S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిలిచీ నిలువని విలువ

ఆదివారం -
తెలతెలవారుతోంది.
వీధి తలుపు చప్పుడు. వెళ్లి చూశాను. మా సుందరమ్మత్తయ్య. పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఆమె ఎప్పుడూ చెప్పాపెట్టకుండా ఇలాగే వచ్చేస్తూ ఉంటుంది. ఎవరింటికైనా వెళుతూ ఉంటుంది. రమ్యని చూడటానికి వచ్చిందన్నమాట! మా అమ్మాయి రమ్య కానుపు అయి ఇవ్వాళ ఎనిమిదో రోజు.
మా ఆవిడ శారద - అప్పటికప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని పూజగదిలో ఉంది. తానూ హాల్లోకొచ్చింది.
హాల్లో గోడపక్కన పడుకున్న శాంతీ, సూర్యం మంచంలో మసలి మళ్లీ ముసుగుదన్నారు. శాంతి ఇంటర్‌లో, సూర్యం తొమ్మిదో తరగతిలో ఉన్నారు. ఇవ్వాళ వాళ్లకి ఆటవిడుపు.
‘రమ్యకు ఆడపిల్ల అని వినేసరికి నాకు చాలా సంతోషమేసిందర్రా. ఆమయాన వచ్చేశాను’ అంటూ బాత్‌రూమ్‌లోకి పోతూ, ‘ఎట్టాగైనా పిల్లలుగల తల్లివి. ఓర్పూ, సహనం ఎక్కువ. నాకు తెలీదూ నీ స్వభావం’ అని శారద నుద్దేశించి అంటూ వెళ్లింది.
శారద పెదవుల మీద ముసిముసి నవ్వు. మొహం మీద గర్వరేఖ. నా వైపో చూపు. నేనూ నవ్వాను.
‘అందరికీ తెలిసిందేగా. దేశంలో ఎక్కడా ఏ ఆడపిల్లకీ కానుపయ్యిందన్న నీకు పండగే. జనాభా వృద్ధి అనేది నీ నినాదం కదా అత్తయ్యా’ అంటూ అనేశాను.
క్షణాల తర్వాత వచ్చి కూచుంది అత్తయ్య. శారద వెళ్లి కాఫీ తెచ్చింది. తీసుకుని, ‘ప్రసాదం నువ్వయినా ఫోన్ చెయ్యలేదేరా?’ అని నాకో ప్రశ్నని సంధించింది. నేనేమీ అనకుండా కాలకృత్యాలకు కాలు కదల్చాను.
మా కాఫీలు అయినై. నిదానంగా లేచి రమ్య గదిలోకి నడిచింది అత్తయ్య. రమ్య లేచే ఉంది.
‘ఎట్టా ఉన్నావ్ అమ్మమ్మా?’ రమ్య అడిగింది.
‘నాకు నా పరామర్శేమిటే. గుండ్రాయిలా ఉన్నాను. నువ్వెట్టా ఉన్నావో చూద్దామనే వచ్చాను’ అని ‘అంతా బాగుందా. కట్టెకారం తింటున్నావా? నడికట్టుందా? సోకులు పోతున్నావా?’ అడిగింది. ‘ఆడపిల్లని కన్నావ్. లక్ష్మీదేవిని తెచ్చుకున్నావ్. మీ అమ్మ చాలు’ అంటూ వంగి పుడుకు పుడుకున బిడ్డని చూస్తూ ‘తండ్రి పోలికలా ఉంది. అదృష్టవంతురాలు’ అని ‘అదిగో నువ్ కదిల్తే అదీ కదులుతోంది. పాలు కావాలేమో చూడు. పసిగుడ్డు, మాటా, మంతా? లేగ తీరే’ అని నవ్వుతూ ఇవతలి కొచ్చింది. రమ్య కూడా చిరునవ్వుతో బిడ్డని గుండెలకి పొదువుకుంది.
గది బయటికొచ్చి, శారదా, అత్తయ్యా వంటింటివైపు కదిలారు. నేను కుర్చీ లాక్కుని వాకిలి దగ్గరగా కూచున్నాను.
