ఆడవాళ్ల అరుపులు.
సమయం మించిన, ఓర్పు నశించిన పురోహితుడు పుష్పం మంటపానికి చూపుతూ, ముఖం పెళ్లికొడుక్కు చూపుతూ ‘కట్టు! కట్టు! కట్టు’ అని ఏడుస్తున్నట్లు అరుస్తున్నాడు.
‘ఆగు! ఆగు! ఆగు’ ఆడవాళ్లు
‘ఉండు! ఉండు! ఉండు’ గ్రాఫర్లు..
‘అటు తిరుగు! ఇటు తిరుగు’ జనాలు
‘నువ్వడ్డంలే!’ పెళ్లికొడుకు తల్లి పురోహితుణ్ణి కోరింది.
‘కట్టు! కట్టు! కట్టు’ పురోహితుడు అరుస్తున్నాడు. ‘సుముహూర్తం దాటుతూ ఉంది. దుర్ముహూర్తం వస్తూ ఉంది’ పురోహితుడు ఏడ్చినట్లు కేకలు పెడుతున్నాడు.
‘నువ్వులే’ అంది తల్లి ‘ఏమీ కనపడటం లేదు ఎవరికీ’
పురోహితుడు తప్పుకోలేదు.
ఆమె పరపురుషుణ్ణి తాకదు. స్వపురుషుణ్ణే ఎప్పుడో తప్ప అంటుకోదు. అంటుకోనీదు.
పురోహితుణ్ణి దూరంగా నెట్టివేయాలని చూచింది.
అతను కదలటంలేదు.
ఆమె మనిషిని తాకి నెట్టదు.
అడని వొంటి మీద చొక్కా లేదు. జంధ్యం పంచె మాత్రమే ఉన్నాయి.
జంధ్యం శరీరాన్ని అంటుకొని ఉంది. కాబట్టి తాకలేదు. కట్టు పంచే గోచీ వాటంగా ఉంది. దాన్ని పట్టుకొని లాగింది.
పురోహితుడు పంచె ఊడి, పక్కకు వచ్చాడు.
‘పరాభవం! అవమానం!’ అంటూ అరిచాడు.
క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు..
‘సుముహూర్తం దాటిపోయింది’ అరిచాడు పురోహితుడు.
వేదిక ఎక్కిన వీడియోగ్రాఫరు వేదికను తీస్తున్నారు. మంటపాన్ని తీస్తున్నారు. పురోహితుడి గోల తీస్తున్నాడు. తల్లి చేతులు తీస్తున్నాడు. పురోహితుడి గోచీ తీస్తున్నాడు. అతడి అవమానాగ్నిని తీస్తున్నాడు. ఈ గోలలో, వేదిక ఎక్కడ ముగిసిందో, మంటపం ఎక్కడ మొదలయిందో చూచుకోలేదు. పెళ్లిని చూస్తున్నాడు కానీ తనను చూచుకోవటం లేదు.
పెళ్లికొడుకు పెళ్లికూతురి మెళ్లో తాళి ఇంకా కట్టలేదు. అట్లా పట్టుకొని నిలబడ్డాడు స్టిల్! స్టిల్! స్టిల్! క్లిక్! క్లిక్! క్లిక్..
పురోహితుడు పక్కకు పోయి గోచీ పెట్టుకొని, ‘దుర్ముహూర్తం వచ్చింది. మీ సావు మీరు సావండి’ అని దూరంగా కూర్చున్నాడు.
‘నా గోచీ ఊడిన క్షణాన దుర్ముహూర్తం వచ్చింది’ అన్నాడు.
ఎవరూ పట్టించుకోలేదు.
క్లిక్! క్లిక్! క్లిక్!
ఆగ్! ఆగ్! ఆగ్!
వీడియోగ్రాఫరు వీడియ తీస్తూ వేదిక మీద నుంచి, కాలు జారి, మంటపంలో ఫ్లోర్ మీద పడ్డాడు.
గట్టి ఫ్లోర్!
తల నేలకు తగిలింది. పగిలింది. రక్తం కారసాగింది.
అంతా నిశ్శబ్దం!
సూత్రధారణ జరగలేదు.
పెళ్లికొడుకు స్టిల్! పెళ్లికూతురు స్టిల్! వేదిక స్టిల్! మంటపం స్టిల్! శబ్దం స్టిల్!
