S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష్మీ యుక్తుడు దుఃఖం ఎరుగడు

వాసుదాసు వ్యాఖ్యానం
కిష్కింధకాండ
*
లక్ష్మణుడితో శ్రీరాముడు ఇంకా ఇలా అంటాడు.
‘పూల వాసనలతో కూడిన ఈ గాలి ఎంతో సుఖం కలిగిస్తూ చల్లదనం ఇస్తున్నప్పటికీ, సీత నా దగ్గర లేని కారణాన అగ్నిహోత్రంలాగా అమితమైన బాధ కలిగిస్తున్నాడు. ఇది వాయువు స్వభావ గుణం అందామా అంటే, సీతాదేవి నా దగ్గర వున్నప్పుడు అమితమైన సుఖం కలిగించేది కానీ, ఇప్పుడిలా కాలుస్తున్నాడు. ఏం పాపమో? అప్పుడు నేను రాముడినే కాని ఇప్పుడు కాదా? అప్పటి గాలి ఇది కాదా? అప్పటి గాలి ఇది కాదా? సీతాదేవి నా దగ్గర వున్నప్పుడు కష్టాలు కూడా సుఖంగానే వుండేవి. ఇప్పుడేమో, సుఖమైనవి కూడా దుఃఖంగానే అనిపిస్తున్నాయి. కాబట్టి, నా సుఖ దుఃఖాలకు సీతాదేవే కారణం. (దీని వాస్తవార్థం: లక్ష్మీ యుక్తుడు దుఃఖం ఎరుగడు.. అలక్ష్మీ యుక్తుడు సుఖం ఎరుగడు) ఈ నీచమైన కాకి, నేను సీతాదేవితో పంచవటిలో వున్నప్పుడు మా వియోగాన్ని సూచిస్తూ ఆకాశం నుండి మా చెవులు కాల్చేట్లు కఠోరంగా కూస్తుండేది. ఇప్పుడేమో మళ్లీ మా సంయోగాన్ని సూచిస్తూ చెట్టుకొమ్మ మీద వాలి రెక్కలు విదిలిస్తూ మరీ మరీ కూస్తున్నది. ఈ పక్షే పంచవటిలో వున్నప్పుడు సీతావియోగాన్ని సూచించింది. అదే ఇప్పుడు ఆ స్ర్తిరత్నం సంయోగాన్ని సూచిస్తున్నది.’
‘పూల కొనలున్న చెట్ల మీద మనోహరంగా కూర్చొని పక్షుల సమూహాలు నా ధైర్యం చెడిపోయేట్లు, కామం పెరిగేట్లు, నానా రకమైన ధ్వనులు చేస్తున్నాయి విన్నావా లక్ష్మణా? కామ మదంతో కంపించి పోతున్న ప్రియురాలిని, దాని మగడు వెంటబడి పోయిన విధంగా గాలివల్ల కదులుతున్న తిలకపు పూలగుత్తిని మగ తుమ్మెద వెంటబడి తిరుగుతున్నది చూశావా? పేరుకు ఇది అశోక వనమే గానీ, వాస్తవంగా కామక జనుల శోకాన్ని వృద్ధి చేసేది ఇది. ఇప్పుడు అది ఏం చేస్తున్నదంటావా? గాలి వల్ల కదిలించబడిన పూలగుత్తులతో అనేక పర్యాయాలు నన్ను కొట్టేదానిలాగా భయపెట్తున్నాయి. అశోకం ఆహారం తిననియ్యదు. మల్లెలు వాడిపోయేట్లు చేస్తుంది. మామిడి వనె్న మారుస్తుంది. కమలాలు ఆలోచనలను పెంచుతాయి. కలువలు చంపడానికి ప్రయత్నం చేస్తాయి. శృంగార చేష్టలతో, గర్వం కలిగిన మనసులతో, నిర్మలమైన చందనం లాంటివి పూసుకున్న మనుష్యులలాగా నిండార పూసిన మామిడి చెట్లు కాంతిగా ప్రకాశిస్తున్నాయి. లక్ష్మణా! పంపా తీరంలోని అడవుల్లో విలాసంగా అక్కడక్కడా కిన్నరులు తిరుగుతున్నారు.. చూశావా? నీటి అలల్లో ప్రతిఫలించిన ఉదయకాలంలోని సూర్యుడిలాగా వున్న ఈ ఎర్ర కమలాలను చూశావా? సంతోషకరములైన కహ్లారాలు, ఎర్రకలువలు, హంసలు, బెగ్గురులతో నిండిన నీళ్లను చూశావా? లేత సూర్యుడితో సమానమైన తుమ్మెద రెక్కలతో కొట్టబడిన అకరువులున్న మడుగును చూశావా? చక్రవాకాలతో కూడి మనోహరమైన వనం అనే వస్త్రాన్ని కప్పుకుని దప్పిక తీర్చుకోవడానికి వచ్చిన లేళ్లతో, ఏనుగులతో పంప ఎంతో ఆనందకరంగా ఉంది.’