అత్తయ్య కబుర్లు మొదలెట్టింది. ఇక, అనేక వార్తావిశేషాలే. రాజకీయాల నుంచీ, సాహిత్యం దాకా, ఆర్థికం నుంచీ సంఘసేవ దాకా ఆమె దగ్గర కోకొల్లలుగా ఉంటాయి విశేషాలలు. ఆమె అనుభవాలూ, ఆలోచనలూ కూడా మధ్యమధ్యలో దొర్లుతూ ఉంటాయి. చిన్నప్పట్నుంచీ రామాయణ, భారత భాగవత పురాణాలన్నీ చదివిన వ్యక్తి. ఎంతమంది చెప్పగా ఎనె్నన్ని ప్రవచనాలు విన్నదో? ఆ శ్రుత పాండిత్యాన్నంతటినీ కూడా జీర్ణించుకున్నది.
పెద్ద బంధు బలగం ఉన్న కుటుంబంలో పుట్టింది అత్తయ్య. ‘అమ్మగన్న సంతానం ఎనిమిది మందిలో నేను చివరిదాన్ని. అందరూ వెళ్లిపోయారు. నేను మిగిలాను’ అని చెప్పుకుంటూ ఉంటుంది. పోయిన వారి కొడుకులూ, కూతుళ్లూ వారి వారి సంతానాలూ అంత కలిపి ముప్పై నలభై మందన్నా ఉంటారిప్పుడు.
అయితే, ఈ తరంలోని యువ దంపతులు పిల్లల్ని కనటం లేదని ఆమెకు బాధ. ఒక విషయంలో మాత్రం అసంతృప్తీ, కోపమూ ఉన్నాయి. అందరిలోనూ ఆ ప్రసక్తిని తెచ్చి చాలా ఉద్వేగంతో తన ఆవేదనని చెప్పుకుంటుంది. ఈ తరం సంతానవంతులు కావలసిన ఆవశ్యకతని గురించి ఆమె ‘ఉద్యమ’ స్థాయిలోనే ప్రచారానికి పూనుకుంది.
అత్తయ్య వయస్సెంతో తెలీదు. ఆ మాట తెస్తే వేదాంతం చెబుతుంది. ‘ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతి దినం యాతుక్షయం వనం’ అని శంకరాచార్యని తెస్తుంది. భోళాగా నవ్వేస్తుంది. ఇంకా మాట్లాడుతుంటే ‘తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది, తుస్సుమనుట ఖాయం’ అని తత్త్వాల్ని ఎత్తుకుంటుంది. ఆమెది చక్కని కంఠం. సంగీత జ్ఞానమూ ఉంది. నా అంచనా ప్రకారం ఆమె వయసు డెబ్బై అయిదు పైమాటే.
ఈమె మా నాన్నకి పెత్తల్లి కూతురు. పెళ్లయిన తర్వాత పదేళ్లలోనూ ఆమెకి ఐదు కాన్పులైనా పుట్టిన బిడ్డలు నేలపై కాలు పెట్టలేదు. ఆ గర్భశోకాన్ని తట్టుకుంది. ఆ తర్వాత రెండేళ్లకి ఒక పిల్లవాడు కలిగాడు. భర్త హఠాత్తుగా చనిపోయాడు. ఆయన గవర్నమెంటు ఉద్యోగి. ఆర్నెల్ల పిల్లవాణ్ణి సాకి పెద్దవాణ్ణి చేసింది. పెద్ద చదువులే చదివించి అమెరికా పంపించింది.
భర్త పెన్షన్ వస్తుంది. విశాఖపట్నంలో ఆరొందల గజాల స్థలంలో మూడంతస్తుల ఇల్లు ఉంది. కింది వాటి ఈమెది. అందులో పక్క పోర్షన్‌ని ఆమె సంరక్షకురాలు ఒక ముప్పై ఏళ్లామె కిచ్చింది. అద్దె లేదు. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త ఆటో నడుపుతాడు. ఆమే అత్తయ్యకి చేదోడువాదోడు. మొదటి అంతస్థు ఒక బ్యాంక్ మేనేజర్‌కి ఇచ్చింది. రెండో అంతస్థు అంతా ఖాళీ. అది ఆమె ఇంటికి వచ్చీపోయే అతిథులకు విశ్రాంతి గృహం. పెన్షనూ, అద్దె కలిపి నెలకో నలభై వేల పైమాటే!