వీడియోగ్రాఫరుకు స్పృహ లేదు. నలుగురు వచ్చారు. ఎత్తుకుపోయారు. కారు హారను వేసింది.
‘స్వామీ!’ అన్నాడు పెళ్లికొడుకు తండ్రి.
‘దుర్ముహూర్తం వచ్చింది. నా అవమానంతో, వాడి రక్తసమర్పణతో దుర్ముహ దుష్ట ప్రభావం తీరింది. ఇంక పెళ్లితంతు ముగించుకోండి’ అన్నాడు పురోహితుడు.
‘సూత్రధారణ చేయించు స్వామీ!’ అన్నాడు తండ్రి.
గోచీ బిర్రుగా పెట్టుకొంటున్న పురోహితుడు వచ్చి ‘తాళికట్టు. నెమ్మదిగా. అందరికీ కనపడేట్టుగా, అందరూ ఫొటోలు! వీడియోలు! సెల్‌లు తీసుకొనేంతగా’ అన్నాడు.
జడ ఎత్తిన వాళ్లు స్టిల్!
పెళ్లికూతురు స్టిల్!
పెళ్లికొడుకు తీరుబడిగా ఒక గంటసేపు తాళి కడుతూనే ఉన్నాడు.
తలంబ్రాలు పడుతూనే ఉన్నాయి.
ఫ్లాష్‌లు వెలుగుతూనే ఉన్నాయి.
బాండు సన్నాయి మోగుతూనే ఉంది.
ఏదీ ఆగలేదు!
వధూవరులు నిలబడ్డారు.
బంధుమిత్రులు, గిఫ్టులు, పాకెట్లు, పర్సులు, బహూకరణలు, కరచాలనాలు, గళ చాలనాలు. రద్దీ!
భోజనశాలకు ప్రయాణాలు.
రుచులు! వాసనలు! ఆకళ్లు!
క్లిక్కులు! క్లిక్కులు! క్లిక్కులు!
నవ్వులు! కేరింతలు! తుళ్లింతలు!
వేదిక మీద జనం పలుచబడ్డారు. మంటపంలో రద్దీ తగ్గింది. భోజనశాలలో, తొడ తొక్కిడి! మెడ తొక్కిడి! వడ తొక్కిడి!
జనమే జనం!
వేదిక మీద పెళ్లికొడుకు, పెళ్లికూతురు చేతులు పట్టుకొని నవ్వుకొంటున్నారు.
బైట నుంచి అభినందించే వాళ్లు వస్తున్నారు. భోజనశాలకు వెళుతున్నారు.
పెళ్లికొడుకు తల్లి పర్సు తీసి, పురోహిత వర్గాన్ని సంతృప్తిపరచింది.
‘ఏమీ అనుకోవద్దు స్వామీ!’ అంది తల్లి.
‘అనుకోవటానికి ఏముంది? అంతా దుర్ముహూర్త ప్రభావం!’ అన్నాడు.
పెళ్లికూతుర్ని, పెళ్లికొడుకును తలంబ్రాలతో దీవిస్తూ ‘దుర్ముహూర్త ప్రభావం తప్పిపోయింది’ అన్నాడు ధనవంతులతో.
పేదవాడు, వీడియోలు తీసుకొనే వాడు అదే బ్రతుకుదెరువు అయినవాడు, పేదవాడు, వాడితోఎవరూ ‘దుర్ముహూర్త ప్రభావం దాటిపోయింది’ అని చెప్పలేదు.
వధూవరుల కిలకిలలు రహస్య సంభాషణగా మారిపోయాయి.
అందరూ వెళ్లిపోయినా అక్కణ్ణుంచి పెళ్లికొడుకు తల్లి కదల్లేదు.
కళ్యాణ వేదికను పరిపాలిస్తున్న మహారాణిలాగా ఉంది.
ఉందో! పోయిందో!
‘నా గోచీ లాగి, దుర్ముహూర్తాన్ని పెళ్లికొడుకు తల్లి సొంతం చేసుకొంది. నన్ను కాపాడింది’ అనుకొంటూ వెళుతున్నాడు పురోహితుడు. *

-ఆచార్య కొలకలూరి ఇనాక్.. 94402 43433