‘తామరపూలు గాలివాటానికి విజృంభించిన అలలతో తాకబడి, ఊయల మీద ఊగుతున్నట్లుగా, ఇంపుగా వున్నాయి చూశావా లక్ష్మణా? తామర రేకుల్లాంటి కళ్లు, కమలాలంటే ప్రీతి, కమలగంధి అయిన సీతను చూడలేక బతకడం వల్ల నేలకు భారమే కానీ మరే ప్రయోజనం లేదు. లక్ష్మణా! ఈ మన్మథుడి కుటిల బుద్ధిని గురించి నేనేమని చెప్పాలి? ఎంతో దూరంగా వున్న నా ప్రాణంతో సమానమైన దానిని, కష్టంగా మాత్రమే సాధించ వీలయ్యేది. శ్రేష్ఠమైన గుణాలు కలదానిని, ప్రియమైన శుభకర వాక్యాలు చెప్పేదానిని, నా స్మృతికి వచ్చేట్లు చేశాడు కదా? లక్ష్మణా! మన్మథుడు ననే్నమీ చేయలేడు. వాడివల్ల నాకు భయం లేదు కాని, ఈ వసంతుడు వాడికి తోడుగా వచ్చి నన్ను బాధిస్తున్నాడు. శత్రు బాహుళ్యం ఏర్పడింది. అందగత్తె అయిన సీతాదేవి సాంగత్యం వల్ల అందమైనవేవైనా నాకు అనురాగం కలిగించాయో, అవే ఆమెను ఎడబాయడం వల్ల అందం చెడి నాకు వైరాగ్యం కలిగించాయి. తక్కినవన్నీ ఎందుకు? తామర మొగ్గల రేకులను చూసైనా సంతోషిద్దామంటే సీతాదేవి కంటిరెప్పలతో అవి పోలినట్లుండటం వల్ల ఆమె స్మృతికి వస్తున్నది. అది పోనీయ్.. కమ్మటి గాలిని చూసైనా సంతోషిద్దామంటే సర్వ ప్రాణాధారకమైన ఆ గాలి నన్ను బాధపెడ్తూ, తామరపూలను తాకి, అలా వచ్చిన వాసన, పుప్పొడి తీసుకుని చెట్లలో నుండి బయటకు వచ్చి సీతాదేవి విడిచే నిశ్వాసాన్ని పోలి నా మనస్సును ఆకర్షిస్తున్నాడు.’
‘లక్ష్మణా! పంపానదీ తీరంలో దక్షిణ తీరాన విస్తారంగా పూచిన గోగుకాడలు ఎంత ప్రకాశవంతంగా వున్నాయో చూశావా? లక్ష్మణా! కావిరాలు లాంటి వాటితో ఘనంగా అలంకరించబడిన ఈ పర్వతరాజు వాయువేగంతో ఎగురగొట్టబడిన దుమ్మును చిత్ర విచిత్రంగా, సంతోషకరంగా లేవదీస్తున్నాడు. మనోహరంగా చెట్ల ఆకులు కనపడకుండా పూచిన అందమైన మోదుగులతో కొండచరియలు ప్రకాశిస్తున్నాయి. పూచిన కొనలుకల తీగెల గుంపులు తమను చుట్టుకోగా పంపా ఒడ్డున పూచిన చెట్లు దట్టమైన కాంతులను ప్రసరింపచేస్తూ, తమ కొమ్మలను ఊపుతున్నాయి. వృక్షాలు గాలికి కదులుతున్న కొమ్మలతో సంతోషంతో తమను సమీపిస్తుంటే కామ మదం కల యువతుల్లాగా తీగలు కౌగలించుకున్నాయి. వాయువు నానా రసంకల జ్ఞానం కలవానిలాగా చెట్టు చెట్టు, కొండ కొండ, అడవి అడవి తిరుగుతున్నాడు. పూచిన పూలతో కొన్ని వృక్షాలు తియ్యటి వాసన ఇస్తున్నాయి. కొన్ని పూలు ఆకులు కనపడకుండా మొగ్గలతో కప్పబడి వున్నాయి. కొన్ని ఆకులు నీలంగా వున్నాయి. కొత్త పూలంటే అనురాగం కల మదించిన తుమ్మెదలు, ఇది ఇంపనీ, ఇది తీపనీ, ఇది ఇపుడే వికసించినదనీ, భావిస్తూ, సంతోషంగా ఝంకారాలు చేస్తూ, పూల మీద పడిపోయాయి. ఒక తుమ్మెద తేనె మీది ఆశతో చెట్లలోని పూల చాటు నుండి తటాలను దాన్ని విడిచి, బయటకు వచ్చి, వేరే చెట్ల మీద ఎక్కువగా తేనె వుండటంతో అక్కడికి పోయింది. పూలు తమంతట తామే విశేషంగా రాలడం వల్ల అందమైన నేలలు సుఖంగా, మనుష్యులు పరచని పూలపాన్పుల్లాగా ప్రకాశిస్తున్నాయి.’
-సశేషం