అత్తయ్యది చెయ్యి విదిల్చే స్వభావం. విరాళాలూ, గుప్తదానాలూ, వారినీ వీరినీ ఆదుకోవటాలూ - ఇవన్నీ ఆమెకు సహజ కార్యక్రమాలు. ఎవరింట్లో పేరంటమన్నా శ్రమదానానికి సిద్ధమంటుంది. అశుభమైనా అంతే చొరవగా వెళ్లి పనుల్లో చేయందిస్తుంది. బంధువుల్లో దీని మీద చర్చ బాగానే జరుగుతూ ఉంటుంది. పొగడ్తలూ, తెగడ్తలూ.
ఆ కబుర్లూ, ఈ కబుర్లతో సమయం గడుస్తోంది.
‘మీ ఇద్దరూ నేల మీద నడిచే మనుషులు. ఎచ్చులకి పోరు. తక్కువకా నీరు. అందుకనే రమ్యకి నువ్ చక్కని ట్రైనింగ్‌నిచ్చావ్. ‘ప్లాన్’లూ, ‘గ్లీన్’లూ అంటే కనే వయస్సుని బలాదూర్ తిరుగుళ్ల పాల్జేయకుండా చక్కగా పండంటి పిల్లని కన్నది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ తన మాటల్ని కొనసాగించింది.
‘వినాయకచవితి కాగానే నెల్లూరు నుంచీ సుభద్ర ఫోను. అదే రామ్మూర్తి భార్య. మీకు తెలుసుగా...’
తెలుసు. అత్తయ్యకు భర్త తరఫున బీరకాయ పీచు బంధుత్వం. నాకు వాళ్లు గుర్తుకొచ్చారు. రామ్మూర్తి ఏదో ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్. పెద్దపిల్ల వరలక్ష్మి. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఒక పిల్లవాడు. అంతా కూనాగుజ్జు. వరలక్ష్మికి ఇంటర్ కాగానే తెలిసిన కుటుంబంలో పిల్లవాడిని ఇచ్చి పెళ్లి చేసేశారు. అతను ఏదో హాస్పిటల్‌లో పని చేస్తాడు. కానీ, ఈమెకు వాళ్లతోనూ, వాళ్లకి ఈమెతోనూ దగ్గరితనం ఎక్కువ. రాకపోకలూ తరచుగానే ఉంటాయి.
‘వాళ్ల పెద్దకూతురు వరలక్ష్మికి డెలివరీ రోజులు. ‘నువ్వొచ్చి నిలబడితే నాకు ధైర్యం అమ్మమ్మా. దానికిది రెండో కానుపు... అని ఫోన్‌లోనే కళ్లనీళ్లు పెట్టుకుంది’ అని చిత్రంగా నవ్వింది.
‘నాకు తెలీదూ! కంఠస్వరం మనసునీ, మనసులోని భావాన్నీ తెలుపుతుందిరా’ అన్నది. ఆ వెంటనే ‘మొదటి కాన్పుకీ నేనే వెళ్లి చూశానే్ల. మొగపిల్లవాడు. అందుకని అక్కడికి వెళ్లాను. ‘ఆ వరలక్ష్మి ఓ అబ్బనాకారి పిల్లే శారదా. నేను వెళ్లటమే మంచిదయింది’ అన్నది శారద నుద్దేశించి అడక్కుండానే తాను చెప్పింది.
‘ఏమైందన్నట్టు’ శారద అడక్కుండానే తాను చెప్పింది.
‘తీరా నొప్పులు మొదలైన తర్వాత బలహీనం వలన అతలాకుతలమై పోయింది. రామ్మూర్తీ, సుభద్రా తత్తరబిత్తర్లాడుతూ హాస్పిటల్‌కి తీసుకుపోవటానికి మొహమొహాలు చూసుకుంటున్నారు. నేనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్‌లో చేర్పించాను. ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల. ఐదో రోజున తల్లీ పిల్లా కులాసాగా ఇంటికి చేరారు’ అని ఒక్క క్షణం ఆగింది. నా వైపు తిరిగి ‘డబ్బు సమస్యని దాచుకోకూడదురా ప్రసాదం. నలుడంతటి వాడే దరిద్రాన్ని అనుభవించాడు. డబ్బుని నా వంటి దాని దగ్గరెందుకు పెట్టాడు భగవంతుడు? పిల్లలు గలవాళ్లని, శక్తిమేరకు నువ్వు చూసుకోవమ్మా అని కాదూ?’ అని నవ్వింది. నాకూ, శారదకూ విషయం అర్థమైంది.
మా పిల్లలు లేచి హాల్లోకొచ్చారు. ‘ఆ వచ్చారా? రండి. మీ కోసమే ఆగా’ అంటూ వాళ్లని దగ్గరికి తీసుకుంది.
తన బ్యాగ్‌లు తీసి పిల్లలకి స్వీట్‌బాక్స్‌లూ, తినుబండారాలూ, నోట్‌బుక్స్, కలాలూ పంచింది. శాంతికేవో పూసల దండలూ, గాజులూ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్‌షాపర్‌లో నుంచీ కొత్తబట్టలు తీసి శారద చేతికిస్తూ ‘ఇవిగో శారదా - ఇవన్నీ మీ కందరికీ, ఎవరికి ఏవో తెలుస్తూనే ఉన్నాయ్‌లే’ అన్నది. ‘ఇప్పుడివన్నీ ఎందుకు పిన్నీ?’ అని మొహమాటపడుతూ వాటిని అందుకుంది శారద.
‘ఐతే నువ్ రావటం నెల్లూరు నుంచీ అన్న మాట’ అడిగాను.
‘కాదు. నెల్లూరులో బారసాల అయిన తర్వాత విజయవాడ వెళ్లాను’ అంటూ అక్కడి విశేషాలు చెప్పుకొచ్చింది.
అత్తయ్య ఇద్దరు అన్నల కొడుకులూ, కూతుళ్లూ, వాళ్ల పిల్లలూ, ఈమె అక్కయ్యల సంతానం - అంతా ఓ పాతికమంది దాకా విజయవాడలోనే స్థిరపడ్డారు. ఈ తరం పిల్లల్లో ఆరేడుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. బెంగుళూరు చెన్నైల్లో పని చేస్తున్నారు.
ఆ ఆరేడుగురు గురించే ఈమె విచారణా, అసంతృప్తీ, కోపమూ, వాళ్లందరూ ‘కుటుంబ నియంత్రణ’ పథకాల్ని అనుసరిస్తున్న వాళ్లు. పెళ్లిళ్లయి ఐదారేళ్లు అయినా పిల్లాపీచూ లేనివాళ్లు. ఉన్నా ఒక్కరితోనే సంతానానికి చుక్కపెట్టేసిన వాళ్లు ‘మా మనవరాలు హేమ ఉంది చూడు.. శారదా. దానికి పెళ్లయి దశాబ్దం దాటింది. పిల్లలు వద్దని తీర్మానించుకుందిట. ఏమి ప్లాన్‌లో పాడో. పిల్లల్లేని ఇల్లేం ఇల్లురా ప్రసాదం, పాడుబడిన గుడి కాదూ..’ అని గఁయ్‌మని స్వరం మార్చింది. స్వేచ్ఛట స్వేచ్ఛ. ఎప్పుడూ ఏదో దేశం పోతూ వస్తూ ఉండటం. బలాదూర్ తిరుగుళ్లూ, పార్టీలూ, టూర్‌లూ.. తిక్క ఆలోచనలూ, తలతిక్క ప్లాన్‌లూ, పిల్లల్లేకుండా ఒంటికాయ శొంఠికొమ్ము బాపతు. బతుకంటే అదేనేరా ఇక?’ అంటూ ‘ఆఁ..’ అని నన్ను చూస్తూ గద్దించింది.
నేను వౌన శ్రోతగా ఉన్నాను.
శారద వైపు తిరిగి ‘నువ్ చెప్పవే - మొక్క నాటి, నీరు పోసి పెంచి, పూలూ కాయలూ రాకూడదంటే ఎట్టాగే. అది ప్రకృతి వరం కదూ. దాన్ని నిరోధించటం మహా పాపమే కాదు, అనారోగ్యం కూడా. అందుకనే ఆ పీసీఓడీలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్‌లూ, ఎప్పుడూ గుప్పెడు గుప్పెడు మాత్రలు మింగుతూ ఉండటం.’
శారద వైపు చూశాను. కళ్లు చికిలిస్తూ ఆమె సూటిగానే అన్నది, ‘పిన్నికి ఈ విషయాలన్నీ కూడా బాగానే తెలుసు’ అని. ‘ఆఁ.. చూస్తూంటేనూ, వింటుంటేనూ తెలీటం లేదూ.. ఇందులో పెద్ద ఘనతేం ఉంది గానీ’ అని ఆగింది అత్తయ్య.
నిలిచీ నిలువని విలువ (7వ పేజీ తరువాయ)
రమ్య గదిలో నుంచీ పిలుపు వచ్చింది. ‘అమ్మా’ అంటూ. శారద కదిలింది. ఆమె వెనగ్గా అత్తయ్యా కదిలింది.
- భోజనాలైన తర్వాత అత్తయ్య క్యాబ్ బుక్ చేసుకుని, గచ్చిబౌలి వెళ్లొచ్చింది. ఆమె పెద్దన్నయ్య మునిమనవరాలు మానస ఉంది. ఎవర్నో ప్రేమించి పెళ్లి చేసుకుని తన వాళ్లందరికీ దూరమైంది. ఈమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మానసని చూసి వెళ్తుంది.
ఆమె తిరిగి ఇంటికి చేరేసరికీ పది దాటింది. స్నానం చేసి టిఫిన్ చేసింది. అప్పుడడిగింది శారద, ‘మానస బాగుందా పిన్నీ?’ అని ఉదాసీనంగా, నిరుత్సాహంగా నిట్టూర్చింది. ‘బంగారం లాంటి పిల్ల.. గరిటెకాడలా తయారైంది. ఒక నేవళం లేదు, మెరుపూ లేదు. అట్టా నవసిపొయ్యకేం చేస్తుంది - ఇరవై నాలుగ్గంటలూ, ల్యాప్‌టాపూ, ఉద్యోగం. ఆ మొగుడో బండరాయి బాపతు అనిపించాడు. ఇల్లంతా శనివారం సంతలా ఉంది. ఎటు చూసినా అడ్డమైన వైర్లూ, కార్డులూ, తోళ్లూ తొక్కులూ.. ఎక్కడి వస్తువులక్కడే. పెళ్లయి ఎనిమిదేళ్లు. ‘అసలు వాళ్లిద్దరూ సంసారం చేస్తున్న వాళ్లలా కనిపించలేదు. కంప్యూటర్లకి అంటుకుపోయిన యంత్రాల్లా అనిపించారు’ అని పిల్లల సంగతి ప్రస్తావిస్తే ‘ఇప్పుడు కన్సీవ్ కావటానికి వీల్లేదమ్మమ్మా.. మా ఇద్దరికీ యుఎస్ అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి అన్నది’ అని ‘ఈ తరమంతా ఇట్టాగే ఏడిస్తే ఇంక సంఘ వృద్ధికి అవకాశమేముంటుంది’ అని నీరసపడింది.
నేనూ శారదా మాటా పలుకూ లేకుండా ఆ రోజుకు సెలవు చెప్పాము.
పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం శాంతినీ సూర్యంనీ తీసుకుని బిర్లామందిర్‌కి పోయొచ్చింది అత్తయ్య. మరొకరోజు ఉదయానే్న అష్టలక్ష్మీ దేవాలయానికి వెళ్లి వచ్చింది.
రమ్య పురిటి స్నానం అయింది. బారసాల కార్యక్రమం మూడో నెలలోనే అని నిశ్చయించుకున్నారు ఆమె అత్తారింటి వాళ్లు.
ఆ వేళ ఉదయం టిఫిన్‌లు అయినై. శాంతి కాలేజీకీ, సూర్యం స్కూలుకీ వెళ్లారు.
అత్తయ్య చాలా అస్థిమితంగా, అన్యమనస్కంగా ఉండటం గమనించాను. శారదతో ఆ మాటంటే ఆమె కూడా తనకు తెలీదంది. ‘కానీ, రాత్రి చాలాసేపు పిన్ని ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తూనే ఉన్నదండి’ అన్నది.
ఇంతలో - ఉన్నట్టుండి లేచింది అత్తయ్య. ‘నేను వెళ్లొస్తానర్రా’ అంటూ రమ్య గదిలోకి వెళ్లింది. శారదా నేనూ కూడా ‘అదేంటి ఇంత హఠాత్తుగా? నిదానంగా వెళ్లొచ్చు. రిజర్వేషన్ లేదు కదా’ అన్నాం. ‘కాదులేరా’ అంటూ ‘రమ్యా.. బారసాల నాటికి వస్తానో రాలేనో.. ఇదిగో ఇది నీ కూతురికీ, ఇది నీకూ’ అని ఒక గొలుసునీ, ఒక రెండు వేల నోటునీ రమ్య చేతిలో పెట్టి, పిల్లని చేతుల్లోకి తీసుకుని ముద్దాడి, తిరిగి రమ్యకిచ్చి జాగ్రత్త చెప్పింది. శారద చేతిని తన చేతిలోకి తీసుకుని, ‘ఎంత అదృష్టం చేసుకుంటేనో ఇట్టా అమ్మమ్మో నాన్నమ్మో కావటం’ అన్నది. ఆమె మనసు ఉద్విగ్నంగా ఉన్నట్టు అర్థమైంది. హాల్లోని తన బ్యాగ్ తీసుకుని బయటకి నడిచింది.
గేటు దగ్గర ఓ క్షణం నిలిచాం. నేను ఆటో పిలిచాను. ఈలోగా శారద పక్కకి జరిగి అన్నది అత్తయ్య. ‘అమ్మమ్మనైనానని మురిసిపోయి, సంసారంలో భర్తతో దూరం పెంచుకోకు. నీకేం వయస్సయిపోలేదు. నలుగురు పిల్లలుంటేనే కుటుంబానికి శాంతీ, సమాజాభివృద్ధీ’
ఆమె మాటల్ని నేనూ విన్నాను. క్రీగంట శారదవైపు చూసి, అత్తయ్యకేసి చూస్తే - ఆమె కళ్ల చెమర్పు స్పష్టంగానే కనిపించింది నాకు.
ఆటో వచ్చింది. ఇద్దరమూ ఎక్కాము.
బస్‌స్టేషన్‌లో-
విజయవాడకి వెళ్లే అమరావతి బస్ సిద్ధంగా ఉంది. టికెట్ తీసుకుని ఎక్కి కూచుంది. టికెట్ డబ్బు నేవివ్వబోతుంటే వౌనంగా నా చేతిని అడ్డుకుంది. నేనూ ఆమె పక్కగా కూచున్నాను. అత్తయ్య మనసులో ఏదో బాధ పడుతోందని నాకు తెలుస్తూనే ఉంది. బస్ బయల్దేరటానికి ఇంకా సమయం వుంది. అసంకల్పంగా ‘చెప్పత్తయ్యా’ అన్నాను - ఆమె ఏదో చెప్పబోతున్నదని గ్రహించిన వాడిలాగా.
అత్తయ్య కళ్లల్లో నీరు.
‘మా సాగర్ చేసిన పని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందిరా ప్రసాదం. ఎవరికీ తెలీదు. ఐదేళ్ల క్రితమే ఎవరో ఫిలిప్పైన్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాట్ట. సరే పోనీలే వాడు కులాసాగా ఉంటే చాలనుకుని సమాధానపడ్డాను. నీకూ తెలుసు. తర్వాత్తర్వాత నాతో మాట్లాడటం మానేశాడు. నేను మెసేజ్‌లు పెడితే కోపం. అయినా నేను విచారించేదేం ఉంది. పిల్లల్ని గురించే కదా. దానికి రాత్రి మెసేజ్ పెట్టాడు. తన పెళ్లానికీ తనకీ అలాంటివి ఇష్టం లేదుట. అందుకని తనే ఆపరేషన్ చేయించుకున్నాట్ట. ‘ఆ ప్రసక్తి మళ్లీ తేవద్దు’ అని హెచ్చరించాడు.
అత్తయ్య కంఠంలో వణుకు. ‘కంఠస్వరం మనసునీ, మనసులోని భావాన్నీ తెలుపుతుందిరా’ అన్న ఆమె మాటే గుర్తుకొచ్చింది. నేను కనె్నత్తి అత్తయ్య వైపు చూడలేకపోయాను.
బస్ బయల్దేరుతోంది. వౌనంగానే చకచకా కిందికి దిగి వచ్చేశాను! నడక సాగింది.
నా ఆలోచనలో ఎక్కడో చదివిన వాక్యం మెరుపులా మెరిసింది - ‘మారుతున్న పరిస్థితులు ఒక్కొక్కప్పుడు అన్ని విలువల్నీ తారుమారు చేస్తాయి!’
*

-విహారి (జె.ఎస్.మూర్తి) 98480 25600